Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 9

 

    "పోనీ! ఆ ఏజెంటు దగ్గరికే వెళ్ళి అడగొచ్చుగా!"

 

    "ఏజెంటు దగ్గర టిక్కెట్టు తాలుకు కౌంటర్ ఫాయిల్ ఉంటుంది ప్రైజ్ మని తాలూకు కమిషన్ క్లయిమ్ చెయ్యడానికి, కానీ టిక్కెట్టు కొన్నవాళ్ళ వివరాలు వాళ్ళ దగ్గర వుండవు."

 

    "అడిగి చూస్తే?"

 

    "అతను ఆ టిక్కెట్టు తనదేనని , ఎవరికి అమ్మలేదని బుకాయించి తనే డబ్బు క్లెయిమ్ చేస్తే?"

 

    ఏం చెప్పలేక నిస్సహాయంగా చూసింది ఆ అమ్మాయి.

 

    రెప్ప వెయ్యకుండా ఆమె వైపు చూస్తున్నాడు శశికాంత్.

 

    అందమైన ఆర్చిలలాగా తీర్చి దిద్దినట్లు కనబడుతున్నాయి ఆమె కనుబొమలు. ఎడమ కన్నుబొమ్మ మీద చిన్న గాయం మానిన మచ్చ కనబడుతోంది.

 

    కళ్ళు చిట్లించి చూశాడు శశికాంత్.

 

    ఈ అమ్మాయిని చూడగా చూడగా తనకు ఎవరో గుర్తొస్తున్నారు లీలగా.

 

    ఎవరు! ఎవరది?

 

    "ఆ టిక్కెట్టు ఎవరిదో కనుక్కుని వాళ్ళకి హటాత్తుగా ఈ న్యూస్ చెబితే వాళ్ళెంత పరమానందభరితలాయిపోతారో!" అంది ఆ అమ్మాయి.

 

    నిదానంగా అన్నాడు శశికాంత్.

 

    "చూడండి! టిక్కెట్టు మీకు దోరికింది. దాని తాలుకు అసలు యజమానులు ఎవరో తెలియకపోతే ఆ డబ్బు మీరే క్లయిమ్ చేసుకోవచ్చని నేను చెబుతున్నాను. అయినా మీరు వద్దనే అంటారా - మిస్! మీ పేరు నాకు తెలియదు.

    
    "సౌమ్యలక్ష్మి" అని "ఆ డబ్బు నాకు వద్దు" అంది.

 

    "సౌమ్య లక్ష్మి" అనుకున్నాడు అతను మనసులోనే కలవరిస్తున్నట్లు. పదిలక్షలు తెప్పిచ్చింది తనకు ఈ అమ్మాయి! అది శుక్రవారంపూట! ఆ పదిలక్షలు తిరిగి ఇచ్చేస్తానన్నా తీసుకోవడానికి నిరాకరిస్తోంది ఇప్పుడు.

 

    "నిజంగానే తన పాలిటి లక్ష్మి ఈ అమ్మాయి!"

 

    పదిలక్షలు! మైగాడ్! పదిలక్షలంటే మాటలు కాదు. లక్షలు రొటేట్ చేసే తలలాంటి బిజినెస్ మాన కి కూడా?

 

    ఏ మిలియన్ బక్స్! యా!

 

    అలా ఆలోచిస్తూనే హటాత్తుగా స్పురించింది అతనికి - ఆ అమ్మాయి ఎవరో.

 

    "నీ పేరు సౌమ్యలక్ష్మా? గుడ్ గాడ్! నువ్వా? నువ్వు సౌమ్యవి కాదు సోమయ్య , గుర్తుందా? నీ పేరు సోమయ్య" అన్నాడు శశికాంత్ చనువుగా. అది వినగానే విస్తుబోయి అతని వైపు చూసింది.

 

    "చిన్నప్పుడు నిన్నూ సోమయ్యా అని పిలిచేవాళ్ళం. నాకు కూడా ఒక నిక్ నేమ్ ఉండేది. జింబో అని! " అన్నాడు శశికాంత్.

 

    "జింబో" అంది మెల్లిగా.

 

    పెద్దగా నవ్వాడు అతను.

 

    "యా! జింబో! చిన్నప్పుడు నా క్రాపు పంపర పనసకాయ డిప్పలాగా వుండేది. అందుకని మీ ఆడపిల్లలంతా కలిసి, నాకు మారుపేరు పెట్టారు జింబో అని! మేమందరం కలిసి నిన్ను సోమయ్యా! సోమయ్యా అంటే నువ్వు ఉడుక్కునే దానివి! గుర్తుందా?

 

    "లేకేం?" అంది సౌమ్య నవ్వుతూ.

 

    "నీ అసలు పేరేమిటి? మరచిపోయాను, వుండు. చంద్రకాంత్ కదూ!"

 

    "కాదు, శశికాంత్!"

 

    "అవునవును. గుర్తొచ్చిందిప్పుడు...."

 

    "సౌమ్యా? - సుబ్రహ్మణ్యం మాస్టారు ఎలా వున్నారు?"

 

    "బాగానే ఉన్నారు."

 

    "మీ అమ్మగారు?"

 

    "అందరూ బాగానే ఉన్నారు. ఈ పక్క సందులోనే మా ఇల్లు. ఈ మధ్యే మారాం."

 

    "పద! నేను నీతో వస్తాను. మాస్టారుని చూసి ఎన్నాళ్ళయిందో?" అన్నాడు శశికాంత్.

    

                                                                          4

 

    చిన్న పెంకుటిల్లు అది. వసారాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు సుబ్రహ్మణ్యం గారు.

 

    చిన్నప్పుడు అయన దగ్గర చదువుకున్నాడు శశికాంత్.

 

    అయన పక్కనే ఆయన భార్య శారదమ్మ కూర్చుని బియ్యం చెరుగుతోంది.

 

    "నమస్కారం మాస్టారు?" అన్నాడు శాశికాంట్ చేతులు జోడిస్తూ.

 

    అతని నమస్కారాన్ని అందుకున్నట్లు తల పంకించి, కళ్ళ జోడు పైనుంచి అతని వైపు చూశారు సుబ్రహ్మణ్యం గారు.

 

    "ఎవరూ?"

 

    "వాసుదేవరావుగారి అబ్బాయి నాన్నా" అంది సౌమ్య - పరిచయం చేస్తూ.

 

    "ఓర్ని ? నువ్వా! పెద్దవాడివైపోయవే? ఎక్కడున్నారు అమ్మా నాన్నా" అన్నారు సుబ్రహ్మణ్యం గారు.

 Previous Page Next Page