Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 7


    "మాటలంటే ప్రాణంలేని అక్షరాల అల్లికేకాదు. మాటలంటే జీవగుళికలు. మాటలకు మంత్ర శక్తి వుందంటాడు ఫ్రాయిడ్" వినయ్ అప్పుడప్పుడూ మాటలకున్న శక్తి గురించి అలా చెబుతుంటాడు.
    ఒక్కసారి తన బాల్యాన్ని కళ్ళముందు సాక్షాత్కారింపజేసిన వినయ్ ను సంధ్య ఆత్మీయతతో చూస్తుంది.
    మన పరిచయాన్ని కూల్ డ్రింక్ తో సెలబ్రేట్ చేసుకుందాం ఏమంటారు?" అని అడుగుతాడు.
    సంధ్య తన ఉనికినే మరిచిపోయి అతనితో వెళ్ళిపోతుంది.
    అప్పుడు మహాలింగంవస్తే ఏమంటాడు తనతో!
    "అందుకేనండీ ఆంజనేయులుగారూ! ఇలాంటి వెధవలకు స్త్రీలను పరిచయం చేయకూడదు. నాలుగు నిముషాలు మాట్లాడాడో లేదో అప్పుడే కూల్ డ్రింక్ తాగడానికి తీసుకెళ్ళాడు. మరో అరగంట ఆగితే కొంప ముంచేస్తాడు. ఆమెను తీసుకెళ్ళిపొండి. వాడికి వావివరసలు లేవు. నీతి నియమాలు లేవు. ఉన్నదంతా ఆడపిల్లల మీద యావ, డబ్బుతో కుళ్ళిపోయిన ఇలాంటి వైరెస్ క్రిములను దగ్గరకు చేర్చకండి. వెళ్ళిపోండి సార్" అని తనకు హితోపదేశం చేస్తాడు.
    "బస్సు వస్తోంది" అప్పుడే మేల్కొన్నట్టు కళ్ళు చిటికరించాడు ఆంజనేయులు. ఆలోచనల గొలుసు తెగింది.
    ఆకాశంలోంచి వూడిపడ్డ నిప్పురవ్వలా ఆర్టీసీబస్సు అంత క్రితం పడ్డ నిప్పురవ్వ ఆరిపోయి, బొగ్గుగా మారినట్లు దానిముందు వ్యాన్.
    "ఎక్కేద్దాం" అన్నాడేగానీ అతనికి వెళ్ళాలని లేదు. ఎవరైనా తెలిసినవాళ్ళు వచ్చి తనపక్కన ఓ అమ్మాయి వుందని గమనిస్తే అతని ఆనందం పూర్తవుతుంది. కానీ అతని దురదృష్టం వల్ల ఒక్కరూ రావడంలేదు.
    చివరిసారన్నట్టు అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనపడలేదు.
    అయిష్టంగానే బస్సెక్కాడు.
    బస్సులేనైనా ఎవరైనా కనిపిస్తారేమోనని వెదికాడు. కానీ ఫలితం లేకపోయింది.
    థియేటర్ చేరుకున్నారు. జనం అంతగాలేరు. టికెట్లు ఇస్తున్నారు ఆంజనేయులు వెళ్ళి టికెట్లు తీసుకొచ్చేసరికి సంధ్య ఎవరో ఓ అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతోంది. రంగుల వలయం ఆమె చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుంది. చిన్నపిల్లలా త్రుళ్ళుతూ, కేరింతలు కొడుతోంది.
    వయసొచ్చిన ఆడపిల్ల తన అస్థిత్వాన్ని నచ్చిన మగవాడితో వెతుక్కుంటుంది" అన్న వినయ్ మాటలు నిజమనిపించింది ఆంజనేయులకు.
    అతను ఆమె దగ్గరగా వెళ్ళేసరికి ఆ అబ్బాయి ఎవరన్నట్లుచూశాడు. ఆంజనేయులు ముఖం ప్రశ్నార్ధంలోకి మారింది.
    "ఇతను మా ఫ్రెండ్ కుసుమ అన్నయ్య. పేరు విజయ్ వాకాడులో బి.టెక్. చేస్తున్నాడు."
    తన గురించి అతనికి చెప్పనందుకు ఆంజనేయులు చిన్నబుచ్చుకున్నాడు. తన గురించి చెప్పడానికి ఏముంది? తను ఆఫ్టరాల్ ఓ గుమాస్తా తను చదివింది బి.ఏ అదే అతను బి.టెక్ ఆగ్లామర్ చాలు అతనికి ఎదుటివాళ్ళు థ్రిల్ గా ఫీలవడానికి.
    అతనివేపు పరిశీలించి చూసాడు ఆంజనేయులు?
    వైట్ బాగీ ఫ్యాంటుమీద నల్లటి గళ్ళున్న డబుల్ బుల్ షర్ట్ టక్ చేస్తున్నాడు. లేటెస్ట్ ఫ్యాషన్ తో కుట్టిన ఆ బట్టలు అతనికి ఎంతో హుందాతనాన్ని ఆపాదిస్తున్నాయి.
