Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 9

 

4.    పుట్టలు పెట్టు మట్టి అడుగున ఉన్న జలరాశి రోగ నివారక ఔషధులను నేల మీదికి తెచ్చుచున్నది. ఈ పుట్టమట్టి అస్రాన ఔషధమై ఉన్నది. అది వ్యాధులను సమూలముగ నిర్మూలించుచున్నది.
   
5.    పంట పొలపు మట్టి మహా ఔషధము అగుచున్నది. అది వ్రణములను మాన్పుచున్నది. ఈ మట్టి అస్రావ ఔషధము అయి ఉన్నది. ఇది వ్యాధులను సమూలముగ నిర్మూలించుచున్నది.
   
6.    ఔషధములకు వాడునట్టి నీరు సుఖప్రదము రోగములను శాంతింప చేయునది అగును గాక. రోగములు కలిగించు వానిని ఇంద్రుని వజ్రము హత మార్చును గాక. రాక్షసుల చేతి రోగ బాణములు మా మీద పడకుండును గాక.
   
                                               నాలుగవ సూక్తము- 4
   
వినియోగము - కృత్య దూషణ, తన రక్షణ, విఘ్న నివారణకు 'జంగిడ' వృక్షమణిని తాడుతో పేని సంపాత,       అభిమంత్రణలు చేసి కట్టవలెను.
   
1.    మాకు బృహదాయువు కలుగుటకును, సకల రక్షణలు సదా కలిగించుటకును, రాక్షసుల రోగగతిని నిరోధించుటకును, శరీరపోషణకు కలుగు అడ్డంకులను దూరము చేయుటకును జంగిడ వృక్షపు మణిని ధరించుచున్నాను.
   
2.    'జంగిడ' మణి అపార బలము కలది. అది మమ్ము హింసక కృత్యనుండి, రాక్షసుల కోరలనుండి, శరీరమును ముక్కలు, ముక్కలు చేయు రోగముల నుండి సకల దిశలందుండి రక్షించును గాక.
   
3.    జంగిడ మణి విశ్వభేషజము. అది మమ్ము ఇతరులు చేయు ఉపద్రవము నుండి రక్షించుచున్నది. భక్షించు వారినుండి కాపాడుచున్నది. అది మమ్ము పాపముల నుండి రక్షించును గాక.
   
4.    జంగిడ మణి సుఖములను కలిగించునది. దేవతలచే ప్రసాదించబడినది. ఇది సకల విఘ్నములను నివారించునది. రాక్షస సంచారమును నివారించుచున్నది.
   
5.    జంగిడయు, మణికి కట్టిన త్రాడును మమ్ము సకల దిశలందు రక్షించును గాక. జంగిడ అరణ్యము నుండి, త్రాడు కృషిరసము నుంచి వచ్చినవి. ఇవి మమ్ము సకల విఘ్నముల నుండి రక్షించును గాక.
   
6.    ఈ జంగిడ మని అభిచారాది 'కృత్య' దోషములను నివారించునది. శత్రువులను తొలగించునది. బలశాలి. ఈ మణి మా ఆయువులను పెంచును గాక.
   
వ్యాఖ్య :- 1) మానవుడు రోగరహితుడు, చిరంజీవి కావలెనను ఆదర్శము - ఆరాటము ఈనాటిది కాదు. ఇది మానవుని తోనే పుట్టినది. ఆ ప్రయత్నము నిరంతరము కొనసాగుచుండును. ఆగదు.
   
    భారతీయ వైద్య విధానమగు ఆయుర్వేదము ఈ దిశలో చాలవరకు విజయవంతమైనది. ఆయుర్వేదమునకు మూలము వేదమనుట నిర్వివాదము.
   
    అనాది కాలపు ఆయుర్వేదమునకు వేదమునకు వలెనే అనేక విఘ్నములు, అడ్డంకులు, ఆటంకములు కలిగినవి. ఆటంకములు జీవిత సత్యము. వానిని అధిగమించి నిలిచినపుడే రాణింపు.
   
    ఈ మధ్యన ఆయుర్వేదమునకు ఆంగ్లప్రభుత్వము వలన అంతరించి పోవు ప్రమాదము ఏర్పడినది. ఆంగ్లేయులు భారత దేశమును పాలించిన రెండు వందల ఏండ్లలో ప్రాచీన భారతదేశమునకు సంబంధించిన సమస్తమును నిర్మూలించుటకు తమ ప్రభుత్వ పశుబలంతో నిరంతరము ప్రయత్నించినారు.
   
