Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 8


    మంజుల ఆలోచనల్ని తెంచేసి "సినిమాకొచ్చాను వినయ్ గారూ" అని చెప్పగలిగాడు ఆంజనేయులు.
    "నేనూ సినిమాకే రండి కాఫీ తాగుదాం" వినయ్ ముందుకు తిరిగి స్నాక్ బార్ వైపు నడిచాడు.
    ఆంజనేయులు అనుసరించాడు.
    "ఒక్కరే నచ్చారా?" అతను అడిగాడు. వినయ్ లాంటివాడు ఒక్కడే సినిమాకు రాడు. కానీ ఆ విషయం తెలుసుకోవాలన్న జిజ్ఞాస తనచేత ఆ ప్రశ్న అడిగించింది. వినయ్ జవాబు వింటే తప్ప తన మనసు ప్రశాంతంగా వుండదు.
    "లేదండీ, ఓ స్నేహితురాలు సినిమా చూద్దామంటే వచ్చాను. ఆమె కోసమే వెయిటింగ్. జెవెఇథమ్లొ అత్యంత మాధుర్యమైనదీ, అంతకంటే బాధాకరమైనదీ నిరీక్షణే. ఈ నిరీక్షణలోనే జీవితాలు తెల్లవారిపోతాయి. ఏమంటారు?" కళ్ళను ఎగరేశాడు వినయ్.
    అవును నిరీక్షణలోనే బతుకులు వెలవెలబోతాయి. అయితే నిరీక్షించడానికి కొందరికి మనుషులైనా వున్నారు. తనలాంటివాళ్ళకు ఆ అవసరమే రాదు కారణం వచ్చేవాళ్ళు ఎవరూ వుండరు గనుక.
    బాగా వాడిపోయిన పువ్వులాంటి నవ్వు ఆంజనేయులు పెదవులమీద రాలింది.
    "ఆడపిల్ల కోసం వెయిట్ చేయడమంటే చాలా కష్టం. ఓ పట్టానరారు. కారణాలు అనేకం అనుకోండి. బహుశా ఈమె మేకప్ ఇప్పటికీ పూర్తయి వుండదు. ఆడపిల్ల ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తుందో తెలుసా ఆంజనేయులు గారూ- తననే. దీనినే నార్సిసిజం అంటారు. అమ్మాయిలంతా స్వప్రేమికులు దీనికీ కారణం సమాజమే. ప్రతి ప్రేమకూ ఇద్దరుండాలి. ఆ ప్రేమను సరిసమానంగా పంచుకోవాలి. పురుషాధిక్యత ఛలామణిలో వున్న ఈ సంఘంలో ఆడపిల్ల ఎప్పుడూ మగవాడ్ని సరిసమానంగా చూడదు. తమ ఆబ్జెక్ట్ అనీ, తాను పురుషుడికోసమే వున్నానన్న ఫీలింగ్ ప్రతి చిన్న సంఘటనగా రుజువు చేస్తుంటుంది. దీనికి ఓ ఉదాహరణ చెబుతాను" వినయ్ కాఫీ సివ్ చేయడానికి ఆగాడు.
    ఆంజనేయులు శ్రద్దగా వింటున్నాడు.
    "ఓ ఇరవైఏళ్ల అమ్మాయి బజారుకు బయల్దేరిందనుకుందాం ఇంట్లో వాళ్ళు ఆమెకు తోడుగా ఎంతో చిన్నవాడైనా ఆమె తమ్ముడ్ని తోడుగా పంపుతారు. అంటే పదేళ్ళ అబ్బాయి ఆమెకు సెక్యూరిటీ ఇస్తాడన్నమాట. ఇరవై ఏళ్లైనా తనకు రాని స్వేచ్చస్వాతంత్ర్యాలు తన పదేళ్ళ తమ్ముడికి వుండడం ఆమెకు అర్ధమవుతుంది. ఆ పదేళ్ళవాడు లేకుండా తను ఎందుకూ కొరగాదన్న విషయం కూడా ఆమెకు బోధపడుతుంది. అంటే తన అస్థిత్వం మొత్తం పురుషుడిమీద ఆధారపడి వుండడం ఆమె గమనిస్తూంది. ఇలాంటి కారణాలవల్లే ఆడపిల్ల పురుషుడ్ని తనకంటే ఎక్కువవాడన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటుంది.
