ఉదయం అతనిని అప్పగించి వెళ్ళిపోయినా శివరాజ్ ఎ ఎస్.పి. సాబ్ ఇంకా తిరిగిరాలేదు అందరు ఎదురు చూస్తున్నారు.
పాములు పట్టి ఆడించే బసవయ్య పాముని బుట్టలో ఉంచి దాని ముందు అతి జాగ్రత్తగా కాపలా కూర్చున్నాడు.
కాస్తంత భక్తి భావము, సెంటిమెంట్స్, సూపర్ నాచురల్ పవర్స్ మీద విశ్వాసాలు కలిగిన పి.సిలు లోలోపల భయపడుతున్నారు. ఇలాంటివి జరగ కూడదని వారి మనసులు కోరుకుంటున్నా ఉద్యోగ రీత్యా విధులు నిర్వర్తించక తప్పదు.
రహస్యంగా చెంపలు వాయించుకుంటూ యధావిధిగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఎ.ఎస్.పి. సాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఇంటిదగ్గర బిజీ కార్యక్రమాలలో లీనమయిపోయి ఉన్నాడు ఎ.ఎస్.పి శివరాజ్!
భయంకరమయిన ద్రవిడ మహేశ్వరుడు సృష్టించిన సంఘటనతో హనీలేని హనీమూన్ ప్రయాణం ఆగిపోయింది. వధూవరులు ఇరు పక్షాలనించి అది కేవలం పెద్దల్ని సంతృప్తి పరిచేందుకు ఏర్పాటు చేసుకున్నదే! అందువల్ల ప్రయాణం ఆగిపోవటం వారిని అంతగా బాధించలేదు. అపశృతి ఎదురయినందుకే బాధపడింది తులసి!
కొంతసేపు ఉపచారాలు చేశాక తల్లికి తెలివి వచ్చింది. ద్రవిడ మహేశ్వరుడిని, గాయపడిన పాముని స్టేషన్ లో అప్పగించి హడావుడిగా తనవారికోసం పరిగెత్తాడు శివరాజ్!
అప్పటికి కళ్ళు విప్పింది తులసి!
కాని కారులోంచి క్రిందికి దిగేందుకు భయపడుతోంది!
పాపం ప్రొఫెసర్ ఒక్కరే ఇంకా తెలివిరాని తల్లికి ఉపచారాలు చేస్తున్నారు. డోరు తెరిచి చేయి అందించాడు శివరాజ్!
"నాకెందుకో భయంగా ఉందండి!' అంది తులసి!
"భయమెందుకు? వాళ్ళని స్టేషన్ లో అప్పగించి వచ్చాను. వెధవకు మా డిపార్టు మెంట్ వాళ్ళు తగిన బుద్ది చెప్తారు. క్రిందికి దిగు! సారీ డియర్! మన ప్రయాణం ఆగిపోయినట్లే!" అన్నాడు తన విచారాన్ని వ్యక్తంచేస్తూ!
"అమ్మ ఇలా ఉంటే ఎలా వెళ్ళగలం?" క్రిందికి దిగుతూ అంది తులసి.
అందరూ కలిసి తల్లిని హాలులోకి సోఫా మీదికి చేర్పించారు.
డాక్టర్ వచ్చి కొద్ది శుశ్రూష జరిగాక ఆమెకు తెలివి వచ్చింది. కూతురి తల ఒడిలోకి తీసుకుని గోలుగోలుగా ఏడ్చింది.
హైపర్ టెన్షన్ కొంత శాంతించి- బి.పి నూటయాభై లోపలకు దిగిపోయింది. డాక్టర్ ప్రమాదం దాటి పోయిందని ప్రకటించి వెళ్ళి పోయాడు.
"ఈ అపశకునం ఎందుకొచ్చిందో?" అన్నదామె తల్లడిల్లిపోతూ!
శకునాలనుకోవటం ఏమిటి చాదస్తంకాని వాళ్ళ సంతోషానికి ఆటంకం కలగటం బాధగానే ఉంది" అంది ప్రొఫెసర్ బెనర్జీ!
