"ప్రియుడు లేక నిదురరాదు...."
విచిత్రవీణ భుజంమీద విరాగిని వేళ్ళు అతివేగంగా చలిస్తున్నాయి. తీవలమీద ఆమె వేళ్ళు చిత్రవిచిత్రంగా కదులుతున్నాయి. ఆమె గానం అందరినీ ముగ్ధుల్ను చేస్తుంది. ఆమె రాగంలో మైమరచింది. స్వరం తప్పింది. మైకం కమ్ముతూంది. వినేవాళ్ళను మైకంలో ముంచుతూంది. రాళ్ళనుగా మారుస్తుంది. ఆమె రాగం ముగుస్తుంది. ఆమె స్వయంగా గీతం అవుతూంది.
లాలా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె చంద్రుణ్ణి చూచింది. చంద్రుడు ఊగుతున్నాడు. జాగ్రత్తగా కన్నీరు తుడుచుకుంది.
ఆమె నేరేడు చెట్టుకింద కూర్చుంది. కాళ్లు చాచింది. కొమ్మల్లోంచి చొచ్చుకొని వచ్చిన వెన్నెలను చూచింది. వాటికి స్థిరత్వం లేదు. కదలాడుతున్నాయి. కప్పలు ఎగిరి వచ్చాయి. మెట్లమీద కప్పగంతులు వేస్తున్నాయి.
రాత్రి రాణి మీద ఏదో పక్షి రెక్కలు రెపరెపలాడేయి. చెట్టు సాంతం గడగడలాడింది. చెరనుండి విడివడ్డట్టు గాలి ఉరికివచ్చింది. గాలులు ఎందుకో వచ్చాయి. ఎవరినో వెదకుతున్నాయి. హాయిగా నిద్రిస్తున్న చెట్లు ఉలిక్కిపడ్డాయి. చిన్నచిన్న కొమ్మలు నిరాశ్రయాలయి చేతులు చాచుతున్నాయి. ఎవరినో పిలుస్తున్నాయి. పండుటాకులు కేకలు పెడ్తూ నేల రాలుతున్నాయి. గాలివేగం హెచ్చింది. ఎండుటాకుల్ను దూరంగా తీసుకుపోయింది. తోటలోని పరిమళాలన్నీ ఒకేసారి వ్యాపించాయి. చంద్రుని కాంతి వెలిగింది.
ఈ దారిన ఎవరు వస్తారు? వెలుగుతున్న చంద్రుని చూచి ఆమెకు ఏదో నీడ జాడ గుర్తుకు వచ్చింది. అదే-ఆ నీడే-ఆమె మనసులో వెన్నెల విరియజేస్తున్నది. విరిసిపోతున్నది.
ఈ చీకటిలో కూడా ఏదో మంత్రం ఉంది - రాత్రి చీకటిలో. ప్రకృతిని సాంతం నిద్రపుచ్చి, దుప్పటి కప్పి విహారానికి వెళ్ళవచ్చు. అంతు తెలియని సముద్రపు వడ్డున నుంచోవచ్చు. తరంగాలు లెక్కిస్తూ జీవితం గడిపేయవచ్చు. ఈ చీకటిని భేదాలు లేవు. అది అన్నింటినీ చెరిపేస్తుంది- ఈ వెన్నెల ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో ఎవడికి తెలుసు?
కొందరు తమ నిద్రలో స్వప్నజగత్తును నిర్మించుకుంటారు. కాని ఏ కదలికయో వారికి వాస్తవ జగత్తును చూపుతుంది.
ఎంతో దూరంగా వచ్చిన వాయుతరంగం ఆమె వెంట్రుకలను చెవులమీదికి కదిలించింది. గాలి చెవిలో గుసగుసలాడింది-నీ జ్ఞాపకాల రూపాలు గుర్తించగలవా? ఆత్మీయత, ప్రేమ, అనురాగం - వీటిని నీ మనసులో జోకొట్టి నిద్రపుచ్చావు - నీ పిరికితనం వల్ల. కాని కొంటె పిల్లల్లా అవి లేచి కూర్చుంటున్నాయి.
లాలా భయంతో వణికిపోయింది. తన దగ్గరున్న తాళంచెవులు చూసుకుంది- ఇవ్వాల్టిదాకా వాటిని వాడదలచలేదు - తన అదృష్టపు పేటిక తెరవదలచలేదు. అందులో ఎన్ని గెలుపులు, ఎన్ని ఓటములు దాగి ఉన్నాయో!
