Previous Page Next Page 
జనపదం పేజి 7

 

    బాగా పొద్దెక్కిం తరవాత దొర దగ్గరనుంచి కబురు వస్తే వెళ్ళాడు. బలరామయ్య రాముడ్ని కారులో తీసుకెళ్ళాడు. కడు దూరం సాగి కారు నిలిచింది. దిగి చూస్తే పోలీసులు కనిపించారు. సన్నీలు రాముని గుండెలో మెరిశాయి. దొర రాముణ్ణి ఒక గదిలోకి తీసికెళ్ళాడు. అది ఒక విశాలమైనది. అనేకమంది అధికారులున్నారు. రాముడు నుంచొనే ఉన్నాడు. అధికారులు రాముణ్ణి ఎగాదిగా చూశారు. వారు అతణ్ణి ఏవేవో అడిగారు. అతడు తెలిసినవీ, తెలియనివీ అన్నీ చెప్పాడు. ప్రశ్నల పరంపర తెగడం లేదు. కాళ్ళు లాక్కుపోతున్నాయి. నడుము పీక్కు పోతుంది. ఎన్ని ప్రశ్నలో? తాను ఏమి చెపుతున్నాడో? సాయంకాలానికి బలరామయ్య వెళ్ళిపోయాడు - రాముణ్ణి వదిలి. ఆ రాత్రంతా అతన్ని వేధించారు. ఒకరి తరువాత్ ఒకరు అనేకమంది అడిగారు. అడిగిందే అడిగారు. రాముడు చెప్పింది చెప్పింది చెప్పాడు. ఏవేవో వ్రాసుకున్నారు . వ్రాసుకున్న వాటిని కలిపి చూసుకొని మళ్ళీ అడిగారు. ఎందుకలా చెప్పావన్నారు. ఏది నిజం అని అడిగారు. తనకు తోచింది చెప్పాడు. తెల్లవారిం తరవాత అతన్ని వదిలి వెళ్ళారు. వళ్ళంతా నొప్పులు ఎప్పుడో మధ్యాహ్నానానికి నిద్రపట్టింది.
    రాత్రికి మళ్ళీ వచ్చి లేపారు. ఏవేవో పటాలు తెచ్చారు. వాటిలో దారులు , కొండలు అడవులు ఊన్నాయి. రాముడు చెప్పినట్లు ఏవేవో గీతలు గీసుకున్నారు. బాటలు వేసుకున్నారు. గుర్తులు పెట్టుకున్నారు. మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏవేవో చెప్పాడు రాముడు. అతని మూలుడులు పీల్చి అధికారులు వెళ్ళిపోయారు.
    అలసిపోయాడు రాముడు. సోలసిపోయాడు జీవుడు. పోలీసులు వేసిన ప్రశ్నలు తల్చుకున్నాడు. బాధలు గుర్తుకు వచ్చాయి. అతనిలో ఏదో తిరుగుబాటు తలెత్తింది. తుపాకుల వాళ్ళు ఎంత మంచివాళ్ళు? వాళ్ళూ అనేకమందిని హింసించారు. దోచుకున్నారు. కాని వాళ్ళు చేసింది ప్రజల కోసం ఊరికోసం - మరి వీళ్ళో? దొరల కోసం, . ఆ మాట తలచుకోగానే వీరభద్రం గుర్తుకువచ్చాడు. బక్కపల్చగా పొడవైన మనిషి భుజాన తుపాకి - కళ్ళలో నిప్పులు - సమాజాన్ని మర్చాలంటాడు. సంపదలు అందరికి అందాలంటాడు. తన మీదికి ప్రమాదం తెచ్చుకుంటాడు. ఇతరులను రక్షిస్తాడు!
    ఆరోజు ఏటి ఒడ్డున ఉన్నారు. పక్క ఊళ్ళో ఏదో తగాదా జరిగింది. తీర్చడానికి వెళ్తున్నారు. ఉన్నది ముగ్గురే అందులో రాముడూ ఉన్నాడు. చెట్లూ దుబ్బులు దట్టంగానే  వున్నాయి. ఎవరికీ కనిపించడం లేదు. అయినా అటు నుంచి సాగిపోతున్న రజాకార్ల దండుకు ఏదో అలికిడి వినిపించింది. తుపాకులు పేలాయి. వీరభద్రం తమను కాల్చవద్దన్నాడు. పడుకోమన్నాడు. తూటాలు రివ్వున వస్తున్నాయి. తలమీద నుంచి సాగిపోతున్నాయి. చావు కళ్ళముందు నిలచింది. కొంతసేపు కాల్పుపు అగేయి. వారు ముందుకు వస్తున్న జాడ కనిపించింది. వీరభద్రం తమను వెళ్ళి పొమ్మన్నాడు. బెదిరించి అదిరించి పంపించేశాడు. తాము వెనుక నుంచి దుబ్బులోంచి పడి దూరంగా ఒక పొదలో దాక్కున్నారు. వీరభద్రం గురి చూస్తూ పడుకున్నాడు. దగ్గరికి వచ్చేదాకా చూచి కాల్పులు సాగించాడు. అనుకోకుండా వాళ్ళు కాలికి బుద్ది చెప్పారు. కాని వీరభద్రం భుజం లోంచి దూసుకుపోయింది బుల్లెట్. అతడు మెల్లగా దిగి ఏట్లో రక్తం కడుక్కుంటుటే తాము పరిగెత్తుకెళ్ళి అతనికి కట్టు కట్టారు. అంత బాధలోనూ అతడు పక్క ఊరికి వెళ్ళాడు. తీర్పు చెప్పాడు. అలాంటివాణ్ణి మోసగించి వచ్చేశాడు తానూ. అలా వచ్చి తల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఇన్ని హింసల పాలవుతున్నాడు. మనసులో వీరభద్రానికి మొక్కాడు. అతనివైపే తిరిగింది మనసు. మెదడు ఏదో సూచించింది.
