"పిచ్చి విరజా! అసలు నేను పెండ్లి విషయం అడిగింది అందుకు కాదు మీ మెడలో శిలువను చూసి నీకు పెండ్లి అయిందేమో ననుకున్నాను.
"అదెలా? ఎలా అనుకున్నావ్? పెండ్లికి శిలువకు సంబంధమేమిటి విస్మయంతో అడిగింది.
"ఏమీలేదు. హైందవ సాంప్రదాయంలో పెండ్లి అవుతూనే ఆడవారికి మెడలో తాళిబొట్టు, వెలుస్తుంది చిహ్నంగా. మాంగళ్యానికి ప్రతీకగా పునిస్త్రీకి గురుతుగా వుంటుందది. అలాగే మీ సాంప్రదాయ ప్రకారం పెండ్లి అవుతూనే తాళికి బదులుగా శిలువ వెలుస్తుందనుకున్నాను."
నవ్వుని ఆపుకోలేక తుళ్ళి తుళ్ళి ఒకేవిధంగా నవ్వుతూ మధ్య మధ్య అనసాగింది.
"ఏమిటి....పెళ్ళి....తాళి....శిలువ....భలే....భలే."
తల్చుకొని తల్చుకొని నవ్వసాగింది విరజ. ఆమెకి అతను చెప్పిన మాటలకన్నా చెప్పిన విధానానికి నవ్వురాసాగింది. ఆపుకోవటానికి సాధ్యం కాకుండా పొంగుకుని వస్తున్న నవ్వును బలవంతాన నిగ్రహించుకోవటానికి ప్రయత్నించసాగింది.
ఉక్రోషంతో లేస్తూ అన్నాడు వేణు. "సరేలే.... నువ్వు.... నవ్వు నాకు తెలీక అడిగితే దానికి ఇంత వేళాకోళం పట్టించడమే కాక పైగా విరగబడి నవ్వుతున్నావా? నవ్వు నవ్వు....అయినా విరజా ఎప్పుడూ అవతలివాళ్ళు తెలియని తనానికి నవ్వుకోరాదు తెలుసా?"
అతని చేయి పట్టుకొని లేచి నిలబడి అతన్ని లేవదీస్తూ ఉడుకుమోతు తనంతో ఎర్రని రంగు పులుముకున్న అతని ముఖాన్ని చూస్తూ అంది.
"నీతో వేళాకోళం కాకుంటే మరెవరితో బావా! వెనుకటి జన్మలో నేను నీ మరదల్ని కదూ? అలాంటప్పుడు ఆ జన్మలో వేళాకోళం చేశానో లేదో గుర్తులేదు. అందువల్ల ఈ జన్మలో ఆ వాసనని కొంచమైనా స్మరించుకుని సరసాలాడొద్దంటావా?"
అతను కోపశిఖరాన్నుండి ఇంకా దిగి రాలేదు. అందుకని చేయి విడిపించుకుంటూ అన్నాడు.
"సరే, సరే! నీకంతా వేళాకోళంగానే ఉందిలే! నడువలేని బంగారువని బరువంతా మోసుకుని తీసుకొనిపోయి తిరిగి పిలుచుకు వస్తుంటే కృతజ్ఞతా సూచకంగా నన్ను నవ్వులపాలు చేస్తున్నావు కదూ? నిన్ను శిక్షించడం ఎలాగో నాకు తెలియదనుకున్నావా? నేను ఒక్కడినే వెడుతున్నానిప్పుడు ఎలా వస్తావో రా నీవే?"
మాటకీ ఆచరణకీ మధ్య విరామాన్నివ్వకుండా ఆమె ఏదో చెప్పబోతున్నా వినకుండా వేగంగా నడక సాగించాడు.
బిత్తరపోయిన చూపులతో అటే చూస్తూ కూర్చుంది. అతను ఓ పాతిక గజాలు వెళ్ళుంటాడు అంతే! హఠాత్ గా బిగ్గరగా అరిచింది ప్రాణం పోతున్నట్లుగా.
