ఆ మాటకు పెద్దపెట్టున, ఉక్కిరి బిక్కిరైపోతూ నవ్వింది సరోజ.
"ఎవరైనా తిరుపతికి హనీమూన్ కి వెళ్తారే? నువ్వింత తెలివితక్కువ దానివని నేననుకోలేదు. ఏ ఊటీయో, కొడైకెనాలో, కాశ్మీరో వెళ్ళాలి. తెల్సిందా?" చెప్పింది సరోజ.
"ఎక్కడికెళ్ళాలో మా బావే నిర్ణయిస్తాడు గానీ, పద. గుళ్ళోకి వెళదాం" లేచింది ఇందు.
మరో పది నిముషాలయ్యాక ఇద్దరూ ఇంటిముఖం పట్టారు.
* * *
అడవుల్లో కుక్కలుంటాయా? సాధారణంగా వుండవు. మనుషులుండే చోటే కుక్కలుంటాయి.
అంటే ఇక్కడెక్కడో మనుషులుండాలి. కనీసం ఓ గిరిజన కుటుంబమయినా వుండాలి.
చెట్లమధ్యనుండి గబగబా నడుస్తున్నాడు మైత్రేయ.
పావుగంట గడిచింది. అతని శ్రమ ఫలించింది.
దట్టమయిన గుబురు చెట్లమధ్యన విశాలమయిన పాతకాలపు బిల్డింగ్. పాడుబడిన గోడలు, కర్రగేటు, గేటుకి మెయిన్ బిల్డింగ్ కి మధ్యన రకరకాల మొక్కలు, చిన్న వరండా. ఆ వరండాలో డాబర్ మాన్ కుక్క.
మైత్రేయని చూడగానే ఆ కుక్క అరవడం మొదలుపెట్టింది. ధైర్యంగా గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టిన మైత్రేయ "ఏయ్ నిక్కీ, ఎందుకా అరుపు...." అనే మాట ఆ వెనుక ఒక అందాలరాణి ప్రత్యక్షమయింది.
ఆమెను చూస్తూనే ఒక్కక్షణం షాక్ తిన్నాడు మైత్రేయ.
కొద్దిసేపు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.
ఆమె ఇంకా కుక్కనే చూస్తోంది తప్ప, తనకు సమీపంలోనే వున్న మైత్రేయని చూడలేదు.
కుక్క అరవడం మానేయగానే అప్పుడు తలెత్తి ఎదురుగా నిలుచున్నా వ్యక్తిని చూసింది. అతనెవరనేది వెంటనే ఆమె గుర్తించింది.
గుర్తించిన మరుక్షణమే కొద్దిపాటి ఉద్రిక్తతకు లోనయింది. అయినా క్షణాల్లో తేరుకుంది.
లేతాకుపచ్చ కాటన్ చీరలో వన కిన్నెరలా వుందామె. జలపాతంలాంటి జుట్టు..... గంధంలో కలిసిన పాలమీగడలా శరీరం రంగు.... ఎత్తయిన వక్షస్థలం..... విశాలమైన కటిభాగం.... కానీ కంపించకుండా కన్పించే నడుం దగ్గర మడతలు..... ఎర్రటి పెదవులు..... నిగనిగలాడే కళ్ళు..... ఆమెను చూడగానే ఒక్కసారిగా మైత్రేయలో కసి, కోపం పెల్లుబుకాయి.
అదే సమయంలో నిక్కీ మైత్రేయ మీదకు దూసుకురావడంతో కుడిచేత్తో దాని కాలిని అందుకుని గాల్లో గిరగిరా తిప్పి మొక్కల్లోకి విసిరేశాడు ఆగ్రహావేశాలతో. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క అంగలో మైత్రేయ మోహిత దగ్గరకి వెళ్ళి చాచి ఫెడేల్మని చెంపమీద కొట్టాడు.
"నన్ను మోసం చేసి, మర్డర్లో ఇరికించి మాయమైపోతావా? అందుకే నిన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించదానికే ఇంత కష్టపడి వచ్చాను" ఆవేశంగా అరిచాడతను. మోహిత ఏం మాట్లాడలేదు. కాసేపయ్యాక....
"మిష్టర్ మైత్రేయ.... మీరొస్తారని నాకు తెలుసు. అందుకే ఆ విజిటింగ్ కార్డుని వదిలిపెట్టి వచ్చాను" చిన్నగా నవ్వుతూ అందామె.
"పదండి.... మైసూర్ వెళదాం. ముందు నన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలి. ఆ మర్డర్ కేసునుండి బయటపడాలి."
"మీరు నిర్దోషే.... మీ మీద ఏ కేసూ లేదు" చెప్పింది మోహిత తాపీగా.
"ముందు లోపలకి రండి. చాలాదూరం నుంచి వచ్చారు" తనమీద కేసు లేదనే విషయం తెలియగానే సంతోషంగా వుంది మైత్రేయకి.
లోపలికి నడిచాడు.
