Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 7

    అతని మాటలు ఆజ్ఞలుగా తీసుకున్నారు అధికారులు!

    సబ్ ఇన్ స్పెక్టర్స్ ఇద్దరు ద్రవిడ మహేశ్వరుడి జాగ్రత్తలు చూచేందుకు పరుగు తీశారు. ఒక సర్కిల్ వెంటనే తన రూంలోకి వచ్చి అతని మీద ఎఫ్.ఐ.ఆర్ తయారుచేయించాడు!

    భయంకర మయిన విష సర్పాలను తగిన రక్షణ బందోబస్తు లేకుండా జనం మధ్యకు తీసుకురావటం!

    చాలినన్ని బట్టలు ధరించకుండా అర్ధ నగ్నంగా తిరగటం!

    పాముల్ని చూపి భయపెట్టి ఆడవాళ్ళనించి భిక్ష తీసుకోవాలని ప్రయత్నించటం మూడవ నేరం!

    వారించాలని ప్రయత్నించిన ఎ.ఎస్.పి. మీదికి విషసర్పాన్ని ప్రయోగించడం, అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా తిరుగబడి, కలియబడి గాయపరచాలని లేదా పోలీసు అధికారిని హత్య చేయాలని చూడటం!

    అనుమానితుడుగా అదుపులో ఉండగా పోలీసులకు సహకరించకుండా ఎదురు తిరగటం__మొత్తం అయిదు నేరాలను అతని మీద ఆరోపించారు. అందుకు సాక్షులు పోలీసు అధికారులుకాక విడిమనుషులు ముగ్గురు.

    'శ్రీమతి తులసి, ఆమె తల్లి, ప్రొఫెసర్ సమతా బెనర్జీ!

    అందుకు సంబంధించిన సెక్షన్స్ తో ఎఫ్.ఐ.ఆర్. తిరుగులేకుండా బలంగా రూపొందించాడు. తమ అధికారం మీద నేరుగా జరిగిన దాడి కాబట్టి జాగ్రత్తగా రిఫరెన్సులు తీసుకొని సీరియస్ సెక్షన్స్ ని ఉటంకించి మరీ తయారు చేశాడు.

    ముందు క్రింది అధికారులకు చదివి వినిపించి సరిగానే ఉన్నదని భావించాక శివరాజ్ దగ్గరకు తీసుకుపోయి చదివాడు.
    అంతా శ్రద్దగా విన్నాడు ఎ.ఎస్.పి.!
    "ఇదంతా ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారా?" అని ప్రశ్నించాడు. లేదని తల ఊగించాడు సర్కిల్.
    "మరి ఇంతసేపూ మీరంతా ఏం చేస్తున్నట్టు!?"

    "అతడు మంత్రగాడట సార్! దగ్గరకు వెళ్ళేందుకు అందరూ భయపడుతున్నారు! ఒక పి.సి. పాలు, రొట్టె ఇచ్చేందుకు వెడితే నోరుతెరిచి చూపించాడట అతని నోటినిండా పాలున్నాయట!

    మరొక పి.సి. ధోవతులు ఇచ్చేందుకు వెళ్ళాడు!

    అతని శరీరంమీది విభూతి తీసి చల్లగానే బట్టలలోంచి పొగ రావటం ప్రారంభించిందట! అంతా భయపడిపోతున్నారు.

    దగ్గరకు వెళ్లి విచారించమంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తా మంటున్నారు" అని వివరించాడు సర్కిల్.

    "పోనీ మీరయినా వెళ్లి తెలుసుకోవచ్చు గదా?"

    "మూడు తరాల నించి మా యింట్లో నాగ పూజ ఉంది సార్! నాగేంద్రుడు మాకు కులదైవం! ఆడపిల్ల పుట్టినా, మగపిల్లవాడు పుట్టినా ఆ పేరే పెట్టుకుంటాం! ఇలాంటి విషయాలలో  కొద్దిపాటి అపచారం జరిగినా మా కుటుంబానికి అనిష్టం వాటిల్లుతుంది.

