"నా పరిస్థితి ఏమిటో నాకే అర్ధం కావడం లేదు."
"ఏం జరిగింది మీనా?"
ఆ రోజున హోటల్లో జరిగినదంతా వివరంగా చెప్పింది మీనాక్షి.
సాలోచనగా వింటూ ఉండిపోయింది డాక్టర్ లత.
"అమ్మ సంగతి కూడా నాకేం అర్ధం కావడంలేదు" అంది మీనాక్షి.
"మీ అమ్మకేం......ఆపరేషన్ అవగానే అంతా అల్ రైట్ అయిపోతుంది."
"ఆపరేషన్ అంటే మాటలా?" అంది మీనాక్షి.
"దానిదేముంది? తలో చెయ్యి వేసుకుని సాయం చేస్తే అంతా ఓకే అయిపోతుంది" అంది డాక్టర్ లత.
"ఎవరు ఎంత సాయం చేసినా కూడా లక్షరూపాయలు పోగవుతాయా డాక్టర్" అంది మీనాక్షి దిగులుగా.
ఏమి చెప్పలేక కాసేపు మౌనంగా ఉండిపోయింది డాక్టర్ లత. తర్వాత నిట్టూర్చి , నెమ్మదిగా అంది. "నేనే గనక సర్జన్ ని అయి ఉంటే, ఆ ఆపరేషన్ ఫ్రీగా చేసేసి ఉండేదాన్ని" అంది చాలా సిన్సియర్ గా.
"అవును!" అంది మీనాక్షి కళ్ళు తుడుచుకుంటూ.
"మా అమ్మకే కాదు.......వేలాది మందికి కూడా చేసేసి ఉండేవాళ్ళు! మీరు ఎమ్మెస్ చదివి స్పెషలైజ్ చెయ్యకపోవడం వల్ల దేశానికే నష్టం జరిగిపోయినట్లు లెక్క!" అంది మీనాక్షి ఉద్విగ్నంగా.
మొహమాటంగా తల పక్కకి తిప్పుకుంది డాక్టర్ లత.
మళ్ళీ దుఖం పొంగుకువచ్చింది మీనాక్షికి.......వెక్కిళ్ళ మధ్య అంది తను. "ఉహ తెలిసినప్పటినుంచి........నాకు......అన్ని కష్టాలే!"
"ఇంక తిరిపోయే టైం వచ్చిందిలే!" అంది డాక్టర్ లత ఓదార్పుగా.
హటాత్తుగా తల ఎత్తి డాక్టర్ లత మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది మీనాక్షి.
"డాక్టర్! నాకు తల్లి ఉంది! కానీ నాకు ఓ తండ్రి కూడా వున్నాట్లా? లేనట్లా?"
ఏం సమాధానం చెప్పాలో తోచక, మీనాక్షి వైపే చూస్తూ ఉండిపోయింది లత.
మళ్ళీ అంది మీనాక్షి.
"నాకు ఉహ తెలిసినప్పటినుంచి కూడా, నా తండ్రిని నేను చూడలేదు..........అసలు నాకు తండ్రి ఉన్నాడో లేదో నాకు తెలియదు. అమ్మ ఇప్పటికి బొట్టు పెట్టుకుంటుంది. అమ్మ పాపిట్లో సింధూరం ఉంటుంది. కానీ నాన్న మాత్రం లేడు. నాన్న ఏడీ అని అడిగితే అమ్మకి ఏడుపోచ్చేస్తుంది. అమ్మ ఏడిస్తే నేను చూడలేను! అందుకనే ఈ మధ్య అసలు ఆ విషయం అడగడం కూడా మానేశాను . నాన్న వున్నాడా లేడా అనేది ఇప్పటికి నాకో పెద్ద మిస్టరీనే? డాక్టర్!"
ఆ విషయం డాక్టర్ లతకి కూడా తెలుసు!
మీనాక్షి వాళ్ళ అమ్మ వసుధ. ఆమె అసలు ఈ లోకంలోని మనిషిలా ఉండదు. మరమనిషిలా ఉంటుంది తను. ఎవరిని పట్టించుకోదు. ఏ విషయం మీదా ఇంట్రెస్టు చూపించదు. ఆమె అసలు దేనిమీదా దృష్టి కేంద్రికరించలేదు. పిలిస్తే పలుకుతుంది. అడిగిన డానికి ఒక్క ముక్కలో సమాధానం చెబుతుంది. మాటల్లో పెట్టాలని చూస్తే మహా అయితే ఒక్క నిముషం మాట్లాడుతుంది. ఆ తర్వాత అప్రయత్నంగానే మళ్ళీ తన ఆలోచనల్లోకి తను జారిపోతుంది.
ఈ విషయాలన్నీ మీనాక్షికి మరి ఎక్కువగా అనుభవం అయ్యే వుండాలి.
మీనాక్షి కూడా తన మనసులో సరిగ్గా అదే అనుకుంటోంది.
తనకి తండ్రి ఉన్నాడో లేడో తెలియదు. కనీసం తనకి సంబంధించినంతవరకు అయన లేనట్లే లెక్క! అమ్మేమో మరి ఉండి కూడా లేని దాన్లాగా ఉంటుంది. జీవచ్చావంలాగా రోజులు గడిపేస్తుంది అమ్మ! ఎందుకని?