నాలుగు గదుల బంగళా. డ్రాయింగ్ రూమ్, మధ్యలో హాలు, ఎడమవేపు విశాలమయిన బెడ్ రూమ్స్ . వెనుక కిచెన్, డైనింగ్ హాలు, పెరట్లో నుయ్యి, రకరకాల పూలచెట్లు.
గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది మోహిత. తాగి గ్లాసుని కిందపెట్టి-
"ముందు చెప్పండి, నామీద కేసెందుకు లేదు?" అడిగాడు మైత్రేయ ఆతృతతో.
బెడ్ రూమ్ లోపలికి వెళ్ళి హిందూపేపర్ తీసుకొచ్చి ఇస్తూ "మూడో పేజీ చూడండి" అందామె.
మూడోపేజీ తీసి అందులో వున్న వార్తను గబగబా చదివి సంతోషంగా ఆమె ముఖంలోకి చూశాడు.
"ఇదెలా సాధ్యం...... స్పాట్ లో నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టారు. రాజకీయ శత్రుత్వం, పాతకక్షల ద్వారా ఎమ్మెల్వే రవీంద్రనాథ్ శత్రువులే అతన్ని చంపారని, దర్యాప్తు జరుగుతోందని రాశారేమిటి?" మరింత ఆశ్చర్యంగా అడిగాడు మైత్రేయ.
"కేసులో మిమ్మల్ని నిర్దోషిని చెయ్యడానికి పాతికవేలు ఖర్చయ్యింది" నెమ్మదిగా చెప్పింది మోహిత.
"ఎవరిచ్చారు..... ఆ డబ్బు?"
"నేనే."
"ఎందుకు?'
"మిమ్మల్ని చూడగానే నాకు అభిమానం ఏర్పడింది కనుక."
"పోలీస్ స్టేషన్ లోంచి తప్పించుకుని వచ్చాను. ఆ విషయం మీకు తెలుసా?" అన్నాడు మైత్రేయ.
నవ్వింది మోహిత. ఆ నవ్వు అందంగా, రంగు రంగుల సీతాకోకచిలుకలా వుంది.
"ఎందుకు నవ్వుతున్నారు?" అడిగాడు మైత్రేయ.
"సర్కిల్ ఇన్ స్పెకర్ చంద్రప్పకు మీరు సులభంగా తప్పించుకునే ఏర్పాట్లు చేయమని చెప్పింది నేనే. అందుకే ఒకే ఒక్క కానిస్టేబుల్ ని అక్కడ వుంచాడు. అర్థమయిందా?" చెప్పిందామె. చాలా విచిత్రంగా వుంది మైత్రేయకి.
"మర్డర్ కేస్ లో నన్ను ఇరికించడం ఎందుకు? పాతిక వేలు ఇచ్చి విడిపించడం ఎందుకు?"
"మిమ్మల్ని అభిమానిస్తున్నట్లుగా నటించి, మర్డర్ కేస్ లో ఇరికించానని మీలో నా మీద కసి ఏర్పడుతుంది. స్టేషన్ నుంచి తప్పించుకుని, నన్ను వెతుక్కుంటూ వస్తారు. అందుకే! నేనూహించినట్లుగానే మీరొచ్చారు గదా?" నెమ్మదిగా చెప్పింది మోహిత.
ఆమె ముఖంవేపు సూటిగా, పరిశీలనగా చూశాడు మైత్రేయ.
"దీనికంతటికీ కారణం....." అయోమయంగా అడిగాడతను.
"మీమీద అభిమానం.... ప్రేమ...." అందామె.
ఆమె అన్నదేమితో ముందు అర్థం కాలేదు మైత్రేయకు. అర్థమయ్యాక ఆమె ఎందుకలా అన్నాడో అసలే అర్థంకాలేదు.
తనను కనీసం ఒక్కసారయినా చూడకుండానే తనని అభిమానించడమేమిటి? ప్రేమించడమేమిటి?
"మరి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ని ఎవరు చంపారు?" ఆలోచనల నుంచి తేరుకుంటూ అడిగాడు మైత్రేయ.
"నేనే...." ఏమాత్రం తొణక్కుండడా చెప్పిందామె.
మోహిత ఒక ఎమ్మెల్యేని చంపిందంటే నమ్మలేకపోతున్నాడు మైత్రేయ.
"దానికి కారణం" వెంటనే ప్రశ్నించాడతను.
"కక్ష... హి ఈజ్ మై వన్ ఆఫ్ ద ఎనిమీస్.... దట్సాల్..." ఉద్వేగంగా చెప్పింది మోహిత.
"ఆ శతృత్వానికి కారణం..."
వెంటనే జవాబు చెప్పలేదామె. గాఢంగా నిట్టూర్చింది.
అప్పటికి బాగా చీకటి పడింది. బయట నుంచి కీచురాళ్ళు చప్పుడు అడవిచెట్లు మీద నుంచి వస్తున్నా చల్లటిగాలి.
లేచి లోనికెళ్ళి సోప్ బాక్స్ తో, టవల్ తో బయటకొచ్చింది మోహిత.
