Previous Page Next Page 
శుభోదయం పేజి 7

 

    ఛా....అదేం లేదు రేఖా....అందరికీ నీమీద సానుభూతి వుంటుంది. కాని హేళన ఎందుకు చేస్తారు? చూడు రేఖా మనవాళ్ళు "మానం" అన్న పదానికి మరీ అనవసర ప్రాముఖ్యత యిచ్చి స్త్రీకి ప్రాణం కన్న మానం గొప్ప, స్త్రీ మానం కాపాడుకుంటూ వుండాలి. మానం పొతే ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని అనేక పతివ్రతల కధలు చెప్పి అనేక యుగాలుగా స్త్రీకి ఆ భావం నరనరాల్లోకి వెళ్లేటట్టు చేశారు. ఏం, పురుషుడికి మానం అక్కరలేదా? నీతి నియమాలన్నీ స్త్రీకేనా? ఎవరో ఏదో చేసినంత మాత్రాన తప్పు తనది కాకపోయినా స్త్రీ ఎందుకు శిక్ష అనుభవించాలి? కావాలని పదిమంది స్త్రీలతో పురుషుడు తిరిగినా అతనికి అంటని అపవిత్రత , ఖర్మవశాత్తు మానం పోయిన స్త్రీకి ఎందుకు అంటాలి? రేఖా! ఈ మానం గీనం అంతా ట్రాష్....పవిత్రత మనసుకి వుండాలి. కట్టుకున్న భర్తతో నీతికి కట్టుబడి వుండాలి. అలాలేని స్త్రీ అపవిత్రురాలు. ఓ ధర్మాన్ని, న్యాయాన్ని కావాలని జవదాటితే నీతి తప్పిందనవచ్చు. అలాగే పురుషుడు భార్యని నమ్మించి ద్రోహం చేస్తే అతనూ అపవిత్రుడే. నీతి , నియమం మనసుకి వుండాలి గాని శరీరానికి కాదు. ఎవరో ఏదో చేసినంత మాత్రాన నీవు అపవిత్రురాలవయ్యావా? ఇదే నీ కాలుకో. చెయ్యుకో యింకే అవయవానికో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే అపవిత్రం అంటూతుందా? ఇదీ అంతే! రేఖా....స్త్రీకి పకృతి మాతృత్వం అనే శిక్ష విధించింది. స్త్రీ విచ్చలవిడిగా తిరిగితే , సంతానవతి అవుతే ఆ సంతానానికి సంఘంలో స్థానం వుండదని , అక్రమ సంతానం ఎక్కువై , కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందన్న భయంతో మనవాళ్ళు స్త్రీని పరిధి గీసి కూర్చోపెట్టి మానం కాపాడుకోవాలని పతివ్రతల కదల ద్వారా భోదించారు. రేఖా! ఈనాడు ఈ ఫామిలీ ప్లానింగ్ వచ్చాక ఎందరు నీతిగా వుంటున్నారంటావు? ఇదివరకు రోజుల్లో ఈ సాధనాలు లేనినాడు గర్భం వస్తుందన్న జంకు వుండేది. అందుకని కాస్త జాగ్రత్తగా వుండేవారు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ఈ నీతి, పతివ్రత అన్న పదాలకి అర్ధం మారిపోయింది. తెలియనంతవరకు అందరూ పతివ్రతలే . రేఖా! మళ్ళీ చెప్తున్నాను . నీవు కావాలని దారి తప్పితే అది తప్పు, నీ ప్రమేయం లేకుండా జరిగినదానితో నీ నేరం లేదు. నీవు పవిత్రత కోల్పోయావు అని అన్నవారు మూడులు. అలాంటి వారి మాట నీవు పట్టించుకొనక్కరలేదు. పెళ్ళి కాదంటావా! పోనీ.....జీవితానికి పెళ్ళి ముఖ్యమేనని పెళ్లి లేకుండా జీవించలేమనుకోవడం వెర్రి. రేఖా! నీ సంగతి తెలిసి ఏ సహ్రుదయుడో ముందుకువచ్చి పెళ్లాడవచ్చు. రోజులు మారుతున్నాయి. యువతరం దృక్పధమూ కాస్త మారుతుంది. నీ తప్పు లేదని గుర్తించిన ఏ ఒక్క యువకుడైనా నిన్ను అంగీకరించవచ్చు. అభ్యుదయం అంతా మాటల్లో, వేషంలో తప్ప చూపరంటే, పోనీ పెళ్ళి కాకుండా బతకలేవా? బి.ఏ. అయింది. ఎమ్మే చదువుకో. నీ పొట్ట పోసుకోవడానికి ఏదో ఉద్యోగం దొరకకపోదు. స్వతంత్యంగా జీవించు......ఈపాటి దానికోసం నీవింత బాధపడకూడదు రేఖా.....