"మీరెక్కువ ఆర్డర్ ఇవ్వాలి..." ప్రియాంక పొడిగా అంది.
అతని కర్ధం కాలేదు- అయోమయంగా చూశాడు.
"హెచ్.బి.ల్యూబ్ ఆయిల్ కొనే విషయంలో మీరు పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి... అంటే మీ పర్చేజింగ్ ఆర్డర్ పెంచాలి."
ఆమె అంతరంగంలో రూపుదిద్దుకున్న ప్రమాదకర పథకం ఏమిటో అర్ధం చేసుకోలేక మరింత సతమతమయ్యాడతను.
ప్రియాంక అలవోకగా చూస్తూ నవ్వింది.
సుదర్శన్ రావు, యోగేష్ మౌనంగా వున్నారు. ప్రియాంకకు వారు మద్దతు తెలుపుతున్నట్లుగా అర్ధంచేసుకుని ఆశ్చర్యపోయాడతను.
"అర్ధంగాలేదు మేడమ్..."
"మీకు పెట్టిన గడువులోపు అతను అందిస్తానన్నంత ప్రొడక్షన్ అందించలేకపోతే, మీకు అతనిపై చర్య తీసుకునే వీలుందా?"
అతను ఉలిక్కిపడ్డాడు- ఆమె ఆవేపు నుంచి వస్తోంది...!
"వుంటుంది. కనుక మీరు ఇప్పుడు కొంటున్న క్వాంటిటీని డబుల్, త్రిబుల్ చేయాలి."
"రిస్కే అయినా చేస్తాను. అలా చేసినా అతనికేకదా లాభం?"
"సప్లై చేస్తే కదా లాభం?" ప్రియాంక చిరునవ్వుతో అంది.
పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడతను.
"శెభాష్... బేబీ... అలాగే నరుక్కురా. బేబీ చెప్పినట్లు చేయి... అర్ధమయిందా?" సుదర్శన్ రావు గంభీరంగా అంటూ లేచాడు.
* * * *
త్రినాధ్ జీప్ ల్యూబ్ ఫ్యాక్టరీకి బయలుదేరింది.
ఆ జీప్ లో హిందూ, బోస్ మాత్రమే ఎక్కారు.
సరిగ్గా ఆరుగంటలకు ల్యూబ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆగింది జీప్. అప్పటివరకు దిగులుగా కూర్చున్న వర్కర్స్ జీప్ శబ్దం వింటూనే షాక్ అయ్యారు. అంటే, బాస్ వచ్చేసారు... అప్పుడప్పుడు త్రినాధ్ అలా హఠాత్తుగా చెకింగ్ కి రావడం గతంలో చాలాసార్లు జరిగింది. త్రినాధ్ జీప్ ఆపుచేసి క్రిందకు దిగుతూనే ఒకింత ఆశ్చర్యపోయాడు. అందుకు కారణం మెషిన్ శబ్దం వినిపించకపోవడం. అప్పటికే వేగంగా షెడ్ లోకి వెళ్ళిన బోస్ అక్కడి వాతావరణాన్ని చూసి ఉగ్రుడయ్యాడు.
"పనులు మానేసి ఇంత తాపీగా కూర్చున్నారేం?"
ఒక్కరూ మాట్లాడలేదు, అంతటా నిశ్శబ్దం. అందరూ తలలు వంచుకుని వున్నారు.
"ఏమిటి చెప్పండి? ఏం జరిగింది?" బోస్ తిరిగి రంకె వేశాడు.
ఒక వర్కర్ ధైర్యంగా ముందుకు వచ్చి "మెషిన్ చెయిన్ తెగిపోయింది వున్నట్టుండి. లంచ్ బ్రేక్ వరకు బాగానే నడిచింది. లంచ్ నుంచి వచ్చి మెషిన్ ఆన్ చేస్తే వీల్స్ తిరుగుతున్నాయేగాని ప్రొసెసింగ్ యూనిట్ స్టార్ట్ అవ్వలేదు. తీరా చూస్తే చెయిన్ తెగిపడుంది. అందుకే మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం."
