చటుక్కున వంగి చెయిన్ తెగిపోయినచోట క్రింద పడివున్న ఓ రాడ్ ని పైకి తీశాడు.
ఆ రాడ్ అక్కడికెలా వచ్చింది??
అదే అనుమానాన్ని వర్కర్స్ ముందు వ్యక్తపరిచాడు.
దానికి వాళ్ళూ ఆశ్చర్యపోయారు.
అది డ్రమ్స్ ని ఓపెన్ చేసేటప్పుడు ఉపయోగించే పరికరం, అక్కడెలా పడి వుంది? మెషిన్ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా వుంచకపోతే త్రినాధ్ సహించడు. అందుకే పొరపాటున కూడా అవసరం లేని వస్తువులు యంత్రం దరిదాపుల్లో వుండనీయరు వర్కర్స్.
త్రినాధ్ లో క్రమంగా అనుమానం బలపడసాగింది. అంతలో ఓ వర్కర్ వచ్చాడు.
"ఆరోజు లంచ్ సమయానికి ముందు ఒకతను వచ్చాడండి..." అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయి అతనివైపు చూశారు.
"ఎవరతను? ఎందుకొచ్చాడు? ఎవరికోసమొచ్చాడు? ఎంతసేపు వున్నాడు?" త్రినాధ్ ఆతృతగా అడిగాడు.
"అతనెవరయిందీ నాకు తెలియదుసార్! కాని అతను అప్పుడప్పుడు హిందూ మేడమ్ ని, ఇంజనీర్ సాబ్ ని కలిసేందుకు వస్తుంటాడు."
హిందూ, ఇంజనీర్ లు ఉలిక్కిపడ్డారో క్షణం.
"ఎవడు వాడు హిందూ?" బోస్ చిరుతపులిలా వున్నాడు.
త్రినాధ్ ఎవరన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు.
"బహుశా సైంటిస్ట్ కావచ్చు" అన్నాడు ఇంజనీర్ తగ్గుస్థాయిలో.
త్రినాధ్ అనుమానం పూర్తిగా బలపడిపోయింది.
"ఇప్పుడెక్కడ అతను?" త్రినాధ్ మామూలుగా వుండేందుకు ప్రయత్నిస్తూ అడిగాడు.
"వాడెక్కడ?" బోస్ వేసిన కేక ఆ షెడ్ లో ప్రతిధ్వనించింది.
"ఈ మధ్యనే సుదర్శన్ రావు కంపెనీలో ఆర్. అండ్.బి. డిపార్ట్ మెంట్ లో జాయినయ్యాడు..." హిందూ మాటలు పూర్తికాలేదు. "వాడికి నా చేతుల్లో మూడినట్లే" పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు బోస్.
అది పొరపాటునో, ప్రమాదవశాత్తో జరిగిన నష్టం కాదు. కావాలనే సుదర్శన్ రావు వర్గం పథకం ప్రకారం పన్నిన వల! ఉద్రేకంగా వూగిపోతున్న బోస్ త్రినాధ్ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుండగా, అతను మౌనంగా బయటకు సాగిపోయాడు.
* * * *
త్రినాధ్ ఆఫీసుకి వచ్చేసరికి మేనేజర్ కంగారుపడుతూ కనిపించాడు.
"ఏమిటి విశేషం మేనేజర్...?" త్రినాధ్ నిరాసక్తంగా అడిగాడు.
అతను మౌనంగా ఓ లెటర్ అందించాడు. అది చదివిన త్రినాధ్ ఒక్కసారి షాక్ తిన్నాడు. హఠాత్తుగా ల్యూబ్ ఆయిల్ ఎక్కువ కావాలంటే పర్చేజ్ ఆఫీసర్ నుంచి లెటర్.
మీకు అవసరమైతే మేం ఇప్పుడు సప్లై చేసేదానికి డబుల్, త్రిబుల్ క్వాలిటీ కూడా సప్లై చేయగలం అని ఎప్పుడో తను ప్రామిస్ చేసిన లెటర్స్ కోట్ చేస్తూ పెంచిన ఆర్డర్ అది. సరిగ్గా ఈ టైమ్ కే రావడం చిత్రంగా వుంది.
