జలపు మూల స్థానమేది? దానిని తెలిసిన వాడు నేటికి లేడు. మానవునికి జ్ఞానము పర్యాప్తము. అది వాడుక తెలియగలదు! మూలమును తెలియజాలదు!!
3. ద్యావాపృథ్వులు అక్షయమగు జలమును పుట్టించుచున్నవి. అట్లయ్యు సముద్రమునకు చేరు నదుల వలె అంతరిక్షమున జలము అక్షయమై ఉన్నది.
వ్యాఖ్య - సూర్యుడు భూమి, నీటి వలననే కదా జలము ఏర్పడుచున్నది - ఇవి జలమును అంతరిక్షమునకు చేర్చుచున్నవి. అంతరిక్షము ఆ జలములను దాచుకొనదు. వర్షించును. అట్లయ్యు అక్కడి జలము వడిసిపోదు.
మానవుడు తప్ప ప్రకృతి శక్తులు దేనిని దాచుకొనవు. ఇచ్చుటే వాని పని. అయినను తరుగవు.
4. ద్యులోకము విశ్వమును ఆవరించి ఉన్నది. పృథ్వి విశ్వమును ఆశ్రయించి ఉన్నది. కావున విశ్వజ్ఞానము గల ద్యులోకమునకు విశ్వమునకు ఆధార భూతమగు భూమికి నమస్కరించుచున్నాను.
వ్యాఖ్య - విశ్వము సమస్త సృష్టి యగును. మనకు కూడ సృష్టియే. మనము భూమిని ఆశ్రయించి ఉన్నాము. ద్యౌ మనను ఆవరించి ఉన్నది. భూలోక ద్యులోక, అంతరిక్షములు కాక "విశ్వము" అను మరొకటి చేరినది. ఇంతవరకు విశ్వము అనిన సమస్తము అయినది - విశ్వేదేవతలు - సమస్త దేవతలు.
ఐదవ సూక్తము - 33
వినియోగము:-
1. ఈ సూక్త పాఠము నాలుగవ సూక్తమున వచ్చినది. అదే వినియోగము.
2. గోదానమప్పుడు ముండనము తరువాత ఈ సూక్తముతో బాలకునికి స్నానము చేయించవలెను.
3. మధుపర్క, పాద్యోదక అభిమంత్రణమున దీనిని చదువవలెను.
4. ఎడారిలో జలము కలిగినపుడు ఈ సూక్తముచే ఘ్రుత హోమము చేయవలెను.
5. కుండ పగిలి పోయినపుడు కొత్తకుండ తెచ్చి దీనితో అభిమంత్రించి నీరు నింపవలెను.
4. జలమా! నన్ను శుభంకర దృష్టితో చూడుము. నీ శుభంకర చర్మముతో నా చర్మమును తాకుము.
అమృతము కురిపించు, శుచివంత, పావక జలము మమ్ము వ్యాధిరహితులను చేసి, మాకు శుభములు కలిగించును గాక.
ఆరవ సూక్తము -34
వినియోగము :-
1. సభాజయమునకు గాను సభలో ప్రవేశించక ముందు దీనితో 'మధూక' మను 'వీరూధ' మును భక్షించవలెను.
2. వివాహమందు ఈ సూక్తముచే మధూక మణిని రక్త సూత్రమున కట్టి వేలుకు కట్టుకొనవలెను.
3. వివాహపు చతుర్ధ కర్మయందు 'మధూక' మణిని దంచి 'ఓక్షము' న ఉంచి ఈ సూక్తముచే అభిమంత్రించి వధూవరులు సంగమించవలెను.
4. అశ్వమేధే బ్రహ్మోద్య వదనేసి ఏతత్ సూక్తమ్.
1. ఇది "వీరుల్లత" ఇది మదురమున పుట్టినది. మధురముగనే నిన్ను త్రవ్వుచున్నాను. నీవు మధురముగ పుట్టిన దానవు. మమ్ము మధుర రస యుక్తులను చేయుము.
2. మధూలకమా! నా జిహ్వాగ్రమున నిలుపుము. జిహ్వ మూలమున నిలుపుము. నా దేహమున నిలుపుము. నా చిత్తమున నిలుపుము. అన్నింటిని మధురరస యుక్తము చేయుము.