    అందుకే తానంటే తానే ఇష్టం పెంచుకుంటుంది. తను రెండుగా విడిపోయి ఓపక్క తను మగవాడుగానూ, మరోపక్క స్త్రీగానూ అయిపోతుంది. అంటే ప్రేమలో తనే రెండు పాత్రలనూ నిర్వహిస్తుంది డ్యుయల్ రోల్ అన్నమాట."
    ఆమాటలు వింటున్న ఆంజనేయులకు పొరబోయింది. కాఫీ ఒలకకుండా కంట్రోల్ చేసుకున్నాడు.
    వినయ్ చెపుతున్నాడు. "సెల్ఫ్ ఐడెంటిటీ స్త్రీ చాలా ముఖ్యం. కాబట్టే స్త్రీకి తన అందం మీద అంత శ్రద్ద మేరీబాస్ క్రిటిసివ్ అనే ఆమె ఏమంటుందో తెలుసా? ఐ యామ్ మై ఓన్ హీరోయిన్' అంటుంది. మనకంటే ఎక్కువవాడు అన్న ఎవరినీ మనం ప్రేమించలేం. కావాలంటే గౌరవిస్తాం, లేదంటే భయపడతాం. అందుకే చాలామంది భార్యాభర్తలు మధ్య ప్రేమ వుండదు. భర్త మంచివాడైనప్పుడు స్త్రీ గౌరవిస్తుంది. చెడ్డవాడైనప్పుడు భయపడుతుంది. కానీ భార్యాభర్తల మధ్య వుండాల్సింది ఇవేమీకాదు- ప్రేమ వుండాలి. పురుష ఆధిక్యతగల ఈ సంఘంలో అది వీలుకాదు."
    వినయ్ కాఫీ కిందపెట్టి సిగరెట్ వెలిగించుకున్నాడు.
    "మీరేమీ అనుకోనంటే ఓ చిన్న సలహా ఆంజనేయులుగారూ. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు వుంటారు. మీరు పెళ్ళిచేసుకోండి. ఈ మౌనం, ఈ ఏకాంతం అన్నీ పటాపంచలై పోతాయి. స్త్రీ అంతగా జీవితాన్ని మరెవ్వరూ ధ్వంసం చేయలేరు. అఫ్ కోర్స్ ఈ మాటలను నేను మెల్ ఛేవనిజంతో అనడంలేదు" అని నవ్వుతున్నాడు వినయ్.
    బలవంతంగా నవ్వును కంట్రోల్ చేసుకుని చెప్పాడు. "ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు వూరికే అనలేదు. నీతి సూత్రాలలో, సంఘపు కట్లుబాట్లతో ఎప్పుడో లోకం కుళ్ళిపోయింది. యూనివర్సిటీ మేన్స్ హాస్టల్స్ లో బాత్రూమ్ తలుపుల వెనకాల విద్యార్ధులు రాసేరాతలూ, వేసే బూతుబొమ్మలనూ చూస్తే చాలు ఈ విషయం అర్ధం కావటానికి.
    చిన్న అనురాగపు పలకరింపు కోసం పరితపించిపోయే యువత మానసిక రుగ్మత సంతరించుకుంటోంది. ప్రతి మనిషికీ తోడు అవసరం. స్వంత చెల్లెల్ని బజారులో పిలుచుకువెళుతూ తనకూ ఉమెన్ అసిస్టెన్స్ వుందని నలుగురూ అనుకోవాలని ఆశించే అబ్బాయిలు చాలామందున్నారు. అంత దౌర్భాగ్యంలో వుంది దేశం. అందుకే పెళ్ళి అవసరమైపోయింది. దాని పరమార్ధమే మారిపోయింది. పెళ్ళిఅర్ధమే తలకిందులైంది. సెక్స్ చీప్ గా దొరుకుతుందనే చాలామంది పెళ్ళి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే పెళ్ళి ఔన్నత్యంగా ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది."
    ఆంజనేయులు గుడ్లప్పగించి చూస్తున్నాడు. వినయ్ మాటలు అతని అంతరాంతరాల్లోని చీకటి నిజాలను పైకెత్తి చూపిస్తున్నాయి.
