తరువాత అనుకున్నాడు! ఈ టిక్కెట్టు తనది కాదు. ఆ అమ్మాయికి దొరికింది. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే కలుసుకుని ఈ టిక్కెట్టు ఆమెకి ఇచ్చెయ్యాలి.
కానీ ఎలా! అసలు ఎవరా అమ్మాయి? ఎలా తెలుసుకోవడం? ఎలా కలుసుకోవడం?
చాలా సేపు ఆలోచించాక తట్టింది అతనికా ఆలోచన. శుక్రవారం నాడు గుడి దగ్గర కనబడింది. ఆ అమ్మాయి అల ప్రతి శుక్రవారం ఆ గుడికి వచ్చే అలవాటు ఉందేమో తనకు? ఉంటే ఉండొచ్చు. లేకపోతే లేకపోవచ్చును కూడా?
కానీ గుడి దగ్గర ఆమె కోసం వెయిట్ చెయ్యడం కంటే తను చెయ్యగలిగింది వేరేమి లేదు.
మళ్ళీ శుక్రవారంనాడు గుడికి వెళ్ళాడు పొద్దున తొమ్మిది గంటలకి.
క్రితంసారి దాదాపు అదే టైముకి కనబడింది ఆ అమ్మాయి.
తొమ్మిదినుంచి పదకొండు గంటలదాకా వేచి చూశాడు అక్కడ.
రాలేదు ఆ అమ్మాయి.
తను చేస్తున్న ప్రయత్నం ఉత్త "చాన్స్" అని అతనికి తెలుసు.
ఇది కూడా ఒక లాటరీ లాంటిదే.
లాటరిలో ప్రైజు వచ్చినట్లు ఆ అమ్మాయి కూడా కనబడితే కనబడవచ్చు, కనబడకపోవచ్చు కూడా!
మళ్ళీ శుక్రవారం కూడా గుడికి వెళ్ళాడు. అదే టైముకి. ఆరోజు వరలక్ష్మి వ్రతం అయ్యింది.
ఆరోజు కూడా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారక్కడ. వాళ్ళలో ఆ అమ్మాయి కోసం వెతికాయి అతని కళ్ళు.
అపుడు అతని దృష్టిని ఆకర్షించింది ఒక బంగారపు రంగు జరి చీర. దాన్ని కట్టుకుని వున్న పొడగాటి ఒకమ్మాయి రాయంచలా నడుస్తూ వెళుతుంది.
త్వర త్వరగా ఆమెని సమీపించాడు శశికాంత్.
ఆమె ప్రోఫెల్ కొద్దిగా కనబడుతోంది అతని కిప్పుడు. సంపెంగ పువ్వులాంటి ముక్కు. విల్లులా వంపు తిరిగిన పెదాలు.
సందేహం లేదు . ఆ అమ్మాయే!
"చూడండి మిస్!" అన్నాడు.
అతని గొంతువిని తిరిగి చూసింది ఆ అమ్మాయి. కానీ ఆమె అతన్ని గుర్తుపట్టలేదని తెలిసిపోతుంది. ఆమె మొహంలో కనబడుతున్న ప్రశ్నార్ధకం చూస్తుంటే. రెండు క్షణాలు అలా చూసి పిలిచింది తనని కాదని నిశ్చయించుకున్నట్టు వెనక్కి తిరిగింది.
"ఏమండీ మిమ్మల్నే?" అన్నాడు శశికాంత్ మళ్ళీ.
"నన్నా?" అంది ఆశ్చర్యంగా.
"ఆరోజు మీరు నాకొక లాటరి టిక్కెట్టు ఇచ్చారు గుర్తుందా!" అన్నాడు శశికాంత్.
"ఎవరు నేనా?"
"మీరే! శ్రావణ శుక్రవారం రోజున నేను కారులో కూర్చుని ఉంటె - ఆ టిక్కెట్టు నా కారులోంచి పడిపోయిందనుకుని భ్రమపడి నాకు ఇచ్చారు. అది నాది కాదని చెప్పెలోపల కనబడకుండా జనంలో కలిసిపోయారు మీరు."
అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమెకి.
"ఓ! అదా? అయితే టిక్కెట్టు మీది కాదా?"
"కాదు"
"అరె! అలాగా!" అంది ఆ అమ్మాయి. ఇంకేమనాలో తోచక.
"ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి! అన్నాడు మొహం సీరియస్ గా పెట్టి.
"సమస్యా! ఏమిటది?" అంది ఆ అమ్మాయి . ఆమె విశాల నయనాలలో కొంచెం ఆదుర్దా కనబడింది.
"ఆ టిక్కెట్టుకి ఫస్టు ప్రైజ్ వచ్చింది"
"ఏమిటి?" అని ఆశ్చర్యంతో నోరు కొద్దిగా తెరచి అతనివైపు చూస్తూ వుండిపోయింది ఆ అమ్మాయి.
"నిజం మిస్! ఆ టిక్కెట్టుకే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ - పదిలక్షలు.
ఆమె సాలోచనగా అంది.
"పాపం! ఫస్టు ప్రైజ్ వచ్చిన లక్కి టిక్కెట్టుని పారేసుకున్న ఆ దురదృష్టవంతులేవరో."
"వాళ్ళ సంగతి వదిలెయ్యండి? ఇక ఈ టిక్కెట్టు మీదే?" అన్నాడు శశికాంత్.
"నాదా? నాదెందుకవుతుంది." అంది ఆ అమ్మాయి.
"అది మీకే దొరికింది కదా!"
"నాకు దొరికినంత మాత్రాన నాదవుతుందా? కాదు. ఎప్పుడూ కాదు."
"మరి ఆ టిక్కెట్టు ఎవరిదో మనకి తెలియదు కదా? ఏం చేస్తాం" అన్నాడు శశికాంత్.
ఆ అమ్మాయి కొద్ది క్షణాలు ఆలోచించింది. "లాటరీ టిక్కెట్టుని బట్టి వాళ్ళని ట్రేస్ చెయ్యడానికి వీల్లేదా?" అంది ఆదుర్దాగా.
"ఆ సంగతి ఆలోచించాను. టిక్కెట్టు వెనక దాన్ని అమ్మిన ఏజెంటు రబ్బరు స్టాంపు ఉంది గానీ, దాన్ని కొన్నవాళ్ళ వివరాలు ఉండవు కదా!"