శం నో దేవీరభీష్టయే శంనో భవన్తు పీతయే |
శం యోరభిస్రవన్తునః ||
మూడవ అధ్యాయము
మొదటి ఖండము
ఋషులు :- 1,6,9. వసిష్ఠుడు. 2. భరద్వాజుడు. 3. వాలఖిల్యుడు. 4. నోధ. 5. కలి ప్రగాథ. 7. మేధాతిథి. 8. భర్గుడు. 10. ప్రగాథ కాణ్వుడు.
1. ఇంద్రా! నీవు శూరుడవు. లోకములకు స్వామివి. సర్వద్రష్టవు. పితుకకనే పాత్ర నింపు ధేనువు వలె చమసములందు సోమము పట్టి నీకు ప్రణమిల్లుచున్నాము.
2. ఇంద్రదేవా! మేము నీ స్తోతలము. అన్నము కలిగించుమని నిన్ను పిలుచుచున్నాము. నీవు సజ్జన పాలకుడవు. తమ శత్రువును వధించుమని ఇతరులు కూడ నన్ను పిలుతురు. అశ్వ సంబంధ సంగ్రామములకు కూడ నిన్ను పిలుతురు.
3. ఇంద్రుడు మహా ధనవంతుడు. మేము అతని స్తోతలము. అతడు మాకు సహస్ర సంఖ్యాక ధనములు ప్రసాదించును.
ఋత్విజులారా! శోభన ధనయుక్తుడగు ఇంద్రుని ముందు నిలిచి విశేషముగా స్తుతించండి.
4. ఇంద్రుడు దర్శనీయుడు. శత్రు తిరస్కర్త దుఃఖ నివారకుడు. సోమ పాయి. ప్రసన్నుడు. గోశాల యందలి ధేనువులు దూడలను చూచి అరచినట్లు స్తుతులు చదివి ఇంద్రునకు ప్రణమిల్లుచున్నాము.
5. ఋత్విజులారా! ఇంద్రుడు ఆశ్వవంతుడు. ధనవంతుడు. కష్టముల సహించి, రక్షణలు కలిగించుమని ఇంద్రుని బృహత్సామమున కీర్తించండి. మేము సహితము సోమము సంపాదించి తమను పోషించు తండ్రిని వలె ఇంద్రుని యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము.
6. యుద్దములందు ముందుండు వాడును, సాయము కలవాడును, బుద్దిమంతుడును గెలుచుచున్నాడు. మంచి కర్రతో వడ్రంగి ఇరుసును తీర్చిదిద్దినట్లు పురుహూతుడగు ఇంద్రుని మీ కొరకని స్తుతించండి.
7. ఇంద్రదేవా! ఇది మేము సముపార్జించిన సోమము. ఇది రసవంతము. పాలు మున్నగునవి కలసినది. దీనిని సేవింపుము. ప్రసన్నుడవగుము.
ఇంద్రా! ఇది దేవతలు సంతసించు యజ్ఞము. నీవు ధనాదులందించు మా బంధువు వంటివాడవు. మా ప్రగతి విషయమున అప్రమత్తుడవగుము. నీ అనుగ్రహమున మాకు రక్షణలు కలుగును గాత.
8. ఇంద్రదేవా! నీవు ధనదాతవగుట నిశ్చయము. నేను సజ్జనుడను. నాకు ధనము నందించుటకు రమ్ము ధనము ప్రసాదించుము. నేను గోవులు కోరుచున్నాను. గోవులనిమ్ము. నేను ఆశ్వములను కోరుచున్నాను. అశ్వముల నిమ్ము.
9. మరుత్తులారా! నేను వసిష్ఠుడను. మిమ్ము ఏ ఒక్కరిని విడువకుండ స్తుతించుచున్నాను. ఇప్పుడు నేను సంపాదించిన సోమమును అభిలషించండి. అందరు కలసి సేవించండి.
10. మిత్రులారా! ఇంద్రుని తప్ప అన్యులను కీర్తించకండి. వృధాగా ఆయాస పడకండి. సోమము సమకూర్చండి. అందరు కలసి వరదుడగు ఇంద్రుని స్తుతించండి. ఇంద్ర స్తుతులనే మరల మరల ఉచ్చరించండి.