    ద్రవిడ మహేస్వరుడి మీద బలమయిన రిపోర్టు రాశాను. మిగిలిన కార్యక్రమాలు ఎవరికయినా అప్పగించండి. ప్లీజ్!" అన్నాడు సి.ఐ.

    శివరాజ్ కి క్షణంసేపు దిగ్బ్రాంతి కలిగింది.

    ఇంటి దగ్గర పరిస్థితే ఇక్కడా ఎదురు అయిందన్నమాట! ఎవరెలా ఆలోచించినా తనకి మాత్రం తప్పదు.

    "అతన్ని నా దగ్గరకు తీసుకురండి" అని ఆదేశించాడు! ఆ పనిచేసేందుకు సర్కిల్ మరొకరిని పురమాయించాడు! అతడున్న సెల్ తలుపులు తెరిచారు. తలెత్తి అయినా చూడలేదు.

    "నిన్ను ఎ.ఎస్.పి. దొరగారు పిలుస్తున్నారు" పి.సి. భయపడుతూ చెప్పాడు.

    "ఎవడురా దొర! ఎవరికి దొర! మీకా? మాకా??" గది గోడలు ఊగిసలాడే నవ్వి వృద్దకంపిత స్వరంతో ప్రశ్నించాడు మహేశ్వరుడు.

    "మా దొరగారే! పిలుస్తున్నారు!" అడుగు ముందుకు వేయ సాహసించలేదు.

    "కావాలనుకున్నవాడు కంటిముందు నిలిస్తే కనికరిస్తాం" అన్నాడు యోగి.

    "బాబుగారూ! మీరు జైలు గోడలమధ్య ఉన్నారండి! వారు చెప్పినట్టే వినాలి! చేసేది పోలీసు ఉద్యోగమయినా పిల్లలుకల తండ్రిని! నా మీద మాత్రం కోపగించకండి! అధికారుల ఆజ్ఞలు పాటిస్తున్నాను. అంతే!"

    "నిన్ను నేను అర్ధం చేసికొంటాను. వాడినే నా దగ్గరకు రమ్మన్నానని చెప్పు"

    "అలాచెపితే నాకు తంటావస్తుందండి! ఈడ్చుకురాలేకపోయావా అంటారు. మీరుచూస్తే దేవుడి మనిషిలా వున్నారు. అలా చేసేందుకు చేతులు రావటల్లేదు. వారు చెప్పినట్లు వింటే గొడవ వుండదు కదా!?"

    యుద్ధం మొదలయ్యాక గొడవ వుండదా మరి?"

    "అవన్నీ నాకు తెలియదు, మీరు రండి సార్!"

    "సరేపద! బడుగు జీవులమీద బడబాగ్ని చిమ్మటం మహేశ్వరుల సాంప్రదాయం కాదు. పద!" అంటూ లేచి ఇంతెత్తున నిలిచాడు. కూర్చున్నప్పుడు గువ్వలా అయిపోయి డొక్కలు అంటుకుపోయిన అతడు అంత ఎత్తు ఉంటాడని పి.సి. ఊహించలేదు.

    ఆరు అడుగుల పైగా ఎత్తు! ఆ పైన ఒక అడుగు జటాజూటం! ఆకృతి భయంకరంగా అనిపించింది. పి.సి. ముందుకు దారి తీశాడు. మిగిలినవారు అతని దృష్టిలో పడకుండా చాటునుంచి చూడాలని ప్రయత్నించారు. సి.ఐ. దగ్గర నిలిచిపోయాడు.

    "తరతరాలుగా నాగాపూజలు చేస్తున్నారు. నాగ దేవతల అనుగ్రహం నీ యింటిలో నిలిచింది!" అన్నాడు. నుదుట ధరించిన విభూతి బొటనవేలుకురాసి అతనికి అందించాడు.
 

 Previous Page Next Page