Previous Page Next Page 
శుభోదయం పేజి 6

 

    ఆ ముగ్గురూ దుండగులూ యింకేవరో కాదు, తప్పక ఆ రౌడీ వెధవలే. యింకా అనుమానం ఎందుకు..... తమ కోపం, కసి తీర్చుకోవడాని కింత దారుణానికి వడిగట్టారన్నమాట. అసలే ఆమె అందంపై కన్నువేసిన ఆ వెధవలు అవకాశం చూసి ప్లాను వేసి ఆమె బతుకు నాశనం చేశారన్నమాట. అన్నెం పున్నెం ఎరుగని ఒఅడపిల్లని యింత ఘోరంగా హింసిస్తారా ......ఆలోచిస్తుంటే రాధాదేవి వళ్ళు ఆవేశంతో వణికింది. ఈ సంగతి రేఖ చెప్పిందో లేదో వెంటనే పోలీసులకి ఈ విషయం చెప్పి వాళ్ళని పట్టుకోమనాలి. రాధాదేవి లేచి చకచక బట్టలు మార్చుకుంది. ఇల్లు తాళం పెట్టేసరికి శ్యామ్ అటో తీసుకువచ్చాడు.


                     *    *    *

    
    రాధాదేవి , శ్యామ్ ఆస్పత్రి చేరేసరికి ఊరు ఊరంతా అక్కడే వుందా అన్నట్టు గుంపులు గుంపులుగా ఎన్నో వందల మంది ఆస్పత్రి దగ్గిర గుమిగూడారు. పేపర్లో వార్త చదివి , కబురు ఈనోటా ఆనోటా విని రేఖ కాలేజిలో ఆడపిల్లలంతా వచ్చారు. ఆడపిల్లలే కాదు ఎంతోమంది విద్యార్ధులు వున్నారు. అమ్మాయిల అందరి కళ్ళల్లో బెదురూ, భయం రేఖ పట్ల జాలి!
    అంతా గుంపులుగా నిలబడి మట్లాడుకుంటున్నారు. గేటు దగ్గిర కాపలాదారువాళ్ళని లోపలి వదలడం లేదు. రేఖ చాలా వీక్ గా , ఇంకా షాక్ లోంచి తేరుకోలేదని , యిప్పుడు యింతమందిని చూస్తే అదంతా మళ్ళీ గుర్తుకువచ్చి బాధ పడ్తుందని యింకొన్నాళ్ళ తరువాత చూడమని , ఎవరినీ లోపలికి వదలోద్దని డాక్టర్లు చెప్పినట్లు నచ్చ చెపుతున్నాడు. అంతా గోలగోలగా వుంది. ప్రతీవాళ్ళు రేఖపై జరిగిన అత్యాచారానికి ఆ క్షణంలోనే ప్రతీకారం తీర్చుకోవలన్నంత ఆవేశంలో వున్నారు.
    రాదాదేవిని, శ్యామ్ ని కూడా ముందు కాపలాదారు లోపలికి వదలలేదు. ఆ ముగ్గురి గురించిన వివరాలు తమకు తెల్సునని వెంటనే ఇన్ స్పెక్టర్ తో మాట్లాడాలని అనగానే రేఖ వున్న వార్డు రూము చెప్పి ఇన్ స్పెక్టర్ అక్కడే వున్నారని చెప్పాడు. రూము వెతుక్కుంటూ వెళ్ళారు ఇద్దరూ. గుమ్మం ముందో పోలీసు కాపలా వున్నాడు. అతనికి విషయం చెప్పి లోపలికి వెళ్ళారు ఇద్దరూ. ఇన్ స్పెక్టర్ మంచం దగ్గర రేఖ కళ్ళు విప్పి ఇంకేమన్నా చెప్తుందా అని చూస్తూ కూర్చున్నాడు. గదిలో ఓ ముసలవ్వ పనిమనిషి , రేఖ తమ్ముడు గాబోలు పదిహేనేళ్ళ వాడు కూర్చున్నాడు. మంచం మీద పడుకున్న రేఖ రెండు రోజులలో గుర్తుపట్టలేనట్టు మారిపోయింది. నల్లగా కమిలిపోయి, గాట్లతో వున్నా మొహం పీక్కుపోయింది. ఎడ్చినందువల్ల గాబోలు కళ్ళు