Previous Page Next Page 
సామ వేద సంహిత పేజి 9

 

4.    ఇంద్రదేవా! మహా మహా పర్వతములు కూడ నిన్ను అడ్డజాలవు. స్తోతనైన నాకు నీవు ప్రసాదించిన ధనమును ఎంతటి వాడును నిలుపజాలడు.
   
5.    ఇంద్రుడు అన్నములకు ప్రభువు. వేగవంతుడు. సోమము త్రావి మదించువాడు. తన బలమున శత్రు పురములను ధ్వంసము చేయువాడు. సోమము సిద్దమైనంత ఋత్విజుల కూడి సేవించువాడు. అట్టి ఇంద్రుని ఎరింగినవాడు ఏడి?
   
6.    ఇంద్రా! నీవు యజ్ఞ విఘ్న కారులను దండించువాడవు. అందువలన మా యజ్ఞశాలకు నలుదిశల ఉన్న విఘ్నకారులను తరిమి కొట్టుము. నీవు ధనపతివి. అనేకులచే తలచుకొనబడువాడవు. మా సోమమును మా గృహములందు వర్ధిల్ల చేయుము.
   
7.    త్వష్ట, పర్జనుడు, బ్రహ్మణస్పతి, పుత్ర, భ్రాతృసహిత అదితిదేవి దుష్కరములు, రక్షాయోగ్యములగు యజ్ఞస్తుతులను రక్షింతురు గాత.
   
8.    ఇంద్రా! నీవు ఎన్నటికిని హింసకుడవు కావు. హవి అందించు యజమానులకు ఋత్విజులను సమకూర్తువు. మఘవా! నీ ధనము అనంతము. ప్రకాశవంతము. ఆ ధన దానము మమ్ము చేరుచున్నది.
   
9.    వృత్రహంతా! నీవు హర్యశ్వములను రథమునకు పూన్చుట నిశ్చయము. నీవు ఉగ్రుడవు. దర్శనీయులగు మరుత్తుల సహితుడవై ద్యులోకము నుండి విచ్చేయుము.
   
10.    వజ్రీ! హవి అర్పించు నరులు నేడు ముందే నీకు సోమము సమర్పించినారు. మేము స్తోతలము. నిన్ను స్తుతించుచున్నాము. అవి వినుటకు మా యజ్ఞమునకు విచ్చేయుము.
   
                                            ఎనిమిదవ ఖండము
   
ఋషులు :-    1,2,7,8. వసిష్ఠుడు. 3. అశ్వినులు, వైవస్వతుడు. 4. ప్రస్కణ్వుడు. 5. మేధాతిథి, మేథ్యాతిథులు. 6. దేవాతిథి 9. నృమేధుడు. 10. నోధ.
   
1.    ఉష సూర్య పుత్రి. ఆమె అవతరించుచునే అంధకారములను దూరము చేయును. ఉషస్సును జనులందరు చూచినారు. ఆమె మహానేత్రము రాత్రి చీకటిని తరిమి వేయును. నరునకు నేత్రము వంటి ఉష వెలుగులు పరచును.
   
2.    అశ్వినులారా! వీరు స్వర్గము కోరువారు. వీరు ఋత్విజులు. వీరందరు మిమ్ము ఆహ్వానించుచున్నారు. మీరు కర్మనే ధనముగా భావించువారు. నన్ను రక్షించుమని మిమ్ము ఆహ్వానించుచున్నాను. మీరు మిమ్ము స్తుతించు వారి వద్దకు వెళ్ళువారు కదా!
   
3.    ప్రకాశమానులగు అశ్వినులారా! భూలోకమున మిమ్ము ప్రకాశింప చేయు నరుడు ఏడి? మీ కొరకు రాళ్ళతో దంచి సోమము తీయుచు అలసిన యజమానికి బహుళాన్నములు, రుచులు కలుగుచున్నవి. అట్లు అతడు ఐశ్వర్యవంతుడు అగుచున్నాడు.
   
4.    అశ్వినులారా! మీ కొరకైన యజ్ఞమందు మధుర సోమము సిద్దమై ఉన్నది. దానిని సేవించండి. యజమానికి ధనములు ప్రసాదించండి.
   
5.    ఇంద్రా! నీవు భరించువాడవు. సింహసముడవు. యజ్ఞమందు నీకు సోమరసము సమర్పించుచున్నాను. దిగ్విజయ స్తోత్రములచే స్తుతించుచున్నాను. సర్వదా నిన్ను యాచించుచున్నాను. తన ప్రభువును యాచించని వాడెవడు?
   
