టెలిఫోన్స్ డిపార్ట్ మెంట్ లో ---
టెలిఫోన్ ఆపరేటర్ గా అపాయింట్ మెంట్!
రెండు మూడు నెలలక్రితం ఈ ఇంటర్వ్యూకి అటెండయింది తను.
ఎంత కరెక్ట్ టైంకి వచ్చింది! చిన్నప్పుడు తను పార్కుకెళ్ళి తప్పిపోతే, సరిగ్గా అటే వస్తున్న నాన్నగారు కనబడ్డారు.
అప్పుడెంత సంతోషం కలిగిందో, ఇవాళా అంతటి సంతోషమే కలిగింది.
"ఏమిటే ఉత్తరం?" అంది అమ్మ.
"ఉత్త ఉత్తరం కాదమ్మా! తూర్పుకి తిరిగి దండం పెట్టాల్సిన స్థితిలో పడ్డాం ఇవాళ! ఈ ఉత్తరమొచ్చి మనకు దిక్కు చూపించింది". అని హాయిగా గుండెలనిండా గాలి పీల్చి, "కొత్త ఉద్యోగమమ్మా! దాదాపు ఆరువందల జీతం!" అంది.
"శాశ్వతమేనా?" అందామె, తనకు సహజమైన చాదస్తపు ధోరణిలో.
లతకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది.
"ఆహా! శాశ్వతమే! మనమున్నంతవరకూనూ!" అంది, కుర్చీలో కూర్చుండిపోయి, నవ్వుతూ.
ఈ సంభాషణ ఏ దుర్ముహూర్తంలో జరిగిందో గానీ, వారం తిరక్కుండానే హార్టు ఎటాకొచ్చి లత తల్లి చనిపోయింది.
జీవితం శాశ్వతం కాదని తెలుసు లతకి. తనకున్న ఒకే ఒక్క దిక్కు అమ్మ. ఆవిడ లేకపోతే తను ఎలా బతుకుతుందో ఊహించుకోడానికే దిగులుగా ఉండి, అసలు ఆ ఆలోచనే మనసులోనికి రానిచ్చేది కాదు.
ఆ ఆలోచనని దూరంగా ఉంచగలిగినా, తల్లి చావునిమాత్రం దూరం చెయ్యలేకపోయింది.
తంతు జరుగుతున్నంతసేపూ రాయిలా కూర్చుండిపోయింది తను. తన మనసులో ఎన్ని దిగుళ్ళున్నా అదేమి చిత్రమో తనకి కళ్ళనీళ్ళుమాత్రం రావు. మనసు మొద్దుబారిపోయిన కొద్దీ నవ్వొస్తుంది తనకు. గలగల నవ్వుతూ మాట్లాడుతుంది. అదొక మాస్క్! మారు వేషంలాంటిది!
తంతంతా రామారావు మామయ్య చేతులమీదుగానే నడిచింది. తూతూమంత్రంగా జరిపించేశాడు. చాలు! ఆమాత్రంగానన్నా జరుగుతుందని అనుకోలేదు తను. అసలు రామారావు మామయ్య వచ్చి పూనుకొని చెయ్యడమే ఆశ్చర్యం!
"ఏమే! ఏం చేద్దామనుకుంటున్నావ్ ఇక?" అనడిగాడు. 12వ రోజు కర్మ ముగిసిపోయి, వచ్చిన నలుగురైదుగురు బంధువులూ వెళ్ళిపోయాక.
"చెప్పు! ఏం చెయ్యను?"
"ఈ ఇంట్లోనే ఉంటావా?'
"ఆలోచిస్తున్నాను."
'ఎంతొస్తుందీ నీకు జీతం? ఆరొందలదాకా రాదూ?" యధాలాపంగా అడిగినట్లే అడిగినా, ఆయన కళ్ళలో అదోరకమైన ఆత్రం, ఆశా కనబడుతున్నాయి.
"వస్తుంది" అంది ముక్తసరిగా.
మామయ్య కళ్ళల్లోకి కళ వచ్చింది.
"ఇక ఈ ఇంట్లో ఒక్కదానివే ఏం ఉంటావ్? ఇల్లు ఖాళీ చేసేసి మాతోనే వుండిపో! ఉన్న పచ్చడి మెతుకులే అందరం తిందాం" చెప్పాడాయన.
