Previous Page Next Page 
జనపదం పేజి 6

 

    ఉలిక్కిపడ్డాడు బలరామయ్య. "అదేందిర అట్లంటవు , మీ అమ్మ బోగంది . పూడ్చి పెట్టాలేర - కాలుస్తారు? అన్నాడు. ఏదో రాబోతున్న అవాంతరాన్ని అడ్డుకోవడానికాఅన్నట్టు అన్నాడు. అయినా అందులో అధికారం ఎక్కువగా ద్యోతకం కాలేదు.
    "అవును పూడ్చను కాలుస్త. మా అమ్మ బోగం పని ఎప్పుడు చేసింది? నిన్ను కట్టుకున్నది నీతోనే ఉన్నది" రాముని మాటల్లో ఏదో స్థిర నిశ్చయం ఉంది. సత్యం ఉంది. అయినా దొర కది గిట్టలేదు. అసమ్మతి సూచకంగా తల అడ్డంగా తిప్పాడు. రాముడు తన పట్టు వదలలేదు. గట్టిగా నిలిచాడు. తన అండన చేరినవాడ్ని ఒక్కడ్ని జారవిడుచుకోరాదనుకున్నాడు దొర. "సరే నీ యిష్టం" అన్నాడు దొర - కొంత డబ్బు అందిస్తూ.
    డబ్బుకు ఎంత విలువ ఉందొ ఆనాడు తెలిసింది బలరామయ్యకు. ఊళ్ళో వాడు ఒక్కడూ గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టలేదు. రామునికి గడీ దాటే ధైర్యం లేదు. ఇద్దరు పోలీసుల సాయంతో కాడు సిద్దం చేశాడు. తల్లి శవాన్ని తానే మోసుకెళ్ళి తగలబెట్టాడు రాముడు, దొరా, కొందరు పోలీసులు వెంట వచ్చారు.
    కాష్టపు మంట రాముని గుండెలో రగిలింది.
    తల బాదుకొని ఏడ్చాడు.
    కాడు ఎంతకని కాలుతుంది? కాలి కూలింది. ఇంటికివచ్చి కూలబడ్డాడు రాముడు. బలరామయ్య బ్రతిమిలాడితే ఎంగిలి పడ్డాడు. కాని నిరామయంగా చూడసాగాడు. అయోమయంగా చూడసాగాడు. తల్లి విడిచిపోయిన గుడిసెలోకి వెళ్ళాడు. ప్రమిద వెలిగించాడు. అంతా బోసిగా ఉంది. అంతా రిక్టంగా ఉంది. శూన్యంలా ఉంది. ఏదో అనంతమైన ఎడారిలో ఒంటరిగా నిలిచి విలపిస్తున్నట్లనిపించింది. ఎద ఏడ్చింది కాని అది కంటి దాకా రాలేదు. కళ్ళు ఎండిపోయాయి. ఏదో చిరుగుల మంట రగిలింది. గుండెల్లో, ఎవరినో ఓడించాలనుకున్నాడు. తానేదో గెలవాలను కున్నాడు. పొడవాలను కున్నాడు. అలా అనుకోగానే భయం ప్రవేశించి గుండెలో గుబులు చేరింది. చివాలున లేచాడు. చరచర నడిచి పోలీసు క్యాంపుకు వెళ్ళాడు. ఆ రాత్రికి తాను అక్కడే పడుకుంటానన్నాడు. అలా వారితో స్నేహం పెంచుకో జూశాడు. ఆ రాత్రి తాగాడు. వళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. భుజంలో బుల్లెట్ ఇంకా ఉందనే విషయమే గుర్తులేదనికి!
