Previous Page Next Page 
విరిజల్లు పేజి 6


    "ఉడుకుమోతుతనంవుంటే మంచిది! కానీ దుడుకుమోతుతనంవుంటే మాత్రం అది కూడనిది విరజా_ చూడు ఎంతగా గీరుకునిపోయిందే అరే! ....అయ్యోయ్యో ఇక్కడ నరం వాచి ఎలా పొంగిందో చూడు."
    అతని చేతిని ప్రక్కకితొలగించి పరికిణీ క్రిందికి లాక్కుంటూ అంది.
    "యేంలేదు వేణూ! వేకువన మా అమ్మ పొయ్యిలోనికి పుల్లలు తెమ్మంటే వెళ్ళాను. చీకట్లో తుమ్మ పుల్లలు గీచుకునిపోయాయి అంతే!"
    ఒలికిన కన్నీటిని కొనగోటితో మీటి అన్నాడు.
    "ఇప్పుడెలా?"
    అతని కంఠం బాధతో పూడుకుపోయింది. మాట బరువుగా ధ్వనిస్తోంది.
    "నీవు వెళ్ళు వేణూ! నేను నెమ్మదిగా ఎలాగో వచ్చేస్తాను__"
    ఆమె మాట పూర్తిచేయకముందే అన్నాడు. "అలా అనేందుకు బదులుగా మరే సాధనంతోనైనా శారీరకంగా బాధించరాదా విరజా!"
    బాధతో కూడుకున్న అతని మాటలకి ఆమె యేమీ జవాబివ్వలేదు.
    అయిదారు క్షణాలు నిశ్శబ్దంగా కాలపురుషుడి హస్తాల్లోకి జారిపోయాయి.  
    ఒకవేపు సిగ్గు, మరోవేపు ఆనందం తోసుకునివస్తుందో పిలిచాడు.
    "విరజా...."
    ప్రశ్నార్ధకంగా చూసింది అతనివేపు.
    "నీవు నడవలేవుకదూ?"
    "ఉహుఁ...."
    "నేను నిన్ను విడిచి వెళ్ళలేను__అందుకని"
    సిగ్గుముంచుకొని రావటంతో మాటలు ఆగిపోయాయి. ఆ అమ్మాయి అంతగా సూటిగా ముఖంలోకి చూస్తుంటే ఎలా చెప్పటం?
    ముఖాన్ని మరోవేపుకు తిప్పుకుని అన్నాడు. "నిన్ను_నిన్ను_నేను_నేను భుజాలమీద ఎత్తుకుని వెడతాను."
    గల గలా సెలయేరులా నవ్వింది.
    సిగ్గుపడుతూ తల మరోవేపుకు తిప్పుకుని కూర్చున్న అతనిని చూస్తూ అంది.
    "సిగ్గుపడతావేం వేణూ! నేనెవర్నీ? పూర్వజన్మలో నీ మరదల్ని ఇప్పుడు దూరమైనా మానసికంగా దగ్గరగా వున్నాను.... రా.... మరి....టైమైపోతుంది. భుజాల మీదుగా ఎత్తుకుని వెళ్ళనవసరం లేకున్నా బరువంతా మోపుకుంటే చాల్లే__"
    ఆ అమ్మాయి నిలుచుంది. మెల్లిగా తన కుడిచేతిని భుజంమీద వేస్తూ బరువంతా మోపి ఒక కాలు భుజంమీద ఆనిస్తూ నడవసాగింది.
    మెత్తగా తాచు పాములా జారిపోతూ మళ్ళీ తనే సర్దుకుంటూ తన కారియర్ ని కూడా అతనికే ఇచ్చేసి మెల్లిగా నడవసాగింది. కొంచెం బరువుగా మెత్తగా మనస్సుకి ఆహ్లాదకరంగా వున్న ఆ నడకకీ ప్రయాణానికీ ముగ్ధుడవుతూ నడక సాగించాడతను.


                                                      *    *    *    *


    మామిడి తోపులోకి ప్రవేశిస్తూనే ఆమెని క్రిందకి దించుతూ అన్నాడు వేణు.
