రెడ్డిగారి రక్తంలో నిప్పు పెట్టినట్లయింది. అయినా, అది బయట పడనివ్వకుండా "వస్తరా గడిదాక" అని సాగిపోయారు. కండవాలు బుజాన వేసుకొని బైల్దేరారు వారిద్దరూ ఆయన వెనకనే. పీరిగాని విషయం తనతో సంప్రదించడానికి రమ్మన్నాడనుకున్నాడు కరణం. తన కలవరం వారికి తెలియనీయ రాదనుకున్నారు రెడ్డిగారు. ఈ చిన్న విషయం కరణంతో సంప్రదిస్తే తాను లోకువైపోతా ననుకున్నారు. పీరిగాణ్ణి పట్టుకొని నాలుగుబాత్తే సరిపోతుందనుకున్నారు. రెడ్డిగారు గడీకిచేరి బల్లపీటమీద కూర్చునేవరకే వారూ వచ్చేశారు. ఎదుటి బల్లమీద కూర్చున్నారు. వారిని ఎందుకు పిలిచిందీ,, ఏం మాట్లాడాల్సిందీ కాలేదు రామారెడ్డిగారికి.
"మంది మితిమీరిపోత్రాను న్రీ" అన్నాడు పటేలు.
విషయం మార్చాలని తటపటాయించే రామారెడ్డిగారికి పాణి గుర్తుకు వచ్చాడు.
"కరణంగారూ! ఊళ్ళ రాములోరికి గుడి కట్టించినం. బాపన్లను తెచ్చి ఉంచినం. సర్కారుతో మదర్స (బడి) పెట్టించినం. ఒక సంగీతపాయిన్నుంచాలని శాన దినాల్నుంచి...."
"ఔ మహరాజ్! సంగీతపాయ నుండాలె, వెంకటేశ్వర్ల జాతర్ల ఏం చక్కగ పాడిండుండి" అన్నాడు నిజామొద్దీన్.
"సంగీత పాయన్నుంచటమంటే మాటలా నుండి? ఇల్లు కావాలే, సంస్కారాన్కి తగిన భూమి కావాలే, ఇన్నిచ్చేనా వచ్చి ఉండేటోడు కావాలే - పారిపోకుండ."
"అయ్యన్కి ఆలోచించిన. మొన్నొక సంగీతపాయ నొచ్చిండు. శాన మంచిగ పాడ్తడు. లగ్గం కాలేదు. ఒంటిగాడు. ఒక్కణ్ణి భరాయించలేమా?"
"ఒంటిగాడు - లగ్గం కాలేదా? అయితే, ఉంచుకోవచ్చు దొరవారు. కుంటిదానికి సంగీతం చెప్పిస్త, నారయ్యగారి బిడ్డగ్గూడ చెప్పించమంట - ఏమంటరు?"
"శాన బాగున్నదుండి. జర్ర గానా బజానా (పాట, మేళం) ఉండాలే ఊళ్ళ" అన్నాడు పటేల్ నిజామొద్దీన్.
"ఎంకటిగా! పంతుల్ను పిలువ్" - ఆదేశం.
సారంగపాణి వచ్చి ముగ్గురికీ నమస్కరించి లూర్చున్నాడు.
కరణం అతణ్ణి ఆపాదమస్తకం కొలిచాడు. నిజామొద్దీన్ తుపాకి గుండులా అనేశాడు. "ఎంకటేస్వర్ల జాతరాయనే కాడుండి!" అని.
"అవును. పేరు సారంగపాణి. శాన బాగ పాడ్తడు. సంగీత పాఠాలు చెప్పుకోటాన్కివచ్చిండు" అన్నారు రెడ్డిగారు.
"ఊరుండి?" అడిగాడు కరణం.
"బెజవాడ."
"తల్లిదండ్రులు లేరా?"
"లేరండీ!"
"లగ్గం కాలేదా?"
"కాలేదండి!"
"ఊళ్లుంటవా? నాలుగు దినాలుండి ఎగిరిపోతవా?"
"ఉండి పోదామనే వచ్చానండీ! దొరవారు ఆశ్రయం ఇచ్చారు."
చివరి మాటకు కరణం గుండె కలుక్కుమంది "దొరవారు ఎంతమంది కిచ్చిన్రో ఆశ్రయం. నీకియ్యటం లెక్కా?" అని రామారెడ్డి పొంగిపోతున్నారని గ్రహించి, "రేపట్నుంచి నా బిడ్డకు పాటం శురూ (ఆరంభం) చెయ్యి" అని ఆదేశించినట్లుగా చెప్పాడు కరణం పాణితో.
"ఏం చెప్పమంటారండీ?"
"సంగీతం చెప్పమంటే" కాస్త విసుక్కొని అన్నాడు - సంగీతం అనేదంతా ఒక పదార్ధం అయినట్లూ అందును గురించి వివరణ అవసరంలేదన్నట్లూ.
