Previous Page Next Page 
మోహిత పేజి 8


 

       గుడిసెల ముందు ఎవరో దగ్గుతున్న చప్పుడు విన్పించడంతో కంగారుగా అటువేపు చూశాడు మైత్రేయ. అతని చూపులు దూరంగా గుడిసెలోంచి బైటకొచ్చిన వ్యక్తిమీద వున్నాయి.ఆ వ్యక్తి గ్రామపెద్ద.

 

    గ్రామపెద్దను చూడగానే దూరంగా జరిగిపోయాడతను. గ్రామపెద్దను చూసిన వనలక్ష్మి-

 

    "బాబూ  లేచి వెళ్ళిపో.... అట్నుంచి వెళ్ళిపో...." అంటూ గబగబా చీర చుట్టుకుంటోంది.

 

    అతను వెంటనే లేచిపోయి, కుడిపక్క డొంకల్లోంచి నులకమంచం దగ్గరకు వెళ్ళాడు.

 

    ఎడమపక్క దట్టమైన చెట్లపక్కనుంచి గుడిసెల వెనక్కి వెళ్ళిపోయింది వనలక్ష్మి.

 

    మబ్బులు మూసేయడం వల్ల చెరువు నీళ్ళల్లో చంద్రుడు మాయమై పోయాడు.

 

    నిశ్శబ్దంగా అలా ఆలోచిస్తూ, మంచంమీద కూర్చుండిపోయాడు మైత్రేయ.

 

    వనలక్ష్మి మళ్ళీ వస్తుందనుకున్నాడు. గుడిసెలలోంచి బయటకు రాలేదామె.

 

    ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదతనికి.

 

                                              *    *    *

    సరిగ్గా మూడుగంటలకు-

 

    ఊరిపెద్ద పాండ్యానాయక్ లేపగా లేచి, బయలుదేరడానికి ఉద్యుక్తుడయ్యాడు మైత్రేయ.

 

    పొలిమేరవరకూ వచ్చి వీడ్కోలు పలికి, జాగ్రత్తలు చెప్పాడు పాండ్యానాయక్.

 

    ముందుకు నడిచి, కొండల దగ్గర మలుపు తిరుగుతూ, చెట్టుపక్కన లేత వెన్నెల వెలుగులో నుంచున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతను.

 

    ఆ వ్యక్తి వనలక్ష్మి....

 

    ముందుకొచ్చి, ప్రేమగా అతని గుండెలకు తలాన్చి-

 

    "మళ్ళీ తిరిగి వెనక్కి ఎప్పుడొస్తావు బాబూ.....?" అనడిగింది.

 

    "చెప్పలేను" బదులిచ్చాడతను.

 

    "ఎన్ని రోజులైనా ఫర్వాలేదు..... ఎన్ని నెలలైనా ఫర్వాలేదు..... తిరుగు ప్రయాణంలో ఒక్కరాత్రి ఇక్కడే వుండి, నా కోరిక తీర్చాలి.... నీతో ఆ కోరిక తీర్చుకున్నాకనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను.... బాగా గుర్తుంచుకో."

 

    ఆ కళ్ళల్లో కన్పించిన ప్రేమకు, ఆ మాటల్లో విన్పించిన ఆర్థ్రతకు చలించి పోయాడు మైత్రేయ.

 

    అతని చేతుల్ని రెంటినీ తీసుకుని, తన గుండెలకు హత్తుకుని, ఆ తరువాత ముద్దు పెట్టుకుంది.

 

    "నేను వెనక్కి రాకపోతే, రాలేకపోతే...." చిన్నగా నవ్వుతూ అన్నాడతను.

 

    "నేను పెళ్ళి చేసుకోను..... నీ మనిషిగా వుండిపోతాను.... సరేనా.... నిజం...." ఆ మాటలకు మైత్రేయ కళ్ళల్లోచిన్న తడి కదలాడింది.

