Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 8

    అతడు వినయంగా చేతులు జోడించి ముందుకి వంగాడు.

    "సర్పోపసర్ప! మహాసర్ప!! అనునయ!! అనునయ!!" అనుకుంటూ అక్కడనుంచి కదిలాడు. సి.ఐ. అతడు వెళ్ళిపోయాక బెంచి చుట్టూ తిరిగివచ్చి అతడు నిలిచిన చోటు కళ్ళకి అద్దుకున్నాడు.

    విభూతిని భక్తిగా పవిత్రంగా శిరసున ధరించాడు.

    ద్రవిడు మహేశ్వరుడు ఎ.ఎస్.పి. గదిలోకి వచ్చి గది మధ్యలో నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. పద్మాసనం వేసుకున్నాడు.

    "మహేశ్వరులంకదరా మిమ్మల్ని రమ్మన్నవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు.

    "ఎందుకలా చించుకుంటావు? నువ్వు ఎక్కడున్నావో గుర్తుందా? అధికారులతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో! లేకపోతే నేర్పాల్సి వస్తుంది. ఈ వేషమంతా ఎందుకు వేశావు?"

    "మూర్ఖుడా! ఈ పృథ్వి అంతా మహాస్మశానం! ఇక్కడ ఎవరేమి చేసినా అదంతా నటరాజు నటన! రోషం కలిగిన నాగాదేవతల ఆరాధకులం! వేషాలతో మాకు పనిలేదు! విషాన్ని చిమ్మే స్వభావం కాదురా!

    మేము ధరించిన వేషం ద్రవిడమాహేశ్వరం!

    ఇది ప్రారంభమయింది పుట్టుకతో! ముగిసేది మరణంతో! నేను ధరించిన వేషం ఈ శరీరమేరా కుర్రకుంకా!!" అన్నాడు గర్జిస్తున్నట్లు.

    అతని మాటతీరు మార్చేందుకు సమయం చాలదు.

    అందుకోసం పూనుకుంటే ప్రశ్నించటం సాగదు! అని భావించాడు శివ.

    "నువ్వు ఆ యింటికి ఎందుకొచ్చావ్? కారుముందు ఎందుకు  కూర్చున్నావ్?"

    "మేము ఎక్కడకయినా రాగలం! ఈ మహాస్మశానంలో రుద్రుడురాకుండనిచోటు ఒకటుందా? నీవు పోలీసు అధికారివేకాని భూమి మీద పాలకుడవుకాదు. నేని నీ బంటునికూడా కాదు!

    ప్రశ్నించే అధికారం నీకులేదు. చెప్పవలసిన అవుసరం నాకులేదు.మాటలో కోపాన్ని మనసులో కరుకుతనాన్ని అదుపుచేసుకో ఇప్పుడయినా! మా అనుగ్రహానికి పాత్రుడవుతావు. లేదా భస్మమవుతావు!"

    "చేసిన నేరాలు కోర్టువారి ముందయినా అంగీకరిస్తావా?"

    "నేను చేసిన నేరమేమిటిరా? భిక్ష అర్ధించడమా?"

    "నువ్వు అర్ధించలేదు బెదిరించావు పాముల్ని చూపి!

    "మాహేస్వరుడి మహాశక్తిని చూపించాను. అది బెదిరింపు అవుతుందా? పిరికివాడికి అందరూ శత్రువులే! భీరువా!" ఉరిమాడు.

    శివరాజ్ కోపం తారస్తాయిని అందుకుంది.

    పెచ్చు మీరిన అతని వాగ్దోరణి అరికట్టాలని చూచాడు. అతని ప్రయత్నానికి అంతరాయం కలిగిస్తూ టెలిఫోన్ రింగ్ అయింది. రిసీవర్ అందుకున్నాడు. అవతలనించి మాట్లాడుతోంది ఓ ఇనస్పెక్టర్!

