Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 7

 

    అప్పుడు గుర్తు వచ్చింది అతనికి. ఆరోజు శ్రావణ శుక్రవారం అని.

 

    అంతమంది అక్కడరోడ్డుకి అడ్డంగా నడుస్తూ వెళుతుండడం వల్ల అతని కారు వేగం తగ్గింది. పాకుతున్నట్లుగా నెమ్మదిగా జరుగుతోంది కారు.

 

    ఉన్నట్లుండి గాజుల సవ్వడి వినబడింది అతనికి - అతి సమీపంగా. మరుక్షణంలో ఒక నాజుకైనా చెయ్యి విండోలో నుంచి లోపలికి వచ్చింది.

 

    తల తిప్పి చూశాడు శశికాంత్.

 

    కారుని అనుకునేంత దగ్గరగా నిలబడి వుంది ఒక అమ్మాయి. తలంటు పోసుకున్న జుట్టు పట్టులా మృదువుగా కనబడుతోంది. వదులుగా వేసుకుంది జడ. తిలకం బొట్టు పెట్టుకుంది. దానిమీద మళ్ళీ కుంకుమ బొట్టు. ఆరెండో బొట్టు గుళ్ళో పెట్టుకొని ఉండొచ్చు. ఆ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కుంకుమ కొద్దిగా జారి ఆమె ముక్కుమీద పడినట్లుంది. ఎర్రటి ముక్కుపుడకలా కనబడుతోంది కుంకుమ. స్నానానికి ముందు రాసుకున్న పసుపు తాలూకు పచ్చటి ఛాయా ఆమె మొహంలో కనబడుతూనే ఉంది.  బంగారపు ముద్దలాంటి పసుపు పట్టుచీర కట్టుకుని ఉంది తను.

 

    భారీగా జారి ఉంది దానికి. ఆ పాతకాలపు పట్టుచీర వాళ్ళ అమ్మది అయి వుండాలి.

 

    ఆమె మెడలో సోమ్ములేమి లేవు. కానీ మెడ కిందుగా సొంపుగా ఒంపులు తిరిగిన-

 

    "ఇది మీదేనా? మీ కార్లోనుంచి కిందపడింది - " అని ఇక చిన్న కాగితం ముక్కని అతనికి అందించింది. ఆ అందమైన అమ్మాయి.

 

    తెప్పరిల్లి - ఆ కాగితం ముక్కవైపు చూశాడు శశికాంత్.

 

    అది ఒక లాటరీ టిక్కెట్టు.

 

    "ఇది నాది కాదు" అని దాన్ని తిరిగి ఇచ్చెయ్యబోయాడు శశికాంత్.

 

    కానీ అప్పటికే ఆ అమ్మాయి వెను తిరిగి  వెళ్ళిపోతోంది.

 

    చటుక్కున డోర్ తెరచి కిందికి దిగాడు శశికాంత్. పసుపు పచ్చ పట్టుచీర కట్టుకున్న ఆ అమ్మాయి పది అడుగుల దూరంలో వెళ్తోంది.

 

    చకచక నడిచి ఆమెను చేరుకున్నాడు.

 

    "ఏమండీ?" అన్నాడు.

 

    వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి.

 

     కానీ ఈ అమ్మాయి కాదు తనకి ఆ లాటరి టిక్కెట్టు ఇచ్చింది. ఈమె కూడా అలాంటి చీరె కట్టుకొని ఉండటం వాళ్ళ తను పొరబడ్డాడు.

 

    "ఏమిటి?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూస్తోంది ఆ అమ్మాయి అతని వైపు.

 

    "ఐయామ్ సారీ! మిమ్మల్ని చూసి మరెవరో అనుకుని పొరబడ్డాను- " అని క్షమార్పణ చెప్పి తనకి పొరబాటున లాటరి టిక్కెట్టు ఇచ్చిన ఆ అమ్మాయి ఎటు వెళ్ళిపోయిందా అని వెతకడం మొదలెట్టాడు శశికాంత్.

 

    అతను ఎంత వెతికినా లాభం లేకపోయింది. ఆ అమ్మాయి అతనికి కనబడలేదు.

 

    ఇక చేసేదేమీ లేక లాటరి టిక్కెట్టుని పర్సులో పెట్టుకున్నాడు శశికాంత్. ఆ తర్వాత దాని విషయం మరచిపోయాడు.

 

    రాత్రికి ఇంటికి వెళ్ళి సూటు విప్పేసి లేతరంగు సిల్కు లాల్చి పైజమా వేసుకుని మెత్తటి స్లిప్పర్లలో పాదాలు దూర్చి సౌఖ్యంగా సోఫాలో కూర్చుని పేపరు తిరగేస్తుండగా అతని దృష్టిని ఆకర్షించింది. ఆ పేపరులోని ఆ కాలమ్.

 

    లాటరీ రిజల్టు ఉన్నాయి అక్కడ!

 

    పరీక్షగా చూశాడు.

 

    తన దగ్గర ఉన్న లాటరీ టిక్కెట్టు తాలూకు రిజల్టే అవి.

 

    చిన్నగా నవ్వుకుని లేచి పర్సులో నుంచి టిక్కెట్టు బయటికి తీశాడు శశికాంత్.

 

    రిజల్టు చూసి ఈ టిక్కెట్టుని చింపి వేస్టు పేపర్ బాస్కెట్ లో పారేస్తే ఇక తనకు ఈ గిల్టి కాన్షస్ నెస్ తగ్గుతుంది.

 

    ఎలాగూ దీనికి ప్రయిజు వచ్చేది లేదు చచ్చేది లేదు. యధాలాపంగా నెంబర్లని వెతికాయి అతని చూపులు.

 

    వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

 

    ఫట్ ప్రైజ్!

 

    ఈ టిక్కెట్టుకే! తన చేతిలో ఉన్న ఈ టిక్కెట్టుకే ఫస్ట్ ప్రైజ్!

 

    పది లక్షలు.

 

    ఏ మిలియన్ బక్స్!

 

    అతనికి మతిపోయినట్లయింది.

 

    టెన్ లాక్స్! మైగాడ్! దిసీజ్ ఫాంటాబ్యులెస్!

 

    రియల్లీ!

 

    కానీ,

 

    తనది కాదు ఈ టిక్కెట్టు.

 

    ఎవరో పారేసుకున్నారు దీన్ని! అది మరెవరో అమ్మాయికి దొరికింది. ఆ అమ్మాయి పిలిచి తనకి ఇచ్చింది.

 

    సరిగ్గా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మిదేవిలాగా!

 

    చిత్రం! చాలా చిత్రం!

 

    తను బిజినెస్ మాన్! తనకు ఈ శుక్రవారం సెంటిమెంట్ బాగా వుంది.

 

    ఆ టికెట్టు వైపే తదేకంగా చాలా సేపు చూస్తూ ఉండిపోయాడు శశికాంత్.

 Previous Page Next Page