పచ్చడి మెతుకులు తినడంకంటే పచ్చగా ఉండే జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు లత. అందుకని మామయ్య మాటలు అభయంలాగా తోచాయి.
వారంలోపల ఇల్లు ఖాళీ చేసేసి, మామయ్యా వాళ్ళింటికి వెళ్ళిపోయింది లత. అది ముషీరాబాద్ లో రెండున్నర గదుల పోర్షను.
మామయ్యా, అత్తయ్యా, వాళ్ళ ఇద్దరు కూతుళ్ళూ - అంతే సంసారం.
ఆ ఇంట్లోవాళ్ళకి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు. ఆ ఇంట్లోవాళ్ళకి వేరెవరినీ చూసినా పడదు. వేరెవరికీ ఆ ఇంటివాళ్ళని చూస్తే పడదు.
ఆ ఇంటిలో పడింది లత.
రోజులు నిర్లిప్తంగా గడుస్తున్నాయి.
ఒక్కోసారి అమ్మ చనిపోవడమనేది ఆలోచిస్తూ ఉంటే అబద్దంలాగా, జరుగుతున్నదంతా ఒక కలలాగా అనిపిస్తుంది.
ఆ ఇల్లు రెండున్నర గదులపోర్షను.
* * *
కొద్ది రోజుల తర్వాత --
ఉదయమే స్నానం చేసి, వంటింటి తలుపులు దగ్గరగా వేసి చీరె మార్చుకుంటోంది లత. పరికిణీ, బ్రా, మాత్రమే ఉన్నాయి ఒంటిమీద.
హఠాత్తుగా వంటింటి తలుపులు తెరుచుకున్నాయి.
మామయ్య లోపలికొక్క అడుగువేసి, తనని చూసికూడా కళ్ళు తిప్పుకునే ప్రయత్నం చెయ్యకుండా, "నువ్వున్నావుటే?" అనుకుంటూ మెల్లిగా బయటికెళ్ళిపోయాడు.
చటుక్కున వెనక్కి తిరిగింది లత.
ఇది మొదటిసారి కాదు. ఐదారుసార్లు జరిగిందిలా! ఇన్నాళ్ళూ కాకతాళీయం అనుకుంది. వంటింటికి గొళ్ళెం లేదు. అత్తయ్యా, సీతా, సరోజా కూడా అక్కడే బట్టలు మార్చుకుంటూ ఉంటారు. వేరే స్థలం లేదు ఆ ఇంటిలో! తన కూతుళ్ళు చీరె మార్చుకుంటున్నప్పుడు కూడా అలాగే లోపలికొస్తాడా? ఆడపిల్లలున్న ఇంటిలో తలుపులు వేసి వున్నప్పుడు అంత చొరవగా ఎలా వస్తాడూ? రాడు.
మామయ్య చెయ్యిపట్టుకున్నాడని పనిమనిషి యాదమ్మ అరవడం గుర్తొచ్చింది లతకి. ఆ వెంటనే మామయ్యకి యాభయి ఏళ్లనీ, గజ్జెలగుర్రాల్లా ఎదిగి పెళ్ళిళ్ళకి సిద్దంగా వున్న ఇద్దరు కూతుళ్ళున్నారనీ గుర్తుకొచ్చి జుగుప్స కలిగింది.
ఎంత పెద్దమనిషి!
భోజనం చేసి ఆఫీసుకు బయలు దేరేవరకూ ఇదే ఆలోచన.
బస్ స్టాప్ లో విపరీతమైన జనం. బస్ స్టాప్ లోనే ఏమిటీ, రోడ్డుమీద ఎటుచూసినా చీమలపుట్ట పగిలినట్లు జనం!
ఒక్క రోడ్డు మీదే ఇంత మంది మనుషులుంటే మొత్తం దేశంలో ఎంతమంది ఉంటారో!
ఇంటర్వ్యూల కోసం తను చదివిన జనరల్ నాలెడ్జ్ గుర్తుకొచ్చింది. భారతదేశపు జనాభా దాదాపు అరవై కోట్లు. అందులో ఆంద్రదేశంలో ఐదు కోట్లమంది ఉన్నారు.
ఇన్ని కోట్లమంది జనాభాలో తనకెవరూ లేరా?
తనకి కావాల్సినవాళ్ళు-
ఒకళ్ళంటే ఒకళ్ళూ లేరా?