Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 9


    "చెప్పండి సార్" మెకానిక్ వినయంగా అడిగాడు.

    "నాకో జావా మోటార్ సైకిల్ వుంది..." త్రినాధ్ అన్నాడు షాప్ అంతా పరికించి చూస్తూ.

    "ఎనీ ప్రాబ్లమ్ సార్?..."

    "నో ప్రాబ్లమ్... చైనే తెగింది."

    తన అవసరం చాలా పెద్దది. అది బయటకు తెలిస్తే ఒక్క చైనే వేల ధరకు పెరిగిపోవచ్చు. అతని కామన్ సెన్స్ అతన్ని కంట్రోల్ చేసింది.

    "తీసుకురండి సార్ చైన్ వేద్దాం" మెకానిక్ తిరిగి అన్నాడు. "నేనుండేది చాలా దూరం. చైన్ అమ్మితే కొనుక్కొని వెళతాను. ఈ మధ్యనే జీప్ వచ్చింది నా దగ్గరకు. బైక్ అవసరం అంతగా లేదనుకో" త్రినాధ్ కి అతనితో మాట్లాడుతున్నా, ఆ చైన్ తన మెషిన్ కి సరిపోతుందా లేదా అని టెన్షన్ గా వుంది.

    "అలాగే సార్" అంటూ జావా చైన్ ఒకటి తీసి చూపించాడు మెకానిక్.

    దానివైపు పెద్ద ఇంట్రస్ట్ పెట్టి చూడకుండా "ఎంత?" అన్నాడు త్రినాధ్.

    "అరవై అయిదు సార్" అన్నాడు హేడ్ చెయిన్ అరవై ఐదా? యాభైకి ఇస్తే మూడు తీసుకుంటాను" అన్నాడు.

    కొద్దిసేపు బేరం జరిగాక మూడు చెయిన్స్ 150 ఇచ్చి తీసుకున్నాడు త్రినాధ్.


                                        *    *    *    *


    త్రినాధ్ సరాసరి ఆఫీసుకి వెళ్ళి టెక్నీషియన్ ని, గుప్తాని ఎక్కించుకుని ఫ్యాక్టరీకి వచ్చాడు.

    ఫ్యాక్టరీకి రాగానే మూడు చెయిన్స్ టెక్నీషియన్ కి అందిస్తూ "మూడింటిని కలిపి మెషిన్ కి ఫిట్ చేయండి" అన్నాడు.

    టెక్నీషియన్ అర్ధంకానట్లు చూశాడు.

    "కమాన్... డు... ఐసే..." అన్నాడు త్రినాధ్ తొందరచేస్తూ.

    ప్రొద్దుటి నుంచీ అక్కడే వున్న బోస్, హిందూ ఆశ్చర్యంగా చూస్తుండగానే టెక్నీషియన్ పని ప్రారంభించాడు. సరిగ్గా అరగంటకు మూడు చెయిన్స్ ని వీల్స్ మీద ఎడ్జస్ట్ చేసి లింక్ క్లోజ్ చేస్తూ ఒక్కసారి ఆనందోద్రేకంతో "సక్సెస్" అంటూ అరిచేశాడు టెక్నీషియన్.

    త్రినాధ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి.

    అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తుండగా బోస్ వెళ్ళి మెషిన్ ఆన్ చేశాడు.

    అంతే! అందరూ ఒక్కసారి ఆనందంతో త్రినాధ్ ని చుట్టుముట్టారు.


                  *    *    *    *


    "హలో బి.ఎం..." త్రినాధ్ ఫోన్ లో ప్రియాంకను పలకరించాడు.

    "ఐయామ్ సేఫ్... మరి..."

    "నో మరి- నేను నీ దయవలన మరింత సేఫ్-"

    "వ్వాట్?" ప్రియాంక ఆవైపునుంచి ఆశ్చర్యపోతూ అంది.