రెండవ ఖండము
ఋషులు :- 1. ఆంగీరస పునర్జన్మ. 2,3 మేధాతిథి, మేధ్యాతిథులు. 4. విశ్వామిత్రుడు. 5. గోతముడు. 6. నృమేధ, పురుమేధలు. 7,8,9 మేధ్యాతిథి. 10 దేవాతిథి.
1. ఇంద్రుడు నిత్యము వృద్ది చెందించువాడు. విశ్వస్తుతి యోగ్యుడు. మహా బలశాలి. లొంగనివాడు. శత్రుభయంకరుడు. యజ్ఞములందు అట్టి ఇంద్రుని తనకు అనుకూలుని చేసికొన్న వానికి దుఃఖములు కలుగవు.
2. ఇంద్రుడు తెగిన వానిని అతికించగలవాడు. అతికించునవి లేకనే రక్తము వెడలక ముందే గ్రీవాదులను అతికించు సమర్ధుడు. అతడు సంపన్నుడు. ధనవంతుడు. తెగి పడిన వానిని మరల జోడించగలవాడు.
3. ఇంద్రదేవా! నిన్ను స్తుతులచే కీర్తించుచున్నాము. హవిస్సులు అర్పించుచున్నాము. మేడమీద జూలు ఉన్న వందల, వేల అశ్వములు, నీ బంగారు రథము పూని నిన్ను సోమ పానమునాకు తీసికొని వచ్చును గాత.
4. ఇంద్రదేవా! నీ హర్యశ్వములు ఆనందదాయకములు. నెమలి పింఛముల వంటి జూలు కలవి. నీవు వాణి మీద బయలుదేరుము. పాంధులు మరు భూమిని దాటినట్లును, త్రాళ్ళతో పక్షులను నిలిపినట్లును నిరాటంకముగ విచ్చేయుము.
5. ఇంద్రా! నీవు జితేంద్రియులందు శ్రేష్ఠుడవు. ప్రకాశవంతుడవు. నిన్ను స్తుతించు మర్త్యులను ప్రశంసింతువు.
సంపన్న ఇంద్రా! సుఖములు కలిగించుటలో నిన్ను మించిన వాడు లేడు. కావున మేము నిన్ను స్తుతించుచున్నాము.
6. ఇంద్రా! నీవు బలములకు స్వామివి. సోమములకు ప్రభువవు. యజమానుల రక్షకుడవు. యశస్వివి. ఎంతటి వాడును నిన్ను ఎదిరించజాలడు. ఎటువంటి ప్రేరణ లేకనే వంటరిగా నీవు అనేకమంది రాక్షసులను హతమార్చినావు.
7. దేవయజ్ఞములకు - దేవతలందు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము. యజ్ఞము జరుగుచున్నప్పుడు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము. యజ్ఞసమాప్తి యందు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము. ధనము కొరకు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము.
8. బహు ధనవంత ఇంద్రా! నా యొక్క స్తుతిరూప వాక్కులు నిన్ను వర్ధిల్ల చేయును గాత. అగ్ని వంటి తేజస్సులును, పవిత్రులగు విద్వాంసులు నిన్ను స్తోత్రములచే స్తుతించుచున్నారు.
9. నిత్య శత్రుంజయములు, ధనవంతములు, అక్షయరక్షణలు గల రథములు అన్నము కొరకు అటునిటు తిరిగినట్లు ప్రసిద్దములు, మధురములు, శ్రేష్ఠములగు స్తుతులు ఇంద్రుని నిమిత్తము ఉచ్ఛరించ బడుచున్నవి. పైపైకి వ్యాపించుచున్నవి.
10. గౌరమృగము దప్పిగొన్నపుడు - గడ్డి లేనట్టి, నీరునిండిన - కొలను వైపు సాగును. నీవును అట్లే బందు భావమున మా వద్దకు రమ్ము. కాణ్వులము సముపార్జించిన సోమమును పానము చేయుము.