 

    "తప్పకుండా వస్తాను...." ఆమె చేతిలో చెయ్యివేసి చెప్పి ముందుకు కదిలాడతను.

 

    చాలాసేపటివరకూ రాత్రి దృశ్యం అతని కళ్ళముందు కదలాడుతూనే వుంది.

 

                                            *    *    *

 

`    పెరట్లో పట్టెమంచంమీద కూర్చున్నాడు మైత్రేయ మేనమామ ఇందు తండ్రి వెంకటయ్య.

 

    అతనికెదురుగా వంటగది మెట్లమీద కూర్చుంది ఇందు తల్లి సావిత్రమ్మ.

 

    మధ్య గదిలో తలుపుచాటున నుంచుంది ఇందు.

 

    "ఈ ఏడాది పంటలు బాగానే వున్నాయి. ఈ ఏడాదే ఇందుకు పెళ్ళి చేసేస్తే బావుంటుందని నాకు వుంది. మరి...." సాలోచనగా భార్యవైపు చూశాడు వెంకటయ్య.

 

    "మైత్రేయకి మనం తప్ప ఎవరున్నారని.... మీరు హైదరాబాద్ వెళ్ళో, లేకపోతే అతన్ని ఇక్కడకు రాప్పించో.... ఒకమాట అనేసుకుంటే సరిపోతుంది కదా...." అంది భార్య సావిత్రమ్మ.

 

    "ఇందుకు ఇష్టమే గదా....?" అడిగాడాయన.

 

    "మైత్రేయ అంటే దానికెంతిష్టమో మీకు తెలీదా?" ఎదురుప్రశ్న వేసిందామె.

 

    "ఫోన్ చేస్తే..." అన్నాడాయన.

 

    "పెళ్లి మాటలు ఫోన్ లో బాగుంటాయా? రేపే మీరు బయలుదేరండి. స్వయంగా మాట్లాడి వచ్చేయండి. ఏమంటారు?' అందామె.

 

    తండ్రి రేపు హైదరాబాద్ వెళ్ళి, బావతో మాట్లాడి వస్తే అభిషేకం చేయిస్తానని అప్పటికప్పుడు తనలో తానే ఈశ్వరుడికి మొక్కేసుకుంది ఇందుమతి.

 

    "అలాగే, రేపు వెళతాను" తండ్రి నోటినుంచి ఆ మాట రాగానే, ఇందు నిలువెల్లా సంతోషంతో పురివిప్పిన నెమలిలా అయిపోయింది. ఆ విషయం ఫ్రెండ్ సరోజతో చెప్పటానికి బయటకు పరుగెత్తింది.

 

                                           *    *    *

 

    పూర్తిగా తెల్లవారింది.

 

    పాండ్యానాయక్ చెప్పిన వివరాల ప్రకారం ఒక్కొక్క గిరిజన గ్రామాల్నీ దాటుతూ, మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతానికి ఎర్రమట్టి దిబ్బలు చేరాడు మైత్రేయ.

 

    ఆ దిబ్బల్లోని ఎర్రమట్టికి మంచిశక్తి వుందని నమ్ముతారు గిరిజనులు. అందుకే  ప్రతిరోజూ, ఆ మట్టిని వుండల్లా చేసుకుని తింటారు వాళ్ళు....

 

    అక్కడినుండి పులిగడ్డ చేరడానికి మరో గంటన్నర పట్టింది.

 

    ఇంకో రెండుగంటల్లో నెమళ్ళకోన చేరిపోతాడు.

 

    అక్కడక్కడ ఆగుతూ, రెస్ట్ తీసుకుంటూ, తనతో తెచ్చుకున్న బిస్కట్స్ తింటూ, కొండల మధ్యలోంచి నడుస్తున్నాడతను.

 

    మరో గంటన్నర గడిచిపోయింది.