    "ఎస్... నా మెషిన్ చెయిన్ ని తెగగొట్టించి నా మెదడుకు పదును పెట్టావు. నా ప్రోడక్ట్ కి మరింత ఆర్డర్ ప్లేస్ చేయించావ్... ఎలాగైనా నీకు నామీద కోపం కన్నా ప్రేమే ఎక్కువనుకుంటాను. ఎంతైనా మేనమామ కూతురివి గదా? ఆ మాత్రం మేనబావ మీద ప్రేమ లేకుండా వుంటుందా?"

    "స్టాపిట్ ఐసే... నీకు లక్షసార్లు చెప్పాను. వరసలు కలపొద్దని." ప్రియాంక ఓ ప్రక్క కోప్పడుతూనే మరోప్రక్క త్రినాధ్ అంత హుషారుగా ఎలా వుండగలుగుతున్నాడా అని ఆలోచిస్తోంది.

    "వరసలు నేను కావాలని కలిపేవి కావు. నిజంగానే నీ బాబు నాకు మేనమామ- అంటే కంసుడు అన్నమాట."

    త్రినాధ్ తిరిగి అదే వరసను వత్తిపలికేసరికి ప్రియాంకకు ఒకింత అనుమానం కలిగింది.

    "నీ బాబుకో చెల్లెలుంది. ఆమె పేరు వసుంధరాదేవి. ఆవిడకో కొడుకున్నాడు. అతని పేరు త్రినాధ్. అతనికో మేనకోడలుంది. ఆమె పేరు ప్రియాంక. ఆమెకో బావున్నాడు- అతని పేరు..."

    "త్రినాధ్..." ఆమె అనాలోచితంగా అరిచింది- అతని మాటల పవాహాన్ని వారించటానికి.

    "అరే... భలే కనిపెట్టావే...? అతని పేరు త్రినాధే. శభాష్ మామకూతురా... నీకు మరో విషయం చెబుతాను విను. నా మెషిన్ సెట్ అయింది. నీవు ఇంక్రీట్ చేయించిన కోటాను మీటయ్యే ప్రయత్నంలోనే ఇప్పుడు నా మెషిన్, నా మనుష్యులు కృషి చేస్తున్నారు. లేదంటే ఎంతో కష్టపడి, వాడికెంతో మేపి నువ్వు నాకుచేసిన మేలు నిష్ప్రయోజనం కదూ?"

    ప్రియాంక షాక్ అయింది త్రినాధ్ చెప్పింది విని.

    "ఇకపోతే నా తల్లి- వసుంధరాదేవి నీ బాబు మీద సమరశంఖం పూరించింది. నన్ను విలుకాడిని చేసి తను సారధి అయి నీ బాబు కోటవైపుకే రథాన్ని మళ్ళించింది. సిద్ధంగా వుండమను యుద్ధానికి నీ బాబును. బైదిబై వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనం ప్రేమించుకుంటున్నాం. గొప్ప థ్రిల్లింగ్ గా లేదూ...? వుంటాను మరి... మూడురెట్లు పెరిగిన ఆర్డర్ ని మీటయ్యే ప్రయత్నంలోకి వెళుతున్నాను. బై..." ఫోన్ పెట్టేశాడు త్రినాధ్.


                                       *    *    *    *


    ఆఫీస్ స్టాఫ్ కు తమ బాసంటే మరింత భయభక్తులు పెరిగిపోయాయి. వారికి త్రినాధ్ ని చూస్తుంటే ఓ అద్భుతమైన వ్యక్తిని చూస్తున్న ఉద్వేగం కలుగుతోంది.

    టెక్నీషియన్ కి, గుప్తాకయితే మతులే పోయాయి. తామెంతసేపు చెయిన్ ఎలా తెప్పించాలనే ఆలోచించారు కాని- ప్రత్యామ్నాయం ఏమిటని యోచించలేక పోయారు. కొన్ని సమస్యలకి సాంకేతిక పరిజ్ఞానం సమాధానం చెబితే, మరికొన్నింటికి సమయస్పూర్తి, తెలివితేటలు, హేతువాదం, వివేకం సమాధానం చెబుతాయి.

