యస్య నిఃశ్వసితం వేదా యో వేదేభ్యో2ఖిలం జగత్|
నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ || శ్రీ మదాంధ్ర వచన అథర్వ వేద సంహిత రెండవ కాండ మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
1. కార్య సిద్ది అగునా లేదా అని తెలిసికొనుటకు:-
అయిదు గణుపుల వెదురు కర్రను సమతల ప్రదేశమున నిలుపవలెను. అది అనుకున్న వైపు కార్య సిద్ది అగును.
2. బాణమును ఎక్కుపెట్టి, ఈ సూక్తమున అభిమంత్రించి విడువవలెను. అది లక్ష్యము చేరిన కార్యసిద్ధి అగును.
3. నీరు నిండిన కుండ లేక కమండలములో పాలు పోసి మనసులో ప్రార్దించవలెను. అనుకున్న రీతి హెచ్చు తగ్గులు కార్యసిద్దిని సూచించును.
4. దర్భలకట్టను ఈ సూక్తముచే అభిమంత్రించి లెక్కించవలెను. సమసంఖ్య కార్యసిద్ధిని సూచించును.
5. వంట చెరుకు ఈ సూక్తముచే అభిమంత్రించి అగ్నిలో వేయవలెను. ప్రదక్షణ పూర్తియగు వరకు మండిన కార్యసిద్ధి కలుగును.
6. పాచికలను అభిమంత్రించి వేయవలెను. అనుకున్న సంఖ్య పడిన కార్యసిద్ది.
7. రెండు చేతుల వ్రేళ్ళను అభిమంత్రించి యోచించవలెను. అనుకున్న వేలు తాకిన కార్యసిద్ధి.
8. 21 ఇసుక రేణువులను అభిమంత్రించి విభజించవలెను. లెక్కపెట్టగా అనుకున్న సరి/ బేసి సంఖ్యలు కార్యసిద్ధిని సూచించును.
9. పోయిన వస్తువు జాడ తెలుసుకొనుటకు నీరునిండిన కుండ లేక నాగలి లేక పాచికను గుడ్డచే కప్పవలెను. రజస్వల కానట్టి ఇద్దరు బాలికలను వాటిని తీసికొని పొమ్మన వలెను. వారు వెళ్ళిన దిక్కున జాడ తెలియును.
11. కుమారి దోసిలిలో నీరు పోసి - అభిమంత్రించి - పారపోయమనవలెను. తూర్పు దిక్కుకు పోసిన కళ్యాణమగును.
12. మూడవ మంత్రము అగ్ని చయనమున పురోడాశ గృహీత ఉత్తరార్ధ ఘ్రుతముచే వైశ్వకర్మ హోమమున వినియోగము.
1. ఆదిత్యుడు పరమగుహ్యమును దర్శించినాడు. విశ్వమంతయు ఏకరూపమగు ప్రదేశమును దర్శించినాడు. అప్రకటితమగు ఈ చరాచర జగత్తును సూర్యకిరణములు ప్రకటించినవి. జన్మించిన సమస్త ప్రజ అట్టి ఆదిత్యుని ఎరుంగును. అర్చించును.
మరొక అర్ధము.
సమస్త విశ్వము జీవించుటకు జలమే ఏకమాత్ర కారణమై ఉన్నది. ఈ సమస్త విశ్వము జలమునందే ఐక్యమగుచున్నది. మధ్యస్థానమున ఉన్న పర్జన్యుడు దీనిని ఎరుంగును. ఆదిత్య మండలమున నిలిచి ఉన్న గుహ్య జలమును దర్శించినాడు. ఆ సూర్యుడు వర్షము కలిగించునని అది సకల ఉత్పత్తి కారకమని ప్రజలకు తెలియును. వారు సూర్యుని స్తుతింతురు.
2. అమృతము తెలిసిన విద్వాంసులు సూర్యుని పరమగుహ్య స్థానమును ఉపదేశింతురు గాక. ఆ గుహ్యమందలి మూడు పదములను తెలిసినవాడు తండ్రులకు తండ్రి అగుచున్నాడు.
