Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 8


    "మీ దేవుడి ఎదుట-మీ పూజారితో యిప్పిస్తారా! దట్సాల్! మళ్ళీ అయిపోయేదాకా డబ్బు అడగనులే!"
    ఇంకేం మాటాడకుండా ఫోన్ పెట్టేసింది. ఆమె మనస్సంతా చికాగ్గా తయారైంది. చూస్తున్న ఎకౌంట్ బుక్స్ మూసేసి ఈజీ చెయిర్ లో వాలిపోయింది. పైన సీలింగ్ ఫేన్ తిరుగుతున్నా ముఖాన చెమటలు పడుతున్నాయి.
    కాలేజి నుంచి తిరిగొచ్చింది స్వప్న. మసక వెలుతురులో అలసటగా నీరసంగా పడుకున్న ఆమెని చూసి "అలా వున్నావేం అమ్మమ్మా?" అని ఆదుర్దాగా అడిగింది.
    స్వప్నని చూడగానే గాలికి చెదిరే మబ్బుల్లా ఆమె ఆలోచనలన్నీ చెల్లా చెదురైపోయాయి. తేటపడింది మనస్సు. ఒక్కక్షణం ఆమెకేసి ఆశగా ఆబగా ప్రేమగా చూసి "ఏం లేదమ్మా! తలనాదుగా వుంటే ఇలా నడుం వాల్చేను." అంది.
    "తల నొప్పా! అమృతాంజనం వాడు క్షణంలో పోతుంది!" అని ఆయాని కేకేసింది లోపల వంట గదిలో వున్న ఆమె పరుగెత్తుకుని వచ్చింది. "రేక్ లో యాస్పిరిస్ వుంటుంది. ఓ కప్పు వేడి కాఫీ తీసుకుని, టాబ్లెట్ తీసుకుని రా! అమ్మమ్మకి తలనొప్పిగా వుందట!" అంది. తర తర లాడుతూ వెళ్ళిందామె. మరో రెండు నిమిషాలకి కాఫీ టాబ్లెట్ తీసుకుని వచ్చింది.
    స్వప్నని చూసి మురిసిపోయిందామె. తన తర్వాత ఈ ఆస్తిని పర్యవేక్షించగల శక్తి వుందనుకుంది. తగిన వాడిని చూసి పెళ్ళి చేస్తే అతన్ని, ఆస్తిని కాపాడుకోగలదని పించింది. కొంతకు కొంతయినా అధికారం చెలాయించలేని ఆడవాళ్ళు పిల్లల్ని పెంచలేరు. భర్తని కాపాడు కోలేరు. ఆస్తినీ ఐశ్వర్యాన్నీ రక్షించుకోలేరు అనుకుందామె.
    "మాత్రమింగి కాఫీ తాగేసి "ఇక ఫర్వాలేదమ్మా. నువ్వెళ్ళి డ్రస్ ఛేంజ్ చేసుకో" అంది. స్వప్న వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూండి పోయిన కృష్ణవేణమ్మగారు వెంకట్రామయ్య రావటం గమనించలేదు.
    "నమస్కారం పెద్దమ్మగారూ!"
    ఉలిక్కిపడింది కృష్ణవేణమ్మ.
    "వెంకట్రామయ్యా! ఇప్పుడా రావటం? నువ్వు యీ యింటికి బందువ్వికాదు. ఉద్యోగివి. బందుత్వంతో వరసకలిపి పిలవ్వద్దు?"
    కఠినంగా ఆమె అన్నదానికి అతని ముఖం మాడిపోయింది. అయినా క్షణంలో తేరుకుని "క్షమించండి మిమ్మల్ని అలా పిలవలేదు. పెద్దమ్మగారూ అని పిలిచాను. మీరు పెద్దమ్మగారు. అమ్మాయిగారు చిన్నమ్మగారు. అయినా ఇంత వయస్సు వచ్చి ఎక్కడ ఎలామెలగాలో నాకు తెలియదనుకొన్నారా? ఐశ్వర్యవంతులు మీరు. మీతో బాంధవ్యం వున్నా పొట్టకి జరక్క మీ వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న నేను మిమ్మల్ని బంధుత్వంతో ఎలా కలుపుకోగలను!" అన్నాడు.
    గుక్క తిప్పుకుంది కృష్ణవేణమ్మగారు. "వెంకట్రామయ్యా! నాకు ధనిక పేద వ్యత్యాసం లేదు. అలా ఎప్పుడైనా నిన్ను అవమానించానా? అయినా మన బంధుత్వం నలుగురికీ తెలియటం ఇష్టంలేదు. తెలిస్తే నిన్ను అంతా ప్రలోభ పెడతారు. అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు అని అడుగుతారు. దానం ధర్మం అనీ వెంట పడతారు. మా వారికి వున్న పేరు తక్కువదా? ఛీఫ్ మినిస్టరు గారికి వారి పేరు చెప్పినా పనులు క్షణంలో అవుతాయే! రావు బహద్దూర్ సుందర రాజారావు గారంటే ఎంతపేరు! ఎంత కీర్తి ప్చ్! అంతా ఆయనతోనే పోయింది. ఆయన కడుపున ఆడపిల్ల పుట్టినప్పుడే ఆయన ఠీవి, దర్పం, ప్రతిష్ఠ అంతా భంగమై పోయాయి. ఆ పిల్ల నరసింహాన్ని ప్రేమించి___" ఉలిక్కిపడిందామె. "ఏమిటది. తనిలా బయట పడిపోయింది." అనుకుంది. అదంతా అతనితో చెప్పాననే అనుకుంది. క్షణంలో తేరుకుని తన ఊహలకీ తనే భయపడి అతనితో ఏమీ అనకుండా వున్నందుకు సంతోషించి అలాగే మౌనం వహించింది.
    "ఎకౌంట్స్! చూశారా?" అడిగాడు నెమ్మదిగా.
    "ఆఁ చూశాను....చూడువెంకట్రామయ్యా! మొన్న మక్తా వసూలుకి రెండొందలు రాశావేమిటి? మనకి వచ్చేదే కొంచెం. ఆ కొంచెం వసూలుకి వందలు రాసేస్తే ఎలా?" తీక్షణంగా ప్రశ్నించింది.
    "టాక్సీలో వెళ్ళొచ్చానమ్మగారూ!"
    "టాక్సీలో వెళ్ళావా? బస్సులో వెడితే పదిరూపాయలతో అయ్యేదానికి రెండొందలు ఖర్చుచేసి చిన్నకారులో వెళ్ళావా? ఇది యెవరి సొమ్మనుకున్నావ్? ఆ అమాయకురాలిది. దాన్ని దాచి భద్రంచేసి పెంచే హక్కే గానీ మనకి అనుభవించే హక్కులేదయ్యా! ఇదో యీసారి యిలాచేస్తే నీ జీతంలో విరగ్గోస్తాను తెలుసా? నేనో, మనిద్దరమో అధికార్లనో ఆఫీసర్లనో కలుసుకుందుకు వెళితే తప్ప చిన్న కారు మనకెందుకు? దుబారా చెయ్యకూడదు వెంకట్రామయ్యా! పొదుపు, పొదుపు నేర్చుకోవాలి!" ముఖం వాచేట్టు చివాట్లేసింది.

 Previous Page Next Page