2. ఇంద్రా! నీవు దూర ద్యులోకమున ఉండుము. లేదా దగ్గరి అంతరిక్షమున ఉండుము. ఈ లోకము నుండి యజమాని నిన్ను ఆహ్వానించును. తన కాంతులచే సర్వత్ర వ్యాపించు కిరణముల వంటి స్తుతులతో ఆహ్వానించుము. సోమము అందుకొని యజ్ఞమునాకు ఆహ్వానించును.
3. ఇంద్రుడు శత్రుభయంకరుడు. శత్రువుల తలలు వంచువాడు. బుద్దిశాలి. సర్వత్ర స్తుతియోగ్యుడు. శక్తిమంతుడు. ఉద్గాతలారా! మీ హితము కొరకు ఇంద్రునకు సోమము సముపార్జించండి. మహాస్తుతులను లాసిగా గానము చేయండి.
4. ఇంద్రదేవా! మాకు భూమి, నీరు, గాలి మంగళకరములు అగును గాత. శీత, ఆతప, వర్షములు శుభప్రదములు అగును గాత. యజమాని ఇంటను, మాకును హవిరూప ధనము కలుగును గాత. శత్రువు యొక్క ఆయుధములను దూరమున ఉంచుము.
5. సూర్యుని ఆశ్రయించిన కిరణములు సూర్యుని కాంతిని భజించును. ఇంద్రుని ఆశ్రయించిన వారు అతని ధనమును భజింతురు. ఇంద్రుడు సృష్టించిన, సృష్టించనున్న ధనములందు - మాకు తండ్రి ధనపు భాగము వంటిది - లభించును గాత.
6. ఇంద్రుడు అమరుడు. ఇంద్రునికి కాక ఇతరులను ఉపాసించిన మర్త్యునకు అన్నము లభించదు.
ఇంద్రుడు రంగురంగుల గుర్రములు కలవాడు. గుర్రములను కూర్చువాడు. హర్యశ్వములను రథమునాకు పూన్చువాడు. అట్టి ఇంద్రుని అర్చించని వానికి అతడు లభించడు.
7. స్తోతలారా! ఏ ఇంద్రుని అసురుల యుద్దములకు దేవతలు తప్పక ఆహ్వానింతురో అట్టి వానిని ఈ యజ్ఞమున శోభన స్తుతులతో అర్చించండి. వృత్రహంతవు, మహా ఆయుధవంతుడవు. కీర్తనీయుడ వగు ఇంద్రా! మూడు సవనములకు విచ్చేయుము.
8. ఇంద్రా! భూమి యొక్క అడుగు పొరయందున్న ధనము నీదియే. మధ్య పొరయందున్న ధనమును పరిపుష్టము చేయుదువు. విశ్వమందలి సమస్త ధనములకు నీవే స్వామివి. ఇది వాస్తవము. గోవులు మున్నగు ధనములు ఇచ్చుటలో నీకు సాటి వచ్చువారు లేరు.
9. ఇంద్రా! నీవు ఇంతకు ముందు ఎక్కడ ఉంటివి? ఇప్పుడు ఎచట ఉన్నావు? నీ మనసు అనేకుల మీద ఉండును. నీవు యుద్దకుశలుడవు. యుద్దములందు అసురులను పరిమార్చువాడవు. రారమ్ము. సంగీత విద్వాంసులు నీ స్తుతులను గానము చేయుచున్నారు.
10. మేము యజమానులము. ఇంద్రుడు వజ్రధారి. అతనికి నిన్న, నేడు సోమము సమర్పించినాము. సంత్రుప్తుని చేసినాము. అందువలన ఇంద్రా! నేటి సవనపు సోమమును సేవింపుము. స్తోత్రములను వినుము. ఆనందించుము.
అయిదవ ఖండము
ఋషులు :- 1,6. పురుహన్మ. 2. భర్గుడు 3. ఇరిమిఠి. 4. జమదగ్ని. 5,7 దేవాతిథి. 8. వసిష్ఠుడు. 9. భరద్వాజుడు. 10. వాలఖిల్యులు.
1. ఇంద్రుడు నరులకు ప్రభువు. రథము మీద పయనించువాడు. గమనమున అందరిని మించిన వాడు. సకల సేనలను తరింపచేయువాడు. పాపనాశకుడు. పెద్దవాడు. అట్టి వానిని స్తుతించుచున్నాము.
