నవ్వింది సంధ్య
'సంధ్యా మనకి స్వామి ప్రత్యక్ష దైవం _
'మరి నా కెప్పుడూ కనిపించాలేదేం_'
'ఆయనకి నిపై కోపం_'
'దయ పోయిందా?'
"ఊహూఁ దయపోలేదు కరుణ పుడుతోంది. అందుకే నిన్ను తన వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు_"
'ఇపుడు కాదా ?'
'ఇది పరోక్షం_ప్రత్యక్షంగా నీపై దయ ప్రసరించాలి'
సంధ్య జవాబు చెప్పలేదు
అంతలో వంటింట్లోంచి కెవ్వుమన్న కేక వినవచ్చింది. అది ఆర్తనాదం. భయనిహ్వాలంగా పెట్టిన కేక.ఒక మహాసర్పాన్ని చూసి పసిపిల్లవాడు పెట్టిన కేక.
చప్పున లోపలికి వెళ్ళింది సంధ్య
వంటింట్లోనే ఓ మూల 'దేవుడి అరుగు వుంది. దానిమీద 'మందసం' అందులో పూజలందుకునే దేవుళ్ళు. సరిగ్గా ఆ పీఠం పై భాగాన పైకప్పు నుంచి ఓ మహాసర్పం వేలాడుతుంది. రెండుబారల పోడువుతో, కాడి లాపుతో నల్లగా.... బుసలు కొడుతూ....
అది కాలనాగు....
సంధ్య నిశ్చేష్టురాలైంది
6
స్వామిని చూడగానే విశాలాక్షి అప్రయత్నంగా చేతులు జోడించింది. నాభిస్థానం నుంచి వెలువడిన వాక్కు ప్రార్ధనగా మారింది. భయం కాస్తా భక్తి రూపం సంతరించుకున్నది.
హే అనంత!పన్నాగరాజ!ప్రసన్న వచన ! అంటూ సర్ప దండకం ఆమె ముఖతః వెలువడుతున్నది.
అలికిడికో_విశాలాక్షి నోటివెంట వెలువడుతున్న శబ్దాలకో పాము అలాగా వుండిపోయింది. కదలటం లేదు.
ఊఁ స్వామికి మొక్కుకో_
అప్రయత్నంగా చేతులు జోడించింది సంధ్య
చూశావా! స్వామికి నీ మీద ఎంత దయో !
దయా? ఆశ్చర్యంగా అడిగింది
కాక ? ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటావ్? నువ్వూ అయన భక్తురాలవి. భక్తవంశాంకురానివి. నా వారసురాలివి. ఈ భూమికి ఆ దివికి లంకె మనం. మరి మనం దారి తప్పితే_దారి విడిస్తే_యీ భూమి నుండి ఆ దివికి వెళ్లేదేట్లా?
అందుకే నువ్వు కట్టు తప్పినా స్వామి కనికరించాడు
నువ్వు ప్రేమ _ పెళ్లి అంటూ కూర్చున్నందుకి ఆయనకి ఆగ్రహం లేదు. పైగా జాలి పుట్టింది. అందుకే ప్రత్యక్షమయ్యాడు
విభ్రాంతి నుంచి తేరుకుంది సంధ్య
'ఇదేమిటి యీ లోకం ? ఇంత వెర్రిదా? ఇంత గుడ్డిదా? పాముని దేవుడంటారేమిటి? ఇది విషప్పురుగు? ఎక్కడ కనిపిస్తే అక్కడే అప్పడే చంపేస్తారు జనం
ఈ పాము చర్మంతో పర్సులు,చెప్పులు,బెల్దులు,తయారుచేసి అమ్ముకుంటున్నారంటా!
ఈ పాములనిఆహారంగా తింటున్నారు కొందరు
ఇంకా ఏమిటి యీ మూఢత్వం?
సంధ్యా?
