"వెళ్లి రబ్రీదేవిని అడుగు.....కసకసా ఈ కడుపులో ఓ కత్తి దించుతుంది" కసిగా అన్నాడు శ్రీచంద్ర.
"సారీ గురూ.....నీ టెన్షన్ మ్యాటర్ అర్ధం కాక....." అని ఒక్కక్షణం ఆగి" నీకు కోపం రాదంటే ఒక్క డౌట్ అడగనా?"
"అడిగి చావు......చెప్పి చస్తా" అంటూ సమీర కోసం వెతకసాగాడు.
"ఈ గడ్డినంతా ఓపిగ్గా క్యారిబాగ్ లో వేసి ప్యాక్ ఎవరు చేసి వుంటారంటావ్?" అడిగాడు సత్తిపండు భయం భయంగా.
"ఆ బేవార్స్ డౌట్ నన్నడుగు నేను చెబుతాను" అన్నమాటలు పక్కనుంచి వినిపించడంతో సత్తిపండు, శ్రీచంద్ర ఒకేసారి తలలు తిప్పి చూసారు.
ఎదురుగా సమీర.
కోపంగా, తినేసాలా చూస్తూ వుంది.
ఆమె కూచున్న చోట చుట్టూ గడ్డి పీకి వేయబడి వుంది.
"అయిదున్నరకు తగలబడి ఏమి తోచక గడ్డి పీకుతూ ఉన్నాను. ఎనిమిది క్యారిబ్యాగుల గడ్డిపీకాను. ఓ అరగంట వెయిట్ చేస్తే మరో రెండు బ్యాగులు పికేస్తాను. సరేనా" అంది ప్రపంచంలోని కోపాన్నంతా తన ఫేసులోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని.
"నిజంగానా వదినా?" సత్తిపండు ఓ అడుగు ముందుకేసి కుతుహులంగా అడిగాడు.
తన పక్కనే వున్న గడ్డితో నిండుగా వున్న క్యారిబ్యాగును వాలుగా గురిచూసి సత్తిపండు వైపు విసిరింది.
సత్తిపండు కంగారుగా కిందకి వంగాడు. అది ఎదురుగా వచ్చిన ఓ కానిస్టేబుల్ మీద పడింది.
కానిస్టేబుల్ సీరియస్ గా చూసాడు.
వెంటనే సమీర పళ్ళికిలించింది.
ఆ కానిస్టేబులు ఆ బ్యాగు విసిరింది అమ్మాయిగనుక, పైగా పళ్ళికిలించి తనని చూసి నవ్వింది కనుక టోపీ తీసి బుర్ర గోక్కుని తనలో తనే "ఇట్సాల్ రైట్" అనుకుంటూ వెళ్లిపోయాడు.
"అదేంటి వదినా.....గురూ మీదకి విసరాల్సిన క్యారిబ్యాగ్ నా మీదకు విసిరావు. అయినా అప్పటికి చెప్పాను పాపం నువ్వెదురు చూస్తుంటావని" అన్నడు సమీర వైపు చూస్తూ.
శ్రీచంద్ర కొరకొరా సత్తిపండు వైపు చూసి-
"ఇప్పుడంత ఓవర్ బిల్డప్ అవసరమంటావా?" అని అడిగాడు.
సమీర సీరియస్ గా కింద కూలబడింది.
"అది కాదు సమీరా......అసలేమైందంటే" సమీరని కన్విస్ చేయబోయాడు శ్రీచంద్ర.
సమీర సీరియస్ గా శ్రీచంద్ర వైపు చూసి పక్కనే వున్న ఓ గడ్డిపరకని చెవి మధ్యలో దూర్చుకుని......
"ఇప్పుడు చెప్పు చందూ" అంది.
"చీ....నీకు బొత్తిగా మేనర్స్ లేకుండా పోతుంది. మరి పబ్లిక్ ప్లేసులో 'రా చందూ' అంటే ఎలా వుంటుంది?" శ్రీచంద్ర టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అన్నాడు.
అసలు నీ ఉద్దేశ్యమేమిట్రా బాబు? అయినా తప్పు నీది కాదు, చిన్నప్పుడే మనిద్దర్నీ మొగుడూ పెళ్ళాలని చెప్పిన మీ అబ్బని, మా అబ్బని అనాలి. చీ.....అనవసరంగా బోల్డు హొప్స్ పెట్టుకున్నా.....ప్చ్....లాభం లేదు, ఎవరో ఒకడికి లైనేయాల్సిందే. అయినా పాలకోవాలాంటి అమ్మాయి పార్క్ కు రమ్మంటే ఈ పొట్టి లాగుని వెంటబెట్టుకొస్తావా? పైగా గంట లేటు" సమీర అంది.
"అదేంటోదినా నన్ను తిడతావు? పోనీ ఓ ఫైవ్ ఇటు కొడితే నేవేళ్ళీ అలా వేరుశనక్కాయలు తింటూ కూచుంటా" వాళ్ళ మధ్య దూరి అన్నాడు సత్తిపండు.