    "ఏదో భుజంమీద గుచ్చు కుంటోంది. కొంచెం చూడు విరజా.
    తెల్లబోయి మెడమీద తడుముకుంది. క్రాస్! నవ్వుకుంది. సాయంకాలపు నీ రెండలో మామిడి ఆకులు తళతళా బంగారంలా మెరుస్తున్నాయ్. మామిడి ఆకుల మధ్యనుంచి సూర్యుడు ముక్కలు ముక్కలుగా తరిగిన మామిడి పండులా వున్నాడు.
    "ఎలా ప్రక్కన తీసివేయమంటావా?" ఒక చేత్తో దాన్ని తడుముకుంటూ అడిగింది.
    "ఏమిటిది?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "క్రాస్__"
    తీసి చూపించింది. భగవాన్ క్రీస్తుకి గుర్తుగా మెడలో వేసుకునేది. సర్వ క్రైస్తవులు అభిమాన పరస్పరంగా వేసుకుని భగవానుని ప్రతిబింబంగా చూసుకునేది.
    ఆశ్చర్యంతో అడిగాడు. "నీవు క్రిష్టియనివా! విరజా?" అతని ఆశ్చర్యానికి అర్ధం తెలియక అడిగింది. "అవును. ఏం?" "అహ_అదికాదు_నీవు క్రిష్టియన్ వి అనుకోలేదు.
    "మరేమనుకున్నారు?" విస్మయంతో అడిగింది.
    "బ్రాహ్మణ కన్యవే అనుకున్నాను__"
    నవ్వింది. ముత్యాల వంటి పలువరుస కనిపించేట్టు, నల్లని కళ్ళు వికసించేట్టు, ఎదుటివారి హృదయం స్పందించేట్టు చక్కగా ఆహ్లాదకరంగా నవ్వింది.
    "ఇప్పుడేమైనా అభ్యంతరమా?"
    చిన్ని బుచ్చుకుని అడిగాడు. "అలా అనకు విరజా! మనమధ్య ఏనాడూ కులమత భేదాలు అడ్డురావు. మన పవిత్రమైన స్నేహ వారధిలో వర్గకాలుష్యం ఎప్పుడూ ప్రవేశించదు. ప్రవేశించబోదు. స్వచ్చమైన స్నేహరాశికి కులమేముంది, మతమేముంది? ఏదో అలాంటి వరుసకి నా భావన కొలది అడిగాను. అంతే కానీ నీవు క్రిష్టియన్ వి అయినా, బ్రాహ్మణకన్య అయినా, ముస్లిమ్ వి అయినా నా మనసుకి ఒకటే."
    కొద్దిగా జీరబోయిన గొంతుకతో తన ఆ బాల్య స్నేహితురాలూ, తన సహాధ్యాయినీ తనని ఇంతగా అర్ధం చేసుకొన్న తన విరజ తనని అలా ప్రశ్నించిందే అనే బాధతో అన్నాడు.
    అతని చేయి మెల్లిగా అందుకుని కృతజ్ఞతా సూచకంగా మృదువుగా నిమరసాగింది.
    క్రుంగబోయే సూర్యుడికి కాలం తోడు పడుతుంది. శకుంతలాలు మెల్ల మెల్లగా నివాసాలకి బయలుదేరుతున్నాయి. పసుపు పూసుకున్న విరజ పాదాలు పచ్చగా అచ్చం బంగారంలా ఆ అస్తమిస్తున్న సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి.
    ఉన్నట్టుండి అడిగాడు ఆతురత ధ్వనించే కంఠంతో.
    "నీకు....నీకు పెళ్ళయిందా విరజా?"
    "ఆ...." సిగ్గుపడుతూ అంది.