"నేను చచ్చిపోతున్నాను వేణూ!"
ఆ అమ్మాయి కంఠస్వరంలో భయం, భీతి రక్షించమనే ధ్వని ధ్వనిస్తున్నా అతను వెనక్కి తిరిగికూడ చూడకుండా ముందుకు వెళ్ళసాగాడు. ఆమె నటిస్తోందనే అభిప్రాయం అతనిలో ఇంకా వీడలేదు.
భయానకమైన దృశ్యాన్ని చూస్తున్న దానిలా గట్టిగా అరుస్తూ ఏడవసాగింది.
"వేణూ! పాము....పాము....చచ్చిపోతున్నాను వేణు"
ఆ అమ్మాయి వేసిన కేక అతన్ని నిలవేసింది. తిరిగి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరగా వచ్చి ఆమెని తన రెండుచేతుల్లోకి తీసుకుంటూ భయంలేదన్నట్టు వీపుని మెల్లిగా అరచేతితో నిమర సాగాడు.
భయం భయంగా చూపిందో చెట్టు వేపు. సుమారు పదిహేను గజాల దూరంలో ఉన్న ఓ మామిడిచెట్టు మొదట్లో పడగనెత్తుకుని నిలబడిందో నాగుపాము.
ఆలస్యం చేయకుండా సాష్టాంగ నమస్కారం చేసి ఆమెకి రెండు చేతులూ ఆసరాగా ఇచ్చి నడవటం సాగించాడు.
"భయపడొద్దు విరజా! నాగదేవతలు మా ఇంటి దేవుళ్ళు.... మిమ్మల్నేమీ చేయరు. నాకు తెలిసినంతవరకూ మా ఇంటికెవరికీ పాముల ప్రమాదం రాలేదు. రాబోదని, రాదని మా బామ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది."
భయం భయంగా అటువేపే చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ అంది.
"నిజంగా నీవు రావేమో అనుకున్నాను వేణూ...."
ఆ అమ్మాయి మాటలు హృదయాన్ని కదిలించాయ్. ప్రేమగా శిరస్సు నిమురుతూ మాట మార్చాలని అన్నాడు హాస్యంగా__
"అదుగో! మరలా నీ తాళి గుచ్చుకుంటోంది."
గట్టిగా నవ్వుతూ అంది__
"అది ఎందుకు వేసుకున్నానో చెప్పమంటావా వేణూ! మా అమ్మా నాన్నా ఇద్దరూ క్రిస్టియన్లే అయినా నేను శిలువ వేసుకునే సరికి నాకు చర్చి మెంబరయ్యే యోగ్యతలేదు. చర్చికి రావటానికి పోవడానికి వీలున్నా మెంబర్ని మాత్రము కాలేదు. అందుకే ఈ శిలువ.
"ఉహుఁ"
"చర్చకి ప్రార్ధనలకి ఎవరైనా ఏ కులం వారయినా ఏ మతం వారయినా వెళ్ళొచ్చు. కానీ మెంబరు కావాలంటే మాత్రం ఈ శిలువను ధరించాలి. దానికెంతో పెద్ద తతంగం ఉందిలే! మాలోకూడా ఎన్నో శాఖలున్నాయి కదా! ఒక్కొక్కరు ఒక్కో విధానంలో మెంబరవుతారు."
"మీక్కూడా ఎన్నో శాఖలున్నాయన్నావే, ఇప్పుడు మాలో లాగా వర్ణాంతర శాఖాంతర వివాహాలు జరుగుతున్నాయా?"
నవ్వుతూ అంది. "నీ ప్రశ్న ఎందుకో నాకర్ధమైందిలే! పూర్వం హిందూ మతంలో లాగే అలా పెళ్ళిళ్ళులేవు. కానీ యిప్పుడిప్పుడే మాలో కూడా మొదలవుతున్నాయ్."
మాట మార్చుతూ అన్నాడు. "విరజా! నీవు కూడా చర్చకి వెడుతుంటావా?"