శ్రీచంద్రకు ఆ సిట్యుయేషన్ చూస్తుంటే జుట్టు పిక్కోవాలనిపిస్తోంది.
సమీర నోరు విప్పితే నాన్ స్టాపే....
* * *
సమీర శ్రీచంద్ర భార్యా భర్తలని చిన్నప్పుడే డిసైడ్ చేశారు వాళ్ళ పెద్దలు.
సమీర తండ్రి, శ్రీచంద్ర తల్లి అన్నాచెల్లెళ్ళు.
శ్రీచంద్ర తనకు ఉద్యోగం వచ్చేవరకూ పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు.
సమీర మాత్రం ఎప్పటికప్పుడు పెళ్ళి చేసుకోమని పోరుతూనే ఉంది. అంతేకాదు , అప్పుడప్పుడు పైనల్ వార్నింగులు కూడా ఇష్యూ చేస్తూ వుంటుంది.
"నీకు ఉద్యోగం వచ్చేవరకూ వెయిట్ చేయలేను. బోర్ కొడుతోంది. ఓ పన్జేస్తాను. ఈలోగా ఎవడికైనా లైనేస్తాను. టెంపరరీ టైంపాస్ కు" అని శ్రీచంద్రని అడుగుతూ ఏడిపిస్తూ వుంటుంది.
పైగా చిన్నప్పట్నుంచి కలిసి మెలిసి పెరగడం వల్ల శ్రీచంద్రని "ఎరా చందూ" అని అంటుంది. అదేంటని అడిగితే-
"గులాబీ సినిమాలో చక్రవర్తిని మహేశ్వరి "ఏరా చందూ అనలేదా? గడ్డం చక్రవర్తికి లేని అభ్యంతరం నీకెందుకు అంటుంది?"
"నీతో పెళ్ళయాక నేనెలా వేగాలో....:" అంటాడు తల పట్టుకుని శ్రీచంద్ర.
* * *
రాత్రి పది దాటుతుండగా శ్రీచంద్ర తనింట్లోకి ప్రవేశించాడు. లుంబిని పార్క్ నుంచి బయటపడి, బయట హొటల్లో సమీరతో కలసి భోజనం చేసి సమీరను వాళ్ళింటి దగ్గర వదలి సత్తిపండుకు గుడ్ నైట్ చెప్పేసరికి ఈ వేళయింది.
ఆ టైంలో తండ్రి గ్యారంటిగా గుర్రు పెట్టి నిద్రాపోతుంటాడని తెలుసు. తల్లి అంతకన్నా ఒక గంట ముందే నిద్ర పోతుందని కూడా తెలుసు.
బామ్మా మాత్రం ఏ ఇంగ్లిషు నవలో చదువుతూ వరండాలో కూర్చుని వుంటుంది అనుకున్నాడు శ్రీచంద్ర. అతని గెస్ కరెక్టే.
బామ్మ వరండాలో కూచుని ఇంగ్లీషు నవల చదువుతోంది.
"ఒసే బామ్మా....ఏం చేస్తున్నావే?" శ్రీచంద్ర బామ్మ పక్కనే కూర్చుని అడిగాడు.
శ్రీచంద్ర వైపో లుక్కేసి "వచ్చావా? మీ నాన్న ఇప్పటి దాకా నిన్ను తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి డాక్టర్ గారు నోటికి ఎక్కువ స్ట్రెయిన్ కలిగించోద్దన్నాడని నిద్రపోయాడు. మీ అమ్మేమో.....మీ నాన్నని తిట్టలేక, మీ నాన్నని కన్న నన్ను తిడుతూ అలసి పడుకుండిపోయింది. నేనేమో ఏమి తోచక బేవార్స్ గా ఈ నవల చదువుకుంటున్నాను."
"ఇలా తయారయ్యావేంటి ముసలి బామ్మా.....నువ్వేం చేస్తున్నావని ఒక్క ప్రశ్న ఆడిగితే ఇన్ని సమాధానాలా?" జుట్టు పిక్కుంటూ అన్నాడు శ్రీచంద్ర.
"యస్ అనో, నో అనో చెబితే అలా కట్టె విరిచినట్టు చేబుతావేంటి బామ్మా .....అంటావు. డిటెల్డ్ గా చెబితే ఇలా అంటావు? నీతో ఎలా చచ్చేదిరా? నన్ను డిస్త్రర్బ్ చేయకు. మంచి రసపట్టులో వుంది నవల" అంటూ నవల చదవడంలో లీనమైంది బామ్మ.
"అంత ఇంట్రెస్టుగా వుందా? ఆ నవల పేరేంటి?"
"హర్ ఫస్ట్ నైట్ అని మాంచి కస్సక్కు నవలలే" అంది నవలలో నుంచి తలెత్తకుండానే.