అరగంటసేపు ఏం చేయాలన్నదీ సమాలోచనలు జరిగాయి.
"బాస్! నాకొక్క ఛాన్స్ ఇచ్చి చూడండి... మరలా మన జోలికి సుదర్శన్ రావుగాని, ప్రియాంకకాని, సైంటిస్ట్ కాని వస్తే అప్పుడడగండి" బోస్ తిరిగి రాక్షసుడు చోటు చేసుకుంటున్నాడా అన్నట్టుగా వున్నాయతని మాటలు, ముఖకవళికలు.
"చూడు బోస- నీవు రంగప్రవేశం చేయవల్సిన సమయం, సందర్భం తప్పక వస్తుంది. అప్పుడు తప్పక నిన్ను వదులుతాను. ఇది ప్రియాంక పనే అని స్పష్టంగా తెలిసిపోతుంది. బలప్రయోగం పరిష్కారం చూపించదని తెలుసు. ఇప్పుడు మనకు కావల్సింది యంత్రం వెంటనే ప్రొడక్షన్ ప్రారంభించడం. మూడు నెలలదాకా మన యంత్రం నడవదని ప్రియాంక ఉబలాటపడుతుంది. కాని ఆలోపే మన యంత్రం ప్రొడక్షన్ ప్రారంభించాలి" అని అభిమానంగా బోస్ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఓ ప్రక్క ఆ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు. గుప్తా పర్చేజ్ ఆఫీసర్ ఆర్డరుకి సమాధానం తయారు చేయిస్తున్నాడు.
స్టాఫ్ అంతా బాస్ ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతారా అని ఆలోచిస్తున్నారు. వారికీ ఓ ప్రక్క దిగులుగానే వుంది. కన్నతల్లిలా అన్నం పెట్టే కంపెనీ హఠాత్తుగా మూగవోతే తమ బతుకులు బజారు పాలవుతాయి.
కాని వారికో నమ్మకం కూడా వుంది.
ఎలాంటి సమస్యనైనా త్రినాధ్ అవలీలగా అధిగమించగలడని.
* * * *
ప్రాతఃకాలం...
మంచు తెరలింకా విడివడలేదు-
ఆమె కళ్ళు నిద్రమత్తును ఇంకా వదిలించుకోనట్టుగా వున్నాయి.
అతని కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయ్.
ఇద్దరూ మౌనంగా వున్నారు-
అతను రాగానే జరిగిందంతా వివరించి చెప్పాడు.
ఆమె మౌనంగా విందేకాని- ఇంకా సమాధానం ఇవ్వలేదు- సలహా చెప్పలేదు.
సరిగ్గా త్రినాధ్ వచ్చిన పావుగంటకు ఆమె తలెత్తి అతనివైపు చూసింది.
"One principle for every one is Don't learn on others- use your resourcefulness and be responsible. Resourcefulness and Responsibility are part and parcel of progress and prosperity."
త్రినాధ్ ముఖం వివర్ణమయింది ఆమె మాటలకు.
Education is not for relief but for release of potential resourcefulness in men. Edu-cation is not make the people wealthy but the people productive, to make people an asset and not a liability."
ఆమె చురకలు వేస్తోందని- తన తెలివితక్కువతనాన్ని ఎత్తిచూపుతోందని గ్రహించాడు త్రినాధ్.
"నీవు నీ వ్యాపారంలో తొలిసారి దెబ్బతిన్నావ్- నేను ముందే హెచ్చరించాను. యుద్ధానికి సిద్ధం కమ్మని- సమస్యలకి తట్టుకోవాలని- కాని మొదటి దెబ్బకే కుప్పకూలిపోయావు- నాకు చాలా అవమానంగా వుంది- నా శిష్యుడు ఇంత తెలివితక్కువవాడా అని. మెదడు వుంది యోచించడానికే- మోకాళ్ళలో దాచుకునేందుకు కాదు- వెళ్ళు. సమస్యను ఎక్స్ రే కళ్ళతో విశ్లేషించు. ఆ విశ్లేషణకు కామన్ సెన్స్ జోడించు. నీ సమస్య ఈరోజే పరిష్కారమవుతుంది." అందామె మాట్లాడవల్సింది ఇంకేం లేనట్టు.