 

    దూరంగా కొన్ని వందల నెమళ్ళు.... ఎక్కడనుంచో వుప్పెన శబ్దంలా విన్పిస్తోన్న జలపాతపు శబ్దం....

 

    మరో గంటన్నర గడిచిపోయింది.

 

    అప్పటికి సాయంత్రం సరిగ్గా అయిదు గంటలైంది.

 

    దత్తమయిన అడవులు.... ఆ వెనుక నిద్రపోతున్న ఏనుగుల్లా కొండలు.....

 

    ఆ కొండల మధ్యనుంచి నింగికీ, నేలకూ వేసిన నీళ్ళ వంతెనలా జలపాతం....

 

    ఎత్తయిన గుట్టనెక్కి నాలుగు వేపులా చూశాడు. ఎక్కడా లాంటి బిల్డింగ్ కాని, పాడుబడిన బంగళా కానీ, కనీసం ఒక గుడిసైనా అతనికి కన్పించలేదు.

 

    నీరుకారిపోయాడు మైత్రేయ....

 

    రాంగ్ ఇన్ఫర్మేషన్ తో తనిక్కడికొచ్చాడా? నిస్త్రాణంగా చెట్టుకు చేరబడి కూర్చుండిపోయాతను.

 

    అతనిలో పాతిక మైళ్ళు నడిచిన అలసట. రాత్రి నిద్రలేకపోవటం వల్ల కళ్ళల్లో మగత...

 

    దూరంగా జలపాతం, విశాలమయిన  పచ్చిక మైదానం.... ఆ మైదానంలో తిరుగాడుతున్న రకరకాల నెమళ్ళు.

 

    సరిగ్గా గంట గడిచింది.

 

    సూర్యుడు అస్తమిస్తున్న సమయం.

 

    జలపాతంలో స్నానం చేస్తే.... ఆ ఆలోచన రాగానే జలపాతం దగ్గరకు నడిచాడు.

 

    అటూ యిటూ చూసి, వంటిమీద బట్టలు పూర్తిగా విప్పేసి, ఒడ్డున పెట్టి నీళ్ళల్లోకి దూకాడు.

 

    అలసట తగ్గిపోయేవరకూ స్నానం చేసి, బ్యాగ్ లోంచి టవల్ తీసుకుని ఒళ్లు తుడుచుకుంటూ అకస్మాత్తుగా బండరాయి పక్కన మిలమిల మెరుస్తూ కన్పించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడతను.

 

    గబగబా ముందుకు నడిచి,  ఆ వస్తువును చేతిలలోకి తీసుకున్నాడు.

 

    ఆ వస్తువు గోల్డ్ చైన్. బంగారు గొలుసు.

 

    అది గిరిజనులు వేసుకునే గొలుసు కాదు. పట్నం అమ్మాయిలు వేసుకునే ఒంటిపేట బంగారు గొలుసు.

 

    "మోహితదా?

 

    లేక పట్నంనుంచి ఎవరో, ఎప్పుడో వచ్చి జలపాతంలో స్నానం చేసినప్పుడు వడ్డున పెట్టి మర్చిపోయారా?

 

    లేదు, మోహితదే. అంటే  ఈ దట్టమయిన అడవుల్లో ఏదో బిల్డింగ్ కానీ, గుడిసె కానీ వుండివుండాలి.

 

    మరో అరగంటలో చీకటి పడుతుంది. ఈలోపలే తను వెతకాలి.

 

    ఆ గోల్డ్ చైన్ ను భద్రంగా జేబులో పెట్టుకుని బయలుదేరాడతను.

 

    ఇరవై నిమిషాలు గడిచాయి.

 

    దట్టమయిన అడవుల్లోకి ప్రవేశించాడు. గాలికి కదిలే ఆకుల చప్పుడు వింతగా విన్పిస్తోంది. గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల అరుపులు కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. దూరంనుండి విన్పిస్తున్న జలపాతపు హోరు....