    విస్తుబోయి ఎండిపోయిన గొంతుకతో అడిగాడు__ "ఎప్పుడు విరజా? ఎవరు? ఎవరితో విరజా? ఎవరా అదృష్టవంతుడు? చెప్పు విరజా"
    అతని కంఠంలో ధ్వనిస్తున్న ఆతురతకీ, ఆ ఆతురత క్రింద దాగివున్న ఈర్ష్యలాంటి వేదనకీ అర్ధంకాని ఆలోచనలు రేకెత్తుతుండగా తల వంచుకుని చూపుడు వ్రేలితో నేలమీద ఏవేవో పిచ్చి అక్షరాలు రాస్తూ అంది.
    "బొమ్మలాటల్లా అయింది వేణూ....అదీ నీతోనే.... ఆ అదృష్టవంతుడివి నీవే...."
    ఫక్కుమని నవ్వాడు హృదయం తేలికైనట్టయి ఆనందంతో మితిమీరిన సంతోషంతో ఆమె తల నిమురుతూ అన్నాడు ఏదో తెలియని అనుభూతి మనస్సుని వెంటాడుతుండగా.
    "భలే చమత్కారివే! నేనేదో అడిగితే ఏదేదో చెప్పి నన్ను పెళ్ళి చేసుకుంటానంటావేం?"
    అతని మనసులోని భావం ఏమిటో తెలుసుకోలేక అతని ముఖంలో ప్రతిబింబించే భావాలని అర్ధం చేసుకోలేక అతని మాటల్లో గోచరించే అర్ధాన్ని అందుకోలేక ఆగింది. ఓ వింతైన అనుభూతితో కూడిన ఆవేశంతో.
    "ఏం తప్పా? చేసుకోగూడదా? స్నేహానికి అడ్డురాని కులం పెళ్ళికి అడ్డొస్తూ వుందా ఏం?"
    అతనూ ఆవేశంగా అన్నాడు.
    "అలా అనకు విరజా! మన మధ్య విభేదాలు అడ్డంకులు అనేవి రాగూడదు. పెళ్ళివిషయం అడిగింది నేనొకందుకు. నీవు చమత్కారంగా మరో దారి పట్టించావు. అయినా పెండ్లి అనేది పెద్దలు చేసేది. దానితో మనకు సంబంధం లేదు__"
    అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఓ విధమైన మెరుపు మెరుస్తూనే వుంది.
    ఏమిటేమిటో పెద్ద పెద్ద పదాల్ని ప్రయోగిస్తున్నాడే ఎందుకా? అని అర్ధంకాక అడిగింది.
    "మీ వాళ్ళు ఒక బొమ్మకు ముడి వేయమంటే వేస్తావా? బొమ్మలాటల్లోలాగా?"
    అతని ఆవేశం ఇంకా తగ్గలేదు. ఎంతయినా మగవాడు మాటంటే పడలేడు. ఆలోచన మీదకన్నా ఆవేశంమీదే దృష్టి ఎక్కువ.
    "మా వాళ్ళు ఎప్పుడూ ఓ కొమ్మకు ముడివేయిస్తారు కానీ బొమ్మకి ముడి వేయించరు. అయినా బొమ్మలాటల్లోలాగా బొమ్మలకు ముడి వేయటానికి నేను ఓ కీలు బొమ్మని కాను. మా నాన్న కీలుబొమ్మల్ని ఆడించాలనుకునేవారు కాదు. అయినా నా పెళ్ళి విషయం ఇప్పుడెందుకులే విరజా పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి మనం ఇంకా ఎంతో పెద్దవాళ్ళం కావాలి. అప్పుడయినా మన ఇష్టాల్ని మనం పాలించుకుని వాటిని పెద్దవాళ్ళు పాటించేలాగా వుండాలి.... పోనిద్దు.... ఇప్పుడెందుకీ పెండ్లి గొడవ.
    "అవునులే నేనే ఏదో పెండ్లి విషయం తెచ్చినట్టు. నీవు అదేమీ ఎరగనట్టు నీ తప్పే లేనట్టు....అబ్బ! యేంత దొంగవు వేణూ! మనసులో ఒకటి....మాటల్లో ఒకటి....నన్ను ఆటలాడిద్దామని కాకుండా ఏమిటిది వేణూ ముందు పెళ్ళి అనేమాట యెత్తిందే నీవు కాదూ?"

 Previous Page Next Page