6.    అధ్వర్యులారా! ఇంద్రుడు సోమ పిపాసియై ఉన్నాడు. సోమమును ఉత్తర వేది మీదకు చేర్చండి. సారథి రథమున హర్యశ్వములను పూన్చినాడు. వృత్రహంత ఇంద్రుడు అదిగో రానే వచ్చినాడు!
   
7.    ఇంద్రదేవా! నీవు అందరి కన్న పెద్ద వాడవు. నేను చిన్నవాడను. ప్రసిద్ద ధనమును నాకు తెచ్చి ఇమ్ము. నీవు ధనవంతుడవు. యాచించ దగిన వాడవు. యుద్దములకు ఆహ్వానించ బడువాడవు అగుచున్నావు.
   
8.    ఇంద్రదేవా! నీవు ఎంత ధనవంతుడవో నేను అంతటి ధనవంతుడను అగుదును గాక. ఆ ధనమును నేను సామగాయక స్తోతలకు ఇచ్చెదను. వృధా చేయను.
   
9.    ఇంద్రా! నీవు యుద్దములందు శత్రు సేనలను తిరస్కరించు వాడవు. శత్రు నాశక ఇంద్రా! నీవు దైవిక ఆపదలను తొలగించువాడవు. మా శత్రువులకు ఆపదలు కలిగించు వాడవు. సకల శత్రువులను నాశనము చేయుచున్నావు. విఘ్నములను నివారించుచున్నావు.

10.    ఇంద్రా! నీవు ద్యులోక బలమున వర్దిల్లు చున్నావు. భూమి మీద పుట్టిన వాడెవ్వడును నీకు సాటి    రాలేడు. మమ్ము అందరను మించిన వారలను చేయుము.
   
                                              తొమ్మిదవ ఖండము
   
ఋషులు :- 1,2,6 వసిష్ఠుడు. 3. గాతు ఋషి. 4. పృథ్వుర్వైనుడు. 5. సప్తగుడు. 7. గౌరివీతి. 8. వేనుడు. 9. బృహస్పతి లేక సకులుడు. 10. సుహోత్రుడు.
   
1.    ప్రకాశమానమగు పాలు కలిసిన సోమము సిద్ద పరచినాము. స్వాభావికముగనే నీవు ఈ సోమమున తత్పరుడవు అగుదువు. నిన్ను స్తోత్రములు, హవిచే ఆరాధించుచున్నాము. సోమపుమత్తులో మా స్తుతులను వినుము.
   
2.    ఇంద్రా! నీ కొరకు ఆసనము సిద్దపరచినాము. నిన్ను ఆహ్వానించు వారు అనేకులు. నేతలగు మరుత్తుల సహితుడవై విచ్చేయుము. ఈ ఆసనమున కూర్చుండుము. మా రక్షణలను వర్ధిల్లచేయుము. మాకు ధనము ప్రసాదించుము. సోమమును ఆనందించుము.
   
3.    ఇంద్రదేవా! నీవు జలధర మేఘములను విదీర్ణము చేసినావు. మేఘములకు నీరు వెడలు మార్గములు ఏర్పరచినావు. బాధించు మేఘములను కురిపించినావు. నీవు ఎన్నో మేఘముల నుండి జలధారలు కలిగించినావు. దానవులను హతమార్చినావు.
   
4.    ఇంద్రదేవా! సోమమును అభిషవించు వారు నిన్ను స్తుతించుచున్నారు. అనంత ధనవంత ఇంద్రా! మేము నీకు పురోడాశము అర్పించి స్తుతించుచున్నాము. నీకు ప్రియతమ మగు ధనమును మాకు ప్రసాదించుము. నీ రక్షణలు గల ధనమును మేము స్వయముగా పొందగలము.
   
5.    బహుధనముల స్వామీ! మేము ధనము కోరుచున్నాము. నీ కుడిచేయి పట్టుకొన్నాము. నీవు అనేక గోవుల అధిపతివని మాకు తెలియును. మాకు కోరికలు తీర్చు ధనమును ప్రసాదించుము.
   
6.    యుద్దములందు రక్షణ కొరకు అనేక ఉపాయములు రచించబడును. అప్పుడు నరులు ఇంద్రుని ఆహ్వానింతురు.
   
    శూరవీర ఇంద్రా! నరులు నిన్ను అన్నము అర్థింతురు. వారికి గోవులను, గోష్ఠములను ప్రసాదించుము.
   
