అన్నపూర్ణావారి చిత్రాలలో
శ్రీశ్రీ గీతాలు
శ్రీశ్రీ
నలుగురు కలసీ
తోడి కోడళ్ళు (1957)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల బృందం
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
నలుగురు కలసీ పొరుపులు మరచీ
చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం ||నలుగురు||
నలుగురు కలసీ పొరుపులు మరచీ
చేస్తే ఉమ్మడి వ్యవసాయం - మన
కిస్తుందేక్కువ ఫలసాయం - ఇది
రైతులకెంతో సదుపాయం ||నలుగురు||
ఒక సంసారం పందేకరాలను
పండించటమే అరుదుకదా - అది
భరించలేని బరువుకదా
పది కుటుంబములు వెయ్యేకరాలను
సాగుచెయ్యడం సులువుకదా ||నలుగురు||
మహారాజులూ జమిందారులూ
మచ్చుకు దొరకని కాలంలో - ఈ
ప్రజలే ఏలే రాజ్యంలో
ఇతరుల కష్టం దోచుకు తినడం
ఇకపై సాగే పని కాదు ! ||నలుగురు||
ఇదియే సూత్రం ఒక్కడు మాత్రం
భూమిని గుత్తకు కొనరాదు - కడు
సోమరిపోతై మనరాదు
నేలా నీరూ గాలీ వెలుగూ
కొందరి సొత్తని అనరాదు - అవి
అందరి హక్కై అలరారు ||నలుగురు||
ఒక్కొక్క వ్యక్తీ సమస్త శక్తీ
ధారపోసి పనిచెయ్యాలి - ధన
ధాన్యరాశులే పెంచాలి
కూటికి గుడ్డకు లోటులేక తన
కవసరమైనవి పొందాలి ||నలుగురు||
పొద్దయినా తిరగక ముందే
తోడికోడళ్ళు (1957)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : జిక్కి
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
పొద్దయినా తిరగకముందే-
చుక్కయినా పొడవకముందే
రెక్కలు కట్టుకు - ఎగిరోచ్చావేమయ్యా
బలేమావయ్యా - నే రానూపోవయ్యా ||పొ||
కిటికీ తీసి చిటికేవేసి
అదలించేవు - నన్నడగొచ్చావు
ఎవరూలేని సమయంచూసి
ఏమని వచ్చావు - నీవేమిటి తెచ్చావు
అన్నెం పున్నెం ఎరగని - నన్ను
అలుసేందుకు చేస్తావు
బలేమామయ్యా - నే రానూపోవయ్యా
చనువిస్తే చాలు -
చిలిపితనాలు చూపెదవేలా-
నీ గుణాలు మానవిదేలా
విలాసాలకీ కులాసాలకీ -
వేళాపాళాలేదా
పదుగురికంటా పడితేతంటా
పరువే పోవునుకదా
బలేమావయ్యా నే రానూపోవయ్యా
కడదాకా నిను విడువను - నేనని
కబుర్లు చెప్పేవు - ఏవో
కధలే అల్లేవు - కమ్మని మాటలు నమ్మి
తీయని కలలే కన్నాను
నీ వలలో పడ్డాను
కళ్ళకు నచ్చిన కానుకలిస్తే
కాదని నేనేంటానా?
బలేమావయ్యా - నే రానూపోవయ్యా
నే రానూపోవయ్యా.
హాయిగా ఆలూమగలై
మాంగల్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి. సుశీల, సరోజిని బృందం
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
పిల్లలు :
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బతకాలి
హాయిగా చేయి చేయిగా
ఆలూ మగలై కాలం గడపాలి
సరోజ:
సతిధర్మం పతిసేవేయని పతిభక్తిని చూపాలి
అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి
పతి యింట్లో బంధుజనాల అభిమానం పొందాలి
పదిమందీ నీ సుగుణాలే పలుమార్లూ పొగడాలి
||హాయిగా||
చంద్రం:
ఇల్లాలే ఇంటికి వెలుగని యెల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలయి తిరగాలి
శరీరాలు వేరేగాని మనసొకటై మసలాలి
సుఖమైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి
||హాయిగా||
సరోజ :
ఇరుగమ్మలు పోరుగమ్మలతో ఇంటిసంగతులు అనవద్దు
చీరెలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు
అత్తింటను అదిరిపోటుతో పుట్టింటిని పొగడోద్దు
తరుణం దొరికిందేచాలని 'తలగడ మంత్రం' చదవొద్దు
||హాయిగా||
తెలియని అనందం
మాంగల్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి. సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సరోజ :
తెలియని అనందం - నాలో
కలిగినదీ ఉదయం
పరవశమైపాడే నా హృదయం
కలకలలాడెను వసంతవనము
మైమరపించెను మలయానిలము
తీయని ఊహల ఊయలలూగి
తేలే మానసము - ఏమో- ||తెలియని||
రోజూ పూచే రోజా పూలూ
ఒలికించినవి నవరాగాలు
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం - ఏమో - ||తెలియని||
అరుణ కిరణముల గిలిగింతలలో
కరగిన తెలిమంచు తెరలే తరలి
యెరుగని వింతలు యెదుటే నిలిచి
వెలుగే వికసించె - ఏమో - ||తెలియని||
ఆకాశవీధిలో
మాంగల్యబలం(1959)
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, పి. సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సరోజ : ఆకాశవీధిలో అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి
ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే ||ఆకాశ||
జలతారు మేలిమబ్బు
పరదాలు నేసి - తెరచాటు చెసే
చంద్రం : పలుమారు దాగి దాగి
పంతాలు పోయి పందేలు వేసి
సరోజ : అందాల చందమామ
దొంగాటలాడెనే దోబూచులాడెనే
||ఆకాశ||
చంద్రం: జడివాన హోరుగాలి
సుడిరేగి రానీ, జడిపించబోనీ
సరోజ : కలకాలము నీవే నేనని
పలుబాసలాడి - చెలిచెంతజేరి
చంద్రం : అందాల చందమామ
అనురాగం చాటెనే
నయగారం చేసెనే ||ఆకాశ||