త్రినాధ్ లేచాడు.
ఆమె లోపలకు వెళ్ళబోతూ ఓ క్షణం ఆగి "ఈ సాయంత్రానికి నీవు నీ సమస్యను పరిష్కరించుకోలేకపోతే నీ అసమర్ధతను ఒప్పుకునేందుకు సిద్ధపడి నా సలహాకోరు. అప్పుడు దాన్ని నేను పరిష్కరిస్తాను. కేవలం రెండొందల రూపాయలతో నీ సమస్యను పరిష్కరించవచ్చు. వెళ్ళు- దిగులుపడడం, బెంబేలెత్తిపోవడం లాంటి నీచపు భావాల్ని, భయాల్ని నీ దరికి చేరనివ్వకు. కనీసం భవిష్యత్ లోనైనా"- అంది గంభీరంగా.
త్రినాధ్ వెంటనే టెక్నీషియన్ ని పిలిపించాడు. గుప్తాని ప్రక్కనే వుంచుకుని సమస్యను తిరిగి వివరించమన్నాడు.
కామన్ సెన్స్ లేని అతను చెప్పుకుపోతున్నాడు సమస్యను భూతద్దంలో చూపిస్తూ.
త్రినాధ్ మెదడు పాదరసం కన్నా వేగంగా ఆలోచిస్తోంది. 'కేవలం రెండొందలతో తన సమస్య ఎలా పరిష్కరించబడుతుంది...?'
"కమ్యూనిస్టు దేశాల్లో స్పేర్ పార్ట్స్ స్టాండరైజ్డ్ చేయబడతాయి" టెక్నీషియన్ విచారంగా చెప్పాడు.
అది వింటూనే త్రినాధ్ కుర్చీలో ఓసారి సర్దుకు కూర్చున్నాడు. "ఆ దేశాల్లో అనేమిటి- యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ దేశాల్లో సయితం స్టాండరైజ్డ్ చేయబడతాయి-" గుప్తా మాటలు పూర్తవుతుండగానే త్రినాధ్ టేబిల్ పైకి వంగాడు.
"అంటే... వివిధ రకాల యంత్రాల స్పేర్స్ ఇంటర్ ఛేంజబుల్ అనేగా-?" త్రినాధ్ ప్రశ్నించాడు ఒకింత హుషారుగా.
"అవును సార్..."
"స్టాండరైజేషన్ అంటే క్లియర్ గా చెప్పండి-" త్రినాధ్ మెదడు చురుగ్గా ఆలోచించుకుపోతోంది.
"ఉదాహరణకి సైకిల్స్ తయారుచేసే కంపెనీలు మినీ, మీడియమ్, బిగ్ సైజుల్లోనే చక్రాల రిమ్స్ ని తయారుచేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ట్యూబ్స్, టైర్స్ తయారుచేసే కంపెనీలు ఆయా సైజుల్లో ఉత్పత్తి చేస్తుంటాయ్. అప్పుడు ఏ రబ్బర్ ఫ్యాక్టరీ తయారుచేసిన ట్యూబ్ అయినా, టైర్ అయినా మరే సైకిల్ కంపెనీ తయారుచేసే సైకిల్ చక్రానికైనా సరిపడతాయి. అలాగే కార్ల కంపెనీలు- వాటి స్పేర్స్ తయారుచేసే కంపెనీలు. అలాగే కారుకి ట్రాక్టర్ ఇంజన్ తగిలించవచ్చు- ట్రాక్టర్ ఇంజన్ లాంచీకి తగిలించవచ్చు- పెద్ద యంత్రాల తయారీలో స్పేర్స్ ఉపయోగించవలసిన ప్రదేశాల్లో నిర్దుష్ట ప్రమాణాల్ని, సైజుల్లో స్థిరీకరిస్తారు. దాని మూలంగా వినియోగదారులకి ఫలానా కంపెనీ స్పేర్సే కావాలన్న ఇబ్బందిని తొలగించుకోవచ్చు-" టెక్నీషియన్ మాటలకు త్రినాధ్ మధ్యలోనే అడ్డొచ్చాడు.