    ఆయుర్వేదము ఒక వైద్య విధానము కాదని దానిని నిర్మూలించుటకు ఆంగ్ల ప్రభుత్వము పూనుకున్నది. అప్పుడు పండిత రాజ గోపాలాచార్యుల వారు ఆయుర్వేద విధానపు శాస్త్రీయతను నిరూపించుటయే కాక భారత దేశమందంతటను వైద్యాలయములు, విద్యాలయములు స్థాపించి ఆయుర్వేదమును రక్షించినారు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్యులు ఆయుర్వేదమును ప్రశంసించుట ప్రారంభించినారు.
   
      2) ఈ సూక్తమున ప్రశంసించబడిన "జంగిడ" ఏకమూలికా సిద్దాంతము. ఇందు మరొకటి కలువదు. జర్మనీలో హానిమన్ అనే మహామహుడు ఈ సిద్దాంతము మీద హోమియోపతి అను ఒక చికిత్సా విధానమును విజయవంతముగా నిర్వహించినారు. ప్రస్తుతము ఈ విధానము ప్రపంచ వ్యాప్తముగ ప్రచారములో ఉన్నది. ఇది హాని కలిగించని వైద్య విధానము.
   
      3) 'జంగిడ' ఇదే పేరుతో వారణాసిలో లభించుచున్నదని చెప్పుచున్నారు. ఇప్పటికే దీనిమీద పరిశోధనలు జరుగుచుండ వచ్చును. వైద్య శాస్త్రజ్ఞులకు తెలియవలెను.
   
    తులసి, వేప మున్నగు వానిమీద పాశ్చాత్యులు పరిశోధనలు జరిపి మనకు వేల ఏండ్లనాడు తెలిసిన ఫలితములను ధృవీకరించుచున్నారు. వారు 'జంగిడ' ను విడిచి ఉండరు. వారు మరొక పేరుతో దానిని మనకే విక్రయింతురు!
   
    'మణి' అనగా 'రత్నము' 'వజ్రము' అగును. వేదమున ఒక్కొక్క చోట 'సువర్ణము' అను అర్ధము వచ్చునట్లు వాడబడినది.
   
    'మణి' అన్నప్పుడు దారము గుచ్చి లేక చుట్టి వాడునది అనియూ చెప్పబడినది. ఇది మెడకు తగిలించుకొనునది గాని ముంజేతికి కంకణము వలె కట్టుకొనునది గాని కావచ్చును. ఈ సూక్తమునకు ఈ అర్ధమే తగినట్లున్నది.
   
                                                          ఐదవ సూక్తము -5
   
వినియోగము :-

   
     1)   సోమాభిషవమున, అభిషవ హోమమున.
   
     2)         షోడశగ్రహ, ఐంద్రోపస్థానమున.
          
     3)   ఐంద్రీ మహాశాంతిలో దీనిని పఠించవలెను.
   
1.    ఇంద్రదేవా! హర్యశ్వముల మీద రమ్ము. ప్రసన్నుడవగుము. మాకు కోరిన ఫలముల నిమ్ము. అభిషుత, ప్రశంసనీయ సోమమును సేవింపుము. అది దశాపవిత్రమున పరిశుద్దమైనది. నిర్మలము. నీకు మాదకమై తృప్తి కలిగించుచున్నది.
   
2.    ఇంద్రా! ఈ సోమము స్వర్గము నందలి అమృతము వంటిది. నవీనము. మధుర రసయుతము. దీనితో నీ కడుపు నింపుము.
   
    ఈ సోమము అభిషుతము. స్తుతి యుక్తము. మాదకము. స్వర్గము వంటిది. నీకు ఇచట కూడ లభించుచున్నది.
   
3.    ఇంద్రుడు సోమ పానము చేసినాడు. బలశాలి అయినాడు. ఆ బలమున శత్రువులను పరిమార్చినాడు. వృత్రుని వధించినాడు. భ్రుగువు వంటి ఇంద్రుడు అంగిరసుల గోవులను తస్కరించిన బలాసురుని, వేదవ్యతిరేకిని వలె వధించినాడు.
   
    ఇంద్రుడు సకల ప్రాణిజాలములకు మిత్రుడు అగుచున్నాడు.
   