3. నా రాక మధుమయము నా పోక మధుమయము అగును గాక. నా మాట మధురము, నా చేత మధురమగును గాక. అన్యులకు నేను మధుమయుడను అగుదును గాక.
4. మధూలకమా! నేను నీ దాపున ఉన్నాను. నన్ను మధువుగ, మధుతరముగ, మధుతమముగ చేయుము. తేనె పట్టు గల కొమ్మను సకల జనులు సేవించినట్లు నన్ను సేవింతురు గాక.
5. ధర్మపత్నీ! చెరుకు గడ అంతటను మాధుర్యము నిండి ఉండును కదా! అట్లే నాలో మొత్తము మధుర రసము నింపుకొని నిన్ను పరిగ్రహించుచున్నాను మనము ఉభయులము పరస్పరము ద్వేషరహితులమై ఉందుము గాక. భార్యగా నీవు నన్ను కోరునట్లును, నన్ను విడువకుండునట్లును ఉండుటకు చేరినాను.
వ్యాఖ్య:- తీయని మాటయే అన్నింట జయము కలిగించును. ద్వేషము, కటు వాక్యము ప్రయోజన రహితము. సమాజమున స్నేహమే, ప్రేమయే వర్ధిల్లవలెను అనుచున్నాడు. ఇంతకు మించి మానవ జాతి ఆశించవలసిన దేమి?
6. దాంపత్య విషయమున ఎంత మధురముగా చెప్పినాడు? చెరుకు గడ నిండుగా తీసియే. రవ్వంత చేదుండదు. తన యందంతటను అంతటి తీపిని నింపుకొని భార్య వద్దకు వచ్చినాడట! ఏమ్తతి ఆదర్శ దాంపత్యము! దాంపత్యమే కదా సమాజమునకు మూలము!! సమాజము ఏమ్తతి మధుర మగును!!!
ఏడవ సూక్తము - 35
వినియోగము:-
1. సర్వ సంపత్కర్మ యందు త్రయోదశి మొదలు మూడు రోజులు నీలిమను పెరుగు తేనెలో ఉంచి తదుపరి మణిని తీసి కట్టవలెను. ఒకే రూపము గల దూడగల ఆవు పాలతో అన్నము వండవలెను. దానిలో మనిషి బొమ్మ గీసి దానిని తినవలెను.
2. ఆయుష్యకామి హిరణ్య మణిని, రెండు నీలిమలను సంపాతిత, అభిమంత్రణము చేసి, స్థాలీపాకమును సహితము సంపాతిత, అభిమంత్రణ చేసి మణులను కట్టవలెను. అన్నము తిన వలెను.
3. ఉపనయనమున ఆయువు ఆశించు బ్రహ్మచారి ఈ సూక్తముచే ఘ్రుత హోమము చేయవలెను.
2. హిరణ్యమణి కట్టుకున్న వైర్ని రాక్షసులు, పిశాచములు బాధించవు. ఈ హిరణ్యము దేవతల ఓజస్సు కలది. దేవతల కన్న పూర్వము పుట్టినది. రక్షించు దాక్షాయణ హిరణ్యము ధరించినవాడు శతాయుష్కుడు అగుచున్నాడు.
3. హిరణ్యము ధరించిన వాని యందు జలముల తేజమును, సూర్యచంద్రుల జ్యోతిని, మహాపురుషుల బలమును, వనస్పతుల సామర్ధ్యమును, ఇంద్రుని అసాధారణ చిహ్నములను స్థాపించుచున్నాము.
4. హిరణ్యము ధరించిన వాని ఋతువులను మాసములను పరిపూర్ణము చేయుచున్నాను. సంవత్సర పర్యంతము దుగ్ధములతోను, సంవత్సరముల పర్యంతము నిలుచు గో, ధన, ధాన్య సమృద్ది కలిగించుచున్నాను. ఇంద్రాగ్నులు, విశ్వే దేవతలు ఆ కర్మ యందలి లోపములను మన్నింతురు గాక. ఫల పాప్తి అనుగ్రహింతురు గాక.
వ్యాఖ్య - బంగారము సంపద మాత్రము కాదు. ఇది ఆయుర్వేదమున ఔషధములందు చేరి మహోపకారము చేయుచున్నది. సువర్ణ వాతచింతామణి, సువర్ణ సూర్యావర్తి, సువర్ణ మకర ధ్వజము కొన్ని ఔషధములు.