"అది కాదండీ, ఏ వాద్యం చెప్పమంటారని?"
"అట్లానా" అని తలగోక్కుని, తనకు అర్ధం కాలేదనే విషయం ఎదుటివారికి తెలియనీయకుండేందుకు ప్రయత్నిస్తూ "నీకేమేమి వస్తయి?" అనడిగాడు.
"ఫిడేలు, వీణ, మృదంగం."
అన్ని పేర్లు విని మరికాస్త తికమకపడ్డాడు కరణం. ఫిడేలు అందామనుకున్నాడు. కాని, ఎప్పుడు విన్నదానికంటే విననిదాని పేరు చెపుతే రసికుడనుకుంటారనుకొని "వీణ చెప్పు" అన్నాడు.
"అయ్యా! నా దగ్గర ప్రస్తుతం ఉన్న వాద్యం ఫిడేలు. అదే చెప్పమంటే రేపన్నుంచి పాఠం ప్రారంభించగలను. వయొలిన్ తరువాత తెప్పించి ఇచ్చినా ఫరవాలేదు. వీణ చెప్పమంటే అది తెప్పించింతరువాతగాని ప్రారంభం చేయడానికి వీల్లేదు."
'వీణ' అన్నందుకు చాలా బాధపడ్డాడు కరణం. కరణం బాధ గమనించి చిరునవ్వు నవ్వారు రెడ్డిగారు.
"సరే. అదే చెప్పు" అన్నాడు పటేల్ నిజామొద్దీన్ 'ఫిడేలు' అనే పదం పలుకరాక.
"సరే అదే చెప్పు" అన్నాడు కరణమున్నూ, ఏదైతేనేం అనే అర్ధం ద్యోతకమయ్యేట్లు.
"మంచిదండీ, రేపు ఉదయమే వచ్చి ప్రారంభిస్తాను" అన్నాడు పాణి.
"సరే, శలవు తీసుకుంట" అన్నాడు కరణం, పీరిగాని విషయం సంప్రదించడానిగ్గాను కూర్చొమ్మంటాడని ఆశిస్తూ.
"మంచిది" అన్నారు లేచి నుంచుంటూ రామారెడ్డిగారు. నిజామొద్దీన్ కూడా లేచి నుంచున్నాడు. ఇద్దరూ బైల్దేరారు.
నాలుగడుగులు వేసిం తర్వాత "కరణంగారూ!" అనే రెడ్డిగారి మాట వినిపించడంతో పీరిగాని విషయం మాట్టాడ్డానికే పిలుస్తున్నాడనుకొని వెనక్కు తిరిగిన కరణంగారికి, "నారయ్య గారి జిమ్మెదారి (బాధ్యత) మీదే" అనే మాట నిరాశ, కోపం కలిగించాయి.
"మంచిది, ఇయ్యాల్నే మాట్లాడ్త" అంటూ సాగిపోయారిద్దరూ నారయ్య ఇంటివైపు.
"చూసినవా, పీరిగాని సంగతి దాచిపెడ్తున్నడు" అన్నాడు కరణం నిజామొద్దీన్తో.
"అ......పట్వారీసాబ్, పీరిగాని సంగతన్న ఎత్తలేదు మన ముంగల" అన్నాడు ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ. "దొర ఏమనుకుంటడో" అన్నాడు తరువాత.
"ఏమనుకుంటాడా? తానే రాజుననుకుంటడు ఊరికి, చూద్దంలే" అన్నాడు. ధ్వనిలో ద్వేషం వ్యక్తం అయింది. పటేలు చకితుడై కళ్ళల్లోకి చూస్తే అప్పుడే రక్తం దిగిపోతున్నది.
నిజామొద్దీన్ శలవు తీసుకొని సలాం చేసి వెళ్ళిపోయాడు.
నారయ్య ఇంటిముందుకు వెళ్ళి "నారయ్యా!" అని పిలిచాడు కరణం.
ఒక స్థూలకాయుడు, గుండ్రనిముఖమూ, బట్టతలా, చిన్నచెవులూ, లావైన ముక్కూ, చిన్న కళ్ళూ గలవాడు వచ్చి దండం పెట్టి "రాండ్రి, కూచుండ్రి" అన్నాడు. కారణం కూర్చోక ముందే "పీరిగాడు దొరల చింతల్లపడి చింతకాయ కోసిండటకద" అని అడిగాడు.
"ఊళ్ళో అనుకుంటున్నారు. దొర దగ్గర్నుంచే వస్తున్న. నాతోని ఆ ఖబర్ ఏం చెప్పలేదు."
"అదేందుండీ చిత్రం! మీకు చెప్పకుండ ఏమన్న చెయ్యలేస్తాడు దొర?"