మూడవ ఖండము
ఋషులు :- 1. భర్గుడు. 2,8. రేభుడు. 3. జమదగ్ని. 4,9 మేధాతిథి. 5,6. నృమేధ, పురుమేధులు. 7. వసిష్టుడు. 10. భరద్వాజుడు.
1. ఇంద్రదేవా! శచీపతివి. శూరుడవు. మాకు సకల రక్షణల వారము ప్రసాదించుము. నీవు మా భాగ్యమునాకు తగిన యశస్సును, ధనమును ఇచ్చువాడవు. నిన్ను ఆరాధించుచున్నాను.
2. ఇంద్రా! నీవు స్వర్గవంతుడవు. అనుభవయోగ్య ధనమును రాక్షసులను వధించి గుంజుకున్నావు. దానితో నీ స్తోతలను వర్ధిల్లచేయుము. నిన్ను భజించు వారిని, నీ కొరకు కుశాసనము పరచువారికి ధనము కలిగించి వర్ధిల్లచేయుము.
3. ఋత్విజులారా! మిత్ర దేవత కొరకు యజ్ఞము నందు స్తుతులను గొప్పగా గానము చేయండి. ఆర్యమ కొరకు గానము చేయండి. యజ్ఞ గృహమందు విరాజిల్లు వరుణుని కొరకు గానము చేయండి.
4. ఇంద్రా! స్తోతలు దేవతలందరి కన్నముందు నిన్నే సోమ పానము చేయుమని స్తుతించుచున్నారు. సమూహముగా యుక్త కంఠమున నిన్నే స్తుతించుచున్నాము. రుద్ర పుత్రులు మరుత్తులు సనాతనుడవగు నిన్నే స్తుతించుచున్నారు.
5. స్తోతలారా! మీ మహాస్తోత్రములను ఇంద్రుని కొరకు ఆలాపించండి. శతక్రతు ఇంద్రుడు పాపనాశకుడు. శతధారల వజ్రమున పాపములను నశింపచేయును గాత.
6. మితభాషులగు స్తోతలారా! వృత్రహంతయగు మహా ఇంద్రుని కీర్తిగానము చేయండి. సత్యవర్ధనుడు, దీప్తుడు, దివ్యుడు, సకలమును మేల్కొల్పువాడగు సూర్యుని ఇంద్రుడు సృష్టించినాడు. అట్టి ఇంద్రునకు స్తుతి గానములు చేయండి.
7. ఇంద్రదేవా! తండ్రి పుత్రులకు వలె మా కార్యములను సఫలము చేయుము. మాకు ధనము నిమ్ము. మేము యజ్ఞములందు జీవింతుము గాక. నిత్యము సూర్యుని దర్శింతుము గాత.
8. ఇంద్రదేవా! మేము హవిస్సులు అందించు వారము. మమ్ము విడువకుము. మాకు ఆనంద దాయక యజ్ఞమున సోమపానము చేయుము. మమ్ము నీ రక్షణలందు ఉంచుకొనుము. మేము నీ బంధువులము. మమ్ము విడువకుము.
9. వృత్రహంతా! మేము నీ కొరకు సోమము సంపాదింతుము. జలములకు వలె నమస్కరింతుము. సోమము పిండ, ఆసనముపరచు స్తోతలు సహితము నిన్ను ఉపాసింతురు.
10. ఇంద్రా! మానవులకు బలము ఉన్నది. ధనము ఉన్నది. పంచ జనులందు ప్రకాశించు ధనమును మాకు ప్రసాదించుము. విశ్వబలములను మాకు అందించుము.
నాలుగవ ఖండము
ఋషులు :- 1. మేధాతిథి. 2. రేభుడు. 3. వత్సుడు. 4. భరద్వాజుడు. 5. నృమేధ. 6. పురుహన్మ. 7. పురుమేధ, నృమేధులు. 8. వసిష్ఠుడు. 9. మేధాతిథి, మేధ్యాతిథులు. 10. కలి.
1. ఉగ్రఇంద్రా! నీవు వరము లిచ్చువాడవు. ఇది సత్యము. సోమాభిషవ కర్తలచే ఆహ్వానించ బడువాడవు. నీవు దూరము నుండియు, దగ్గరి నుండియు వరములు వర్షించువాడవని వినుచున్నాము.