రెండు సుతిమెత్తని చేతులు ఆ తల్లిని చుట్టేసుకున్నాయి. ఎక్కడో అనంతాకాశంలోంచి ఒక వెన్నెలకిరణం నడక నేర్చుకొంటూ వచ్చి, ఆకార రూపమై అక్కున చేరినట్టుగా మధురమయిన స్పర్శ."
నుదుటిమీద ముద్దుపెట్టుకుంటూ ఆ కళ్ళలోకి చూసిందామె. యశోద చూసిన బాలకృష్ణుని కళ్ళలా, ఆ కళ్ళు అనంతాంబరపు నీలినీడల్ని ప్రాసరిస్తున్నాయి.
ఆ తల్లి మనసు గాలికి రేగిన ఇసుక రేణువులా సంతోషంతో ఎగిరి పడుతోంది.
"ఆ....ఆ....ఆ....మ్...మ్....మ్..." చిన్నారి నోట్లో ఆకృతి ఏర్పరచుకోవడానికి సుడులు తిరుగుతున్న రెండక్షరాలు....అమ్మ.
అమ్మ....అమ్....మ్మ...అను" ఆ రెండక్షరాల్ని చెప్పించడానికి సుదేష్ణాదేవి నానా తంటాలు పడుతోంది.
కుడిచూపుడువేలు, బొటనవేళ్ళతో ఆమె ముక్కును పట్టుకుని లాగుతూ-
"ఆ...ఆ...ఆమ్...మ్...మ్" అనే శబ్దాల్ని చేస్తున్నాడు బుల్లి తేజ.
ఆ శబ్దాలు ఓంకారనాదంలా వినిపిస్తోంది ఆ తల్లికి.
ఒడిలో ఒకచోట ఉండకుండా అట్నించిటూ, ఇట్నించటూ దుముకుతూ గెంతుతున్నాడు చిన్నారి తేజ.
"నాన్నగారిలాగే నీక్కూడా కాలు నిలవదు" అంటూ ప్రేమగా గుండెల కద్దుకుంది సుదేష్ణాదేవి.
నోరంతా తెరచుకొని, పెద్దగా నవ్వుతూ ఆమె మెడలో వేలాడుతున్న మంగళసూత్రాల్ని పట్టి పైకిలాగి, వాటితో ఆడుకుంటున్నాడు తేజ.
అపురూపమైన మాతృత్వపు ఆనందాన్ని తనకిచ్చిన, ఆ భగవంతుడ్ని తలచుకుంటూ పరవశించిపోతుంది సుదేష్ణాదేవి.
సరిగ్గా అదే సమయంలో__
"అమ్మగారూ" ఆ పిలుపుకి తపోభంగమయిన మునిలా చిరాగ్గా సర్వెంట్ వేపు చూసిందామె.
"అయ్యగారి ఫోన్....బొంబాయినుంచి" ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తోందామె.
"రారా....డాడీతో మాట్లాడుదాం" రెండుచేతుల్తో కొడుకుని ఎత్తుకుని, వరండాలో వున్న ఫోను దగ్గరకెళ్ళి రిసీవర్ని అందుకోబోయింది. అంతకు పూర్వమే ఆ రిసీవర్ని చేత్తో అందుకుని తేజ-
"ఉమ్....మ్...మ్" ని అంటున్నాడు.
"హలో తేజేశ్వర ప్రసాద్ గారూ! ఏం చేస్తున్నారు?" భర్త కాళేశ్వర ప్రసాద్ గొంతు గంభీరంగా విన్పిస్తోంది ఫోనులో.
తనకు పరిచయమైన గొంతు వినబడడంతో ఆ గొంతు ఎక్కడ నుంచి వినబడుతుందో తెలీక చిన్నారి తేజ ఫోన్ రిసీవర్ వేపు, తల్లి సుదేష్ణాదేవి ముఖంలోకి పెద్ద కళ్ళతో చూస్తున్నాడు!
"మీ నాన్నగారు ఆ ఫోనులో దాగొని మాట్లాడుతున్నార్రా చిట్టి కన్నా" సుదేష్ణాదేవి అంది మురిపెంగా.
"అమ్...మ్...మ్" చేతిలోని రిసీవర్ నోటితో పట్టబోయాడు తేజ.
