"చూశారా - ఈ చిత్రం బొమ్మట! బొమ్మ! అబ్బ ఆ వంటరితనం చూస్తే భయం వేస్తుంది. సముద్రానికి ఒడ్డు ఎక్కడా కనిపించదే! 'ఆర్టిస్టు ' అనిపించుకోవాలనే ఆదుర్దాలో మనుషులకు మతి పోతుందనుకుంటా. హమీదా అక్కా! మీరే న్యాయం చెప్పండి - వంటరిమనిషి తరంగాలు లెక్కిస్తూ సముద్రపు ఒడ్డున ఎంతకాలం కూర్చోగలడు?"
లాలా కేకలు పెడ్తూ అతని ముందు నుంచే అనేకసార్లు వెళ్ళింది. గదిలో కూర్చొని పెద్దగా కేదారరాగం ఆలపించింది. అయినా అతను పట్టించుకొందే! చెవుల్లో సీసం పోసుకుంటూన్నట్లు కూర్చున్నాడు. ఆమెకు విసుగు పుట్టింది. ఎదురుగా వెళ్ళి చివాట్లు పెడదామనుకుంది. చేతిలోని బొమ్మను లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పారేడ్డామనుకుంది. అయినా మాట్లాడలేదు.
ఆనాడు లాలా అతన్ని గురించిన భోగట్టా సాంతం సేకరించింది. అతని అలవాట్లను గురించి అంచనా వేసింది. అతన్ని హేళన చేయడానికి సకల సామాగ్రి సిద్దం చేసి ఉంచింది.
సాయంకాలం అయింది. అతడు రాలేదు. రోజూ వచ్చేవాడే. హమీదా పిల్లల్తో బంతి కోసం పోట్లాడేవాడు. లాలాను గురించి తల్లికి లేనిపోనివి కల్పించి చెప్పేవాడు. నాన్నతో నీతులు చెప్పించుకునేవాడు. ఆ రోజు రాలేదు.
"కే షేకహు సాజన్ బినా నీంద్ న అయే
బిరహ సతాయే"
పాట పాడుతూ ఊగుతుంది ఇమ్తియాజ్ వచ్చాడు. హమీదా అక్కతో గుసగుస సాగించాడు. తన చాకచక్యాన్ని డబ్బుగా మార్చుకోవడానికి ఇమ్తియాజ్ ఎక్కడికో వెళ్లి పోతానంటున్నాడు. ఇదీ లాలా విన్నది- ఆమె అర్ధం చేసుకున్నది.
'ఎక్కడికి? ఆమె సుదూరప్రాంతాలకు తన చూపును ఉరికించింది. ఎదురుగా ఎత్తేన కొండలు కనిపించాయి. కొండల మీది నుంచి దొర్లి పడుతున్న రాళ్ళు కనిపించాయి. ఒక రాయి విసురుగా వచ్చింది. ఆమె గుండెకు తాకింది. దాహం గొంతు ఆరిపోతుంది.
అది వింటే నవ్వొచ్చింది. నవ్వు కాకుంటే ఏమిటి? ఎముందక్కడ ? నెత్తి గోక్కొనే ఇమ్తియాజ్ కూడా విరగబడి నవ్వాడు.
"ఎందుకా వెకిలి నవ్వు? ....." తీక్షణంగా అడిగింది లాలా.
"ఏం లేదు పిచ్చాసుపత్రి మనింటికి ఎంత దూరమా అని'
ఆమె మాట్లాడలేదు. మూతి ముడుచుకుంది. తంబూరా తీవలు సవరిస్తుంది.
ఇద్దరూ ఏదో కుట్ర పన్నినట్లున్నారు. అతను ఇమ్తియాజ్ గంబీర వదనాన్ని చూచాడు. "విన్నావా బాబూ! పెద్దమామ అక్తర్ మామను శానిటోరియంలో చేర్పించాట" అన్నాడు ఇమ్తియాజ్' తో.
ఈ మాట మీద ఇద్దరూ బయటపడతారనుకుంది. ఇమ్తియాజ్ జరిగిందంతా వెళ్ళకక్కుతాడనుకుంది. కానీ ఇమ్తియాజ్ కిక్కురుమనలేదు. తెల్ల ముఖం వేసుకొని కూర్చున్నాడు.
'ఒక్క అక్తర్ మామే కాదు - ఇంకెంతమంది వెళ్ళాలో శానిటోరియంకు? ఈ ఆడవాళ్ళు క్షయ క్రిములు. నవ్వుతూ తుళ్ళుతూ ఉండే జనాన్ని గోరీలోకి దింపేస్తారు' అని గది తలుపులు మూసుకున్నారు.
ఏమిటీ కధలు వ్యధలు!
ఆమె తంబూర నెలకు కొట్టింది.
ఆకాశంలో చిక్కని చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రుడు గోరీల గోతుల్లోకి వెళ్ళిపోయాడు ఎవరినో వెదకడానికి. వెన్నెల విరాగిని అయి భుజం మీద విచిత్రవీణ ధరించి , ఎక్కడో మందిరపు చీకట్లో కూర్చొని రాగం ఆలపిస్తుంది. సాజన్ బినా నీంద్ న అయే - ప్రియుడు లేక నిదురరాదు.
ఆకాశంలో చుక్కలు కన్నీటి చుక్కల్లా మిలమిలలాడాయి. కదిలాయి వణికాయి. ఒక బాష్పబిందువు రాలింది. ఆకాశంలో ఒక బంగారు రేఖ మెరిసింది. లిప్త పాటు నక్షత్ర మాలిక వెలిగింది. ఆరిపోయింది.
రేయి సాంతం లాలా కళలు గన్నది. కలల్లో అక్తర్ మామను చూచింది. అతడు చీకటి కొట్లో పడి కొట్టుకుంటున్నాడు. వెలుగు చుక్క కోసం వేచి ఉన్నాడు. చంద్రుని కోసం వేయి కనులతో నిరీక్షిస్తున్నాడు. చంద్రుడు రాడు. అతను ఏడ్చి ఏడ్చి సగం అయినాడు.
హమీదా, గజాల అక్కను చూడ్డానికి రోజూ ఆస్పత్రికి వెళ్ళేది. ఆమెకు భరింపరాని కడుపునొప్పి , నొప్పి భరించలేక ఆమె పాషాణం తినడానికి ప్రయత్నించిందట.
చాలా కాలం తరవాత - ఆ - రాత్రి - లాలాకు - ఆకాశంలో ఎవరి కోసమో కేకలు వేస్తూ తిరిగే పక్షి కేక వినిపించింది. చెట్ల మీది పక్షులు భయంతో కేకలు వేస్తున్నాయి. "ఊష్ నిశ్శబ్దం అరవకండి" అని దూరం నుంచి వినిపించే కేకకోసం చెవులను అర్పించి లాలా కనురెప్పలు వాల్చింది.