విశాలాక్షి పిలుపుకి తెప్పరిల్లింది సంధ్య
ఇకనైనా మనస్సు మార్చుకుంటావా?
ఫక్కున నవ్వింది సంధ్య 'అత్తయ్యా ! మనది పాత మిద్దేయిల్లు తడకలు దంతెలపై వేసి మట్టి కప్పు వేశారు. అంచేత ఎలుకలు యధేచ్చగా తిరుగుతున్నాయి. ఆ ఎలకల కోసం వచ్చింది యీ పాము_'
'హవ్వ!'సంధ్య మాటలు పూర్తిగా విన్లేకపోయింది విశాలాక్షి స్వామి నీకు మామూలు పాములా కనిపిస్తున్నడా? పాముకి రెండు తలలుంటాయా? సునిశితంగా చూస్తూ ప్రశ్నించింది ఆమె
'రెండు తలలా?'
'ఆఁఅహఁ అటుచూడు!అయిదు తలలతో స్వామి ఎలా వున్నడో ఆ పడగలపై మణులు చూడు ఎలా ప్రకాశిస్తున్నాయో? సంధ్యా! పాములు విషప్పురుగులే! చంపెయ్య వలసినవే! కానీ ఇది దిప్యసర్పం! మన ఇలవేలుపు బాగా చూడు స్వామి ఎంత ప్రసన్నంగా వున్నాడో! సంధ్యా! స్వామికి నీపై ఎంతో ప్రేమ వున్నట్టుంది. అందుకే దివ్యరూపంలో
దర్శనం యిస్తున్నారు?' అంది ఆవేశంగా.
అయోమయంగా చూస్తోంది సంధ్య! 'ఇదేమిటి?' ఈమె యీ పాముకి రెండు తలలంటుంది. అంతలో అయిదు తలలంటుందేమిటి?
ఈమెకి మతిపోయిందా? నాకు మతిపోతున్నదా? అయినా పాములని చంపెయ్యాలని తను మనస్సులో అనుకున్నది ఈమెకి ఎలా తెలిసింది?
సంధ్యా!ఇంకా ఆలోచిస్తున్నావా? మొక్కుకో స్వామికి... పెళ్ళి చేసుకోనని ప్రమాణం చెయ్, ఒత్తిడి చేసింది విశాలాక్షి.
'పాములు(నాగరాజు)పశువులు(నంది)పక్షులు (గరుడుడు) పంది (వరహాస్వామి) పూజలందుకుంటున్న యీ దేశం ఎప్పుడు బాగుపడుతుందో!చెట్టు (అశ్వత్థ వృక్షం) పుట్ట (నాగులచవితినాడు)ని పూజించే యీ సంస్కృతి ఎప్పుడు పోతుందో' అనుకుంది బాధగా
అత్తయ్యకి జవాబు చెప్పకుండా వెనుదిరిగింది
"సంధ్యా!"
కఠినంగా పిలిచింది విశాలాక్షి
ఆగిపోయింది సంధ్య
'ఇంత మొండితనం కూడదు, దివ్యులతో వైరం మంచిది కాదు. అంతకు అంత అనుభవిస్తావు_'
నవ్వుకుంది సంధ్య
అత్తయ్య అమాయకత్వాన్ని చూసి జాలిపడింది. ఆమె మౌఢ్యానికి విచారించింది.
ఆ పాముని తరిమేయ్యాల కనిసం_చంపటానికి ఎవరూ ఒప్పుకోరు.శత్రువుతో పగవుంటే ఇంట్లొ పమున్నట్లే అన్నారు పెద్దలు. మా ఇంట్లో పాము వుంటే ఇంకెంత ప్రమాదం!
ఎంత దౌర్భాగ్యం!
ఈ యింట్లో ఒక్కరయినా నా మాటని ఆమోదించే వాళ్ళు లేరు. అందరిదీ మూఢభక్తి...అంధ విశ్వాసం...గుడ్డి పూజ.