ఇవ్వాళ తీర్పు జరిగిపోతుంది. ఈరోజే రాముడు శివధనుస్సును విరిచాడు. అది తనకు బహుమానంగా అందుతుంది. కాని వద్దు. తానొక పూలమాట కాదలచలేదు. కొన్నవాడు దాన్ని జేబులో వేసుకొని వెళ్ళిపోతాడు. అతడు ఇంగ్లండు వెళ్లి ఉండడు. జీవితాంతం సముద్రపు వడ్డునే గడిపేస్తాడు. చీకటి కొట్లో పడి వెలుగురేఖ కోసం ఏడుస్తాడు. ఒకరోజు వస్తుంది. అతని కోసం కూడా ఆకాశంలో దీపావని వెలుగుతుంది.
ఇవ్వాళ అంతా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. అక్తర్ మామ చీకటి కొట్లోంచి పారిపోయాడని శానిటోరియం డాక్టరు తెలియపరచాడు. అతడు ఆకాశం వైపు వెళ్ళిపోయాట్ట! ఏదో వెదుకుతూ వెళ్ళిపోయాట్ట. అది విని ఇంట్లో వాళ్ళంతా ఏడ్చారు. లాలా మాత్రం పెద్దగా నవ్వింది. కిలకిలా నవ్వింది. ఇవ్వాళ చంద్రుని విరాగిని అడుగడుగునా దీపాలు వెలిగించి ఉంటుంది.
ఆమె మనసుమీద వడగళ్ళ దాడి జరిగింది. అక్తర్ మామ కోసం ఏడ్చే హమీదాకు 'అతడు' గుర్తుకు వచ్చాడు. అతణ్ణి కొండలమీంచి దొర్లకుండా కాపాడాలనుకుంది. పాపం! వంటరితనం ఎంత చెడ్డది! ఎవరో ఒకరు తనకోసం నిరీక్షించడం ఎంత బావుంటుంది! అతడు ఇంకా సముద్రపు వడ్డునే ఉండి తరంగాలు లెక్కిస్తుంటాడు. చంద్రోదయాన్ని ఎదిరి చూస్తుంటాడు. స్త్రీలు క్షయ క్రిములు! ఆమెకు అమాంతంగా గుర్తువచ్చింది.
అనుమానాల చీకట్లు దాడిచేశాయి-ఆమెమీద. ఏమిటిది ఇంత వెన్నెల! ఇహ చంద్రుడు అస్తమించడులా ఉంది. ఇంత వెన్నెల, ఇంత వెలుగు, ఇంత పరిమళమైన రేయి ఉంటుందా?
ఒకచోట జీవితం పట్టపగటి ఎండలా మాడిపోతుంటుంది. ఒకచోట అంధకార బంధురం అవుతుంది. అక్కడ వెన్నెల కిరణం కూడా చొరరాదు. తన మనసులో అనుమానాల అంధకారాలను కూర్చుకున్నప్పుడు చంద్రకిరణం గురించి ఆలోచించనైనాలేదు.
లాలా ఆలోచనల భారంతో అలసిపోయింది. ఇహ వెన్నెల కొన్ని క్షణాలే ఉంటుంది. క్షణాల్లో వెన్నెల తోడు కూడా విడిపోతుంది. ఆమె తన ఆలోచనలను దూర తీరాలకు ఉరికించింది-తాను బయటపడే మార్గాలను వెదికి తెమ్మని.
ఆకాశంలో చుక్కలు మసకలవుతున్నాయి. అయినా చంద్రుడు వెలుగుతున్నాడు. ఇహ తెల్లవారుతుంది. తన ఉత్తరం అనేక టపాల ద్వారా పయనిస్తుంది. తన నిరాకరణమీద లెక్కలేనన్ని చేతులు ముద్రలు వేస్తాయి. వాయుతరంగాలలో తన వార్త వ్యాపిస్తుంది. వినిపిస్తుంది. ఆమెకు వెన్నెల రాత్రులలో కేకలు వేసే పక్షి గుర్తుకు వచ్చింది.
ఆమె పిల్ల తెమ్మరలా లేచింది. శతాబ్దాలుగా వెలుగుకోసం పరితపించేవారి కోసం దీపాలు వెలిగించడానికి కదిలింది. పిల్లిలా కాళ్ళ బలంతో కదిలింది. ఉత్తరం తెచ్చింది. మల్లెమొక్క నాటడానికా అన్నట్లు గునపంతో గోయి తీసింది. ఎవరి గుండెలోనో రహస్యం దాచివచ్చినట్లు - ప్రకృతి సాంతం వెలిగించడానికి మీటనొక్కినట్లు - ఉత్తరాన్ని గోతిలో పూడ్చింది.
చివరిసారి రాగం ఆలపించి, మకుటం అందుకొని వదిలేసినట్టు, ఆమె రాగంలా కదిలి మంచంవైపు సాగింది.
* సమాప్తం *