ఆ రిసీవర్ అతడి చేతిలోంచి జారి కింద కార్పెట్ మీద పడిపోయింది.
"నాన్నగారు టైమ్ కి రాలేదని కోపమా....నేను మాట్లాడతాను" అంటూ ఒడిలోని తేజను కార్పెట్ మీద కూర్చోపెట్టి, కిందకు వంగి రిసీవర్ని అందుకొని__
"బిజినెస్ టూర్ వెళితే, అయ్యగారికి భార్య ఎలాగూ గుర్తుకురాదు. కొడుకునుకూడా మర్చిపోయారా?" చిరుకోపాన్ని నటిస్తూ అందామె.
"సుదేష్ణా మేడమ్ గారికి కోపం వచ్చినట్టుంది."
"ఎందుకు రాదు...కనీసం ఫోను చెయ్యడానికేమైంది? అంత బిజీనా!"
"ఇక్కడ వర్షంవల్ల పనులన్నీ పోస్ట్ ఫోనయ్యాయి. వచ్చేస్తున్నా-ఈవినింగు ఫ్లయిట్ కి దేవిగారు ఏ శిక్ష వేసినా."
డైలాగులకేంలెండి...ఇవాళ అద్బుతమయిన ఇన్ సిడెంట్ జరిగింది ఏమిటో తెలుసా?"
"నాకెలా తెలుస్తుంది చెప్పు."
"మన తేజ నోటివెంట అ...మ్...అని రెండక్షరాలొచ్చాయి."
"నిన్ను అమ్మా అని పిలిచాడా" ఆనందంగా అడిగాడు కాళేశ్వరప్రసాద్.
"అంత స్పష్టంగా ఎలా పిలుస్తాడూ చెప్పండి. ఆశబ్దాలు అడిగాడు కాళేశ్వరప్రసాద్.
"అంత స్పష్టంగా ఎల పిలుస్తాడూ చెప్పండి. ఆశబ్దాలు వచ్చాయి. ఈ వారంలో పిల్చేస్తాడు" ఆనందంగా అందామె.
"వెరీగుడ్...వాడు మొట్టమొదటిసారి నిన్ను నోరారా అమ్మ అని పిలిచినా క్షణంలో, మన కంపెనీ వర్కర్స్ అందరికీ ఒక నెల సాలరీ బోనస్ గా యిస్తా" ఆనందంగా ప్రకటించేసాడు కాళేశ్వరప్రసాద్.
"మీకు ఆనందం వచ్చినా, కోపమొచ్చినా పట్టలేం - ఈవెనింగ్ ఫ్లయిట్ కి వచ్చేస్తున్నారు కదూ" అడిగింది సుదేష్ణాదేవి.
"బాబు ఉయ్యాలయెక్కి నిద్రపోయేలోపు వచ్చేస్తాను...సరేనా....వాడి నోటివెంబడి అమ్. ఒక్కటేనా- నాన్న అనే పదం రాదా!"
"వాడికి నేనేంటేనే యిష్టం - అంచేత నన్నే ముందు పిలుస్తాడు__అమ్మ తర్వాతః నాన్న!"
"ఏడీవాడు- వాడికి ఫోనివ్వు - ఆ సంగతేదో వాడ్నే అడుగుతాను" కోపాన్ని నటిస్తూ కాళేశ్వరప్రసాద్ అనగానే, సుదేష్ణాదేవి కింద కార్పెట్ వేపు చూసింది నవ్వుతూ.
బాబు అక్కడ లేడు__ఆయా తీసికెళ్ళి వుంటుందనుకుని-
"ఆయా తీసికెళ్ళినట్టుంది....మీకోసం వెయిట్ చేస్తుంటా__ఉంటామరి" అని ఫోను పెట్టేసి_
వెనక్కొచ్చి "ఆయా" అని పిలిచింది. ఆయా డ్రాయింగు రూమ్ లోంచి ఒక్క అంగలో వరండాలో కొచ్చింది.
ఆమె చేతిలో బాబు లేడు!
"తేజ ఏడీ" అడిగింది సుదేష్ణాదేవి కంగారుగా.
"మీ దగ్గరే ఉండాలికదమ్మా!" ఆ జవాబుతో సుదేష్ణాదేవి ముఖంలో రంగులు మారిపోయాయి. నలువేపులా చూసింది - ఎక్కడ తేజ కనబడలేదు.