7.    సూర్య కిరణములు సంచరించునవి. సుఖములు కలిగించునవి. యజ్ఞప్రియలు. ద్రష్టలు ప్రజ్ఞాయాచికలు. అవి ఇంద్రుని యందు చేరినవి. ఇంద్రా! తిమిరమును దూరము చేయుము. తేజస్సును పూరింపుము. మమ్ము బంధ విముక్తులను చేయుము.

8.    వేనా! నీవు సుందర నగరముల వాడవు. ఆకశమునకు ఎగురునపుడు బంగారు రెక్కల వాడవు. వరుణునకు దూతవు. విద్యుతాగ్నికి నిలయమవు. పక్షి రూపమున వర్షాదులు కలిగించువాడవు. స్తోతలు నిన్ను మనమున ధరించి అంతరిక్షమును చూచుచున్నారు.   
    (అసావాదిత్యో నేనో అని యజుర్వేధము ఇన్ద్ర ఉవై వేనః, ఆత్మా వైవేనః అని కౌషీతకి. ఈ మంత్రపు ఋషి వేనుడు.)
   
9.    వేనుడు పూర్వము పుట్టినవాడు. జ్ఞాని వెధముఖమున శబ్దము చేయువాడు. కాంతి రక్షకుడు. అతడు ఆదిత్యాదులకు కాంతులు కలిగించినాడు. పుట్టిన, పుట్టనున్న వారిని స్థిరపరచినాడు.
   
10.    ఇంద్రుడు మహానుడు. బలవంతుడు. శత్రుంజయుడు. శీఘ్రగామి. స్తుతియోగ్యుడు. వజ్రధారి. అట్టి ఇంద్రుని కొరకు స్తోతలు అపూర్వములు, సుఖదాయకములగు అనేక స్తుతులను గానము చేయుచున్నారు.
   
                                               పదవ ఖండము
   
ఋషులు :- 1,2,4. ద్యుతానుడు. 3. బృహదుక్దుడు. 5. వామదేవుడు. 6,8. వసిష్ఠుడు.  7. విశ్వామిత్రుడు. 9. గౌరివీతి.
   
1.    కృష్ణాసురుడు శీఘ్రగామి. పదివేల సేనలు కలవాడు. అతడు దండెత్తి అంశుమతి నదీ తీరమునకు చేరినాడు. అతడు తన బలమున లోకములను భయపెట్టు ధ్వని చేయగలవాడు. ఇంద్రుడు మరుత్తులతో కూడి అతని వద్దకు వచ్చినాడు. నరులు ఏక మనస్కులై ఆరాధించునట్టి ఇంద్రుడు కృష్ణాసురుని, అతని సేనను హతమార్చినాడు.
   
2.    ఇంద్రా! సకల దేవతలు యుద్దమందున నీకు సాయపడు మిత్రులై ఉండిరి. వారు వృత్రుడు తమ వైపునకు వచ్చుటను చూచి, భయపడి, నలువైపులకు నిన్ను విడిచి పారి పోయినారు. అప్పుడు ఎప్పటికి విడువని మరుత్తులతో నీకు స్నేహము అయినది. అప్పుడు నీవు విశ్వమందలి శత్రువులను స్వ బలమున గెలిచినావు.
   
3.    కాల స్వరూప ఇంద్రుని కీర్తించుచున్నాడు:-
   
    ఇంద్రుడు యుద్దవిధాత. అనేకమంది శత్రువులను తరిమికొట్టువాడు. యువతను వార్ధక్యముచే మ్రింగించువాడు. అట్టి ఇంద్రుని మహత్తును ఎరుగండి.
   
    బృహదుక్దా! ముసలివాడైనవాడు మరణించుచున్నాడు. అతడే రేపు మరల ఈ లోకమున పుట్టుచున్నాడు.
   
4.    ఇంద్రా! నీవు ఎంతటి పరాక్రమా వంతుడవనగా నీవు కనిపించగనే ఏడుగురు శత్రువులు మిగలకున్నారు. నీవు చీకటిలో ఉండిన ద్యావాపృథ్వులను సూర్య రూపమున ప్రకాశవంతము చేసినావు. సగౌరవముగా సమస్త లోకములను నీవే భరించుచున్నావు.
   
5.    ఇంద్రా! నీవు స్తుతులు అభిలషించువాడవు. మాశత్రువులను క్షీణింపచేయువాడవు. మాకు విజయము కలిగించువాడవు. మేఘముల ప్రేరకుడవు. ద్యులోక వాసివి. జలధరుడవు. వరదుడవు. స్థిరుడవు. వజ్రధారివి. శత్రుహంతవు. వర్షము కొరకు వాణిని ప్రార్దించినట్లు నిన్ను స్తుతులతో అర్చించుచున్నాము.

 Previous Page Next Page