ఆ సంభాషణ పొడిగిస్తే కోపం పొంగి పొర్లేట్లుంది కరణానికి. ఏదో ఒకటి గబగబా వాగినా వాగొచ్చు. రామారెడ్డి బలవంతుడు. తాను అతన్ని ఏమి చేయలేడు. మాటలవల్ల ప్రయోజనం లేకపోగా శత్రుత్వం రావచ్చు అనుకొని మాట మార్చాడు.
"నారయ్య గారూ! ఊళ్ళకి సంగీతపాయనొచ్చిండు. మా తాయారుకు సంగీతం చెప్పిస్తున్న, నీ బిడ్డక్కూడ చెప్పించరాదు?"
అనుకోకుండా పిడుగుపడ్డది నారయ్య మీద. సంగీత పాటకుడు గడీలోకి వచ్చాడని తెలిసిన్నాడే తనమీద ఈ పిడుగు పడుతుందని గ్రహించాడు. కానీ, రెడ్డి కారణం చేత చెప్పించి తనను అడకత్తెరలో పెడ్తాడనుకోలేదు. లంబాడీల భూమి తగాదా విషయంలో తాను కరణం చేతుల్లో ఉన్నాడిప్పుడు. కరణం మాట వినకుంటే నిలువునా ముంచుతాడు తనను. నారయ్య తన చేతులోంచి జారిపోతాడనే తెగనియ్యడం లేదు కరణం. అది నారయ్యకు తెలుసుకాని ఏం చేయగలడు పాపం!
"మీరు చెప్పుతే కాదంటానుండి నన్నడగట మెందుకు? ఆన్నే చెప్పకపోయినారు మా సీతకు కూడా చెప్పమని."
కరణం చిరునవ్వు నవ్వి "నువ్వీ మాటంటవని నా కెరికే. ఎట్లయిన నిన్నడుగుతే బాగుంటదనుకున్న. రేపు పొద్దున్న లేచి మా ఇంటి కొస్తడు సంగీతప్పంతులు, వెంట పెట్టుకొని వస్త" అని లేచాడు.
నారయ్య కూడా లేచి కరణంతో నాలుగు అడుగులు వేసి "ఆ లంబాడీల పంచాయితీ తస్ఫియ (పరిష్కారం) చేయకపోతిరి" అన్నాడు.
"చూస్తంలే జల్దేమున్నది? ఫసల్ (పంట) నువ్వె తింటున్నవ్ కద, లంబాడి ముండాకొడుకులు కచ్చేరికి పోయిన్నాడు చూతంలే" అని వెళ్ళిపోయాడు కరణం.
5
తాంబూల చర్వణం చేస్తూ గదిలో ప్రవేశించారు రెడ్డిగారు. దిగ్గునలేచి నుంచొని దండం పెట్టాడు పాణి.
"కూచో పంతులు" అంటూ కుర్చీలో కూర్చున్నారు రెడ్డిగారు. పాణి వయొలిన్ పెట్టె మూత తీస్తుంటే అడిగారు "పంతులూ పీరిగాని ఖబరిన్నావా?" అని.
లేదన్నట్టు చూచాడు పాణి, వయొలిన్ అలాగే ఉంచి.
"అయితే వీదనక రాలేదన్నమాట. పొద్దుగూకేటాళ్ళ పొలాల కాడికి పోతన్నా, చింతచెట్లమీద జర్ర అలికిడనిపించింది. ఎవడ్రా వాడు అంటుండగనే చెట్టు దిగిండు, ఉరికిండు. నిలువకుంటే తోళ్ళొలుస్తనన్నా. వెనక్కు మళ్ళక్కుండ ఉరికిండు. మా తాతలకాన్నుంచి కూడ చింతలకు కాపలా పెట్టలే. దొరల చింతలని ఎవ్వడు తెంపెటోడు కాదు. ఊళ్లేవరిండ్లనన్న లగ్గమన్న ఏమన్న అయితే నన్నడిగేటోరు. తెంపు కొమ్మంటేనే తెంపుకొనేటోరు. ఇట్లా దొంగతనం ఎవ్వడు ఇయాల్టికి చెయ్యలేదు పంతులూ! కోసుకొన్నోడు పారిపోతే ఆ అదొక మాట. విలవమంటే నిలవకుండా పోతాడు లంజకొడుకు. అక్కడికి నా మాట చెల్లదన్నట్లాయే. అదంతా ఎవ్వరు చూడకుండున్నా బాగుండేది. కంసలి బ్రహ్మయ్య చూచిండు, ఊరంతా చాటిండు. పీరిగాడి తోలు వలవాలె, నేను నిద్రపోవాలె. యాడికి పోతడు గాడ్దికొడుకు. కారణం వెంకట్రావు నన్ను కమ్జోర్ (బలహీనుడు) చెయ్యాలనుకుంటున్నడు. అట్లనే కరణంతో సుత చెప్పలేదు. నువ్వంటే ఎత్మెనా (నమ్మకం) నుండబట్కెచెబితాన్న" అన్నారు రెడ్డిగారు.