నా మాట విని నీవింక ఈ సంగతి మర్చిపోవాలి.... మళ్ళీ నీకేదో ఘోర అన్యాయం జరిగిందని , నీ జీవితం వ్యర్ధం అయిందని ఏడిస్తే ఒట్టే....." రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడి, రేఖ మొహం ఎత్తి కన్నీళ్లు పమిట కొంగుతో తుడిచింది. రాధాదేవి మాటలతో రేఖ మొహంలోకి కాస్త వెలుగు వచ్చింది. జరిగిన దానికోసం అంత బాధ పడనక్కరలేదని ఆమె అన్న మాటలతో ఆమెలో కాస్త బాధ, నిస్పృహ , ఆవేదన తగ్గి దుఖం  ఉపశమించింది. అంతలో పోలీసు ఇన్స్ పెక్టర్ హడావుడిగా లోపలికి వచ్చాడు. రాధాదేవిని ఉద్దేశించి "మీరు చెప్పిన ఆ ముగ్గురు రౌడీలని కస్టడీలోకి తీసుకున్నాను. కాని వాళ్ళు మొన్నటి రోజున ఆ కిళ్ళీ బడ్డి దగ్గిరే పెకాడుతున్నారని కొట్టువాడే కాక, రెండు మూడు కోట్లు వాళ్ళు, ఇంకో నలుగురైదుగురు సాక్ష్యం చెప్తున్నారు.... వాళ్ళ చేయి దీన్లో లేదనిపిస్తుంది" అన్నాడు నిరాశగా.
    "లేదు, లేదు, వాళ్ళే..... వాళ్ళపనే యిది ఇన్స్ పెక్టర్ నాకు తెలుసు. వాళ్ళకే నామీద కోపం. యింకేవరికో యింత కక్ష ఎందుకు వుంటుంది? వాళ్ళే ఈ పని చేశారు ఇన్స్ పెక్టర్ మీరు వాళ్ళని పట్టుకోండి. ఆ వెధవలని లాకప్ లో పడేసి కొట్టించండి. నిజం చెప్తారు. వాళ్ళని వదలడానికి వీలులేదు ఇన్స్ పెక్టర్ ...." రేఖ ఆవేశంగా అరిచింది. రేఖలోని ఆ మార్పుకి ఆశ్చర్యపడ్డాడు ఇన్స్ పెక్టర్.
    "ఇన్ స్పెక్టర్ గారూ ....చూడండి వాళ్ళు చేశారన్న అనుమానం రేఖకి వుంటుందని యింకేవరినో ఆ పనికి వినియోగించి వుంటారు. ముందురోజు జరిగిన సంఘటన వల్ల తమని అనుమానిస్తారని తెలిసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఈ కధ నడిపించి కక్ష తీర్చుకుని తమకి ఎలిబీ సృష్టించుకోవడానికి అక్కడ పేకాడుతూ కుర్చుని వుంటారు....." రాధాదేవి అంది. ఇన్స్ పెక్టర్ ఆలోచనలో పడి "అంతేనంటారా?...." అన్నాడు.
    "అంతే, లేకపోతే యింత ఫ్రీ ప్లాన్డ్ గా ఇంకెవరో చేసేందుకు అవకాశం లేదు. అప్పటికప్పుడు ఏ రోడ్డు మీదో అడ్డగించి చేసినది కాదు, రేఖని పిలిచి తీసి కెళ్ళారంటే ముందు నించి ఆలోచించింది అని అర్ధం కావడం లేదా? మీరు వాళ్ళని వదలకండి సార్. మీ దండోపాయం ప్రయోగిస్తే వాళ్ళే నిజం చెప్తారు..." రాధాదేవి కోపంగా అంది.
    "యూ ఆర్ కరెక్ట్.....చూస్తాను వెధవలు యెలా చెప్పరో....థాంక్స్ ఫర్ ది  యిన్ ఫర్మేషన్. అమ్మా రేఖా....ఆ నీచులని శిక్షించే పూచీ నాది. నీవు ఇంక విచారించకుండా త్వరగా ప్రోగేస్ అవాలి. మళ్ళీ ఏ వెధవా యిలాంటి ఘాతకం చేయడానికి భయపడెట్టు వాళ్ళ పని చెప్తాను . హు....మనం కాలంతో ముందుకు వేడ్తున్నామో, వెనక్కి వేడ్తున్నామో తెలియడం లేదు. సివిలైజేషన్ రోజు రోజుకి వెనక్కి వెడుతుంది." గొణుక్కున్నాడు ఇన్స్ పెక్టర్. "థాంక్స్ మేడమ్- మీరిచ్చిన ఇన్ ఫర్మేషన్ మాకు క్లూ యిచ్చింది. వస్తానమ్మా రేఖా...." అంటూ వెళ్ళాడు.
    "రేఖా ....నీవు ఒక్కర్తివే వున్నావు . అమ్మానాన్నగారు ఏరి?"
    "నిన్నటి నుంచి అమ్మా, అయ్యా తిండి తిప్పలు లేకుండా యిక్కడే పడున్నారు అమ్మా! ఉదయం లేచి యింటికెళ్ళి స్నానం చేసి భోజనం వండుకొని తీసుకొస్తామని నన్ను, ఆ యమ్మ తమ్ముడిని కూకోపెట్టారు" పని అవ్వ సమాధానం చెప్పింది."
    "పాపం! మీ పేరెంట్స్ చాలా కృంగిపోయి వుంటారు."
    "హు.....నాన్నగారయితే మొహం గుర్తుపట్టలేనంత మాడిపోయింది. అమ్మ ఒకటే ఏడుపు" తమ్ముడు అన్నాడు.

 Previous Page Next Page