'పోనీ ఈ విధంగానైనా నీవు కాస్త కళ్ళు తెరుస్తావని...' వాసంతి నవ్వింది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది. ఉక్రోషంతో, అవమానంతో.... తల్లి వంక చురచుర మింగేసేట్టు చూసింది. 'ఊర్లో వెధవలు నాకు నీతులు చెపుతూ అవమానం చెయ్యాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు... ఛీ.... మీరు.....మీరు.... కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది.
* * *
జరిగిన అవమానం చాలనట్టు మరో నాల్గు రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురుకి షాక్ అయింది జయంతి. దమయంతికి గోపాలకృష్ణకి పెళ్ళి నిశ్చయం అయిందని వాసంతి చెప్పగానే నిర్ఘాంతపోయింది. పక్కనున్న దమయంతి ముసిముసి నవ్వులు నవ్వింది. నోటమాట రానట్టుండిపోయిన జయంతిని చూసి దమయంతి "ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు. నాకేం నీలా పెద్ద కోరికలు లేవు. నీలా అందగత్తెనని అనుకోడం లేదు. ఎనిమిది వేలు తెచ్చుకుంటున్నాడు. నాకు యింతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు. మీ ఇద్దరికైతే రెండేళ్ళే తేడా మాకైతే ఐదేళ్ళుంది. ఐడియల్ అనిపించింది"
"ఇంగితజ్ఞానం, తెలివి వుంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతనూ సంతోషంగా వప్పుకున్నాడు. దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు. మంచీ చెడ్డా తెల్సింది కనుక పెద్దకోరికలు పెట్టుకుని విర్రవీగడం లేదు' తల్లి జయంతిని దెప్పిపొడుస్తూ అంది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది, "నేను కాదన్నవాడిని, నన్ను నలుగురిలో అవమానించిన వాడిని పిలిచి పిల్లనిస్తున్నారా...మీకసలు బుద్ది జ్ఞానం లేదా...." కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి.
"మేం పిలిచి ఇస్తున్నామో, అతనే అడిగి చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరికి కుదిరినా కుదరడమేగా, చూడు జయా, మీనాన్నగారు నీతో చెప్పమన్నారు నీఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో దీని పెళ్ళితో పాటు నీదీ జరిపిస్తారు. లేదంటే నీకోసం ఆగకుండా ముందు దాని పెళ్ళి చేసేస్తాం. నీ వల్ల దానికీ ఆలస్యం అవద్దని నిర్ణయించుకున్నాం. నీవెవరిని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆలోచించి చెప్పు."
'ఈ పెళ్ళి చేయడానికి వీలుకాదు నేవప్పుకోను. వాడు ఈ ఇంటి అల్లుడవడానికి వీలులేదు. నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి మొహం ఇంట్లో చూస్తూ ఉండాలా, వీల్లేదు ఈ సంబంధం చేయడానికి వీలులేదు.'
దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది. 'నీ యిష్టం ఏమిటి మధ్యలో, దానికి, అతనికి, మీకు నచ్చింది ఇది నీ పెళ్ళి కాదు, దాని పెళ్ళి దానిష్టం అంది. వద్దు అంటే మానెయ్యాల్సిన అవసరం మాకేంలేదు....' పద్మావతి కోపంగా అంది.
'దమ్మూ...' జయంతి చెల్లెలితో ఏదో చెప్పబోయింది. 'ప్లీజ్ అక్కా ఇంక అనవసరంగా గొడవొద్దు... సీన్ క్రియేట్ చేయకు. నిర్ణయం చేసుకున్నాం. నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు. నాకెందుకో అతని స్వభావం, మాట నచ్చింది అమ్మావాళ్ళకి నా వల్ల ఇబ్బందులు ఎదురవడం నాకిష్టం లేదు....' దమయంతి తేల్చి చెప్పింది.
జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిల్చుంది ఓ క్షణం, తరువాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకున్న దానిలా విసురుగా బీరువా మీద దున్న ఓ సూట్ కేస్ లాగి బీరువాలోని చీరలన్నీ చకచక పెట్లో పడేసింది. తన పుస్తకాలు, చెప్పులు, టాయిలెట్ సామానులు అన్ని ఓ షోల్డర్ బ్యాగ్ లో పడేసింది. గదిలో చప్పుడుకి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లబోయింది.
'అమ్మా, అమ్మా, గాభరాగా పిల్చింది. పద్మావతి, వాసంతి ఏమిటోనని గాభరా పడిపోతూ లోపలికొచ్చి పెట్టె మూస్తున్న జయంతిని తెల్లబోతూ చూశారు.
"ఏమిటే ఇది, ఎక్కడికి ప్రయాణం' పద్మావతి కాస్త గాభరాగా అంది.
'ఎక్కడికో అక్కడికి, ఈ ఇంట్లో మాత్రం ఇంక ఉండను' రోషంగా అంది జయంతి.
"ఏమిటే జయా! మతిగానీ పోయిందా, ఎక్కడికి వెడదామని ప్లాన్, ఏమిటసలు ఇదంతా' వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టె లాగబోయింది.
'అక్కయ్యా నా దారికి అడ్డురాకు. నేనింక ఈ ఇంట్లో చచ్చినా వుండను. మీరంతా కలిసి నాటకాలాడి నలుగురిలో నన్ను ఇన్సల్ట్ చేశారు. నన్ను అవమాన పరిచిన వారితో నా కళ్ళముందే చెల్లెలు పెళ్ళి చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కూతురు కంటే పైవాడే ఎక్కువన్నమాట. నేనీ ఇంట్లో ఇంక మొఖం ఎత్తుకోకుండా చేశారు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎగిసి పడ్తున్న గుండెలతో ఆవేశంగా అంది.
'ఎక్కడికి వెళతావే....మతి పోయిందా ఏమిటి నీకసలు. ఆడపిల్లవి ఉన్న మాటున ఇల్లువదిలి ఎక్కడికి పోదామని ఉద్దేశ్యం జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని పద్మావతి ఆందోళనగా అంది.
'ఎక్కడికి వెళతానో నీకనవసరం- ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ న్నాయి. నన్ను నాలుగు రోజులు ఆదుకునే స్నేహితులున్నారు. నా ఏర్పాటు నేను చేసుకోగలను' పౌరుషంగా అంది.