 

    సరిగ్గా  అప్పుడు విన్పించింది.

 

    భయంకరంగా అరిచిన ఓ కుక్క అరుపు.

 

                                              *    *    *

 

    శివాలయం మెట్లమీద కూర్చున్నారు ఇందుమతి, సరోజ....


    
    "అయితే మీనాన్న హైదరాబాద్ వెళుతున్నారంటే, మేరేజ్ ఫిక్స్ అయిపోయి నట్టే గదా.... నా పెళ్ళికన్న ముందు నీ పెళ్ళి అయిపోతుందేమో" అంది సరోజ.

 

    "అదికాదే నా బాధ. మా బావ ఒప్పుకుంటాడనుకో..... కానీ పెళ్ళి ఈ సంవత్సరం వద్దు..... వచ్చే సంవత్సరం అంటే..." తన మనసులోని మాటను బైటపెట్టింది ఇందు.

 

    "బుద్ధి వున్నవాడెవడూ వాయిదా వెయ్యడు.... మీ బావ నిన్ను చూసి ఎన్నాళ్ళయ్యింది.....?" ప్రశ్నించింది సరోజ.

 

    "మూడేళ్ళు...."

 

    "అంటే....నీలో సెక్సప్పీల్ చోటుచేసుకున్నాక మీ బావ నిన్ను చూడలేదన్న మాట" అంటూ ఇందు ఎత్తయిన గుండెలవేపు చూస్తూ అంది సరోజ.

 

    "దేవుడి గుడిముందు, ఏంటా మాటలు......." సిగ్గుపడుతూ అంది ఇందుమతి.

 

    "ఈ పెళ్ళిని మీ బావ వాయిదా వెయ్యడు గాక వెయ్యడు. ఎగిరి గంతేసి, వెంటనే ఒప్పేసుకుంటాడని నా నమ్మకం.... పోనీ వాయిదా వేసాడనుకో.... ఏం చేస్తావ్...."

 

    "ఏం చెయ్యాలి?" నీరసంగా ప్రశ్నించింది ఇందు.

 

    "నువ్వే హైదరాబాద్ వెళ్ళిపో, మీ బావ రూంలో తిష్ట వేసెయ్. ఏ అర్థరాత్రో మీ బావకు 'మూడ్' వచ్చేట్లు చేసేయ్. సంసారం చేసెయ్. నువ్వు గర్భవతివి అయిపోతావ్. అది బయటపడితే మీ బావ పరువుపోతుంది కదా.... అందుకని వెంటనే పెళ్ళికి ఒప్పేసుకుంటాడు. ఎలా వుంది మన ఐడియా...." హుషారుగా అంది సరోజ.

 

    "బాగానే వుంది.... కానీ....." ఏదో చెప్పబోయింది ఇందు.

 

    "కానీలు అణాలు జాన్ తానై. చూడమ్మాయ్..... మీ నాన్న హైదరాబాద్ నుంచి వచ్చాక, అక్కడి న్యూస్ మనకు తెలిసాక, అవసరమయితే నేనూ నీతో వస్తాను. సరేనా.... ఆ మాత్రం ధైర్యం లేకపోతే మనం ఏమీ చెయ్యలేం అర్థమయిందా...." అంది సరోజ.

 

    "అదికాదే... పెళ్ళికి ముందే సంసారం చేస్తే.... ఆ తర్వాత హనీమూన్ మజా ఏవుంటుంది? ఆలోచించు...." సీరియస్ గా అంది ఇందు.

 

    "అదీ నిజమే, కానీ నీ పెళ్ళి రేపు వేసవిలో జరగాలంటే ఈ సాహసం చెయ్యక తప్పదు. ఇంతకీ హనీమూన్ కి ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నావ్?" అడిగింది సరోజ.

 

    "తిరుపతి....." వెంటనే తడుముకోకుందా చెప్పింది ఇందు.

 Previous Page Next Page