    "హలో వినయ్"
    వినయ్ తోపాటు ఆంజనేయులూ తల తిప్పి చూశాడు- ఎవరో ఓఅమ్మాయి వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చింది.
    "రక్షించావ్, సినిమా బిగెన్ కాకముందే వచ్చి "వినయ్ ఆమెతో అని "బైదిబై....ఈయన మా కొలీగ్- పేరు ఆంజనేయులు" అని పరిచయం చేశాడు.
    "నమస్తే!" రెండు చేతులూ జోడించింది ఆమె.
    "ఈమె పేరు శ్రీమతి యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్."
    ఆంజనేయులు ప్రతి నమస్కారం చేయడం మరిచిపోయాడు. దేనికీ అతను క్విక్ గా ప్రతిస్పందించలేడు. న్యూనతాభావం అతని మెదడును మొద్దుబారించింది.
    వస్తామని చెప్పి వినయ్, శ్రీమతి వెళ్ళిపోయారు. సినిమాకు వెళ్ళబుద్దికాలేదు. తన అంతరంగం మనిషికి అర్ధం కావడం అన్నదానికంటే బాధాకరమైనది ప్రపంచంలో మరొకటిలేదు. అందుకే ప్రతిమనిషీ ప్రతి క్షణం ఆత్మ ద్రోహం చేసుకుంటూ వుంటాడు. ఇదే మనిషికి చేతకాకపోయివుంటే ప్రపంచంలో ఇంత దుర్మార్గం వుండేదికాదు.
    తనేమిటో తనకే అర్ధంకావడం నవ్వొచ్చే బాధ ముళ్ళున్న పువ్వుల వాన. మన మనసును మనమే అనాటమీ బల్లమీద పడుకోబెట్టి డిసెక్షన్ చేసుకోవడాన్ని భరించలేం ప్రస్తుతం ఆంజనేయులు పరిస్థితి కూడా అదే.
    స్వంత చెల్లెల్ని జజారులో తీసుకెళుతూ తనకూ ఓ ఆడతోడుందని ఫీలయ్యే అబ్బాయిలు చాలా మంది వున్నారన్న వినయ్ మాటలు అతనిలో ఏవో సుడిగుండాల్ని పైకి రేపుతున్నాయి. ఆమాటల్లోని నిజం అతన్ని భయపెడుతోంది. కారణం సంధ్య అతనికి చెల్లెలు వరసవుతుంది- పెదనాన్నకూతురు.
    
                                                                *    *    *
    
    ఆంజనేయులకు మెలకువ వచ్చింది.
    మంచం నులక గుచ్చుకోవడంతో వీపంతా మండుతోంది. చేత్తో తడిమి చూసుకున్నాడు.
    ఎప్పుడు లేచాడో ఏమో ఎదురుగ్గా వున్న మంచంమీద తండ్రి కూర్చుని దగ్గుతున్నాడు. ఆయనకు క్షయ. ఎన్నో రోజుల్నుంచి తండ్రిని డాక్టర్ దగ్గరకు పిలుచుకు వెళదామని ప్రయత్నిస్తున్నా కుదరడంలేదు. నాన్నకు పిన్ని రెండవ పెళ్ళామైతే క్షయరోగం మూడవ పెళ్ళాం ఇలా అనుకోవడంతో బాధతో కూడిన చిరునవ్వు కదిలింది ఆంజనేయులు పెదవులమీద.
    చుట్టూ చూశాడు ఇంకా తెల్లవారడానికి గంటకు పైగానే పట్టేట్టుంది. చీకట్లు బాగా తుప్పట్టిన ఇనుప వలల్లా లోకం చుట్టూ పరుచుకుని వున్నాయి.
    పిన్ని దూరంగా పొయ్యి రాజేస్తూ వుంది. కట్టెలులేక పొయ్యి వెలగడం లేదు. పొగబరువుగా పైకిలేస్తోంది.
    తనను, తన బతుకునీ, మండని పోయ్యినీ తిట్టుకుంటూ వుంది పిన్ని ఎప్పుడూ ఏదో గొణుక్కోవడం పిన్నికి అలవాటైపోయింది. ఆమైనా ఏం చేస్తుంది పాపం? ఒక ముద్దూ లేదు, ముచ్చటా లేదు. బతికినంతకాలం బాధలతోనే చేస్తోంది.

 Previous Page Next Page