Previous Page Next Page 
మనసున మనసై పేజి 7


    "అమ్మా తల్లీ మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా, ఏదో ఓ గోల చెయ్యందే నీకు నిద్దర పట్టదా...' పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది.
    'ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా బాధుండదు మీకింక' హేళనగా అంది. వాసంతి చెల్లెలి చెయ్యిపట్టుకొని బతిమలాడే ధోరణిలో' జయా ఇంత కోపం, తొందరపాటు పనికిరాదు. పెళ్ళికావాల్సిన దానివి. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురూ ఏమంటారే. ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్ లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా..."
    'నా పెళ్ళి సంగతి, నాబాద్యత ఇంక మీరు తీసుకోనక్కరలేదు. నాదారి నేను చూసుకుంటాను. చదివించారు. ఉద్యోగం ఉంది. నాబతుకు నేను బతకగలను మొండిగా అంది. పద్మావతి నిస్సహాయంగా చూసింది. అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి, "ఏమిటి, ఏమయింది?' అంటూ గదిలోకి వచ్చారు. జయంతి సర్దుకున్న సామాను అది చూసి ఏమిటి జయంతి ఎక్కడికన్నా వెడ్తుందా' ఆశ్చర్యంగా అడిగారు. పద్మావతి కలవరపాటుతో 'అది ఇంట్లోంచి వెళ్ళిపోతుందిట' అంది.
    'ఎందుకు? ఏమయింది' ఆయన ఆశ్చర్యంగా చూశారు. పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది. వెంకటేశ్వరరావుగారి మొహం కోపంతో ఎర్రబడింది. తీక్షణంగా కూతురి వైపు చూశారు. 'దమయంతి అతనిని చేసుకుంటే నీకేం నష్టం. నీవెలాగూ బాగుపడవు, అది బుద్దిగా చేసుకుంటానంది, మధ్యలో నీకేం అభ్యంతరం....' కఠినంగా అన్నాడు.
    'చేసుకోమనండి ఎవరొద్ధన్నారు. మీదారికి అడ్డులేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను' హేళనగా అంది.
    'పిచ్చివేషాలేయకు, నీ పెళ్ళి చేసి పంపే వరకూ నీవు నాకస్టడీలో ఉండాలి- అదీ నా బాధ్యత. ఇల్లు కదిల్తే కాళ్ళు విరగొడ్తాను. నోర్మూసుకుని పడి వుండు. రోజు రోజుకీ నీ పొగరు మరీ ఎక్కువవుతూంది. ఇంట్లోంచి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళు' ఖచ్చితంగా అన్నారు.
    జయంతి రోషంగా చూసింది.
    'మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి.' 'అది చెప్పడానికి నీవెవరు? అది ఎవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు'
    'అయితే నా దారికి అడ్డురావద్దు. నన్ను ఆపలేరు మీరు బలవంతంగా ఈ రోజు ఆపినా రేపు వెళితే ఏం చేస్తారు. నేను మేజర్ని, నన్ను ఆపే అధికారం మీకు లేదు.' పొగరుగా అంది జయంతి వెంకటేశ్వరరావు కూతురి వంకచూసి ఒక్క క్షణం ఆలోచించి 'వెళ్ళు....కానీ, బాగా ఆలోచించి మరీ వెళ్ళు, ఈ రోజు నీవు గడపదాటితే నీ బాధ్యత ఇంక మాది కాదు' అంటూ భార్య వంక చూసి 'దాన్ని ఆపద్దు, వెళ్ళనీండి...' గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు. పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి, అన్నా వినదన్నది ఆవిడకి తట్టి మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది. వాసంతి చెల్లెలు చేయిపట్టుకుని 'జయా నీవు చాలా తొందరపడుతున్నావు' అంది. జయంతి మొహం గంటు పెట్టుకుంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోలోపల జంకు కల్గి నా తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది'. నన్నాపకు అక్కయ్యా, నే వెళ్ళినా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవరూలేరని అర్ధమైంది నాకు' ఉడుకుమొత్తనంగా అంది.
    'జయా నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే. బయటికి వెళితే..'
    "ఏం ఫర్వాలేదు చావనులే. నా బతుకు నేను బతకగలను' అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకుని బైటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది.
    
                              * * *

    
    'జయంతీ, నువ్వా... ఏమిటి ఇది, కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారాణి సామానుతో గుమ్మంలొ నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది.
    'ప్లీజ్ ఉషా... నీవో రెండుమూడు రోజులు ఆతిధ్యం ఇవ్వగలవా. ఇక్కడ నీ రూములో నేను నీతో ఉంటే నీకభ్యంతరం వుంటుందా జస్ట్ ఫర్ టూ త్రీ డేస్" అభ్యర్ధిస్తూ అంది జయంతి.
    'ఎందుకు ఏమయింది. ఇంట్లోంచి వచ్చేశావా....దెబ్బలాడావా..' చేతిలో పెట్టె అందుకుంటూ లోపలికి రమ్మన్నట్టు సైగచేసి ఆరాటంగా అడిగింది.
    'చెపుతా, ముందు కాసిని మంచి నీళ్ళియ్యి... బ్యాగు, పెట్టె ఓ వారగా పెట్టి కుర్చీలో కూర్చుంది. మంచి నీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది. అంతా విని తెల్లపోతూ 'ఇంత మాత్రానికే ఇల్లు వదిలి వచ్చావా' అంది.
    'నీవూ అలాగే అంటావా. ఇది నీకు వాళ్ళకి చిన్న విషయం ఏమో, నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించినది.'    
    "ఏయ్ ఏమిటీ ప్రతీదీ ఇంత సీరియస్ గా తీసుకుంటే ఎలా. చిన్న చిన్న వాటికి సర్దుకు పోవాలి. మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకభ్యంతరం ఉండాలి చెప్పు.'
    "ఇదిగో నీవూ అలా మాట్లాడకు. నన్ను అంతలా నలుగురిలో అవమానించిన వాడని నాచెల్లెలు మొగుడిగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా, అందరిదీ ఒకటే పాట, నీకేం పోయిందని వాడ్ని చూస్తూ ఇంట్లో ఎలా మసలాలి" తీవ్రంగా అంది.
    'బాగుంది. మీ ఇంట్లో అతను కూర్చుంటాడ, పెళ్ళి అయి వెళ్ళిపోతాడు, దానికోసం నీవు అందరిని కాదని ఇలా.....'
    'ఇదిగో నీకు నేనుండటం అభ్యంతరం అయితే చెప్పు. ఇంకో చోట వెతుక్కుంటా' సీరియస్ గా అంది.

 Previous Page Next Page