వీలైతే తనని నెల్లూరు స్టేషన్ లో కలుసుకోమని, నాయుడుపేటలో తను చార్మినార్ ఎక్స్ ప్రెస్ కేచ్ చేస్తున్నానని....తనని అబ్బయ్యనాయుడు మనుషులు వెంటాడుతున్నారని....కూడా ఆయనతో చెప్పాడట మేడమ్."
"మరి...?"
"ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు మేడమ్..... నాయుడుపేటకు, నెల్లూరుకు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ నాతపాలెం... దగ్గర.... ఓ ఇంట్లో శ్రీకర్...." మరి చెప్పలేకపోయాడు ఎక్సయిజ్ కమీషనర్.
"అతను సంపాదించిన ఇన్ ఫర్ మేషన్ ఏవైందట?"
"తెలీదు మేడమ్!"
త్రిభువనేశ్వరీదేవి విసుగ్గా, కోపంగా ఎక్సయిజ్ కమీషనర్ వేపు, ఇంటెలిజెన్స్ ఐజీ వేపు చూసింది.
అబ్బయ్యనాయుడు!
ఒక్కసారి ఆమె కళ్ళల్లోకి కోపం ప్రవేశించింది.
దూరంగా నుంచున్న హేమాద్రిశర్మ వేపు చూసింది. అంతకు కొద్ది నిమిషాల ముందే, తను హేమాద్రి శర్మతో... ఛాలెంజ్ చేసిన విషయం గుర్తు కొచ్చింది!
మరి ఎవ్వరివేపూ చూడలేదు త్రిభువనేశ్వరీదేవి గబగబా పోర్టికోలోకి వచ్చింది.
సి.ఎమ్ దర్శనం కోసం.... పడిగాపులు పడుతున్న పొలిటికల్ లీడర్స్....అఫీషియల్స్... కనీసం-
తమ సమస్కారాల్ని కూడా పట్టించుకోకుండా, ముందుకెళ్ళి పోతున్న సి.ఎమ్.ను చూస్తూ కంగారుపడ్డారు.
పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ఆమె ఎనక పరుగులెత్తారు.
డ్రైవర్ కార్ దోర్ తెరచి పట్టుకున్నాడు. డోర్ వరకూ వెళ్ళి ఆగి వెనక్కి హిరిగి చూసిందావిడ.
కొంచెం దూరంలో హేమాద్రిశర్మ నుంచునున్నాడు.
"హేమాద్రిగయూ... ఇవాళ నా అపాయింట్ మెంట్స్ అన్నీ కేన్సిల్ చెయ్యండి. మీరు అర్జంట్ గా సెక్రటేరియట్ కు రండి..." ఎవరివేపు చూడకుండా, ఏ నమస్కారాల్నీ పట్టించుకోకుండా కారెక్కేసింది త్రిభువనేశ్వరీదేవి.
ఇంటెలిజెన్స్ ఐజి, ఎక్సయిజ్ కమీషనర్ వేపు...ఎక్సయిజ్ కమీషనర్....హేమాద్రిశర్మవేపు ఆశ్చర్యంగా చూసారు.
ఆ చూపుల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు హేమాద్రిశర్మ.
తనూ కారెక్కాడు.
ఆ తర్వాత అధికారుల కార్లన్నీ, వరసగా సెక్రటేరియట్ కు బయలుదేరాయి.
* * * * *
పంజాగుట్టలోని కాంతి శిఖర అపార్ట్ మెంట్స్.
ఫ్లాట్ నెం. 15.
ఉదయం ఏడుగంటలైంది. కిచెన్ రూమ్ లోంచి రెండు కాఫీ కప్పుల్తో బయటికొచ్చిన లక్ష్మినారాయణ బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
"మిత్రా... మిత్రా... కాఫీ రెడీ...." ప్రేమగా పిలిచాడు.
ఎదురుగా డబుల్ కాట్ బెడ్ మీద పడుకున్న సుమిత్ర, సత్యభామ టైపులో కళ్ళిప్పి చూసి-
"పేపరొచ్చిందా?" అని అడిగింది రెండోవేపు వత్తిగిల్లుతూ.
"పేపరు రాలేదు.... రాదట... ముందు కాఫీ తీస్కో..."
"పేపరొచ్చాక లేపండి....అప్పుడే కాఫీ తాగడం..." మత్తుగా గొణిగింది సుమిత్ర.
"నీలా పేపర్లో పనిచేసే....ప్రతీవాళ్ళకూ... ఇదో జబ్బు....ప్రపంచంలో ఏం జరిగిందో తెలీపోతే కాఫీ తాగరా....భలే అలవాటు చూడు పిల్లా...రాత్రే నీరసం అన్నావ్! ఈ కాఫీ తాగు....నా బుజ్జివి కదూ....ఇంతలో చక్కగా....టమాటా బాత్ చేస్తాను....నీకిష్టం కదా..." అంటూ...కప్పుతో సహా, మంచం అంచుమీద కూర్చుని....అటువైపున్న సుమిత్ర ముఖాన్ని ఇటువైపు తిప్పే ప్రయత్నం చేసాడు.
