Previous Page Next Page 
దీప పేజి 7


    "ఊరు పొలిమేర దాటని నాకేం తెలుస్తుంది మనూ! నువ్వంటే అక్కడుండి చదువుకుంటున్నావు. కొత్త కొత్తవి తెలుసుకోవచ్చు, చూడొచ్చు, నేర్చుకోవచ్చు."

 

    మన్ మోహన్ చటుక్కున దీప భుజాలమీద చేతులేశాడు. భుజాలు పట్టుకుని బలంగా ఊపుతూ "ఏయ్ పిల్లా! నాకేదో పాడలవాట్లయినట్లు ఆ ... గూడార్ధంగా మాటలేమిటి? ఆప్ ట్రాల్ వెధవ సిగరెట్ గురించే నువు బాధపడుతుంటే చెప్పు మానేస్తాను" అన్నాడు.

 

    "ఓ అలవాటేంటి చాలా నేర్చుకున్నావ్, భుజంమీద చేతులేస్తే తప్ప మాటలు రావా?"

 

    "ఆడపిల్లలందరి భుజాలమీద చేతులేయను. ఇది అలవాటు అంటే నిజమే అని ఒప్పుకోవాలి. చిన్నప్పటినుంచి ఎన్నిసార్లు నీ భుజంమీద చేయివేశాను, తప్పా?"

 

    "అది చిన్నప్పటి సంగతి."

 

    "అబ్బో, ఎంత పెద్దయావే!"

 

    "చా...లా..."

 

    "పోనీ పెద్దయావే అనుకో, నీ భుజంమీద చెయ్యివేసే చనువు నాకు తప్ప ఎవరికీ లేదు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ. నువ్వు కూడా మనూ! మనూ! అంటూ ఆడుకోటానికి చెయ్యిపట్టుకు లాక్కెళ్ళేదానివి. మర్చిపోయావా దీపా! ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా?"

 

    "మనూ! అమ్మ పిలుస్తున్నది" కంగారుగా అంది దీప.

 

    దీప భుజంమీద చేతులు తీసేశాడు మన్ మోహన్ తత్తరపడుతూ.

 

    దీప పకపక నవ్వింది. "మనూ! ఓ మనూ! నువ్వు వేషం మార్చుకున్నావు గాని మనసు ఎదగలేదు. మనిషితోపాటు మనసూ ఎదగాలి. చిన్నప్పుడు అమ్మ పిలుస్తుందీ అంటే "పద పోదాం దీపా" అని నా భుజంపట్టుకుని నడిచేవాడివి. ఇప్పుడదే మాట అంటే భుజంమీదనుంచి చెయ్యి తీసేశావు. మార్పు చూశావా! దేనికంటావ్ ఆ భయం?

 

    "భయమా! ఛ...ఛ... అలాంటిదేంలేదు. నా ధైర్యం చూస్తావా! ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాను కావాలంటే."

 

    "మనూ!" కోపంతో దీప ముఖం జేవురించింది.

 

    "సారీ దీపా! కోపం వచ్చిందా? చిన్నప్పటినుంచి నా సంగతి తెలిసిందేగా, నీ వద్ద చనువువల్ల కాస్త చనువుగా మాట్లాడాను ఏమనుకోకు."

 

    "మనూ! నీ చదువు సంగతి చెపుతావూ, కాలేజీ లైఫ్ ఎలా వుంటుందో తెలుసుకుందామని వచ్చాను. నాకు కొన్ని పుస్తకాలు కావాలి. తర్వాత వస్తాను. ఇంకా వుంటావుగా అమ్మ చెప్పిందిలే." మోడా మీదనుంచి లేచి అంది దీప.

 

    "అప్పుడే వెళుతున్నావా?"

 

    "ఊ."

 

    "మళ్ళీ ఎప్పుడొస్తావ్?"

 

    "పని లేనప్పుడు వస్తామరి..."

 

    దీప గుమ్మం దాటుతుంటే వాకిలిదాకా వచ్చాడు. మన్ మోహన్ "దీపా!" అన్నాడు "ఏమిటి?" అన్నట్లు వెనుతిరిగి మన్ మోహన్ ని చూసింది దీప గుమ్మం అవతల నిలబడి.

 

    "నా మీద కోపం రాలేదుగా?"

 

    "కోపం దేనికి?"

 

    "అదే ఇందాక కిస్ గురించి..."నానుస్తూ ఆగిపోయాడు మన్ మోహన్.

 

    "ఓ ... అదా...! అందాకా నేను రానివ్వనులే, అయినా అబ్బాయిగారికి అంత ధైర్యం కూడానా?" నవ్వుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది దీప.

 

    దీప అన్నదానికి అర్ధం ఆలోచిస్తూ గుమ్మం అవతలే నుంచుండిపోయాడు మన్ మోహన్.

 

                                                                  6

 

    "ఈరోజేమిటి ఆలస్యంగా వచ్చావ్!" పార్వతమ్మ చేస్తున్న పని ఆపి దీపని అడిగింది.