4.    ఇంద్రా! రమ్ము ఈ సోమము నీలో ప్రవేశించును గాక. నీ కుక్షి యొక్క రెండు భాగములు నిండి పొర్లును గాక. మా ఆహ్వానమును ఆలకించుము. అనుగ్రహించుము. మా స్తుతిరూప వాణిని వినుము. ప్రసన్నుడ వగుము. మాకు ఫలసిద్ది కలిగించుటకు నీ మిత్రులగు మరుత్తుల సహితుడవై వచ్చి సోమము సేవించుము.
   
5.    ఇంద్రుడు వజ్రధారి. అతడు పూర్వము అనేక వీరకృత్యములు చేసినాడు. నేను వానిని చక్కగా వివరించుచున్నాను:-
   
    ఇంద్రుడు వృత్రుని వధించినాడు. వృత్రుడు బంధించిన జలమును విడిపించినాడు. పర్వతముల నుండి నదులను ప్రవహింపచేసినాడు.
   
6.    గోవుల వంటి శబ్దము చేయుచు నిరాటంకముగా పల్లమునకు ప్రవహించి నదీపతి యగు సముద్రుని చేరు నదుల వలె ఇంద్రుడు వృత్రుని వధించినాడు. మేఘమును విదీర్ణము చేసినాడు. వృత్రుని తండ్రియగు త్వష్ణ దహించునట్టి వజ్రమును ఇంద్రుని కొరకు పదును పెట్టినాడు.
   
7.    వృషాయ మానుడగు ఇంద్రుడు ప్రశంసనీయ సోమము కొరకు ప్రజాపతిని అర్ధించినాడు. ఇంద్రుడు 'త్రికద్రుక' సోమయాగమున అభిషుత సోమము పొందినాడు. ఆ సోమము త్రావిన బలమున ఇంద్రుడు శత్రువు నుండి వజ్రాయుధము గ్రహించినాడు. అసురులలో తొలుత పుట్టిన వృత్రుని సంహరించినాడు.
   
                                         రెండవ అనువాకము
                                       మొదటి సూక్తము - 6

   
వినియోగము :-
   
      1) సంపద కోరువాడు దీనిచే అగ్ని యాగము చేయవలెను.
   
      2) భూత, రోగ, చోరాది భయముల సంవత్సరమైనపుడు తచ్చాంతి కొరకు దీనిచే ఘ్రుతాహుతులు     ఇవ్వవలెను.
   
      3) అగ్ని చయనమందు ప్రజాపతి పశు సామిధేని సమయమున బ్రహ్మ దీనిని జపించవలెను.
   
      4) సర్వ కామములకు, అగ్ని భయమునకు ఆగ్నేయ మహాశాంతి యందు దీనిని జపించవలెను.
   
      5) రాత్రి పూట రాజుకు హారతి ఇచ్చునపుడు ఇందలి 5వ మంత్రముచే వెలిగించవలెను.
   
1.    అగ్నిదేవా! సంవత్సరములు నిన్ను వర్ధిల్లచేయును గాక. ఋతువులు, ఋషులు, నిన్ను సమృద్దుని చేయును గాక. సత్యస్వరూపులగు పృథివ్యాదులు నిన్ను సమృద్ధుని చేయును గాక. ఆ సమృద్దులతో నీవు దివ్యలోకమున తేజరిల్లుము. ఆ తేజస్సుతో విశ్వమును, సమస్త దిశలను ప్రకాశింప చేయుము.
   
2.    అగ్నీ! నీవు స్వయముగ ప్రజ్వరిల్లుము. ఇతని కోరికలు తీర్చుము. ఇతనికి మహదైశ్వర్యము కలిగించుటకు ఉత్తిష్ఠ నిన్ను సేవించు వారికి క్షయము కలుగ కుండును గాక. వారికీ యశస్సు కలిగించుము. పూజించని వారికి యశస్సు కలుగకుండును గాక.
   
3.    అగ్నిదేవా! ఈ బ్రాహ్మణులు నిన్ను ఆరాధించుచున్నారు. వారికి శుభములు కలిగించుము. వారి లోపములను మన్నించుము.
   
    అగ్నిదేవా! మా శత్రువులను జయించుము. మా పాపములను పోగొట్టుము. నీ ఇంట అప్రమత్తుడవై గౌరవ ప్రదుడవై వసింపుము.
   
4.    అగ్నీ! నీవు స్వంత బలమున వర్ధిల్లుము. మిత్రులను పోషించుము. వారికి ఉపకారము చేయుము. నీవు సజాతీయుల మధ్య నిలువుము. రాజులు చేయు 'విహవ్య' యజ్ఞమున ప్రజ్వరిల్లుము.

 Previous Page Next Page