ఏ రోజు లెక్కలు ఆ రోజు వీలువారిగా జాగ్రత్తగా చూస్తుందామె. పది పైసలు ఖర్చుచేసి పావలా రాసేసినా బాధపడదు. కానీ పావలా ఖర్చయ్యేచోట పది రూపాయలు రాస్తేనే మండి పడుతుంది. వెంటనే ఎకౌంటెంటుని పిలిపిస్తుంది. తర్వాత మేనేజ్ చేసే వెంకట్రామయ్యని కేకేస్తుంది. ఆ తర్వాతే గుమాస్తాలని చివాట్లేస్తుంది.
రెడ్ పెన్సిల్ తో అన్నిటికి మార్క్ చేసుకుంటూ వెళుతున్న దల్లా ఫోన్ మోగటంతో ఆగిపోయింది. మళ్ళీ ఫోన్ మోగింది కుర్చీలో కొద్దిగా కదిలి ఫోనెత్తింది.
"హలో!" గంభీరంగా పలికిందామె.
"హలో అత్తయ్యా! కులాసానా?" అవతలి గొంతు నవ్వుతూ పలికింది.
కృష్ణవేణమ్మగారి కనుబొమలు ముడిపడ్డాయి. క్షణం సేపు జవాబివ్వలేదు.
"హలో అత్తయ్యా!" మళ్ళీ పిలిచాడవతలి వ్యక్తి.
"నరసింహం, నన్నలాపిలవ్వద్దు!" కఠినంగా అందామె.
"ఏం?" కవ్వింపుగా రెట్టించాడా వ్యక్తి "నేను నీ బిడ్డకి భర్తని కానా? తాళికట్టి తలంబ్రాలు పోశానే! పదిమంది మధ్యలో భూ సభోంతరాలు దద్దరిల్లేలా ఏర్పాటుచేసి నీవూ, నీ భర్తా కాళ్ళు కడిగి కన్యాదానం చేశారే? అప్పుడే మరిచిపోయారా?" ఎద్దేవగా ప్రశ్నించాడు.
"నేను మరవాలనుకున్నా నువ్వు మరవనిస్తావా త్రాష్టుడా? నా మనవరాల్ని చూసినప్పుడల్లా మీరు గుర్తుకి రాకుండా వుంటారా? నువ్వు దాన్ని మాయ చేసి నీవలలో వేసుకుని, దాన్ని ఆధారం చేసుకుని మమ్మల్ని ఆడించిన ఆటలు ఎలా మరవగలం? నరసింహం...ఎప్పుడూ నిన్ను మరుస్తాననుకోవద్దు అనుక్షణం నీ నుండి, నీనీడనుండి స్వప్నని రక్షించాలనే నా తాపత్రయం!" దృఢంగా, నిశ్చింతగా చెప్పిందామె.
పక పక నవ్వేడతను.
ఫోన్లో నవ్వుతున్నా ఆ నవ్వు వింటున్నా ఆమెకి కంపరమెత్తినట్టుగా వుంది. అతన్నేమీ చేయలేని తన అశక్తత, అతని దౌష్ట్యం ఆమెకి సహింపరానిదిగా వుంది.
ఒక్క క్షణం సేపు నవ్వి అన్నాడు "ఫరవాలేదు. భద్రంగా పెంచండి. ఎలాగయినా అది నా కన్నకూతురు!"
కృష్ణవేణమ్మ సమాధానం యివ్వలేదు.
"అత్తగారూ..."
"........."
"ఇవన్నీ దాగుడు మూతలు....అనవసరమైన మాటలు. నాకు చాలా అవసరంగా వుంది. డబ్బు కావాలి."
"డబ్బా?"
"అవును నిత్యావసరాలకి కూడా కట కటగా వుంది.
ఏం చేయను చెప్పండి వద్దనుకున్నా మిమ్మల్ని అడక్కతప్పదు ఎప్పుడు రమ్మంటారు!"
"నరసింహం! నా వద్దయిప్పుడు చిల్లిగవ్వలేదు అయినా అడిగినప్పుడల్లా వేలకి వేలు నీకు అందించటానికి ఇదేం బ్యాంక్ అనుకున్నావా? అయినా నా వద్ద డబ్బులేదు" అని ఫోన్ పెట్టేయబోయింది.
పక పక నవ్వేడతను "పాపం! నన్ను నమ్మమంటావు కదూ? ఇరాన్ షాకి అధికార కాంక్ష లేదన్నా, ఆయూబ్ ఖాన్ సౌమ్యుడన్నా నమ్ముతాను కానీ నీ వద్ద డబ్బు లేదంటే నమ్ముతానా? పోన్లే.....స్వప్ననే అడుగుతాం...అడగ వలసిన వాళ్ళు అడిగితే స్వప్న తన ఆస్తంతా యిచ్చేస్తుంది!"
బెదిరింపుగా అతనన్న దానికి ఆమెక్షణకాలం నివ్వెరపోయింది. "వద్దు....వద్దు.....నువ్వు కానీ అది కానీ స్వప్నని కలుసుకునేందుకు వీల్లేదు. నీ లాటి తాగుబోతూ, జూదరీ, మోసగాడూ తన తండ్రి అవి తెలిసిందంటే స్వప్న గుండె గాయపడుతుంది. చెప్పు ఎంత కావాలి?" అంది ఆర్భాటంగా.
"అద్గదీ మార్గం.....అలా రా దారికి.....ఎంత జస్ట్ అయిదువేలు.....అయిదంటే నీ దృష్టిలో ఆఫ్టరాల్."
"సరే! యిప్పుడు డబ్బు సిద్దంగా లేదు. రేపు బ్యాంక్ నుంచి తెప్పించి పెడతాను. రేపు సాయంకాలం అయిదింటికి వేణుగోపాలస్వామి వారి గుడికి రా! అక్కడ పూజారి గారి నడుగు డబ్బిస్తారు!"