Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 6


    "చాలా మంది ఆడపిల్లలకు డ్రస్ సెన్స్ వుండదని నా ఉద్దేశ్యం ఎప్పుడు ఏ డ్రస్ వేసుకోవాలో అలంకరించుకోవాలో తెలిసిన ఆడపిల్లలు చాలా తక్కువ. మిడ్ సమ్మర్ బ్లాక్ డ్రస్ లో మ్యాట్నీలకి వెళ్ళే ఆడపిల్లలున్నారు. నలుపురంగు ఎండను బాగా ఇముడ్చుకోవడంతో థియేటర్ దగ్గరకెళ్ళేసరికి చెమటతో స్నానం చేసినట్టు అయిపోతారు. మరీ కొందరైతే తెల్లటి  ట్రాన్స్పరెంట్ చీర కింద బాగా ముదురు రంగు లంగాలను కట్టుకుంటారు. దీంతో పై భాగం తెల్లగానూ, కింద లంగా రంగు కనిపించి ఎబ్బెట్టుగా వుంటుంది. ఇంకొకరైతే ఎర్రటి చీర నల్లటి జాకెట్ వేసుకుని అచ్చం డి.ఎం.కె. జెండా ప్రాణం పోసుకొని నడుస్తున్నట్లు వుంటారు. ముదురు పసుపు చీరలో పెళ్ళిచూపుల్లో కూర్చున్న అమ్మాయిలున్నారు. కళ్ళకు ఏదో ఇబ్బంది కలుగజేస్తుంది ఆరంగు. ఆ ఇబ్బంది చీర వల్లో అమ్మాయి రూపం వల్లో తెలియని అబ్బాయి అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తాడు. కడకు బ్రా విషయంలో కూడా జాగ్రత్తలు పాటించరు చాలామంది. పలుచటి తెల్లటి జాకెట్టు కింద రంగుల బ్రాలు వేసుకుంటారు. ముందైతే ఫరవాలేదు. వెనుక ఆ రంగు పట్టీలు కనిపిస్తూ ఏవో రంగుల గీతలు వీపుమీద గీసుకున్నట్టు వుంటాయి. అసలు రంగుల ఇష్టాన్నిబట్టి వాళ్ళ మనస్త్తత్వాన్ని చెప్పవచ్చని ఏదో సైకాలజీ పుస్తకంలో చదివినట్టుగుర్తు. ఈ రోజు టైం పాస్ కోసం ఓ గేం చెబుతాను సరేనా!"
    "....."
    "చిన్న పిల్లల దగ్గర అన్ని రంగులూ పెట్టి ఓ వైట్ పేపర్ మీద వాటిని చిలకరించమని చెబితే వాళ్ళు చిలకరించిన రంగుల్ని బట్టి వాటి మోతాదును బట్టి వాళ్ళ అభిరుచులను చెప్పవచ్చు. ఉదాహరణకు ఎల్లో కలర్ సెక్స్ పట్ల వున్న ఆసక్తిని తెలియజేస్తుంది. నువ్వూ మీ డుంబూ చేత చేయించు. రేపు నేనొచ్చాక ఎనలైజ్ చేసి చెబుతాను."
    "...... ......"
    "ఈ రంగుల గేమ్ కొక కొస మెరుపు చెప్పనా?"
    "... ....."
    "ఏం లేదు మీ డుంబూ పేపరంతా ఎల్లో కలర్ ను గుప్పించేసి ఆంటీ అంటూ నిన్ను వాటేసుకున్నాడనుకో నా పని గోవిందా?"
    ఈ సంభాషణ జరుగుతుండగా తనను మహాలింగం బలవంతంగా క్యాంటీన్ కు లాక్కొచ్చాడు.
    "చూశారా వాడిపొగరు. అదే ఆ వినయ్ గాడు. విన్నారా వాడి సంభాషణా చాతుర్యం. చివరిగా డుంబూ మీద వేసిన జోక్ కు ఆ అమ్మాయి ఇప్పటికీ నవ్వుతూనే వుంటుంది. డుంబూను చూసినపుడంతా ఆజోక్ గుర్తుకొచ్చి తెరలుతెరలుగా నవ్వుతుంది. చిన్న పిల్లలమీద ఆ జోక్ లేమిటి పర్వర్టెడ్ మెంటాలిటీస్ అండి. ఆ అమ్మాయి ఎవరో కానీ వీడి చేతుల్లో పడి ఎంత మోసపోతుందో చూడండి. వాడి మాటల ఒడుపు చూశారా! జింకను పులి డైరెక్టుగా తరుముతుంది. పరుగెత్తి పట్టుకుంటుంది. పంజాతో చీల్చేస్తుంది. వాడి కోరలతో పేగులను పెరికేస్తుంది. కానీ వీడు అలా కాడండీ అంతకంటే డేంజరస్...."
    మహాలింగం గ్లాసులోని నీళ్ళు గటగటా తాగి మళ్ళీ ప్రారంభించాడు.
    "వీడు చాలా ఇన్ డైరెక్టుగా వేటాడుతాడండీ. మొదట నేర్పుగా మాటల్లోకి దించుతాడు. కళ్ళతో కాటేస్తాడు, మనసుతో విషం కుమ్మరిస్తాడు. గుండెల్లో పొగ పెట్టేస్తాడు ఉక్కిరిబిక్కిరై పోయిన అమ్మాయి దారి వెదుక్కునేలోపులే వీడు తనకు కావాల్సింది లాక్కొనేస్తాడు. అందుకే వీడు పులి, సింహంకన్నా వైల్డ్ ఎనిమల్. డ్రస్ సెన్స్ గురించి వాడు వాగినవాగుడు విన్నారు కదా నిండుగా కట్టుకోవడానికి ఒక్క మంచి చీరలేని ఇల్లాళ్ళు ఎంతమంది ఉన్నారో వాడికి తెలుసా? చినిగి పోయిన బట్టల్లోంచి కనిపిస్తున్న అవయవాలను నాకుతున్న సవాలక్ష కళ్ళనుంచి ఎలా తప్పించుకోవాలో తెలీని ఆడకూతుళ్ళ గురించి వీడెప్పుడైనా విన్నాడా? వినే వుంటాడు. కానీ విననట్లు నటిస్తాడు. వేటగాడికి కావల్సింది పావురమే. దాని బాధకాదు....."