    శ్మశానం పక్కన ఊడల మర్రి.
    మర్రి కింద బొంద
    బొంద మీద చిరిగిన బట్టలు!
    ఏదో భయం మొదలైనది రాముడికి. గుండె దడదడలాడింది. ఎలాగో ఊరికి చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు బయలుదేరుతారో పోలీసులు ! వీరభద్రం జాడ చెప్పాలా? పట్టుకుంటారో కాల్చేస్తారో , ఏమో చాలామందిని కాల్చేస్తున్నారు.
    వీరభాద్రాన్ని
    వీరభాద్రాన్ని    
    కాల్పించాలా!!!
    తాను!
    అసలు అలసి ఉన్నాడు. ఆలోచనలతో భయంతో మరీ అలసిపోయాడు. నిద్రపట్టింది.
    అర్ధరాత్రి లేపారు పోలీసులు. రాముణ్ణి ఒక పోలీసుల లారీలో ఎక్కించారు. దొర జీపులో కూర్చున్నాడు. జీపు సాగింది. లారీలు సాగేయి. రోడ్డు మీద శరవేగంగా సాగిపోతున్నాయి. తెల్లావారు తుండగా ఊరు వచ్చేసింది. ఊరికి దూరంగా ఆగాయి. లారీలు. పోలీసులు తుపాకీలతో దిగారు. రాముణ్ణి ఇద్దరు పోలీసులు పట్టుకున్నారు. బారులు తీరిన పోలీసులు ఊరిని చుట్టేస్తున్నారు. జగ్గయ్య చెంబు పట్టుకొని పోతున్నాడు. ఒక పోలీసు చూశాడు కేకవేశాడు. తుపాకి పేల్చాడు. జగ్గయ్య అమాంతంగా పడిపోయాడు. తుపాకి గుండు వట్టిపోయింది. పోలీసులు ఈలలు మోగ్రాయి. పదిమంది పరిగెత్తారు జగ్గయ్యను పట్టుకున్నారు.
    కేకలు కూతలు విన్నారు పల్లె జనం. తలా ఒకవైపు పరిగెత్తారు. ఎటు చూసినా పోలీసులు! తప్పుకోవడానికి ఎలుకల్లా పరిగెత్తారు. అయినా బోనులో చిక్కుకున్నారు!! జగ్గయ్య సహితంగా జనాన్ని తుపాకీ మడమల్తో బాదారు వాళ్ళ దగ్గర లాఠీలు లేవు మరి! జనంలో భీతాహం చెలరేగింది. ఏడుపులు, పెడబొబ్బలు గడీ ముందుకు తెచ్చారు జనాన్ని మోకాళ్ళ మీద నడిపించి పశువుల కొట్టంలోకి తోలారు. పోలీసులు ఊరంతా గాలించారు. ఇండ్లన్నీ గాలించారు. మనుషుల్ని పట్టుకెళ్ళి ఇండ్లలోంచి మంచాలు, కుర్చీలు , పాతసామగ్రి తెప్పించి గడీ నింపారు. ప్రజలు పంచుకున్న పశువుల్ని పట్టుకొస్తున్నారు. గంగమ్మను లాక్కోస్తున్నారు. అది జంగయ్య కొచ్చిన ఆవు. అతనికి రెండెకరాల పొలమూ, ఈ ఆవూ వచ్చాయి. ఇంతకాలముగా వాటిని తల్లి కంటే ఎక్కువగా చూచుకుంటున్నాడు. ఇవ్వాళ దాన్ని లాక్కోస్తున్నారు గడీకి. అది గాడీ నుంచే జంగయ్య ఇంటికి పోయింది. అయినా గాడీకి రానని మొరాయించింది. మొండిపట్టు పట్టింది. అందుకే దానికి చాలా దెబ్బలు తాకాయి. అయినా అది ఎదురు తిరిగింది. నడి వీధిలో పట్టు విడిపించుకుంది. పోలీసులను కుమ్మింది. జంగయ్య ఇంటివైపు పరిగెత్తింది. దాని వెంట పరిగెత్తారు పోలీసు బలగం. అది జంగయ్య ఇంట్లోకి పోయి తల ఎత్తింది. కాలు దువ్వింది. లాభం లేదనుకున్నారు పోలీసులు. జంగయ్యను పిలిపించారు. వళ్ళంతా వచ్చిన జంగయ్య వచ్చాడు. అతని కళ్ళలో నీరు నిండించి. 'అమ్మా! గంగమ్మా! రా తల్లీ. నీ రుణం చెల్లిపోయింది " అన్నాడు. గంగమ్మ అనుసరించింది . గడీ దాకా వచ్చి గంగమ్మ ఏడ్చింది. జంగయ్య గంగమ్మను కౌగలించుకొని ఏడ్చాడు. రెండు ప్రాణాలు ఏడ్చాయి. :పో అమ్మా! తల్లీ. ఇకనుంచి ఇదే నీ ఇల్లు నేను ఎట్టి మాదిగోడ్ని అని సాగనంపాడు. ఆవు సాగిపోయింది. జంగయ్యను కొట్టంలోకి తోశారు.

 Previous Page Next Page