3. అతడు నా పాలకుడు. నన్ను సృజించిన వాడు. అతడే బంధువు. అతడు విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. లోకములందలి సకల సంప్రశ్నలు అతనిని గురించినవే!
4. (జ్ఞానోత్తర కాలం తత్త్వవిద్ బ్రూతే - జ్ఞానము కలిగిన తరువాత తత్త్వ విదుడు అనుచున్నాడు.)
మాట్లాడు వాణి మాటను దగ్గర ఉండువారు వెంటనే స్పష్టముగా వినుచున్నారు. అట్లే నేను ద్యావాపృథ్వులను పొందినాను. నేనే తొలుత పుట్టిన అమృత స్వరూపుడను అగుచున్నాను.
5. ఎచట దేవతలు అమృతము ఆరగించుచున్నారో ఎచట దేవతలు ఒకే మూలమును ఆశ్రయించినారో ఆ స్థలమును తెలిసికొన్నాను. సకల భువనములు ఏ పాప పుణ్యముల దారములతో కట్టబడి ఉన్నవో ఆ దారములు తెగుటను దర్శించినాను.
1. దివ్యసూర్యుడు, భువనపతి ఒక్కరే. అతడు నమస్కరించ దగినవాడు. స్తుతించదగినవాడు. నేను ఆ సూర్యుని, ఈ భువన పతిని బ్రహ్మగా భావించుచున్నాను. మీరు దివ్యులు. దేవతలు, స్వర్గవాసులు. మీకు నమస్కరించుచున్నాము.
2. సూర్యుడు ఆకసమున ఉన్నవాడు. పూజ్యుడు. గంధర్వుడు. సూర్యుని వంటివాడు. దేవతల కోపము చల్లార్చగలవాడు. అతడు లోకములకు స్వామి. నమస్కరించ దగినవాడు. మంచి సుఖములు కలిగించ గలవాడు. అతడు మాకు సుఖములు ప్రసాదించును గాక.
3. కిరణరూప అప్సరసలతో సూర్యరూప గంధర్వుడు కలిసిపోయినాడు. అప్సరసలతో కూడ సూర్య నామక గంధర్వుడు కలిసి పోయినాడు. ప్రాణులను ఆనందపరమ అప్సరల స్థానము సముద్రనామక సూర్యుడై ఉన్నాడు.
1. ముంజవాన్ పర్వతము సర్వశ్రేష్ఠము ప్రసిద్దము. దాని మీద వ్యాధిని నివారించునట్టి "ముంజ" నేలమీద వ్యాపించి ఉండును.
ముంజమా! నీ అగ్రభాగమును వ్యాధి నివారణ ఔషధముగా చేయుచున్నాను. నిన్ను వ్యాధి నివారక, సమర్ధ, పరమ వీర్యవంత ఔషధమును చేయుచున్నాను.
2. ఔషధమా! నిన్ను వాడగనే వ్యాధిని దూరము చేయుము. మరల వచ్చు వ్యాధులను నష్టపరచుము. నీ జాతివారు అనేకులున్నారు. వారిలో నీవు శ్రేష్ఠమవు. నీవు రోగమును నివారించుట మాత్రము కాదు. నిర్మూలించు దానవు.
వ్యాఖ్య - అత్యంత ఆధునిక వైద్యము సహితము నివారణను గురించి మాత్రమే ఆలోచించుచున్నది. ఒకసారి రోగి నిత్య రోగి అగుచున్నాడు. జీవితకాలము మందులు తప్పుట లేదు.
ఆ కాలమున "అరోగిణమ్" రోగము లేని వాణి గురించి, రోగ నిర్మూలమును గురించి ఆలోచించినారు. అట్టి ఆలోచన నేటికిని కొనసాగుతున్నది.
మనము మందుల వ్యాపారము పెంచుటను మించి సాగలేకున్నాము.
3. ఈ వ్యాధులు అసురులు వంటివి. ప్రాణములు తీయును. దేహములను కూల్చును. ఇవి ప్రాణమును లోననుండి తొలుచును. అట్లయిన ఈ 'ముంజ' ఆ స్రావమునకు మహా ఔషధము అది వ్యాధులను సమూలముగ నాశము చేయుచున్నది.