2. ఇంద్రదేవా! మాకు భయము కలిగించు వారినుండి మమ్ము నిర్భయులను చేయుము నీవు అభయ ప్రదాతవు. మమ్ము రక్షించుటకు మా శత్రువులను నష్టపరచుము. మమ్ము బాధించువారిని నష్టపరచుము.
3. గృహపతీ! ఇంటిని నిలుపు స్తంభము గట్టిది అగును గాక. సోమ సంపాదకులారా! మీ అవయవములు పటిష్టములు అగును గాత. సోమపాయి, అసుర భంజక ఇంద్రుడు మునులమగు మమ్ము కాపాడును గాత.
4. ఇంద్రదేవా! నీవు సూర్యరూపుడవు. తేజస్సున అధికుడవు. ఇది సత్యము. అదితిపుత్రా! బలమున నీవు అధికుడవు. ఇది సత్యము. నీ మహిమ గొప్పది. స్తోతలు దానిని స్తుతింతురు. దేవా! వీర్యము నందును నీవు అధికుడవు. ఇది సత్యము.
5. ఇంద్రదేవా! నీకు మిత్రుడు అగువాడు ఆశ్వవంతుడు, రథవంతుడు, గోమంతుడు, శోభన ధనవంతుడు, నిత్య అన్నవంతుడు, స్తోత్రవంతుడు అయి సభలందు గౌరవము పొందుచున్నాడు.
6. ఇంద్రదేవా! స్వర్గములు వందలయినను నీకు సాటిరావు. భూగోళములు వందలయిన నీ అంత కాజాలవు. సూర్యులు వందలయినను నీ ప్రకాశమునకు సరిరారు. పుట్టిన ఏ పదార్ధమూ నీ అంతటిది లేదు. ద్యావాపృథ్వులు నీకు సరిబోలవు. నీవు అందరికన్న గొప్పవాడవు.
7. ఇంద్రదేవా! నిన్ను తూర్పు, పడమర, ఉత్తర, దిగువ దిక్కులా నరులందరు స్తుతించుచు ఆహ్వానింతురు. రాజులు తమకు హితము కూర్పుమని నీకు ప్రేరణ కలిగింతురు. స్తుతింతురు. 'తుర్వశు' ని విషయమున కూడ నిన్ను ఆహ్వానింతురు.
(తుర్వశుడను రాజు సుదాసునితో యుద్దమున ఓడినాడు. ఇంద్రుడు అతనికి సాయము చేసినాడు. రక్షించినాడు.)
8. ఇంద్రదేవా! నీవు వ్యాపకుడవు. నిన్ను బెదిరించగల నరుడేడి? నీ విషయమున శ్రద్ద గలవాడు హవివంతుడు అగుచున్నాడు. సోమము సంపాదించినవాడు హవిస్సులు అర్పించదలచుచున్నాడు.
9. ఇంద్రాగ్నులారా! ఉష చరన రహిత. అట్లయ్యు చరణ సంహిత ప్రాణుల కన్న ముందు అవతరించును. ఆమె ప్రాణుల శిరములు వదలి నాలుకలతో శబ్దము చేయించును. తదుపరి ఒకేరోజు ముప్పది ముహూర్తములను దాటును.
10. ఇంద్రా! మా యజ్ఞశాలలు మీకు దగ్గరలో ఉన్నవి. మావరకు పరిమితమగు బుద్దితోను, రక్షణలతోను అవశ్యము విచ్చేయుము. పరమశాంతములగు అభీష్టములతో విచ్చేయుము. సుఖములు కలిగించుటకు విచ్చేయుము.
ఆరవ ఖండము
ఋషులు :- 1. నృమేధుడు. 2,3. వసిష్ఠుడు. 4. శంయు. 5. పురుచ్చేపుడు. 6. వామదేవుడు. 7. మేధ్యాతిథి. 8. భర్గుడు. 9,10. మేథ్యాతిథి, మేధాతిథులు.
1. ఇంద్రుడు జరారహితుడు. ఇతరులకు ప్రేరణ కలిగించువాడు. తనకు ప్రేరణ అక్కరలేనివాడు. వేగవంతుడు. శత్రుంజయుడు. యజ్ఞములకు విచ్చేయువాడు. రథికుడు. అజేయుడు. జలవర్ధనుడు. జనులారా! మీ రక్షణలకు గాను అట్టి ఇంద్రుని ముందుంచు కొనండి.
2. ఇంద్రదేవా! నిన్ను యజమాని సహితము మాకు దూరము చేయకుండును గాక. దూరము నందు ఉన్నాను మా యజ్ఞమునకు విచ్చేయుము. మేము చేయు స్తుతులను ఆలకించుము.