    కొన్ని లక్షలు ఉచితంగా ఇచ్చినా పొందలేని ఆరాధనా భావాన్ని, గౌరవాభిమానాలను, భయభక్తులకు త్రినాధ్ కేవలం తన కామన్ సెన్స్ తో పొందగలిగాడు తన అనుచరుల్లో, సిబ్బందిలో.


                  *    *    *    *


    "శభాష్ త్రినాధ్... మెదడు మోకాళ్ళలోకాదు, తలలోనే వుందని నిరూపించావ్. నేను రెండొందలకి పరిష్కారం దొరుకుతుందంటే, నీవు నూటయాభైకే పరిష్కారాన్ని కొనేశావ్... ఇంక నీకు తిరుగులేదు. ఏదైనా ఎలాగైనా సాధించగలవు అనే నమ్మకం నాకు కుదిరింది. ఇప్పుడు ఇక నేను గురుదక్షిత అడగవచ్చని భావిస్తున్నాను" మాలినీదేవి ఆనందంతో కళ్ళు మెరుస్తుండగా అంది.

    త్రినాధ్ వినయంగా, భక్తి ప్రపత్తులతో తలను ఒకింత వంచాడు.

    "నాకిప్పుడు ఓ వ్యక్తి వినాశనం కావాలి... ఆమె కళ్ళలో అంతలోనే ఎరుపు జీర.

    త్రినాధ్ ఆశ్చర్యంగా చూశాడామెవైపు.

    "ఎవరు-? ఎవరు నాశనం కావాలి..? నా ప్రాణాలు ఒడ్డయినా ఆ పని సాధించి మీకానందం కలిగిస్తాను. చెప్పండి... ఎవరతను..." ఆవేశంగా అన్నాడు త్రినాధ్.

    మాలిని ఒకింత మౌనం తర్వాత మంద్ర స్వరాన అంది.

    "సుదర్శన్ రావ్..." 

    త్రినాధ్ ఉలిక్కిపడ్డాడో క్షణం.

    కాని ఆమెలో ఏ మార్పు లేదు.

    "త్రినాధ్... మీ అమ్మ శత్రువు అతనే- నా శత్రువు అతనే."

    "మేనమామ అనే సెంటిమెంట్ ని ఆశ్రయించవని ఆశిస్తున్నాను. నాకతని పతనం గొప్ప సంతృప్తిని కలిగిస్తుంది.

    ఆమె ఓ ఎబ్ స్ట్రాక్ట్...

    ఎవరికీ అర్ధం కాదు- అర్ధమయినట్లే వుంటూ అర్ధం కాకుండా మిగిలిపోతుంది.

    త్రినాధ్ లేచాడు.

    ఆమెవైపు చూశాడు.

    ఆమె చూపులు లేసర్ కిరణాల్లా సూటిగా, తీక్షణంగా వున్నాయి.

    అతనిలో పెల్లుబికిన కృతజ్ఞతాభావం అతని కంటిలోని ఎరుపు జీరగా మారింది. ఆవేశంతో వూగిపోతున్నాడు. తన గమ్యం ఏమిటో- లక్ష్యం ఏమిటో అర్ధమయిపోయాయి. జన్మనిచ్చిన తల్లిని, బ్రతకడం నేర్పిన భగవత్ స్వరూపాన్ని సంతృప్తి పరచడం కన్నా తనక్కావలసిందేముంది?

    "గురువాజ్ఞ... దానికి తిరుగులేదు... అతని సర్వనాశనం నా చేతిలో రాసి వుంది. ఈ రోజు నుంచే అతన్ని ఒక్కొక్క మెట్లు క్రిందకు దింపుతాను. హరిహరాదులు అడ్డొచ్చినా ఎదురొడ్డి మీ గురుదక్షిణ చెల్లించుకుంటాను. నాకు సెలవు..." అంటూ గిరుక్కున వెనుదిరిగాడు.

    వేగంగా బయటకు దూసుకుపోతున్న త్రినాధ్ వైపు చూస్తూ నిట్టూర్చిందామె.


                                        *    *    *    *


    హాలంతా నిశ్శబ్దంగా వుంది.