ఆ మాటలు అప్పుడే ఎంటర్ అయిన త్రినాధ్ కి వినిపించాయి. ఓ క్షణం అతని ముఖం వివర్ణమయింది. త్రినాధ్ టెక్నీషియన్ ని పిలుస్తూనే, మెషిన్ దగ్గరకు వెళ్ళి చెయిన్ తెగిపడిపోయిన చోటును వెతుకుతున్నాడు. టెక్నీషియన్ వచ్చాడు. అతని ముఖమూ పాలిపోయి వుంది.
"ఏమిటి ఇప్పుడు చేయవలసింది... రిపేరు చేస్తే సరిపోతుందిగా?" త్రినాధ్ ఏ భావమూ వ్యక్తపరచకుండా అడిగాడు.
"సారీ సార్... ఈ మెషిన్ కి రిపేరు ఏం చేయక్కర్లేదు. ఒక పార్ట్ వేయాలి. అంతే..." అన్నాడు టెక్నీషియన్.
"వేస్తే పోలే..."
త్రినాధ్ కి బాధగా వుంది. నిజానికి ఆరోజు నుంచే ప్రొడక్షన్ బాగా పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు- ఇంతలో ఈ అవాంతరం.
"ఆ పార్టు ఇండియాలో దొరకదు. ఇండియన్ మేడ్ చెయిన్స్ దీనికి సరిపడవు."
త్రినాధ్ ఓ క్షణం అయోమయంగా చూసాడు టెక్నీషియన్ వేపు.
"అవును సార్... కమ్యూనిస్టు కంట్రీస్ స్పేర్స్ స్టాండ్ రైజ్డ్ చేయ బడతాయి కనుక తప్పనిసరిగా మనం దీని చెయిన్ ని జెకోస్లవేకియా నుంచి తెప్పించు కోవలసిందే... అందుకు కనీసం ఆరునెలలు పట్టవచ్చు..."
అప్పుడు షాక్ అయ్యాడు త్రినాధ్.
దూరంగా వున్న వర్కర్స్ కి, బోస, హిందూలకి వారి సంభాషణ వినిపించడం లేదు.
త్రినాధ్ ఓ ప్రక్క టెక్నీషియన్ తో మాట్లాడుతూనే తెగిపడిన చెయిన్ వేపే చూస్తున్నాడు.
అతనికి తెలుసు- చెయిన్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అన్నది జాప్యంతో కూడుకున్నదని. వచ్చిన సమస్య చిన్న చెయిన్ మూలంగానే- కాని దానిమూలంగా జరగబోయే నష్టం మాత్రం సివియర్ గా వుంటుంది.
వెంటనే చేయగలిగింది ఏమీలేక మెషిన్ బాగయ్యే వరకు వర్కర్స్ ఫ్యాక్టరీకి రానక్కర్లేదని, ఆ రోజులకు సగం జీతం ఇవ్వబడుతుందని అప్పటికప్పుడు అక్కడే ఆర్డర్స్ పాస్ చేసి త్రినాధ్ ఆఫీసుకి బయలుదేరాడు. ఫ్యాక్టరీ లాకౌట్ విషపు కోరల్లో ఇరుక్కుపోయింది చూస్తుండగానే.
ఇక అక్కడ మిగిలింది టెక్నీషియన్, బోస, హిందూలు మాత్రమే. హిందూకయితే దాదాపు ఏడుపు వచ్చినంత పనయింది.... రోజుకు కొన్ని వేలు లాభం తెచ్చి పెడుతూ దాదాపు నలభైమంది వర్కర్స్ కి బ్రతుకు తెరువు చూపిస్తున్న కన్నతల్లిలాంటి యంత్రం మూగపోయింది. అనుక్షణం ఆ యంత్రం చేసే చప్పుడు... టిన్స్ చప్పుడు... వర్కర్స్ కోలాహలంతో సందడిగా సంపదకు ప్రతీకగా వుండేది. త్రినాధ్ పట్టుదల, దీక్షలకు ఓ మైలురాయిలా, జరిగిన అవమానానికి సమాధానం చెప్పి తీరుతాను అన్న భావాన్ని కలిగిస్తూ రిథమిక్ గా వచ్చే అమూల్య యంత్ర శబ్దం ఏదిప్పుడు? నిశ్శబ్దం... స్మశాన నిశ్శబ్దం. ఫ్యాక్టరీ గుండె చప్పుడు ఆగిపోయింది. ఓరి నిర్దయుడా... భగవంతుడా ఎంత పాపం మూటగట్టుకున్నావయ్యా! పచ్చగా కళకళలాడుతున్న త్రినాధ్ అభివృద్ధిని సహించలేకపోయాయా? యాభై కుటుంబాలు పిల్ల పాపలతో రెండు పూటలా కడుపునిండా తినడాన్ని సహించలేకపోయావా??