"ఉహు__ఒకే ఒక్కసారి వెళ్ళాను. అదీ క్రిజ్నింగ్ డేకి మాత్రమే_"
"ఎందుకు వెళ్ళటం లేదు? ఇష్టంలేదా?"
'ఇష్టాయిష్టాలతో పనేముంది వేణూ! ఆ ప్రార్ధనలన్నీ ఇంట్లోనే చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా వుంటుంది కదూ? నాకు హిందూమతంలో చెప్పినట్టు ఏకాంతసేవ, ధ్యానం అంటేనే ఎంతో ఇష్టం. అలవాటు కూడా__ నీవే చెప్పు. పదిమందిలో చేసే ప్రార్ధనలో మానవుని మనస్సుకి నిలకడ తక్కువ కదా_ ఏకాంతంగా ధ్యానించడం మంచిది కదా?"
తృప్తిగా అన్నాడు. నీలో చాలా బలమైన ఊహలున్నాయ్ విరజా! బహుశా పూర్వజన్మ విశేషం కావచ్చు."
అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అంది. "నాకు హిందూమతం అంటే అందునా బ్రాహ్మణులంటే ఎంతో యిష్టం. ఎందుకో తెలుసా? మాగ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు__అందుకని"
ఒక్క క్షణం తనేది వింటున్నాడో విస్మయ పూర్వకంగా అడిగాడు.
"అదెలా?"
ఊరి దరిదాపుల్లోకి వచ్చేరు. బాగా చీకటి పడింది. ఇంకా దీపాలు వెలిగించలేదు. వూర్లో_మెల్లగా అతని భుజంమీద చేతులు తీసి వేస్తూ అంది.
"ఇక మెల్లిగా నడిచి వస్తానులే"
అయినా ఇంకాస్తదూరంవరకూ ఇలా చేయి అందుకుని నడుస్తూ రా. ఎందుకయినా మంచిది_ అది సరే ఇంతకూ ఆయన బ్రాహ్మణులే అయితే మీరు క్రిష్టియన్స్ ఎలా అయ్యారు?"
ఇప్పుడు కాదులే వేణూ!__ అది చాలా పెద్ద కథ__ రేపు చెబుతాలే"
మౌనంగా ఆమెను ఓ చేత్తో పట్టుకొని నడిపిస్తూ కొన్ని క్షణాలు గడిచాక అన్నాడు.
"అమ్మదొంగ? తప్పించుకోవాలని చూస్తున్నావా? రేపు ఆదివారం ఎలా చెపుతావు?"
నవ్వుతూ అంది "ఇంతమాత్రం జ్ఞాపకశక్తితో చదివితే ఈ ఏడుగట్టెక్కినట్టె! మనం రేపు తిరుణాలకి వెళ్లాలని ప్రోగ్రాం వేసుకోలేదూ- ఎలాగా రేపుదయానికల్లా ఈ కాలు బాగు అవుతుంది- దారిలో ఆడుకొంటూ గంతులేసుకుంటూ వెళుతూ కధ చెబుతాను_"
సంతోషంతో ఆమె చేయి నొక్కాడు. "మీ ఇంట్లో చెప్పావు కదా విరజా! అబద్ధం మాత్రం చెప్పవద్దు"
నవ్వి అంది_ నేనెవర్ని వేణూ అబద్ధం ఆడటానికి! నీ - నీ - నచ్చిన మనసైన స్నేహితురాలిని. అబద్ధాలు నా నోట రమన్నా వస్తాయా?"
చిలిపిగా నవ్వుతూ అన్నాడు "అందుకేనేమో ఆ రోజు మేష్టారుతో-"
అతనిమాటలు పూర్తి కాకుండానే అంది_ "సరేలే అదీ ఒక అబద్ధమే నీవే చెబుతావుగా శుక్ర నీతి అంటూ."
ఇద్దరూ గలగల నవ్వుతూ శ్రుతికలిపారు-మింట చుక్కలూ ఇంట దీపాలు వెలుగుని చిమ్ముతున్నాయి.