Previous Page Next Page 
కేదారం పేజి 7


                                                       అంతరం


    వేడి తగ్గింది. సాయంసంధ్య చీకటి ముసుగు వేసుకుంటున్నది. విసురు గాలి వీస్తూంది. వేగంగా వీస్తూంది. గాలి వడికి చెట్లు ఊగుతున్నాయి. కిటికీల తెరలు రెపరెపలాడుతున్నాయి. లాలా కురులు గాలికి ఎగురుతున్నాయి. ఆమె గుండె వేగం హెచ్చింది. అంతా కల్లోలంగా ఉంది.
    ఇంకా రేయి ఎదగలేదు. ఇప్పుడిప్పుడే పున్నమి వెన్నెల వీణారాగం ఆలపిస్తూ అడవుల వైపు పయనిస్తూంది. వాతావరణం గజిబిజిగా ఉంది. కల్లోలంగా ఉంది. ఈ రాత్రి ఏదో జరుగుతుంది అన్నట్లుంది.
    ఇప్పటికి లాలా నిద్రపోవాల్సింది. కాని ఇవ్వాళ దుప్పటి పక్కకు నెట్టి పరుపుమీద పడి ఉంది. నిద్ర జోకొడుతూంది. కనురెప్పలు వాలుతున్నాయి. నరనరంలో నిద్రా తరంగాలు వ్యాపిస్తున్నాయి. కోపం, ప్రతీకారానికి సంబంధించిన ఆలోచనలు మేనువాల్చాయి. ఒక్క కునుకు - ఒకే కునుకు అంతే - ఆమె నిద్రలో మునిగిపోతుంది.
    చప్పున ఆమె హృదయకవాటాలను ఎవరో చప్పుడు చేశారు!
    ఆమె ఉలిక్కిపడి లేచింది.
    చూచింది.
    ఎవరూ లేరు.
    విరిసిన వెన్నెట్లో అంతా నిద్రిస్తున్నారు. అమ్మా-నాన్న, బల్లమీద ఉన్న కూజాలు మూతలకు కప్పిన అల్లకపు సంచులు!
    అంతటా ఆమె గుండె చప్పుళ్లు వినిపిస్తున్నాయి. లోకం సాంతం ఆమె ఎడద దడదడలతో నిండిపోయింది. ఏమీ వినిపించడంలేదు. ఏ ఆలోచనా వెలుగు చూడడంలేదు. అక్తర్ మామ కొండమీదినుంచి దొర్లిపడుతున్నట్లుంది. కళ మందిరంలోంచి బయటపడి మనుషుల గుంపులో దూరినట్లుంది. మబ్బు ముక్కలు దూదిపింజలా ఎక్కడికో హడావుడిగా ఉరుకుతున్నాయి.
    ఏదో జరిగింది. జరిగిపోయింది.
    ప్రకృతి సాంతం అల్లకల్లోలంగా ఉంది. వరండాలో వెలిగే దీపం భగ్గు భగ్గుమని కొట్టుకుంటూంది. చప్పున ఆరిపోయినట్లనిపిస్తుంది. ఇంతలో కళ్ళు మిరిమిట్లు కొలిపేట్లు వెలుగుతుంది. ఆమె ముఖంలోని అంధకారాన్ని మాయం చేస్తుంది.
    లాలా కళ్ళు చీల్చుకొని నలువైపులా చూచింది. ఏమీలేదు. ఏదో వాగ్దానం - తానిచ్చిన మాట - తనను ప్రశించడానికి వచ్చినట్లుంది. అడగడానికి వచ్చినట్లుంది.
    హుఁ- ఆ ఆలోచనను దులిపేసింది. పిచ్చి కాకుంటే నేనెవరికి మాట ఇచ్చాను? నేను వాగ్దానం చేస్తానా? రక్తం తాగే తోడేళ్ళక్కడ? అమాయకం అయిన మేకలెక్కడ? ఈ రెండూ వాగ్దానాలు చేసుకుంటాయా? అసంభవం. అసాధ్యం.
    అంతలోనే ఏదో భావన వచ్చింది. వెన్నెల హద్దులకు ఆవలినుంచి ఎవరో పిలుస్తున్నారు. పిలుపు గాలిలా ఉంది. గాలి సవ్వడిలా ఉంది. ఆమె లేచింది. వళ్లు విరుచుకుంది. అమ్మాయిలు కాళ్ళకు అందియలు వేసుకోవడం మానేశారు - మంచిదైంది. కాకుంటే గత వర్షకాలపు గీతాలకు ఇవే అడ్డంకులు అయినాయి. మనసునిండా మువ్వల చప్పుడే అయినాయి.
    ఘల్లు!
    ప్రకృతి సాంతం ఝల్లుమంది.
    ఆమె ఉలిక్కిపడింది.
    ఆమె చేతి గాజులు రెండు కలుసుకున్నాయి. ఆమెను చూచాయి. కిలకిల నవ్వాయి.