 

    "ఎంతాలశ్యం అయింది పదినిమిషాలేగా." అంది దీప.

 

    "పది నిమిషాలు ముందే వచ్చేదానివి పదినిమిషాలు ఆలస్యంగా వస్తే ఎంత ఆలస్యమయిందో లెక్కవెయ్యి."

 

    అప్పుడే గదిలోంచి బైటకు వచ్చిన అనిల్ నవ్వుతూ "అమ్మా! ఇహపై దీపకి చదువు నీవు నేర్పుతావా ఏమిటి, ఏదో లెక్కలడుగుతున్నావ్?" అన్నాడు.

 

    "నేర్పుతారా, తప్పా?"

 

    "అమ్మమ్మ తప్పని నేననటంలేదు. దీపకి నీవు ప్రైవేట్ చెపితే ఇహపై నేనెవరికి చదువు చెప్పాలి. ఎవరి నెత్తిపై మొట్టికాయ లేయవచ్చు అని ఆలోచిస్తున్నాను."

 

    పార్వతమ్మ దీపవైపు తిరిగింది. "ఏమే దీపా! మావాడు రోజూ నీ నెత్తిని మొట్టికాయ లేస్తున్నాడా?" అంది ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుని.

 

    దీప సర్వం ఓడిపోయిన సామ్రాజ్నిలా ముఖం పెట్టింది.

 

    "ఉత్త మొట్టికాయలే కాదత్తయ్యా, మరి...మరి... అప్పుడప్పుడు చెవి మెలేయటం...చెంపలు వాయగొడటం...తొడపాశం ..." దీప టక్కున నోరు మూసుకుని నాలిక్కొరుక్కుంది.

 

    "ఏరా అనిల్, దీప చెప్పింది నిజమేనా? ఆడపిల్ల అంటే మల్లెపూవు లాంటిది. బాధ పెట్టటం మగవాడి లక్షణం అయితే వాడు పశువుతో సమానంరా మానవుడు కాదురా."

 

    "రామచంద్రప్రభో, నేనసలు దీపని కొట్టందే, దీపా! అబద్ధాలాడవచ్చా?" తల్లితో అని, దీపవైపు తిరిగి దీపని గదమాయించాడు అనిల్.

 

    "చూడత్తయ్యా! ఎలా కోప్పడుతున్నాడో!" బుంగమూతి పెట్టింది దీప.

 

    "చూస్తున్నా? చూస్తున్నా?" అంది పారవతమ్మ గంభీరంగా.

 

    "మెజార్టీ లేని చోట తొలగిపోవటం మంచిది. అమ్మతో కబుర్లు కానిచ్చిరా" అని అనిల్ లోపలికి వెళ్ళిపోయాడు.

 

    అనిల్ ఎమ్మెస్సీ పాసయ్యాడు. ప్రతి క్లాసులో ఫస్టుమార్కులు తెచ్చుకుంటు పైకి వెళ్ళాడు. పార్వతమ్మకి అనిల్ ఒక్కడే కొడుకు. ఈ పల్లెటూరిలో ఏ ఇంటి బిడ్డ చదవనంత పెద్ద చదువు చదవాలని పెద్ద ఉద్యోగం చేయాలని పార్వతమ్మ కోరిక. ఆ కోరిక తీరింది. ఇటుకోరిక తీరటం అటు భర్త ఆకస్మిక మరణం ఏక కాలంలో జరిగాయి, అనిల్ కి లెక్చరర్ ఉద్యోగం రావటం స్టూడెంట్స్ అనిల్ ని మించిన వయసులో వుండటం ఆడపిల్లలని వాళ్ళు అల్లరి చేయటం, ఫలితం సమ్మె. అనిల్ తప్పులేకపోయినా విద్యార్ధులని మంచిగా మందలించిన అతి చిన్న కారణానికి వాళ్ళ సమ్మె. అనిల్ విద్యార్ధులని అపాలజీ కోరాలని ప్రొఫెసర్ ఆజ్ఞ. అనిల్ కి కోపకారణం అయి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చేశాడు.

 

    పార్వతికి అనిల్ ఉద్యోగం చేయాలని వుంది. "చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం చేయాలని లేదమ్మా. చదువు విజ్ఞానం అంతే. ఇందాకా చదవాలని కొలబద్దేంలేదు. ఉన్న ఊరువదిలి ఎక్కడికో పోవటం దేనికమ్మా. ఇల్లుంది, భూముంది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నచోటునే వుండక. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా వాడికో పై వాడుంటాడు. ఓ రకమైన బానిస బ్రతుకే, ఉద్యోగంలేదని నాకేం బాధలేదు" అని అనిల్ ఉద్యోగ ప్రయత్నం చేయటం మానేశాడు. పార్వతమ్మ చెప్పి చెప్పి విసుగు చెంది ఊరుకుంది.

 Previous Page Next Page