"టమాటా బాత్...చేసాక....లేస్తాన్లెండి....బద్దకంగా ఉంది."
"పెళ్ళిచూపుల్లో... నాకూ వంటొచ్చని... సరదాగా చెప్పినందుకు.. మొత్తం నన్ను కిచెన్ రూమ్ కి కట్టిపడేసావ్" అంటూ ఆమె బుగ్గమీద గిల్లి...అటూ ఇటూ చూసి-
గబుక్కున ఆమె బుగ్గమీద ముద్దుపెట్టుకోబోయి, ద్వారబంధం దగ్గర ఏదో చప్పుడైతే-
తటాల్మని తలతిప్పి చూసి-
నోట మాట రాక అలాగే ఉండిపోయాడు.
ఎదురుగా-
మధూలి...ఇరవై రెండేళ్ళ మధూలి....ఎంతసేపై అక్కడ నుంచుందో తెలీదు.
"ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సీన్లే కనబడతాయని తెలిసే డిటెక్టివ్ లా వచ్చానండీ.... లక్ష్మీగారూ."
సుడిగాలిలా లోనికొచ్చేసిన మధూలి మాట విని సత్యభామ పక్కీలో వున్న సుమిత్ర, గబుక్కున లేచి కూర్చుంది.
'లక్ష్మి' అనే లక్ష్మినారాయణ అలవిమాలిన సిగ్గుతో చేతిలోని కాఫీ కప్పుతో కిచెన్ రూమ్ లోకెళ్ళిపోయాడు.
"ఏవిటీ....ఆదర్శదంపతులు మాంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. సారీ మిత్రా....కానీయండి ....నే వెళ్ళిపోతాను..." అంటూ కూర్చుంది మధూలి.
"వెళ్ళిపోతానని....బైటాయించావేమిటే..." లేచి కుచ్చిళ్ళు సర్దుకుంటూ అంది సుమిత్ర.
"పొలిటికల్ రిపోర్టర్ ని కదా... కూచుంటానంటే వెళ్ళిపోతానని- వెళ్ళిపోతానంటే- తిష్టవేస్తానని అర్ధం....అది కాదు గానీ....ఏంటీ....పెళ్ళయి పన్నెండు నెలలైనా- ఇంకా 'గాఠి'గా ప్రేమించుకుంటున్నారేంటే ...బాబూ" సుమిత్ర కోసం ఉంచిన కాఫీ కప్పుని అందుకొని సిప్ చేస్తూ అడిగింది మధూలి.
"చాల్లేవే...నీ కొంటె ప్రశ్నలు అసలే మా ఆయనకు సిగ్గెక్కువ. నువ్వేమైనా అన్నావనుకో.... మూడ్రోజుల వరకూ ఈ బెడ్ రూమ్....ఒక్కొక్కప్పుడు బాత్ రూమే బెడ్ రూమ్."
"నీకు పెళ్ళయ్యాక వరండాలోనే బెడ్ రూమ్ సెటప్ చేసుకో....నాకెందుగ్గానీ....అవునూ...మీ రిపోర్టర్లకి అర్ధరాత్రీ, అపరాత్రీ.... తేడా లేవీ వుండవటే..." డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకెళుతూ అడిగింది సుమిత్ర.
"ఇప్పుడర్దరాత్రేవిటే....పిల్లా..." అని సుమిత్ర పక్కకెళ్ళి నుంచుంది మధూలి.
మధూలి....
అయిదడుగుల అయిదు అంగుళాల ఎత్తున్న మధూలి, లేతాకు పచ్చకుర్తా పైజామాలో ఏపుగా పెరిగిన అశోక వృక్షంలా వుంది. బాబ్డ్ హెయిర్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ మెడలో వంటిపేట గోల్డ్ చెయిన్ చెవులకు పెద్దసైజు ప్లాస్టిక్ రింగులు.
క్లోజ్ ఫ్రెండ్స్ అగ్గిబరాట అని నిక్ నేమ్ తో పిల్చుకొనే మధూలి, ఉస్మానియాలో యమ్ ఎ పొలిటికల్ సైన్స్ చేసాక డిప్లమా ఇన్ జర్నలిజం చేసింది.
సుమిత్ర ఆమె క్లాస్ మేట్...
ప్రస్తుతం సుమిత్ర సమాజం దిన పత్రికలో సబ్ ఎడిటర్.... అదే దినపత్రికలో మధూలి పొలిటికల్ రిపోర్టర్.
చేరిన రెండేళ్ళలోనే డేరింగ్ అండ్ డేషింగ్ రిపోర్టర్ గా పేరు తెచ్చుకుంది మధూలి.