వీరుడి తలలో
వీరుడి తలలో బుల్లెట్ కాల్చు
పొలాలు మూగవి
భూమికి ప్రాణంలేదు
విప్లవకారుని వీపుని పేల్చు
గోడకి చెవులు
గుడిసెకి కళ్లులేవు
ఒళ్లే తగలేయ్ కండలు పిండేయ్
నీళ్లూ నెత్తురు బూదిగా మార్చు
వీరుని చేతిని వ్రేలేకోసి
అతని ఆఖరి ఆజ్ఞగ మార్చు
జపాటా1
తర్వాత లుముంబా2
Nadie Y nada3
వీరుడి తలలో బుల్లెట్ కాల్చు
పొలాలు కదులును
భూమిది ఎరుపు
విప్లవకారుని వీపుని పేల్చు
గోడకి చెవులు
గుడిసెకి మనసు
ఒళ్లే తగలెయ్
కండలు పిండెయ్
నీళ్లూ నెత్తురు బూదిని ముంచు
వీరుని చేతిని వ్రేలేకోసి
అతని ఆఖరి ఆజ్ఞగ మార్చు
జపాటా
తర్వాత లుముంబా
గువేరా4
Viva la tierra5
రచన: అక్టోబరు, 1967
ముద్రణ : మరో ప్రస్తానం విరసం ప్రచురణ - మే, 1980
1. జపాటా (1879 - 1919): మెక్సికో విప్లవకారుడు. ఇరవయ్యో శతాబ్దంలో మొట్టమొదటి రైతాంగం పోరాటాన్ని నడిపిన నాయకుడు. మెక్సికో నగరాన్ని మూడుసార్లు ఆక్రమించాడు (1914 - 15). అటు తర్వాత ప్రభుత్వం దళాల జపాటాని పరమ కిరాతకంగా చంపేశాయి. మెక్సికో ఇండియన్లు అతన్ని ఇప్పటికీ స్మరించుకుంటారు.
2. పాట్రిస్ లుముంబా(1925 - 61): కాంగో జాతీయోద్యమ సమితిని స్థాపించాడు. కాంగో రిపబ్లిక్ కి మొదటి ప్రధానమంత్రి. కమ్యూనిస్టుల మద్దతున్న లుముంబాపై బెల్జియం పగబట్టింది. బెల్జియం ప్రభుత్వ దళాలు ఇతన్ని చంపేశాయి. ఇఅతని పేరు మీద మాస్కోలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించాడు.
3.Nadie Y nada అనేది స్పానిష్ పదం. మీకు స్వాగతం. మీకు మా కృతజ్ఞతలు అని అర్థం.
4. ఎర్నెస్టు చేగువేరా (1928-8.10.1967): డాక్టరీ పాసయ్యారుగాని వైద్యవృత్తి చేయలేదు. లాటిన్ అమెరికా విప్లవోద్యమ ప్రముఖ నాయకుడు. పాబ్లో నెరూఢా పద్యాలంటే ప్రాణం. జూల్సువెర్న్, అలెగ్జాండర్ డ్యూమాల రచనలంటే అభిమానం. అతని 'గెరిల్లా యుద్ధతంత్రం,' బొలీవియాడైరీ' అనే పుస్తకాలు బాగా ప్రసిద్ధి పొందాయి. 'నేను అర్జెంటీనాలో పుట్టాను. క్యూబాలో పోరాడాను. గ్వాటిమాలాలో విప్లవకారుడినయ్యా"నన్నాడు గువేరా. బొలీవియా సైనిక పటాలం అతన్ని పరమ కిరాతకంగా చంపింది.
5. Viva అంటే "వర్థిల్లాలి" Tierra అనేది చిలీ, అర్జెంటీనా మొదలైన దేశాలకు ఉమ్మడి పేరు. లాటిన్ ఆమెరికా వర్థిల్లాలి అని అర్థం.