వచ్చి వున్నాయి. ప్రాణం లేని దానిలా నిశ్చలంగా పడి వున్న రేఖని చూసేసరికి రాధాదేవి, శ్యామ్ చలించి పోయారు. ఒక్కక్షణం చకితులై నిలబడిపోయారు. వారిని చూసి ఇన్ స్పెక్టర్ శబ్దం చెయ్యవద్దని వారిస్తూ గుమ్మం బయటికి పిలుచుకు వెళ్ళాడు. రాధాదేవి ఆ ముగ్గురి రౌడీల విషయం తనకు తెల్సినది అంతా చెప్పింది. "ఈజిట్ ఉండండి ఆ వెధవల పని ఈ తక్షణం పడ్తాను" అంటూ ఉగ్రుడై వారిని రేఖ దగ్గిర ఉండమని వెంటనే బయటికి వెళ్ళాడు. రాధాదేవి, శ్యామ్ యు=యిద్దరూ రేఖ మంచం దగ్గిర కూర్చున్నారు. సేడేటివ్ ప్రభావంలో వున్న రేఖ గదిలో మాటల అలికిడికి మత్తుగా కళ్ళు కాస్త తెరిచింది. రాదాదేవిని, చూస్తూనే గుర్తుపట్టినట్లుగా ఆమె కళ్ళు వెడల్పు అయ్యాయి. వెంటనే ఒక్క ఉద్డుతున లేవబోతూ 'అంటీ" అంటూ బావురుమంది. రాధాదేవి చటుక్కున ముందుకు వంగి ఆమెను పొదివి పట్టుకుంది. రాధాదేవి గుండెల మీద వాలి "అంటీ.....వాళ్ళు......వాళ్ళు అనుకున్నంతా చేశారు. అంటీ.....మీరు అన్నది నిజమే. అంటీ.....వాళ్ళు.... నన్ను ....నన్ను......" అంటూ హృదయ విదారకంగా ఏడ్చింది. "రేఖా....ఊరుకోమ్మా....ఊరుకో..... ఇంకేం ఫరవాలేదు నీకు....ఏడవకమ్మా ఏడవకు" రాధాదేవి ఒదార్చబోయి తనే ఏడ్చింది. శ్యామ్ కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. ఎంత ఓదార్చిన రేఖ దుఃఖం అంతులేనిదిలా వెక్కిళ్ళు పెడ్తూనే వుంది. ఆ ఏడుపు విని పరిగెత్తి వచ్చిన నర్సు గాభరాగా డాక్టరుని పిలుచుకు వచ్చింది. ....డాక్టరు రేఖని చూస్తూ "ఏడవనీ , అదే మంచిదన్నట్లు" సౌంజ చేశాడు. "హృదయంలో కారుడు కట్టిన బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తే గుండె తేలిక పడ్తుంది" అన్నాడు నెమ్మదిగా. తల్లిదండ్రుల దగ్గిరయినా అంత ఏడవని ఆ అమ్మాయి వీళ్ళని చూసి అంత ఏడుస్తూన్నందుకు ఆశ్చర్యపడి శ్యామ్ ని అవతలికి పిలిచి వివరాలు అడిగాడు. అంతా విని తలపంకించి "ఆమెని అడ్డకండి. మాట్లాడనీండి, ఏడవనీండి . కాసేపు ఏడిస్తే సర్దుకుంటుంది" అన్నాడు. "అంటీ.....వాళ్ళు.....ఆ వెధవలు నన్ను లాక్కెళ్ళి అరవడానికి లేకుండా, కదలడానికి లేకుండా చేసి రాక్షసుల్లా మీదపడి యింక చెప్పలేనట్టు రాధాదేవి గుండెల మీద పడి వెక్కివెక్కి ఏడ్చింది.
    "ఊరుకోమ్మా రేఖా.... యింక చెప్పకు తల్లీ. అదో పీడకల తల్లీ. మరిచిపోయి గుండె దిటవు తెచ్చుకో" రాధాదేవి గద్గదంగా అంది.