ఉన్నట్లుండి ఆమె హిస్టీరియా వచ్చినదానిలా ఊగిపోతూ అరవ సాగింది పిచ్చిగా.
అప్పటికే కృంగిపోతున్న బోస్ చప్పున తేరుకుని హిందూని అనునయించబోయాడు. కాని ఆమె కంట్రోల్ కాలేదు.
ఆమె చేతులు, కాళ్ళు ఏ గోడకు, ఏ డ్రమ్ముకు తగిలి విరిగి పోతాయోమో అన్న భయం. అప్పటికే ఆమెపై తనకు తెలియకుండానే అతను పెంచుకున్న అభిమానం, ఇష్టం కలిసి ఆమెను బలవంతాన అతని కౌగిలిలోకి తీసుకునేలా చేశాయి.
* * * *
ఆ దుర్వార్తకి రెక్కలొచ్చాయ్. ఆఫీస్ స్టాఫ్ కూడా జరిగింది తెలుసుకుని షాక్ అయ్యారు. అంతటా నైరాశ్యం అలముకుంది.
త్రినాధ్, గుప్తా ఇద్దరూ ఎదురెదురుగా వున్నారు. అయినా ఏం మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ జరగబోతున్న నష్టాన్ని మౌనంగా దిగమ్రింగుకునే ప్రయత్నంలో వున్నట్టుగా వున్నారు.
సరిగ్గా రెండు గంటల క్రితమే ల్యూబ్ కి బాగా లాభాలు వస్తున్నట్టు ప్రకటనలిచ్చి, కంపెనీ ఇమేజ్ ని పెంచుకుని, మూలధనాన్ని వాటాల రూపంలో ప్రజల నుంచి సమకూర్చుకోవాలనుకున్నారు. ఆ డబ్బుతో వేరే వ్యాపారాలలోకి దూసుకుపోవాలనుకున్నారు.
అన్నీ... కుప్పకూలిపోయాయి.
తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా తన గురువు మాలినీదేవి ప్రసంగాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు త్రినాధ్.
సరిగ్గా ఇదే సమయంలో ఆర్.టి.సి. పర్చేజ్ ఆఫీసర్ పర్చేజ్ ఆర్డర్ పెంచుతూ దానికో టైమ్ ని నిర్ణయిస్తూ, దాన్ని అతిక్రమిస్తే వసుంధరా ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ ని రద్దు చేయవలసి వస్తుందనే డ్రాఫ్ట్ ని పదునెక్కిస్తున్నాడు.
ఇక్కడ గుప్తా ఆలోచిస్తున్నాడు.
తన గత అనుభవాన్ని, పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నించినా ఆ చెయిన్ తెప్పించడానికి కనీసం మూడు నెలలు తేలికగా పడుతుంది. అప్పటివరకూ...?
సరిగ్గా అప్పుడు మ్రోగింది ఫోన్.
త్రినాధ్ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
"నీకు లక్షలకు లక్షలు ఆర్జించి పెట్టే రిక్లమేషన్ మెషిన్ చెయిన్ తెగిందట. ఐయామ్ వెరీ సారీ..."
అంత త్వరగా ఆమెకా సమాచారం ఎలా చేరివుంటుంది?
త్రినాధ్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడు ఫోన్ లో ఆమె మాటలు వింటూనే. "ఎట్ లీస్ట్ మూడు నెలలన్నా పడుతుంది తిరిగి ఆ దేశం నుంచి చెయిన్ తెప్పించుకునేందుకు. ఇప్పుడు ఈ క్రైసస్ నుంచి బయటపడి ముందుకు వెళ్ళగలిగితే మన ఛాలెంజ్ రక్తికడుతుంది" ఆమె నవ్వింది. నవ్వుతూనే వుంది తెరలు తెరలుగా!