"ఈ టైమ్ లో జలపాతంలో స్నానం చెయ్యడం నాకు ఇష్టం. రండి. అక్కడ మాట్లాడుకుందాం" బయటకొస్తూ అంది.
బయట వరండాలో డాబర్ మాన్ 'నిక్కీ' యథాస్థానంలో నుంచుని గుర్రుగా మైత్రేయ వేపు చూస్తోంది.
"అది రాక్షస కుక్క.... పిస్టల్ తో పేల్చినా అది చావదు. ఇకనుంచి మిమ్మల్ని అదేమీ చెయ్యదు" ముందుకు నడుస్తూ అంది మోహిత.
అలవాటయిన దారిలో నడుస్తోంది మోహిత. ఆనే వెనకే నడుస్తున్నాడు మైత్రేయ.
"నేనడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్తారా?" అడిగాడు మైత్రేయ.
"అడగండి" అందామె.
"గిరిజనులెవరికీ తెలియకుండా ఇక్కడికెలా వచ్చారు?" ఇక్కడ వంటరిగా ఎలా వుండగలుగుతున్నారు? ఇక్కడే ఎందుకుండాలి? భోజనం సామగ్రి ఇవన్నీ ఎలా వస్తాయి?" ప్రశ్నించాడు మైత్రేయ.
"ఇక్కడికి రావడానికి ఒకే దారి వుంటుందని ఎలా అనుకున్నారు? ముదుమలై నుంచి ఇక్కడికి రావడానికి చాలాదూరం. ఇటువేపు కుకునూర్ అనే ఊరుంది. ఆ ఊరు వరకూ కార్లో రావచ్చు. అక్కడనుండి ఇక్కడకు కాలినడకన రావడానికి కేవలం రెండు గంటలు పడుతుంది. నాకు తోడు ఓ గిరిజన అమ్మాయి వుంది. ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం వరకూ వుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేనున్నప్పుడు సరుకులన్నీ ఆ అమ్మాయే తెస్తుంది. రాత్రిపూట నాకు తోడు.... మా రాక్షసి డాబర్ మాన్ నిక్కీ వుండనే వుంది గదా....." చెప్పింది మోహిత.
"రాత్రిపూట మీకేదైనా ప్రమాదం సంభవిస్తే... ఐమీన్ దొంగలు...."
"జలపాతానికి కుడివేపు కొండల మధ్య గిరిజన తండా వుంది నేనరిస్తే చాలు.... వాళ్ళు అయిదు నిముషాల్లో వచ్చేస్తారు. వాళ్ళే నాకిక్కడే ఫ్రెండ్స్. వాళ్ళని రేపు పరిచయం చేస్తానులెండి" అందామె.
"అంతా వింతగా వుంది" అన్నాడు మైత్రేయ.
ఇద్దరూ జలపాతం దగ్గరకెళ్ళారు.
* * *
దట్టమైన పచ్చటి ప్రకృతిమీద పరచుకుంటున్న పల్చని వెన్నెల. పరిమళాలు. అనంతంగా గుబాళిస్తున్న అడవి వాసన. సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు మైత్రేయ.
"నాకు ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో చిన్నపిల్లలా వుండటం యిష్టం. నగ్నత్వమంటే నాకు చాలా ఇష్టమని చెప్పానుగా.... నగ్నత్వంలో నేను కళాత్మకతను చూస్తాను" అంటూ అతనికి కొంచెం దూరం వెళ్ళి చీరను విప్పేసి, బ్రాతో, లంగాతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బొమ్మలా నిలబడి వళ్ళు విరుచుకుంది మోహిత.
తన కెదురుగా ఒక అపరిచిత వ్యక్తి, మగాడున్నాడనిఆమెలో ఎ మాత్రం సంకోచం లేదు. ఆ దృశ్యాన్ని అలా కళ్ళప్పగించి చూస్తున్నాడు మైత్రేయ.
కాసేపటికి మిగతా లో దుస్తులు కూడా వంటిమీద లేవు.
చీకట్లో పాలరాతి బొమ్మలా మెరుస్తోంది మోహిత.
స్త్రీ నగ్నత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం, మైత్రేయకి అదే మొదటిసారి.
ఎత్తయిన ఆమె గుండెలమీద వెన్నెల ప్రతిఫలిస్తోంది.
"నేను బావున్నానా?" అడిగింది మోహిత.
జవాబు చెప్పలేదు మైత్రేయ.
"ఓ స్త్రీ నగ్నంగా చూడటం ఇదే మొదటిసారి కదూ!"
"అవును!"
"ఇలా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? నిజం చెప్పాలి...."
వెంటనేఏం చెప్పాలో అతనికి అర్థంకాలేదు. ఆమె వింత ప్రవర్తన వెనక మానసిక స్థితి గురించి ఆలోచిస్తున్నాడతను.
కాసేపయ్యాక-
"ప్రకృతిలో సౌందర్యం ఎక్కడుందో తెలియనట్లే, స్త్రీలో కూడా ఎక్కడుందో తెలియదు...." చెప్పాడతను నెమ్మదిగా.