    ఆ రాత్రి కల వల్లకాడు, ఊడల మర్రి. ఒక బొంద, బొంద మీద పాత గుడ్డలు. ఒక నల్లని కాటుక రంగు మనిషి - గునపంతో తవ్వుతున్నారు. భయం భయంగా అటు ఇటూ చూస్తున్నాడు. రాముడు వెళ్ళాడు. ఇద్దరూ కలియబడ్డారు. ఆ రాక్షసుడు గునపంతో తల మీద కొట్టాడు. - కెవ్వున కేకపెట్టి లేచాడు. చుట్టూ చూచుకున్నాడు. ఏమీ లేదు. చుట్టూ పోలీసులున్నారు. చుట్టి వేశారు. ఏమైందని అడిగారు. ఇంకా గుండె దడదడ లాడుతూనే వుంది. ఏం చెప్పాలో తోచలేదు. చుట్టూ చూశాడు. "తుపాకుల వాళ్ళు నరికేస్తున్నారు " అన్నాడు. ఇంకా వగరస్తూనే . నవ్వారు పోలీసులు. ఒకడు సిగరెట్టు అందించాడు రాముడు కాల్చాడు.
    "వాళ్ళ తావరం చూపించు మసి చేస్తాం" అన్నాడొక పోలీసు వచ్చీ రాని ఉర్దూలో.
    "వాండ్లక చోట ఉంటారనా పొద్దునొక చోటుంటే పొద్దుగూకే యాళ ఇంకొక చోటుంటారు. ఎట్లా చూపుదును?"

    "అన్ని తావరాలు చూపు గాలిస్తాం . పొద్దున్న పోదమా?"\
    రాముడు భుజాన్ని చూసుకున్నాడు గ్రహించాడు పోలీసు. "సరే బాగై వచ్చిన తరవాతనే వెళ్దాం లే" అన్నాడు ఓదారుస్తూ.
    తెల్లవారి తల్లి కాటి దగ్గరికి వెళ్ళాడు రాముడు - ఇద్దరు పోలీసులను తీసుకొని కాటిని చూచి ఊడల ,మ్రరిని చూచాడు. దాని కింద బొంద , దానిమీద పాత బట్టలూ ఉన్నాయి. అవి చూచి తిరిగి వచ్చేశాడు.
    మూడోనాడు బూడిద ఎత్తిపోసిం తర్వాత రాముడ్ని పట్నం తీసుకెళ్ళాడు బలరామయ్య. ఆస్పత్రిలో చేర్పించాడు. ఆపరేషన్ చేసి బుల్లెటు తీసేశారు. కట్టు కట్టారు. మంచం మీద పడి వున్నాడు. బలరామయ్య చాలా సార్లు వచ్చాడు. ఇంకా చాలా మంది వచ్చారు. పోలీసు అధికారులు వచ్చారు. తుపాకుల వాళ్ళను గురించి అనేక ప్రశ్నలు వేశారు. తనకు తెలిసినవీ, తెలియనివి అన్నీ చెప్పేశాడు. వాళ్ళు తన ప్రాణం తీయడం ఖాయమన్నాడు. ఎన్నో రక్షణలు కల్పిస్తామన్నాడు. ఏవేవో ఆశలు చూపించారు. అన్నింటినీ లోంగాడతను. పూర్తిగా సాయం చేస్తానన్నాడు. కాస్త కోలుకుంటున్నాడు.
    ఒకనాడు బలరామయ్య వచ్చాడు. "అమ్మ  పెద్దదినం చెయ్యాలే" అన్నాడు రాముడు. బలరామయ్య కూడా చేతామనే అనుకున్నాడు. సాటివారితో సంప్రతింపులు జరిపాడు. భోగం దాని దినం చేయడమేమిటీ అదీ పట్నంలో అతని హోదాకు తక్కువన్నారు. ఆ విషయం మానుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ లేవనెత్తాడు రాముడు.
    "ఊరు చూస్తే అట్లుండే, పట్నంలో బోగందాని దినమెట్ల చెయ్యాలె?"
    మనసు చివుక్కుమన్నది రామునికి.
    "ఊరికే బొగందీ , బొగండీ అంటారు. మా అమ్మ ఎన్నడు బోగం పని చేసిందండీ. కట్టుకున్న అలికంటే ఎక్కువగుండే. చచ్చేటప్పుడు సుత నువ్వే దాని మనసులుంటివి .నేను నీకు పుట్టినోడ్ని కాదా? చెప్పరేముండీ?"