    ఇప్పుడా హాల్లో ఓ పక్క సుదర్శన్ రావు యోగేష్ లు, మరో పక్క ప్రియాంక, ఆమె తల్లి నించున్నారు.

    అందరి ముఖాలు సీరియస్ గా వున్నాయ్.

    "ఏం డాడీ చెప్పరేం... త్రినాధ్ చెప్పింది నిజమేనా? వసుంధరాదేవి నీకు చెల్లెలేనా...?" ప్రియాంక గొంతులో సీరియస్ నెస్ తొంగిచూసింది.

    సుదర్శన్ రావు వెంటనే బదులేం ఇవ్వలేదు. మౌనంగా పచార్లు చేస్తున్నాడు.

    "అదే నిజం కాకపోతే మీరింతసేపు వూరుకోరు. త్రినాధ్ చెప్పింది నిజమేననిపిస్తోంది. ఇకపోతే మీరెందుకు విడిపోయారు...? అంటే మనం ఎందుకు విడిపోయాం? మనమీ స్థితిలో ఎలా వున్నాం? వాళ్ళా స్థితికెలా దిగజారారు?" ప్రియాంక తిరిగి నిలదీసింది తండ్రిని.

    తల్లి ఆమె వైపు విస్తుపోయి చూస్తోంది.

    ప్రియాంక తన కూతురేనా?

    ఎప్పుడూ... ఏ రీజన్ ఆలోచించని తన కూతురేనా? ఎలాంటి వారినైనా గడ్డిపోచకింద తృణీకరించే తన చిట్టితల్లేనా?

    ఆవేశమే తప్ప... ఆలోచనలేని తన చిన్నారితల్లేనా?

    ఆమెకు తన కూతుర్ని చూస్తుంటే ఓ అత్యద్భుతాన్ని చూస్తున్న భావన కలుగుతోంది.

    అప్పటికే సుదర్శన్ రావు కళ్ళు నెత్తురు చిమ్ముతున్నట్టుగా మారిపోయాయి.

    "మన స్థితికి నా పట్టుదల, శ్రమ కారణమైతే..." తండ్రి మాటల్ని మధ్యలోనే ఖండించింది ప్రియాంక.

    "మన స్థితికి కారణాల్ని తరువాత సమీక్షించుకుందాం. వారి స్థితికి కారణం...?"

    ఇదివరకటి ఆమె ఎదిరింపులో ఆవేశం, ఉక్రోషం, ఉద్వేగం కనిపించేవి. ఇప్పటి ఈ ఎదిరింపులో, తిరుగుబాటులో ఒకింత వివేకం, ఆసక్తి జిజ్ఞాస కనిపిస్తున్నాయ్.

    చిత్రమైన మార్పు- 

    "వారి స్థితి అప్పుడూ ఇప్పుడూ అదే అయినప్పుడు కారణాలతో పనేముంది?" సుదర్శన్ రావు కోపంగా అన్నాడు.

    నిజానికి అలా మరెవరన్నా తనని నిలదీసి వుంటే అంతసేపు బ్రతకనిచ్చేవాడు కాదు.

    ఆ... నిలదీస్తున్నది ప్రాణ సమానమైన తన కూతురు.

    తన అడుగుజాడల్లోనే నడుస్తూ, తనని అనుసరిస్తూ తనంత స్థాయికి తన కూతురు ఎదగాలని, తన భాగ్యవంతమైన ప్రపంచానికి సామ్రాజ్ఞి కావాలని ఎన్నో కలలు కన్నాడు తను. అలా కావాలంటే తన కూతురిలో రీజనింగ్ పవర్ పెరగకూడదు. దయాదాక్షిణ్యాలు మొలకెత్తకూడదు. కాని ఇప్పుడు జరగబోతున్నది...? ఊహూ... లాభం లేదు.

    "వారి స్థితికి మీరే మాత్రం కారణం కానప్పుడు త్రినాధ్ తల్లి మీ మీద పగ పట్టడానికి కారణం?" క్షణక్షణానికి కూతురులో పెరుగుతున్న ఆసక్తి గమనించి సుదర్శన్ రావు ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు.

 Previous Page Next Page