    మహాలింగం ఇంకా బండబూతులు తిట్టాడు. తను లేచి వచ్చేశాడు.
    వినయ్ ఇప్పుడెక్కడున్నాడు? ఇటు ఒక్కసారి రాకూడదా. ఇప్పుడు వినయ్ వస్తే ఏమంటాడు? ఓ తుఫాను సృష్టిస్తాడు. ఓ మాధుర్యపు సుడిగుండాన్ని తన మాటలతో రప్పిస్తాడు.
    ఇప్పుడు ఇటువస్తే.... "ఏమిటండీ ఆంజనేయులుగారూ! మిట్టమధ్యాహ్నం ఎడారిలో కర్జూరపు చెట్టులా నిలబడి వున్నారు. ఆచెట్టుకి కాస్తంత కూల్ డ్రింక్ పోద్దురుగానీ రండి. బై ది బై ఈమెవరు?" అని గాగుల్స్ తీసి అడుగుతాడు.
    తను తడబడతాడు "ఈమె.... ఈమె..... సంధ్య."
    వినయ్ ఇక తన ఇంట్రడిక్షన్ అక్కర్లేనట్టు ఆమె వైపు తిరిగి మీ పేరు సంధ్యా! ఈ పేరు వినగానే మీరు నాకు చాలా సాన్నిహిత్యంగా అనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా?...... రోజూ పడమటి కొండల్లో సూర్యాస్తమయం అప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను కదా" అనంటాడు.
    మొదట సంధ్యకు అర్ధంకాక ఆ తరువాత అర్ధంఅయి నవ్వుతుంది.
    "మీరు నవ్వుతుంటే అచ్చం పత్తిపువ్వు చిట్లినట్లుంది."
    ఆమె మళ్ళీ నవ్వుతుంది, ఈ సారి కాస్తంత సిగ్గుగా, కాస్తంత బిడియంగా.
    "పౌర్ణమి వెళ్ళిన రెండో రోజో, మూడో రోజో అలా కారిడార్ లో నిలబడి సంధ్యను చూసి తలతిప్పి తూర్పుదిక్కున చూస్తే అప్పటికే ఆకాశంలో మెరిసే చందమామ గుర్తొస్తోంది మీ నవ్వును చూస్తుంటే" అని మెచ్చుకుంటాడు.
    ఆమె బుగ్గలు ఎరుపెక్కుతాయి.
    "ఇలా మీరు నవ్వుతూ బుగ్గల్ని ఎరుపు చేసుకుంటుంటే మీ అమ్మగారు ముచ్చటపడి ఆలోచించకుండానే ఆ పేరు పెట్టేసివుంటారు. యామ్ ఐ కరెక్ట్? అని అడుగుతాడు.
    ఆమె నవ్వుతూ తను అమ్మ పొత్తిళ్ళలో పాపాయిలా వుండడాన్ని వూహించుకుంటుంది.
    "ఆడపిల్లలకు చిన్నతనం జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమంటే మహా ఇష్టం పెద్దయ్యేకొద్దీ ఈ ప్రపంచం తన మీద పెత్తనం చెలాయిస్తూ వుందన్న విషయం అర్ధమవుతుంది. తను స్వతంత్రురాలు కాదనీ, తన ఆనందం, తన విషాదం, తన అందం, తన ఆకర్షణ-అన్నీ ఇంకెవరికోసమో ఉద్దేశించినవన్న సత్యం బోధపడుతుంది. ఇలాంటప్పుడు మళ్ళీ చిన్నతనంలోకి, తల్లిదండ్రుల వెచ్చటి రెక్కల కిందకీ వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఎలాగూ వీలుకాదు కనుక ఆ జ్ఞాపకాలతో తృప్తిపడాలని ఆరాటపడిపోతుంది.
    అందుకే ఆడపిల్లలను పిలిచేటప్పుడు, ఉత్తరాల్లో సంభోదించేటప్పుడు మై లిటిల్ గర్ల్, మై లిటిల్ ఏంజిల్, ఏయ్ బుజ్జీ, హలో చిట్టి అని అనాలి ఆమె సెక్యూర్ గా నీ దగ్గర అప్పుడే ఫీలవుతుంది.
    ప్రేమ ఒక్కటే తిరిగి ఆమెకు చిన్నతనాన్ని ఇస్తుంది. ప్రియుడో, భర్తో ఇంత అభిమానాన్ని ఆమెకు ఇవ్వాలి. అయితే ఇంత తీరికెక్కడిది మగవాడికి, అందుకే పెళ్ళి అయిన ప్రతి ఆడపిల్లా పుట్టింటి మమకారాన్ని పెంచుకుంటోంది. వీలైనప్పుడంతా అమ్మగారింటికి ప్రయాణం కడుతుంది. భర్త "నా చిట్టితల్లీ" అని అనంటే భార్య ఎంత సంతోషిస్తుందో మాటల్లో చెప్పలేం" - ఇదీ వినయ్ థీరీ, దీన్నె అద్భుతంగా మాటల్లో చెప్పగలడు. చిన్నతనాన్ని కళ్ళముందు సృష్టించగలడు.

 Previous Page Next Page