    తన రంగు వెలిసిన డెడ్ ఓల్డ్ ఫ్యాషన్ డిజైన్ షర్టు వేసుకున్నాడు. అందుకే చొక్కా కూడా చచ్చిపోయిన వృద్దుడిలాగా కళావిహీనంగా వుంది. ఇక ప్యాంట్ గురుంచి చెప్పక్కర్లేదు. ఎప్పుడో జనం మరిచిపోయిన బెల్ బాటమ్ ప్యాంటు వేసుకున్నాడు. ఈ ప్యాంట్ ల తరువాత నేరో ప్యాంట్ల ఫ్యాషన్ వచ్చింది. ఆ తరువాత బ్యాగీలు సెమీ బ్యాగీలు వచ్చాయి.... కానీ తను మాత్రం వాటిని వేసుకోలేకపోయాడు. తన బతుకే పాతవాసన వేస్తోంది.
    కాలంతో పాటు పరుగెత్తడానికి తన కాళ్ళకు డబ్బు చక్రాల్లేవు. అందుకే తాను ఎప్పుడూ కనీసం ఒక దశాబ్దం వెనుకనుంటాడు.
    ఏదో చెప్పటానికి ఇబ్బంది పడుతున్నట్టు చూసింది సంధ్య ఆంజనేయులు వైపు ఫరవాలేదు చెప్పు అన్నట్టు ఆ కుర్రాడు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు.
    "విజయ్, నేనూ పక్క థియేటర్ కు వెళతాం." అని ఆగి "సినిమా వదిలాక వచ్చేస్తాను. ఈ థియేటర్ బయటే వుండు. కలిసి వూరెళదాం. నువ్వు వెళ్ళిపోతే ఇకంతే. ఇంటి దగ్గర అమ్మ చంపేస్తుంది" గబగబా అని తన చారడేసి కళ్ళను ఇంకా సాగదీసింది సంధ్య.
    ఆంజనేయులు చేతిలోని రెండు టికెట్లు గాలికి వూగుతున్నాయి. అందులో ఏదో వెక్కిరింత వున్నట్టనిపించింది ఆంజనేయులకు.
    సంధ్య, విజయ్ వెళ్ళిపోయారు.
    మళ్ళీ తను ఒంటరి. సంధ్యకి కూడా ఓ తోడున్నాడు. ఆమె బాధలను, సంతోషాలను పంచుకునేందుకు మరో ప్రాణి వుంది కానీ తనకు ఎవ్వరూలేరు. అనంతమైన ఈ విశ్వంలో తను ఒంటరి. తన చుట్టూ లక్షలమంది, కోట్లమంది వున్నా తనకంటూ ఎవరూ లేరు. తన ఎమోషన్స్ ని పంచుకునేందుకు ఒక్కరూ రారు. ప్రపంచానికీ, తనకూ లంకె తెగిపోయింది. తను పాతాళంలో పడిపోయాడు. అందరూ తనకంటే ఎత్తైన ప్రపంచంలో వున్నారు ఎవరూ తన కోసం కాసిన్ని మెట్లుదిగి పాతాళంలోకి రారు.
    ఎవరిదో  చేయి భుజం మీద పడ్డట్టనిపించి తల పైకెత్తాడు ఆంజనేయులు.
    ఎదురుగ్గా వినయ్.
    "హలో ఆంజనేయులుగారూ! ఏమిటి మీలో మీరే ఆలోచించుకుంటున్నారు."
    వినయ్ ఇకాస్త ముందు వచ్చుంటే ఎంత బావుండు! క్షణకాలం అతని కళ్ళల్లో తనమీద ఈర్ష్యలాంటిది కదలాడేది. కానీ....తానెప్పుడూ దురదృష్టంవంతుడే. తననికంటూ అమ్మ చనిపోయినప్పుడే తనకంటే నష్టజాతకుడు మరొకరుండరని అర్ధమైవుంటుంది ప్రపంచానికి.
    "సభ అయిపోయాక బోసిపోయిన షామియానాలాగ ఆ ఫీలింగ్స్ ఏమిటండీ ఆంజనేయులు గారూ. కాస్తంత నవ్వండి."
    అంత సరదాగా, అలా అలంకారాలతో, ఉత్రేక్షల్పతో తను ఎప్పుడూ వినయ్ లా మాట్లాడలేడు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మాటజలపాతంగా బయటకు వురకదు.
    తను ఎందుకిలా అయిపోయాడు? చిన్నప్పట్నుంచీ అంతే తను. అయితే అప్పుడు ఇంత మూడిగా వుండేవాడుకాడు. అది వయసుతెచ్చిన వుత్సాహం కావచ్చు. ఆ ఉత్సాహం మీద మంజుల నీళ్ళు చల్లేసి పూర్తిగా ఆర్పేసింది. ఇక అది మళ్ళీ రగులుకోదు. ఎవరూ రగల్చడానికి ప్రయత్నించలేదు. అది మరింతగా అణగారిపోయింది. తన ఆత్మవిశ్వాసం గాజుమేడలా పగిలిపోయింది. తన అవతారాన్ని పరిహసించింది. తన అమాయకత్వాన్ని దూషించింది. తన నిర్మలత్వాన్ని అపహాస్యం చేసింది. తన ప్రేమను ఛీదరించు కొట్టింది.
    అందుకే తను పిచ్చివాడైపోయాడు. ఈ ప్రపంచానికి అంధుడైపోయాడు. రకరకాల కాంప్లెక్సులు బాక్టీయాల్లాగా తనలో ప్రవేశించాయి.
    మంజుల ఇప్పుడెక్కడుందో?

 Previous Page Next Page