    "సర్! జడ్జిగారిని కలిసి పరిస్థితిని వివరించాను. ఈకేసు తక్షణ నిర్ణయానికి ఆయన అంగీకరించారు. మీరు వెంటనే అతన్ని కోర్టుకు తీసుకు రావచ్చు!" అని విన్పించింది! క్రెడిల్ చేసేసి సంతోషంగా చూచాడు.

    "కోర్టులో నిన్ను ఇంటరాగేషన్ చేయటానికి అనుమతి పొందుతాను. ఆ తరువాత చూద్దువు కాని నా తడాఖా ఏమిటో!? కోర్టుకి వెడదాం పద!" అన్నాడు ముందుకు సాగుతూ!

    "మూర్ఖుడా! దిక్కులే వస్త్రాలుగా బ్రతుకుతున్న వాడిని! నన్ను మీ కోర్టు గోడలు బంధించలేవు. ఎక్కడికయినా వస్తాను పద!" అంటూ లేచి అతని వెంట నడవటం ప్రారంభించాడు!

    రెండు మూడు అంగల్లోనే అతన్నిదాటి వెళ్ళిపోయాడు!

    "జీపులో కూర్చో!"

    "కృత్రిమయిన వాహనాల అవుసరం నాకులేదు. నేను నడుస్తాను"

    జీపులోంచి దిగి అతనితో నడవటం ప్రారంభించాడు ఎ.ఎస్.పి. డ్యూటీలో ఉన్న ఎస్.ఐ.లు ఎస్కార్టుగా వారిని అనుసరించారు.

    అప్పటికే ఈ విషయం నగరంలో నలుమూలలా ప్రాకింది. కోర్టు దగ్గర జనం గుంపులు కట్టి నిలబడి ఉన్నారు. కొందరు ద్రవిడ మాహేశ్వరుడి పాదాలు తాకిన చోటున ధూళితీసి శిరసున చల్లుకుంటున్నారు.

    మరికొందరు ఇలాంటి మాయమంత్రాల పేరు చెప్పి పొట్ట పోసుకునే సోమరుల్ని తగిన విధంగా శిక్షించాలని, బుద్దిచెప్పాలని ముచ్చట్లాడుకుంటున్నారు. లోలోభిన్నరుచిః!

    ఎవరి అభిప్రాయాలు వారికే ఉంటాయి!

    అదేమీ గణించకుండా కోర్టుహాలులోకి వెళ్ళి బోను చూపించగా దానిలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మాహేశ్వరుడు.

    "జడ్జిగారు న్యాయశాస్త్రానికి ప్రతినిధి! వారి ముందు కూర్చుని మాట్లాడరాదు. నిలబడి మాటాడాలి!" లాయర్ సూచించాడు!

    "మేము మాహేశ్వరులం! నాగదేవతలకు ప్రతినిధులం!" అన్నాడు. ఆ ప్రధమ సంభాషణలోనే కోర్టుహాలులో క్రిక్కిరిసిన జనంలో కలకలం బయలుదేరింది. జరుగనున్నది ఒక విచిత్ర పోరాటం అని ప్రేక్షకులంతా గుర్తించారు. అరుదైన సంఘర్షణ అది!

    "న్యాయ స్థానాన్ని దిక్కరించకూడదు. అందువల్ల నువ్వు శిక్షకు పాత్రుడవుతాడు. న్యాయమూర్తిని గౌరవవించాలి."

    "మానవులంతా ఒక్కటే! ప్రతి ఒక్కరూ మరొకరిని గౌరవించాలి."

    "ఇక్కడ మనిషి ప్రవర్తించటానికి కొన్ని నియమనిబంధనలున్నాయి."

    "మాకు మీ నియమాలు వర్తించవు. మీ నిబంధనలతో పనిలేదు" అతడు బదులు చెప్పే తీరు జనంలో గొప్ప సంచలనం కలిగించింది.

    కొందరయితే మరింత ఉత్సాహ పడిపోయి అలజడి ప్రారంభించారు.

    "సైలెన్స్, సైలెన్స్" న్యాయమూర్తి మాటలు విన్పించాయి.

    కోర్టు హాలు సద్దుమణిగింది.
   

 Previous Page Next Page