    ఆమె లేచింది. తోట వైపు ఉరికింది. నాలుగు అడుగుల్లో చంద్రుడు అందనున్నాడన్నంత వేగంగా పరిగెత్తింది.
    ఉరికింది. ఆగిపోయింది. తోటలోని చల్లని మెట్లమీద కూర్చుంది. ప్రశాంతంగా కూర్చుంది.
    చంద్రుని వైపు పరుగులు తీసే మేఘశకలం వేగంగా సాగిపోయింది - వెళ్ళిపోయింది - దొర్లిపోయే రాయిలా.
    "ఏమిటిది? ఎవరైనా అలక బూనారా?
    ఆమె బెదిరి ఆలోచించింది. అది బెదురు ఆలోచన. భయభ్రాంతమయిన ఊహ!
    లోకం సాంతం అదిరిపడింది. దూరాన రైలు కూసింది. గుండెలు అవిసేట్లు కూసింది. భూదేవి గుండె కుదిపింది-కదిలింది- ధక్....ధక్....ధక్. పిట్టలు బెదిరి గూళ్లకు తిరిగిరాని పిట్ట పిల్లల కోసం అరిచాయి, మల్లెపందిరి కొనకొమ్మల్లో పూసిన పూలు గడగడలాడేయి.
    ఆమె నేరేడు చెట్టుకు తల ఆనించింది. మెదడులో ముసిరే జ్ఞాపకాలను పట్టుకోవాలనుకుంది.
    ఇంతకుముందే_ఈ సాయంకాలమే హమీదా అక్క చెప్పింది-జనం తనను హంతకురాలిగా చూస్తారని-రోమును సాంతం తగలపెట్టిన నీరో చక్రవర్తిని చూసినట్లు చూస్తారని-రాముని వనవాసానికి పంపిన కైకను చూసినట్లు చూస్తారని.
    హమీదా చాలా బాధగా చెప్పింది-అతడు సన్యాసం స్వీకరించడానికి వెళ్లిపోయాడని. హమీదాకు అతనిమీద అనంతమైన సానుభూతి. పూలు తనకోసమే పూయించుకోవడం స్వార్థంకాదా! ఆమెకు అమాంతంగా కోపం వచ్చింది.
    "లోకంలో ఉన్న దీపాలన్నింటినీ ఆర్పేయడం కళ అనిపించుకోదు" అన్నది.
    లాలా అది విన్నది. నిశ్శబ్దంగా కూర్చుంది. ఇంతలో కోపం పొంగింది. తనను గురించి ఈ జంతువుకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అనుకుంది. వెంటనే కలం కాగితం అందుకుంది. చేతులు నొప్పులు పెట్టేదాకా రాసింది. అప్పుడు లోకాన్ని చూచింది.
    పడమట సంధ్యారాగం పరచుకుంది. కోపించిన కాంత చెక్కిలిలా అంగణంలో అరుణిమ నిండింది. మసీదు నుంచి ప్రార్థనా స్వరం వినిపించింది. చప్పున తలమీద ముసుగు కప్పుకుంది. సంధ్యా సమయంలో ఎవరిని గురించీ చెడు పలకరాదంటుంది అమ్మ. ఆ మాట జరుగుతుందట. అందుకే రాయడం ఆపేసింది. అదిలింపులు, బెదిరింపులూ అన్నింటినీ పెదవిదాటి రానివ్వలేదు.
    నేరేడు చెట్టుకు తల ఆనించి ఇవన్నీ ఆలోచించింది. అప్పుడు ఆమె చుట్టూ వంటరితనపు కటికపొగ కమ్ముకున్నట్లనిపించింది. తాను వంటరిని అనే భావన తొలిసారి కలిగింది. ఎన్నో శతాబ్దాలుగా వంటరిగా అలా కూర్చున్నట్లనిపించింది. కాలానికీ, లోకానికీ దూరంగా ఎవరో తనను పిలుస్తారు. పిలిచీ పిలిచీ అలసిపోతాడు. తిరిగి వెళ్ళిపోతాడు. కాని తాను పలకదు.
    భయం, భీతి ఆమెమీద దాడిచేశాయి. ఆమె బెదిరిపోయింది. జరగనున్న పరిణామాలు అల్లాకే తెలియాలి. ప్రకృతి అల్లకల్లోలం అవుతూంది. అందులో ఆమె వేడి నిట్టూర్పులు కలిసిపోతున్నాయి. ముత్యాలా మెరిసే కన్నీటిచుక్కలు ఆమె చెక్కిళ్ళమీద రాలుతున్నాయి.
    ఈ మధ్య సాయంకాలం కాగానే ఆమె గుండెల్లో నల్లని చీకట్లు పరచుకుంటున్నాయి. కాని రాత్రులలో-అందాలు విరజిమ్మే రాత్రులలో ఆమె ఎన్నడూ కన్నీటిచుక్క రాల్చలేదు.

 Previous Page Next Page