మర్నాడు రాత్రి -
ఎవరో తలుపు తడుతున్న శబ్దం అయింది.
విధి తన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పబోతుందని తలుపు తిసేముందు రాజా గ్రహించలేకపోయాడు!
నిజానికి ఎవరూ కూడా తన తలుపు తట్టనవసరం లేదు!
అది రాత్రింబవళ్ళు తెరిచే ఉంటుంది. ఇప్పుడు పొరపాటున గాలికి మూసుకుపోయి ఉంటుందేమో! అంతే!
అయినా ఇది రహదారి సత్రం లాంటిది గదా! ఇక్కడకొచ్చేవాళ్ళెవరు తలుపు తట్టి మరి లోపలికి రారే!
అంటే, వచ్చింది ఎవరో కొత్త మనిషి అయి వుండాలి. ష్యూర్! అనుకొంటూ బద్దకంగా ఒళ్ళు విరుచుకుని లేచి, తలుపు తెరచి చూశాడు రాజా.
బయట ఒకాయన నిలబడి ఉన్నాడు. బాగా పొడుగ్గా, బక్కపలచగా ఉన్నాడు. అప్పుడే డ్రైక్లీనింగ్ చేసినట్లు ఫ్రెష్ గా ఉన్న సూటు వేసుకుని ఉన్నాడు. సన్నటి నిలువు గీతలున్న పిన్ స్ట్రయిప్ డ్ సూటు, టై కట్టుకోలేదు. మెడదాకా పూర్తిగా గుండీలు పెట్టి ఉన్న షర్టు మెడకి పోల్కాడాట్స్ అనే చుక్కలు ఉన్న స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాడు. కాళ్ళకి ఆక్స్ ఫర్డ్ మోడల్ ఖరీదైన బూట్లు, గంభీరంగా ఉంది మొహం. సరళరేఖలా బిగుసుకుని ఉన్న పెదిమల మీద సన్నటి మీసం.
ఆరోగ్యంగా ఉన్న అతని శరీరం, చాలా ఖడక్ గా నిలబడి అతని తీరు అతను మిలటరీ మనిషి అని చెబుతున్నాయి.
"ఎవరూ?" అన్నాడు డైమండ్ రాజా ఆయన్ని పరిశీలనగా చూస్తూ.
"నేను కెప్టెన్........." అనబోయాడు అయన.
అయన మాట పూర్తీ చేసేలోగా, మరో మనిషి అర్జెంటుగా ఆయన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు.
ఆ మనిషి తనని తగిలినచోట సుతారంగా దులుపుకున్నాడు అయన.
దులుపుకుని, "నేను కెప్టెన్....." అని మళ్ళీ అనబోతుండగా లోపలికి వచ్చిన ఆ మనిషి సుడిగాలిగా మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు.
"ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు లాంటిది. ట్రాఫిక్ ఎక్కువ! మీరు ఇక్కడ నిలబడితే లాభం లేదు. లోపలికి రండి!" అన్నాడు రాజా.
పీత బొక్కలాంటి ఆ ఇంట్లోకి తనలాంటివాడు ప్రవేశించడం తగునా అని ఒక్కక్షణం తటపటాయించి, తర్వాత లోపలికి వచ్చాడు అయన.
వస్తూనే చెప్పాడు.
"నాపేరు కెప్టెన్ జస్వంతరావు!"
"కూర్చోండి" అన్నాడు రాజా.
చుట్టూ చూశాడు కెప్టెన్ జస్వంతరావు. అక్కడ కూర్చోవడానికి ఏమి కనబడలేదు.
అక్కడ ఒక కుక్కి మంచం ఉంది. దాని మ్,మీద తల వైపున ఒక పిల్లి కాళ్ళ వైపున ఒక ఉరకుక్క పడుకుని ఉన్నాయి.
ఆ కుక్కని తట్టి లేపాడు రాజా.
"బాబాయ్! లే!" అన్నాడు.
"బాబాయా?" అన్నాడాయన ఆశ్చర్యంగా.
"అవును! కుక్కలకి ఆరేళ్ళ వయసంటే మనుషుల వయసు లెక్క ప్రకారం నలభై ఏళ్ళని లెక్క! అందుకే బాబాయ్ అని పిలుస్తుంటా!" అన్నాడు రాజా.
"పిచ్చిగోల!" అనుకున్నాడు కెప్టెన్ జస్వంతరావు మనసులోనే. అనుకుంటూనే గది అంతా పరికించి చూశాడు. గోడల మీదా ఎక్కడ అంగుళం కూడా ఖాళిలేకుండా పోస్టర్స్ అతికించి ఉన్నాయి.
