Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 6

బయటికి రాగానే "హలో" అంటూ దగ్గరికొచ్చాడు శ్రీమంత్.
అప్రయత్నంగానే పెదిమలమీద చిరునవ్వు వచ్చింది లతకు.
"హలో హలో!" అంది.
"కాఫీ తాగుదాం" అన్నాడతను. ముందే బేరమాడుతున్నట్లు.
"అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది" అంటూనే అతనితోబాటు హోటల్ వైపు నడిచింది లత.
"ఒక జోక్ చెబుతాను ఇవాళ" అన్నాడు శ్రీమంత్.
"ఏమిటో అంత జోకు? ఏడుపొస్తుందా?"
"నువ్వూ రావచ్చు, నవ్వలేక ఏడుపూ రావచ్చు."
"ఊ! చెప్పండి?"
 "అనగనగా ఒక అబ్బాయి."    
"ఇంకో అమ్మాయీ! ఇది మామూలు కథే! జోకేముంది?"
"అమ్మమ్మ! అలా తీసిపడెయ్యకండి! అబ్బాయీ ఉన్నాడు. అమ్మాయీ వుంది. అమ్మాయికి ఉద్యోగం వుంది. అబ్బాయికి సద్యోగం లేదు. కానీ ఆ అమ్మాయిని అబ్బాయి పెళ్ళి చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఎలా ఉంది జోక్?"
"బావుంది!"
"ఏమిటి? ఆ  అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమా?" అన్నాడు శ్రీమంత్ ఆశగా.
"కాదు. మీరు చెప్పిన జోక్?" అంతలో లత కళ్ళలో కొద్దిగా బెదురు కనబడింది. షర్టూ ధోవతీ వేసుకున్న ఒక పెద్దమనిషి నాలుగు టేబుళ్ళ అవతల కూర్చుని వీళ్ళనే చూస్తున్నాడు. లత మొహంలో నవ్వు తొలిగిపోయి సీరియస్ గా మారిపోయింది.
అది గమనించాడు శ్రీమంత్.
"ఏమయిందీ? వాట్ హాప్పెన్ డ్?"
"మా రామారావు మామయ్య!"
"మామయ్యా?"
'మామయ్యంటే స్వంత మేనమామ కాదు. కాస్త దూరపు చుట్టరికం. కానీ ఆ చుట్టరికం ఇంకా దూరమైతే బావుండు అనిపించే రకం! మాకేమైనా చెడుజరిగితే, మేము ఇంకా రెండు రెట్లు కిందికి జారితే సంతోషించేవాళ్ళలో మొదటివాడు."
"నాతో మిమ్మలిని చూస్తే ఏమైనా అంటాడు."
"ఏమీ అనడు. రిక్షా వేసుకు తిరిగి ఊరంతా దండోరా వేస్తాడు. అంతే!"
శ్రీమంత్ పెద్దగా లక్ష్యపెట్టలేదు.
"లతా! భయపడకండి! ఎలాగో పెళ్ళి చేసుకోబోతున్నాంగా!"
"పెళ్ళి చేసుకోబోతున్నామా?" అంది లత ప్రశ్నార్ధకంగా అతడిని చూస్తూ.
శ్రీమంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఈసారి అతని దగ్గరే డబ్బులున్నట్టున్నాయ్. అతనే బిల్లు పే చేశాడు.
ఇద్దరూ బయటికి వచ్చారు.
    
                                                               * * *
    
"నిన్న మీరు ఆరుగంటలు ముఫ్ఫయ్ అయిదు నిమిషాలకి తాజ్ లో నుంచి బయటకు వస్తున్నారు..... వంటరిగా కాదు!" అన్నాడు సతీష్.
లత మాట్లాడలేదు. చకచక టైప్ చేస్తోంది.
"లతా! కమిన్ వన్స్!"
ఒక్కసారి అతనివైపు చూసి లేచి, పమిట సర్దుకుని రూంలోకి నడిచింది.
"ఎవరతను? మీకాబోయే....?"
"ఏమో తెలియదు. బహుశా కావచ్చు."    
"మీరు నాతో చెప్పి ఉండాల్సింది. నాతో కాఫీకి రాకుండా అదే టైంలో అతనితో...."
"మీతో చెప్పాల్సిన అవసరం లేదు."
"పోనీ ఇవాళ సాయంత్రం నాతో రాగలవా?"
మాట్లాడకుండా వెనక్కి తిరిగింది.
అతను రెండు క్షణాలసేపు ఆమెని పరీక్షగా చూశాడు.
"ఓకే! ఓకే! ఒక లెటరు అర్జెంటుగా టైప్ చెయ్యాలి. డిక్టేషన్ తీసుకోండి."
పాడ్ పట్టుకుని రెడీగా నిలుచుంది లత.
"టూ,
మిస్ జి. లత,
క్లర్క్ కమ్ టైపిస్ట్,
జానకీదాస్ అండ్ కంపెనీ, సికిందరాబాద్.
అక్కడిదాకా రాసుకునేసరికి అతను ఇవ్వబోయే డిక్టేషన్ ఏమిటో అర్ధమైపోయింది.
చేతులు బరువుగా అయిపోయాయి. చెవుల్లోంచి రివ్వున గాలి వీస్తున్నట్లనిపించింది.
"డియర్ మేడమ్,
మీ సర్వీసెస్ ఇకమీదట మా కంపెనీకి అవసరం లేదని చెప్పడానికి, చింతిస్తున్నాము. మీకు రావలసిన జీతం వగైరా కాషియర్ దగ్గరనుంచి తీసుకోగలరు.
                                                                                                మీ విధేయుడు,
                                                                                               సతీష్ ఛోప్రా, మేనేజర్"
    
    నిస్సత్తువగా టైప్ రైటర్ ముందు కూర్చుంది. పదిక్షణాల తరవాత కర్చీఫ్ తో మొహం తుడుచుకుని, చకచక లెటర్ టైప్ చేసి ఫ్యూన్ తో లోపలకు పంపించి, తను బయటికి నడిచింది.
"సో! ఈ ఉద్యోగం మూన్నెల్ల ముచ్చట!"
అమ్మకెలా చెప్పాలి? ఎంతబాధ పడుతుందో తను!
పరధ్యానంగా ఆలోచిస్తూ ఇంటికొచ్చేసింది.
"నీకేదో ఉత్తరమొచ్సిందే లతా!" అంది అమ్మ.
బ్రౌన్ పేపరు కవరు. 'ఆన్ ఇండియన్ గరర్నమెంట్ సర్వీస్' అని ముద్ర. సర్వీసు స్టాంపులు.
విప్పి చూసింది.

 Previous Page Next Page