"అంటే- యమహా మోటార్ సైకిల్ కి వాడే స్పార్క్ ప్లగ్ హోండా, కవాసాకి, సుజుకీలకు కూడా సరిపోతుందా?"
"తప్పకుండా సరిపోతుంది సార్-"
కేవలం కామన్ సెన్స్ తో త్రినాధ్ తన సమస్య పరిష్కారానికి దగ్గరగా రాబోతున్నట్టు అక్కడున్న ఎవరూ వూహించలేకపోతున్నారు.
"అలాగే హోండా కవాసాకి పనికొస్తుంది కదా-"
"యస్ సార్."
"బజాజ్ కంపెనీ రేపేదన్నా వేరే యంత్రాన్ని ఉత్పత్తి చేస్తే వేరే సైజులో వుండే చెయిన్ ని ఉత్పత్తి చేస్తుందా?"
"చేయదు సార్."
"ఏం, ఎందుకని?"
"ఆల్ రడీ తాము ఉత్పత్తి చేస్తున్న చెయిన్ కి ఒక యూనిట్ ని సెటప్ చేసుకొని వుంటారు. చెయిన్ సైజ్ మారకుండా వుంటే అదే యూనిట్ ని ఉపయోగించుకోవచ్చు. దాని మూలంగా చాలా ఖర్చులు, పెట్టుబడి కల్సి వస్తుంది. లేదంటే మిల్లీమీటర్ ప్రమాణం పెరిగినా మరో యూనిట్ నెలకొల్పవలసి వస్తుంది. దానికి పెట్టుబడి కొత్తగా పెట్టవలసి వుంటుంది. కొత్త స్టాఫ్ ని నియమించుకోవలసి వస్తుంది."
త్రినాధ్ చటుక్కున సీట్లోంచి లేచాడు.
"జెకోస్లవేకియా ప్రోడక్ట్స్ ఇంకేం వున్నాయి ఇండియాలో-?" త్రినాధ్ ముఖంలో ప్రసన్నత చోటు చేసుకుంది.
"జావా మోటార్ సైకిల్ సార్..." టెక్నీషియన్ మాటలు పూర్తయ్యేలోపే త్రినాధ్ గదిలోంచి బయటకు దూసుకుపోయాడు.
అతనికి 'జావా' అన్న మాటే వినిపించింది.
* * * *
త్రినాధ్ ఎక్కిన జీప్ సరాసరి ఓ పెద్ద మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ వేపుకు దూసుకుపోయింది.
అతను ఆలోచిస్తున్నాడు.
కేవలం రెండొందలు రూపాయలు- కొద్దిపాటి కామన్సెన్స్ తన సమస్యలకు పరిష్కారం చూపించగలదన్న మాలినీదేవి మేథస్సు అమోఘం, అత్యద్భుతం! ఇప్పుడు తన మనస్సులో తిరుగాడుతున్న పరిష్కారమేనా ఆమె వూహించింది-? చూడాలి... తన ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో...
అనుక్షణం గెలుస్తూ పోవడం కన్నా... ఓడి గెలవడంలోనే గొప్ప థ్రిల్ వుంటుంది.
మెదడు సమస్యల వలయంలో, శరీరం శత్రువుల వలయంలో చిక్కుకున్నప్పుడే కదా రాటుదేలేది.
ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, జీప్ కి సడన్ బ్రేక్ వేశాడు. ఎదురుగా మోటార్ సైకిల్ రిపేర్ షాపు.
జీప్ దిగి షాపులోకి వెళ్ళాడు.
"హలో... ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి" అన్నాడు త్రినాధ్ ఓ మెకానిక్ వైపు చూస్తూ.