త్రినాధ్ టక్కున ఫోన్ కట్ చేసి లేచాడు.
మరో అరగంటకి ఫ్యాక్టరీకి చేరుకున్నాడు.
అప్పటికప్పుడు ఐదారుగురు వర్కర్స్ ని పిలిపించాడు.
"బాగా గుర్తుతెచ్చుకుని చెప్పండి. ఆ రోజు లంచ్ టైమ్ లో బయట వ్యక్తులెవరన్నా మన ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యారా? నాకిది లక్షల్లో నష్టం కలిగించే సమస్య అయితే, మీకు బతుకుతెరువుకు సంబంధించిన సమస్య. కమాన్ టెల్ మీ... నిజాయితీగా, నిర్భయంగా చెప్పండి..." త్రినాధ్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్లున్నాయ్.
ఫోన్ రావడం, త్రినాధ్ ఆ వెంటనే ఫ్యాక్టరీకి రావడం, వర్కర్స్ ని పిలిపించి క్రాస్ చేయడం అంతా చూస్తుంటే గుప్తా, ఇంజనీర్, హిందూ, బోస్ లకు అనుమానం వచ్చింది. అంటే... త్రినాధ్ అది ఎవరో కావాలని చేసిన దుశ్చర్యగా భావిస్తున్నాడా? సాధారణంగా త్రినాధ్ తొందరపడి ఒక నిర్ణయానికి రాడు. ఒకర్ని అనుమానించడు. మరి...?
బోస్ రక్తం సలసలా మరగడం ప్రారంభమైంది.
వర్కర్స్ కి తమ బాస్ త్రినాధ్ ఆందోళనగా కనిపించడం అదే మొదటిసారి. ప్రశాంతమైన వదనంతో, పట్టుదలను సూచించే లోతైన చూపులతో, ఎప్పుడూ అభిమానంగా పలకరించే తమ బాస్ ఇప్పుడు క్రైసస్ లో పడ్డారు. లక్షల నష్టం అతని సుఖసంతోషాల్ని హరించబోతుంది.
ఆ భావం వారి గుండెల్ని పిండిచేసింది.
ఏది చేసినా, ఆయన్నా స్థితి నుంచి ఒడ్డుకు లాగగలిగే అవకాశం వస్తే బాగుండుననుకుంటున్నారు వారి మనస్సుల్లో.
వాళ్ళు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
త్రినాధ్ మెషిన్ వైపు నడిచాడు.
బాధకు ప్రతిరూపమైన నేనే నీ బాధను భరించలేక వెళ్ళిపోతున్నాను మిత్రమా! ఇన్నాళ్ళు నా అవసరం నీకు రాలేదు. నా అవసరం రాని కఠిన హృదయులు కూడా వున్నారా అని శపించిన నేను... ఈ అసూయా ద్వేషాల కుళ్ళు ప్రపంచంపై నిరసన వ్యక్తం చేస్తూ, నిర్వేదం చిందిస్తూ, నీ బాధ కొంతయినా తగ్గిద్దామని నిస్తేజంగా వెళ్ళిపోతున్నాను అన్నట్టు ఓ కన్నీటిచుక్క త్రినాధ్ కనుకొలకుల నుంచి నిశ్శబ్దంగా రాలి యంత్రం పైన పడింది.
నిజానికి ఆ యంత్రం ప్రాణంలేని వస్తువని త్రినాధ్ ఏనాడు భావించలేదు. ప్రాణం వుండి, ఇంగితజ్ఞానం వున్న లక్షలాదిమంది సోమరులుగా బ్రతుకుతుంటే, వారిని చూసి అనుకున్నాడు- నిజానికి వాళ్ళే ప్రాణం లేని వాళ్ళని.
అప్పుడప్పుడు ఆ యంత్రాన్ని ఆప్యాయంగా సృజించేవాడు, కృతజ్ఞతగా చూసేవాడు, ఆ యంత్రానికి చిన్నదెబ్బ తగలడాన్ని కూడా పెద్ద నేరంగా భావించేవాడు. అంతటి అనుబంధాన్ని దానితో ముడివేసుకున్న త్రినాధ్, అది మూగబోతే ఎలా భరింపగలడు?
ఉన్నట్టుండి అతని కనుబొమలు ముడిపడ్డాయి.