    బలరామయ్య ఓడిపోయాడు. రాముడు చెప్పినదాంట్లో అబద్దం యిసుమంత లేదు. అమృతవాణి తనకు భార్య కన్నా మిన్నగా సేవ చేసింది. రాముడు వాస్తవంగా తన కొడుకే. అది తన మనసుకే తెలుసు. అయినా ఆ విషయం బహిరంగంగా చెప్పలేడు. సంఘం తన సమాజం దాన్ని ఒప్పుకోదు. సమాజం సత్యాన్ని అంగీకరించదు. బలరామయ్య మనసులో కలవరం చెలరేగింది. ఏం చెయ్యాలో తోచలేదు. రాముడన్నది బహిరంగంగా ఓప్పుకోడానికి దొరతనం అడ్డం వచ్చింది. "రాముడూ! సత్రంలో అన్ని ఇంతజాములు చేస్త. దినం చేసుకో. ఈ పట్నంలో ఎవరు ఎవడిని కనిపెడ్తాడు?" అన్నాడు .
    "మల్ల మీరోస్తరా?"
    చూస్త!"
    గూడకు కట్టిన కట్టుతోనే దినం చేశాడు రాముడు. బాలరామయ్య చెప్పింది వాస్తవం పట్నం ఎవడు ఎవడిని గుర్తిస్తాడు? చాలామంది బాపలు వచ్చారు. వాళ్ళు భోజనాలు చేస్తుంటే తల్లి తింటున్నట్లు సంతృప్తి చెందాడు రాముడు! తల్లికి ఇష్టమైన పదార్ధాలన్నీ వండించి పెట్టించాడు. బాపలు భోజనాలు చేసి త్రేనుస్తే వారిలో తన తల్లిని చూసి ఆనందించాడు రాముడు! సత్రం ఖాళీ అయి వంటరిగా మిగిలిపోతే ఏడుపు వచ్చింది రామునికి. తల్లి తనను వంటరివాడ్ని చేసి వడలిపోయి నట్లనిపించింది. ఇంత విశాల ప్రపంచంలో తనకు 'నా' అనేవాడు లేదు. దొర మహాదాతలాగా ఇంత డబ్బే పారేశాడు. కనీసం ఇటు తొంగి చూడలేదు. అన్నీ తలచుకుంటే రామునికి దుఖం పొంగింది. కుమిలి కుమిలి ఏడ్చాడు. అతనికి తుపాకుల వాళ్ళే నయం అనిపించింది. వారికి కులాలు, మతాలూ లేవు. వారికి రెండే కులాలు. ఉన్నవాడు లేనివాడు . లేనివాళ్ళంతా ఒకటి కావాలి. ఉన్నవాళ్ళను హతమర్చాలి. అందుకే తాను వాళ్ళలో చేరాడు. తుపాకి పట్టాడు. మొనగాణ్ణి అనిపించుకున్నాడు. అక్కడ ఎవడూ తనను బోగందాని కొడుకనలేదు. కాని ఎందుకో వాళ్ళలో ఇమడలేకపోయాడు. వాళ్ళను మోసగించి వచ్చేశాడు. ఆ మాట తలచుకునే వరకు అతనికి ఊడల మర్రి, దాని కింద బొందా గుర్తుకు వచ్చాయి. ఎందుకో గుండె గుబగుబ లాడింది. క్రమంగా నిద్ర ఆవరించింది. తెల్లవారుజామున కలలో ఊడల మర్రి బొంద, దాని త్రవ్వుతున్న కారు నలుపు మానవాకారం! ఏదో గుండె దడ పట్టుకుంది. మేల్కొన్నాడు. గదిలో ఎవడూ లేరు. వంటరితనం మరీ గుబులు పుట్టించింది. లేచి అటూ ఇటూ తిరిగాడు. ఊడల మర్రి, మర్రి కింద బొంద అతన్ని వదల్లేదు. మెదడును ఎవరో గోళ్ళు పట్టి చీలుస్తున్నట్లనిపించింది.

 Previous Page Next Page