Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 7

    పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అంతవరకు సరే. మాతృత్వం స్త్రీకి వరం అన్నారు కదా! పిల్లనో పిల్లాడినో కనంగానే ఆమెని దేవతగా పూజిస్తున్నారా! అలాంటి దాఖలాలు ఎక్కడాలేవు. మచ్చుకి ఒక్కటంటే ఒక్కటి చూపించండి. అప్పుడు ఒప్పుకుంటాను మాతృత్వం స్త్రీకి వరమో శాపమో!
   
    లీడర్ లీలారాణి మాటలు పూర్తికాకముందే సంతానలక్ష్మి తెగ బారెడు నిట్టూర్పు విడిచి "అంతెందుకు ఉదాహరణకి నిన్నే తీసుకోండి. నాకు ఎనిమిది సంతానం. ఉప్పు బస్తాలను మోసినట్లు తొమ్మిది నెలలు మోసి నాలుగేసి రోజులు నెప్పులుతీసి ఎనిమిదిమంది బిడ్డలను కన్నాను. నాకేమన్నా ఊరా పేరా! తక్కువ కాలంలో ఎక్కువమందిని కన్నం దుకు ఏదైనా ఒక చిన్న అవార్డ్ నా ముఖాన పారేయవచ్చు కదా! బుల్లి బహుమానం యివ్వొచ్చు కదా!
   
    సంతానలక్ష్మి సాంతం మాట్లాడకముందే సూరంపూడి సూర్యకాంతాదేవి కయ్యి కయ్యిన అరిచింది. "ఈ ప్రభుత్వమా మనకి అవార్డులు రివార్డులు యిచ్చేది! వీళ్ళకి చాతనయింది ఒకటే పదవిలో వున్న రాజకీయ నాయకుడు మరణిస్తే ఓట్లు దండుకోటానికి, పార్టీబలం పెంచుకోటానికి ఓ అంటెనా రాని అతగాడి భార్యకి పార్టీ టికెట్ యిచ్చి ఓట్లు ప్రజల నుంచి పిండుకుని ఆమెని గెలిపించి పదవి కట్టబెట్టి ... అంత వరకు వచ్చు. అంతవరకు పిడకలు చేయటం తప్ప మరో లోకం తెలీని ఆమెకి తెలిసింది ఆ ఒక్కటే కాబట్టి ప్రజల్ని పేడలా పిసికి పిడకలుగా చేసి గోడకేసి కొట్టడం...
   
    "ఆపు...." ఇంకా ఆపు. మన ఆడవాళ్ళని మనమే హేళన చేయరాదని మన "నిబంధవళి" లొ ఒక నిబంధనం కదా అటు భర్త లేక ఇటు అయిదోతనము లేక అలమటిస్తున్న ఆ అతివకి అధికారం ఓ వరం కదా! లాయర్ కాబోయి కాలేని లాయర్ సుహాసిని లా పాయింట్ లాగుతూ అంది.
   
    చాలా సేపటి వరకు ఆవేశాన్ని ఆపుకుంటూవున్న అరుణేందిర ఆవేశంతో రొప్పుతూ "ఈ ప్రభుత్వానికి నా రెడ్ శాల్యూట్" అంది పిడికిలి బిగించిన చేతిని పైకెత్తి.
   
    "సైలెన్స్!" లీడర్ లీలారాణి అరిచింది.
   
    అందరూ నిశ్శబ్దం అయిపోయారు. [ఏ శబ్దాలు వినరాకపోతే మిగిలేది నిశ్శబ్దమే మరి...!]
   
    అందరూ ఒక్కసారిగా గడగడ లొడలొడ వాగుతుంటే వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నారని సంతోషపడుతున్న నారదుల వారికి లీడర్ లీలారాణి "సైలెన్స్" అనంగానే అందరూ నోరు మూసుకోటం మహా ఆశ్చర్యం వేసింది. ఆడవాళ్ళలో ఇంత ఐకమత్యం కలియుగ మహిమా? లేక ఇది కూడా కలియుగం అంతం కావటానికా?
   
    ముక్కుమీద వేసు వేసుకోబోయిన నారద మునీంద్రుల వారికి వేలు ముక్కు మీదకి పోక అలవాటు ప్రకారం తుంబర మీదకి పోయి తీగలని "టింగ్ టింగ్" మనేటట్లు చేసింది.
   
    లీడర్ లీలారాణి మళ్ళీ చెప్పసాగింది.
   
    "సంతానవతి కాకపోయినా స్త్రీల తప్పే. అధిక సంతాన వకులు అయినా స్త్రీల తప్పే. మాతృత్వం వరమో శాపమో అర్ధం కావటంలేదు స్వామీ! అదలా వుంచండి. ఒక పశువులాంటి పురుషుడు ఒక కన్యని...ముక్కుపచ్చలారని పసిదాన్ని రేప్చేస్తే ఆ అమ్మాయి గర్భవతి అయితే అది ఎవరి తప్పు? అమ్మాయిదా! అతనిదా!
   