"జటాజూటంలోంచి పాము రావటం ఏమిటి?" అంది తులసి!
"అమ్మా! ఇలాంటివి జరుగుతుంటాయి! మన భారతదేశంలో అపూర్వమయిన కల్చెర్, కష్టమ్స్ ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను మనం తేలికగా కొట్టి వేయటానికి వీలుకాదు.
నిస్సందేహంగా ద్రవిడ మహేశ్వరుడు మంత్రశక్తులు కలవాడు అనిపిస్తోంది నాకు. అతని జటాజూటంలోని నాగరాజు సమ్మోహిత మయిన దైవసర్పం! సందేహం లేదు.
ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండటమే మంచిది!
ఈ రోజు సాయంత్రం నాగపూర్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చేందుకు చాల ముందుగా ఒప్పుకున్నాను. తప్పకుండా బయలుదేరివెళ్ళాలి బేబి! ప్రస్తుతానికి కొద్దిరోజులు హనీమూన్ వాయిదావేసుకోండి మరి! అదే నా సలహా!" అని చెప్పేసి శలవు తీసుకుంది ప్రొఫెసర్!
తల్లికి స్పృహ వచ్చినా కళ్ళు విప్పేందుకు భయపడుతోంది!
"ద్రవిడ మహేశ్వరుడు మంత్ర శక్తి కలవాడని ప్రొఫెసర్ మేడమ్ అంటున్నారు కదా! అతని దారిన అతన్ని పోనివ్వటం మంచిది అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు?" అని అడిగింది తులసి!
"నువ్వు సాధారణ గృహిణిగా ఆలోచిస్తున్నావు. ప్రొఫెసర్ తార్కిక జ్ఞానం కలిగిన ఒక మేధావిగా ఆలోచించారు.
కాని నేను ఒక పోలీసు అధికారిని! నా బాధ్యతలు వేరుగా ఉంటాయి. సెంటిమెంట్స్ కి లొంగిపోవటం అధికారిగా నేను చేయకూడదు.
మాకు కొన్ని నిర్దిష్టమయిన మార్గదర్శక సూత్రాలుంటాయి. ఆ ప్రకారమే నేను చేయగలను. ఇక్కడ నా స్వంత ఆలోచనకి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. మమ్మీని జాగ్రత్తగా చూచుకో!
అవుసరమయితే డాక్టర్ అంకుల్ కి ఫోన్ చేసి చెప్పు! వీలయినంత త్వరగా కేసు డీల్ చేసి నేను మళ్ళా తిరిగి వస్తాను" అంటూ హడావుడిగా డ్రసస్ అయి బయల్దేరాడు శివరాజ్!
జీప్ వచ్చి స్టేషన్ ముందు ఆగగానే క్రిందికి జంప్ చేశాడు! అతన్ని చూచిన తరువాత పి.సి.లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
కటకటాల వెనుకనించి చింతనిప్పులాంటి కళ్ళుతో రెప్పవేయకుండా చూస్తున్నాడు ద్రవిడ మహేశ్వరుడు!
పళ్ళు పటపట నూరుతున్నాడు. వెర్రి కోపంతో నాలుకలోకిపళ్ళు దింపుకుని రక్తం తెప్పించాడు. నోరంతా తాంబూలం సేవించినట్టు ఎర్రగా అయింది. ధోవతి కట్టుకునేందుకు కూడ తిరస్కరించాడు. సీట్లో కూర్చోగానే పి.సిలు ఈ వివరాలన్నీ అందించారు.
"ఈ వెర్రి మొర్రి వేషాలు భయపడే వాళ్ళదగ్గర సాగుతాయి. కాని పోలీసుల దగ్గర ఎలా సాగుతాయను కుంటున్నాడు. ఏమైనా కానివ్వండి! ఈ రోజు కోర్టు ముందు హాజరు పరిచి అతను బయటకు వెళ్ళకుండా చేయాలి! మరొకరికి కూడ ఇతనివల్ల ఇబ్బంది కలుగకూడదు. అన్నాడు శివరాజ్!