    "ఎలా మరిచిపోను అంటీ? కళ్ళు తెరచినా మూసినా అదే కనిపిస్తుంది. నా వళ్ళంతా చూడు అంటీ ఏం చేశారో , కుక్కల్లా కరిచారు. జంతువుల్లా పీకారు. .....నేను వాళ్ళకేం అపకారం చేశానని నా మీద యింత కక్ష కట్టారు.... ఓ ఆడపిల్లనిలా నాశనం చేస్తే వాళ్ళకేం వస్తుంది? నా అందమే నాకు శత్రువయింది అంటీ.....శ్యామ్ , చూశావా! నిన్ను, నీ రూపుని అవహేళన చేసినందుకు భగవంతుడు నాకేం శిక్ష విధించాడో తెలుసా, ఏ అందం చూసుకుని వెక్కిరించానో ఆ అందంతోనే నన్ను శిక్షించాడు..... శ్యామ్ నన్ను క్షమించగలవా? " ఉబికివస్తున్న దుఃఖం కన్నీళ్లుగా పారుతుంటే ఆవేదనగా ఆవేశంగా మాట్లాడేస్తున్న రేఖని చూసి శ్యామ్ గొంతులో దుఃఖం అడ్డుపడింది. చప్పున రేఖ దగ్గిరికి వెళ్ళి ....."ప్లీజ్ రేఖా .....ఫర్ గాడ్ సేక్ , అలా ఎప్పుడూ ఆలోచించకు. అదంతా కుర్ర చేష్టలు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ నిక్ నేమ్స్ తో కాలేజిలో ప్రతివాళ్ళూ పిలుచుకుంటారు. ఆ మాత్రం దానికి దేముడు నిన్నిలా శిక్షించేటంత కఠినాత్ముడు కాడు. అలా అలోచించి నన్ను గిల్టీ చెయ్యకు" బాధగా జాలిగా అన్నాడు.
    "రేఖా ....అమ్మా ....చూడు నీవింక ఈ విషయం మరిచిపోవాలి..... చూడు రోజూ ఎందరికో ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇలాగే ఎవరో నిన్ను తీసికెళ్ళి కాలో, చెయ్యో విరక్కోట్టారనుకో, శారీరకంగా బాధపడతావు. కాని మానసికంగా బాధపడ్తావా....యిదీ ఒక ప్రమాదమే జరిగింధనుకో. ఒక అవయవానికి దెబ్బ తగిలింది. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. నాల్గురోజుల్లో మళ్ళీ మాములు మనిషివవుతావు.....మాలిన్యం మనసుకి గాని శరీరానికి అంటదు రేఖా....."
    "అంటీ, మీకేం మీరిలా అంటారు. అందరూ నన్ను ఎంత జాలిగా చూస్తున్నారో చూడండి. రేపటి నుంచి నన్ను అందరూ ఎంత చులకనగా చూస్తారో నాకు తెలియదా అంటీ. అమ్మ నాకోసం ఎంత ఎడుస్తోందో తెలుసా.....నీ బతుకు నాశనం అయిందే అమ్మా - ఇంక నీ గతెమిటే , పెళ్ళి ఎలా అవుతుందే అంటూ ఒకటే ఏడ్పు.....నే నెందుకు యింకా బతకాలి అంటీ" మళ్ళీ ఏడవసాగింది రేఖ. రాదాదేవికి ఆ తల్లి తెలివితక్కువ తనం మీద విపరీతమైన కోపం వచ్చింది. అసలే భయంతో, గుండె బెజారయి ఏడుస్తున్న కూతురికి జీవితం పాడయిందని , పెళ్ళి కాదని యిలాంటి మాటలు ఆమె ముందు అని మరింత పిరికిదాన్ని చేస్తుందా.....ధైర్యం చెప్పి, ఏం జరగలేదు నాల్గురోజులలో మాములు అవుతావు అని బుజ్జగించాల్సింది పోయి ఆమె కూతురు ముందు ఏడ్చి రేఖని మరింత బెంబేలు ఎత్తించిందన్నమాట.

 Previous Page Next Page