మైకేల్ జాక్సన్ , బాబా సహగల్, సామంతా ఫాక్స్, మడోన్నా.........ఎట్ సెట్ రా..........ఎట్ సెట్ రా.
అవన్నీ చూసిన కెప్టన్ జస్వంతరావు మొహం అప్రసన్నంగా అయిపొయింది. మరింత బిగుసుకుపోయి, నిటారుగ్గా కూర్చున్నాడు.
ఆలోగా, అదర గండంలా కనబడుతున్న ఓ అయిదేళ్ళ పిల్లాడు వచ్చాడు. వాడివైపు పరుగుని చూసినట్లు చూశాడు జస్వంతరావు.
ఆ తర్వాత డైమండ్ రాజాని మైక్రోస్కోపు క్రింద క్రిమిని పరిశిలించినట్లు చూడడం మొదలెట్టాడు.
విశ్రుంఖలంగా పెరిగిన జుట్టు, నాలుగు రోజులుగా షేవ్ చెయ్యని గడ్డం ఒక వంద రంగులు కలిసి ఉంటాయేమో అనిపించే టీ షర్టు. పాతగా ఉన్న బ్లూడెనిమ్ జీన్సు. కాళ్ళకి తెల్ల సాక్సు- లోఫర్లు.
"ఈ ప్యాంటు వారానికోసారాన్నా ఉతుకుతావా!" అన్నాడు జస్వంతరావు.
"అబ్బే! ప్రతినెల తప్పకుండా ఉతుకుతూనే ఉంటా!" అన్నాడు డైమండ్ రాజా, మాటకి మాట అంటిస్తూ.
తిరుగుబాటుదారుడిలా ఉన్న రాజా వైపు కెప్టెన్ జస్వంతరావు అంతరాత్రివేళ కూడా మడతనలగని సూటుతో, యుడీకో లోన్ సువాసలని వెదజల్లుతూ వున్న జస్వంతరావు వైపు రాజా కొద్ది క్షణాలపాటు అలా చూసుకుంటూ ఉండిపోయాడు.
వాతావరణం కొంచెం వేదేక్కుతున్నట్లు అనిపించింది జస్వంతరావుకి.
ఈ రాజా తన జీన్సుని నెలకోసారి ఉతుక్కుంటే తనకేమిటి? ఆర్నెల్లకోసారి ఉతుక్కుంటే తనకేమిటి?
ఇతన్ని జెంటిల్ మాన్ గా మార్చడానికి ముందు ముందు చాలా టైం ఉంది!
ప్రస్తుతం తను చెప్పినదానికి అతన్ని ఒప్పించాలి! అంతేచాలు!
వాతావరణాన్ని తేలిక చెయ్యదలచుకుని , లోపలికి వచ్చిరాగానే అకారణంగా విద్వంసకాండ మొదలెట్టిన ఆ అయిదేళ్ళ పిల్లాడిని పలకరిచాడు కెప్టెన్ జస్వంతరావు.
"నీ పేరేమిటి బాబూ?" అన్నాడు గంభీరంగా.
"బాడ్ ఖోవ్!" అన్నాడు పిల్లాడు తక్షణం.
షాకయిపోయాడు జస్వంతరావు.
"ఏమిటి?" అన్నాడు ఆప్రయత్నంగా.
"బాడ్ ఖోవ్!" అన్నాడు పిల్లాడు మళ్ళీ.
రాజా కల్పించుకుని చెప్పాడు "వాడి పేరు భార్గవ్! వాడికి మాటలు సరిగ్గారావు. వాణ్ణి మాట్లాడించకండి! ఇంకా చాలా వినాల్సివస్తుంది.
తక్షణం కట్టెబొమ్మలా బిగుసుకుపోయాడు జస్వంతరావు.
అంతలోనే.
ఒక బిచ్చగాడు గుమ్మదగ్గర కనబడ్డాడు. కనబడిన మరుక్షణంలోనే చనువుగా లోపలికి వచ్చేశాడు. ఒక మూల నిలబడి, తన బిచ్చగాడి డ్రెస్సుని విప్పేశాడు. వంకేన తగిలించి ఉన్న రాజా ప్యాంటు షర్టు అర్జెంటుగా తగిలించుకుని "అన్నా! ఇవాళ కలెక్షన్ బాగుంది నాకు! సరదాగా సెకెండ్ షోకి వెళ్ళొస్తా!" అని గబగబ బయటికి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళి వెళ్ళకముందే ఒక పదహారేళ్ళ పిల్ల వచ్చింది. "అన్నా! మిరప్పళ్ళ ఖారం నీకు ఇష్టం కదా! అమ్మ ఇచ్చి రమ్మంది" అని చిన్న గిన్నె అక్కడ పెట్టి " రొట్టెలు కాల్చుకున్నవా?" అంది.