    ఎవరినడిగినా చెపుతారు. అతనిదే అప్పని. కాని శిక్ష మటుకు వేయరు. ఎవరూ వేయకుండానే శిక్ష అమ్మాయికి పడుతుంది. మాతృత్వంవరం ఎలా అవుతుంది? స్త్రీకి మాతృత్వం వరం కాదు శాపం చేయని నేరానికి చెప్పరానంత ఘోరమైన శిక్ష. నేరస్తుడు అతను. నిర్దోషి ఆ అమ్మాయి. నేరం చేయకుండా బలికావటం అన్నది ప్రకృతి శాపం కాదు ఆమె చేసిన పాపం కాదు. ఈ సృష్టిచేసిన బ్రహ్మదా నేరం...
   
    లీడర్ లీలారాణి వాక్ ప్రవాహం అలా సాగిపోతున్నది. నారద మునీంద్రుల వారికి అప్పటికే బుర్ర తిరిగిపోయి నారాయణ నారాయణ అనుకోవటం మరిచిపోయారు. రామ కృష్ణా అన్న నామాలుకూడా గుర్తు రాలేదు.
   
    "...మా కష్టం వినిపించాముకద స్వామీ! కనక నే చెప్పేది ఏమిటంటే మా స్త్రీలందరి కోరికలు ఏమిటంటే పురుషులు కూడా పెద్ద మనుషులు కావాలి..."
   
    లీడర్ లీలారాణి ఆ మాట అంటుంటే "నే ఒక్కసారి పెదవి కదపవచ్చా తల్లీ!" అన్నట్లు సౌంజ్ఞ చేశాడు నారదుడు.
   
    "ఒక్కమాట అయినా సరే ఒక్క ప్రశ్న అయినా సరే అడగవచ్చు." గంభీర్యంగా శలవు యిచ్చింది లీడర్ లీలారాణి.
   
    "పురుషులలో కూడా చాలామంది పెద్దమనుషులే కదా తల్లీ! మరి యింకా వేరే పెద్ద మనుషులు కావటం ఏమిటీ అంటె అర్ధం పురుషులందరూ పెద్ద మనుషులు కావాలనా! అది కుదరదే! పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన అని వెనకటికొకాయన...
   
    నారదులవారి గబ గబ అడిగేస్తుంటే అతివలందరూ పడి పడి నవ్వారు.
   
    నారదుల వారి నోరు టక్కున మూతపడిపోయింది.
   
    "అదికాదు స్వామీ! పురుషులు కూడా పెద్ద మనుషులు కావాలి అంటే...అంటే....వివరంగా చెపుతాను వుండండి పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు వుండాలని...సమాన హక్కులు  కావాలని.... మేము చాలాసార్లు పోరాడాము. స్త్రీలంతా పిచ్చివాళ్ళు, అమాయకులు స్వామీ! అందుకే హక్కులంటే అలాంటివి అనుకున్నాముగాని అసలువి వేరే వున్నాయని అనుభవంమీదగాని తెలిసి రాలేదు.
   
    మాకు కావాల్సిన సమాన హక్కుల లిస్టు చదువుతాను వినండి. మాతో సమానంగా పురుషులు కూడా పెద్దమనిషి అనగా రజస్వల కావాలి.... మాకు ప్రతినెలా తప్పనిసరి తద్దినాల లాగే ప్రతినెలా వచ్చే మెన్సస్ వారికి రావాలి. మగవాడు రేప్ చేస్తే ఆడదానికి కడుపు వచ్చే విధంగా ఆడది రేప్ చేస్తే మగవాడికి కడుపు రావాలి అలాగే.
   
    ఆడదాని కడుపు ద్వారా ఆడపిల్లలే పుట్టాలి. మగవాడి కడుపు ద్వారా మగపిల్లలే పుట్టాలి రూపురేఖల్లోగాని లింగ బేధాల్లోగాని మార్పు అనేది మేము కోరటంలేదు. అదలాగే వుండనివ్వండి. మా కోరికలల్లా మాతో సమానంగా పురుషులు ముట్లు అంట్లు కావాలి. పురుళ్ళు పుణ్యాలు కడుపులు గట్ర, బిడ్డని కనటం...వీటిల్లో సమాన హక్కులు కావాలి. అప్పుడుగాని ఈ పురుషులకి మా బాధలు తెలియవు. ఇవీ మా కోరికలు స్వామీ! ఇక ఇప్పుడు చెప్పండి మా కోరికలు సమంజసం అవునో కాదో?"
   
    అవునంటే అయే పనికాదు. కాదంటే కయ్యిమనే ప్రమాదం. నారదుల వారికి పచ్చి వెలక్కాయ గోతుకి అడ్డంగా పడినట్లయింది. "తల్లులారా! మీరు కోపగించుకోనంటే కొన్ని ప్రశ్నలు వేస్తాను." అన్నాడు వినయంగా.
   
    "అడగండి స్వామీ!"
   
    "ఇది సృష్టి రహస్యం. మీ కోరికలు సమంజసమే కావచ్చు. కాని సృస్త్య్ని మార్చటం అనేది మా తండ్రిగారికి కూడా [ఆ బ్రహ్మకయినా] కుదరని పనికదా?" నారదుల వారు భయం భయంగా అడిగాడు.

 Previous Page Next Page