3. జనులారా! వజ్రధారియు, సోమపాయియు నగు ఇంద్రుని కొరకు సోమము సంపాదించండి. ఇంద్రుని సంతోషపెట్టుటకు పురోడాశము వండండి. ఇంద్రుని ప్రసన్నుని చేయుకార్యములు చేయండి. ఇంద్రుడు మీకు సుఖములు ప్రసాదించి పురోడాశము స్వీకరించును.
4. ఇంద్రుడు శత్రుహంత. సర్వద్రష్ట. అట్టి ఇంద్రుని మేము స్తుతించుచున్నాము. ఆహ్వానించుచున్నాము.
ఇంద్రుడు సహస్ర గోధనుడు. బహుధనయుక్తుడు. సజ్జన పోషకుడు. అట్టి ఇంద్రుడు సంగ్రామములందు మమ్ము వర్ధిల్ల చేయును గాత.
5. అశ్వినులారా! మీరు మా యజ్ఞములనే ధనముగా భావించువారు. మీ పనులతో మాకురాత్రింబవళ్ళు ఫలములు ప్రసాదించుడు. మీ దానములు అక్షయములు అగును గాక. మా దానములు ఎన్నటికిని క్షీణించ కుండును గాత.
6. ఎప్పుడైనను యజమాని స్తోతలచే స్తుతులు చేయించవచ్చును. తదుపరి పాపనాశకుడు, వివిధ కర్మలు ధరించువాడగు వరణుని తమ రక్షణల కొరకు స్తుతించవలెను.
7. మేధ్యాతిథే! ఇంద్రుని ఆనందపరచుము. గోవులను రక్షించమని కోరును. ఇంద్రుడు హర్యశ్వములను రథమునకు పూన్చువాడు. బంగారు రథము కలవాడు. వజ్రధారి హితకారి. రమణీయుడు.
(మేధ్యశ్చాసౌ అతిథిస్చేతి మేధ్యాతిథిః - యజ్ఞములకు అతిథియగు వాడు ఇంద్రుడని కూడ అర్ధము. అప్పుడు అది ఇంద్రునకు విశేషణమగును. ఇచట ద్రష్ట తనను సంబోధించుకొనుచున్నాడు.)
8. మా స్తోత్ర, శస్త్రాత్మక కీర్తనలను ఇంద్రుడు మా ముందుండి వినును గాత. విని మా యజ్ఞమున తన బుద్దితోను, ధనము తోను బలము తోను సోమ పానము చేయును గాత.
9. వజ్రధారీ! నిన్ను మహా మూల్యమునకు విక్రయించను. వేలమూల్యమునకు, పది వేల మూల్యమునకు విక్రయించను. ధనముల స్వామీ! నిన్ను అపరిమిత ధనమునకు విక్రయించను.
10. ఇంద్రదేవా! నీవు నా తండ్రిని మించినవాడవు. అన్నము పెట్టని అన్నను మించిన వాడవు. ఆశ్రయము కలిగించు ఇంద్రా! నీవు మా అమ్మకు సముడవు. "మె మాతాచ సమా". నేను బలవంతుడను, ధనవంతుడను అగుటకు నన్ను యశస్విని, మహితుని చేసి నన్ను రక్షింపుము.
ఏడవ ఖండము
ఋషులు :- 1. వసిష్ఠుడు. 2,6,7 వామదేవుడు. 3,9 మేధాతిథి, మేధ్యాతిథులు. 4. నోధ. 5. మేధాతిథి. 8. వాలఖిల్యులు. 10. నృమేధ.
1. వజ్రహస్తా! పెరుగు కలిపిన సోమము సిద్దము చేసినాము. హర్యశ్వముల మీద విచ్చేయుము. సోమపానము చేయుము ఆనందించుము.
2. ఇంద్రదేవా! స్తోత్రయుక్తమగు ఈ సోమము నిన్ను ఆనందింప చేయ నిరీక్షించుచున్నది. ఈ ఆనందకర సోమమును త్రావుము. మా స్తుతులను ఆకర్షించుము. స్తోతవ్యా! మాకు ధనములను ప్రసాదించుము.
3. ఈ ధేనువు మిక్కిలి పాలిచ్చునది. వేగవంత. అనాయాసముగ పితుక తగినది. విలక్షణ. సహస్రదుగ్ధ ధారలది. అభిలషణీయ. ఈ గోవు ఇంద్రుని ఆహ్వానించుచున్నది.