"ఏసుపాదం వాళ్ళ అమ్మ చపాతీలు పంపిందిలే!" అన్నాడు రాజా.
తర్వాత జస్వంతరావు వైపు తిరిగాడు రాజా.
చెక్కబోమ్మలా కూర్చుని ఇదంతా చూస్తున్నాడు జస్వంతరావు.
"చెప్పండి! మీరెవరు? నాతొ ఏమిటి పని? అని అడిగాడు రాజా.
గొంతు సవరించుకున్నాడు జస్వంతరావు.
"నేను లేట్ రాజా ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారికి ఎస్టేట్ మేనేజర్ని. రిసెర్చి స్కాలర్ ని కూడా!"
చిత్రంగా చూశాడు రాజా.
"లేట్ రాజ ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారు నిన్న బంధుమిత్ర సపరివారసమేతంగా పరమపదించారు" అన్నాడు కెప్టెన్ జస్వంతరావు.
"పాపం!"
"వారి ప్లేన్ క్రాష్ అవుతున్నప్పుడు నువ్వే హోటల్ లో ఉన్న వాళ్ళని అందరిని హెచ్చరించి ప్రాణాలు కాపాడావు."
"ఏదో సమయానికి అక్కడ ఉండబట్టి........" అన్నాడు రాజా.
"లేట్ రాజా ఆఫ్ రానీపూర్ శ్రీ విక్రమదేవరావుగారు వారసులు లేకుండా పరమపదించారు." అన్నాడు జస్వంతరావు.
జస్వంతరావు అలా అనగానే, రాజా మొహం ఆర్క్ లైట్ లా వెలిగిపోయింది!
"అంతా అర్ధం అయింది! ఇప్పుడు నేను వచ్చి రాజాగారి వరసుడిలా నటించలంటారు! ఆస్తిలో మీకు మేజర్ వాటా..........నాకు కొంచెం క్యాషు....మీ పని అయిపోగానే నేను మళ్ళీ నాదారిన నేను వెళ్ళిపోవాలి. అవునా? ఇది చాలా సినిమాల్లో చూశాం! కానీ సార్! లాభం లేదు.....ఇలాంటివి సినిమాల్లో నడుస్తాయి గానీ, రియల్ లైఫ్ లో బెడిసికొడతాయి" అన్నాడు రాజా ఏకధాటిగా.
గంభీరంగా అన్నాడు కెప్టెన్ జస్వంతరావు.
"నేను నిన్ను వారసుడిగా నటించమని అడగటానికి రాలేదు."
"మరి?"
"నువ్వే నిజంగా వారసుడివని చెప్పడానికి వచ్చాను."
"ఏమిటి?" అన్నాడు డైమెండ్ రాజా కొయ్యబారిపోయి.
"అవును! లేట్ ఆఫ్ రాణీపూర్ శ్రీ విక్రమదేవరావుగారి వారసుల్లో నీ నెంబరు రెండు వందల నలభై తొమ్మిది. రెండు వందల నలభై ఎనిమిది వారసులు ఒకేసారి ప్లేన్ క్రాష్ లో పోయారు. మిగిలింది నువ్వే! ఇకనుంచి నువ్వు ఉత్త డైమండ్ రాజావి కాదు.
నిజంగా నువ్వు రాజా ఆఫ్ రాణీపూర్ , శ్రీ రాజశేఖరసింహ!"
"శ్రీశ్రీశ్రీ రాజశేఖర సింహ!" అన్నాడు రాజా సీరియస్ గా. తర్వాత నవ్వేసి, "భలే కదా కమామీషు! నిజం చెప్పండి! నాకు టోకరా వెయ్యాలని మీరు గనక వచ్చి వుంటే మీకు శ్రమదండగ! నా దగ్గర మొత్తం నూట అయిదు రూపాయలున్నాయి! దానికోసం మీరు ఇన్ని తిప్పలు పడడం అనవసరం!" అన్నాడు.
రాజా మాటలు విని సహనంగా అన్నాడు కెప్టెన్ జస్వంతరావు "ఒక్క ఐదునిమిషాలు ఓపికపడతావా? అన్ని వివరాలు వివరించి చెప్పేస్తాను."