అమ్మ అలా మారిపోవడానికి ఆమె జీవితంలో అంతటి షాకింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగి ఉంటుంది?
ఆ జరిగింది ఏమిటో గాని, చాలా చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అయి ఉండాలి!
తను అలా అనుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది.
తనకి ఉహ తెలిసినప్పటి నుంచి కూడా అమ్మ జుట్టు వెండి తిగేల్లా తెల్లగానే ఉంది.
తన జుట్టంతా ఒక్కే ఒక్క రాత్రిలో నెరిసిపోయినట్లుగా!
వినరాని దుర్వార్త విన్నప్పుడు కొంతమందిలో ఇలాంటి మార్పు రావచ్చునని అంటారు.
చాలా చిన్నదిగా కనబడే అమ్మకి ఆ వెండి జుట్టు ఎంతో అసహజంగా ఉండేది!
అంతుబట్టని ఆ దారుణం ఏదో జరిగినప్పటి నుంచి అమ్మ ఇలా అయిపోయి వుంటుందా?
అప్పట్నుంచే అమ్మకి హార్ట్ ట్రబుల్ కూడా మొదలై వుంటుందా?
ఏమో!
ఏది ఏమైనా కూడా.........
తను మాత్రం మాట్లాడే తోడు కూడా లేక, చిన్నప్పట్నుంచి ఏకాకి అయిపొయింది!
అమ్మలోకం అమ్మది! తన లోకం తనది!
నిజానికి ఒక విధంగా తమ పాత్రలు రివర్స్ అయ్యాయి కూడా! తనంతట తానుగా ఏ పని చేసుకోలేని అమ్మ తనకి కూతురిలాగా అనిపిస్తుంది. తనేమో అమ్మకి కావలసిన పనులన్నీ చేసి పెడుతూ చిన్నప్పుడే పెద్దరికం అబ్బి, తల్లి పాత్రని పోషిస్తోంది.
చిన్నప్పటి నుంచి ఒంటరి బతుకు బతికింది తను. లోన్లిగా పెరిగింది. "లొనర్" గా మిగిలిపోయింది. అందుకనే ఎవరితో త్వరగా కలవలేదు. ఎవరితో మనసు విప్పి మాట్లాడలేదు. ఎవర్ని నమ్మలేదు - అందరితో చాలా ముభావంగా ఉంటుంది.
"ఒంటిపిల్లి రాకాసి" అని తనకెవరో ఒక నిక్ నేమ్ తగిలించారు కూడా!
తనది కట్టేలాంటి స్వభావమే! అందుకే అచ్చం అలాంటి స్వభావమే కలిగిన డాక్టర్ లత అంటే తనకి అప్పట్లో బొత్తిగా పడలేడు. పైపెచ్చు అలర్జీలాంటిది కలిగింది కూడా!
కానీ డాక్టర్ లత యారోగేన్సు లేదని, అది ఆత్మవిశ్వాసమని, కేర్ లెస్ గా కనబడుతుంది గాని, చాలా దయాదక్షిన్యాలు గల వ్యక్తీ అని ఆ తర్వాత త్వరలోనే తెలిసింది.
ఒకసారి అమ్మకి "ఎమర్జన్సీ" అనిపించే పరిస్థితి వస్తే, అప్పుడు తీసుకెళ్ళవలసి వచ్చింది అమ్మని, డాక్టర్ లత దగ్గరికి! మొదటిసారిగా!
అప్పుడే తనకి తెలిసింది - మొదటిసరిగానే - డాక్టర్ లత తన ఇంట్లో చేసే ట్రీట్ మెంటుకి అసలు డబ్బులే తీసుకోదని!
డాక్టర్ లత దగ్గరికి అమ్మని తను తీసుకెళ్ళడం ఆ ఒక్కసారే-
ఆ తర్వాత లతే రెగ్యులర్ గా "విజిట్స్" కి వచ్చి అమ్మ యోగక్షేమాలు విచారించి వెళుతూ వుండేది. మందులు కూడా ఫ్రీగానే ఇచ్చి వెళ్తుండేది.
అదగో - సరిగ్గా అప్పట్నుంచే-
డాక్టర్ లత తనకి రోల్ మోడల్ అయింది! అన్ని విషయాల్లోనూ లతని ఆదర్శంగా పెట్టుకోవాలని చూసేది తను.
అయితే ఒక్క విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదు -
డాక్టర్ లత బాగా పాడుతుంది - చాలా బాగా కానీ తనో?
తనకి వేలం పాట పాడ్డం కూడా రాదేమో!
అందుకని తను తెగ బాధ పడిపోతుంటే -
ఓరోజు లతే సలహా ఇచ్చింది.
"ఆర్టు అంటే ఒక్క పాటలు పాడ్డం మాత్రమేనా ఏమిటి? అందరూ పాడే వాళ్ళే అయితే ఇంక వినే వాళ్ళెవరు? నువ్వు చక్కగా ప్రబంధ నయికలా ఉంటావ్! మంచి ఎజ్స్ ప్రేసివ్ ఐస్ నీవి! నువ్వు డాన్సు డేవోలప్ చేసుకో!" అంది. ఆ చెప్పడం కూడా కట్టే విరిచినట్లే!
అలోక్, లతల ప్రోత్సాహంతోనే తను డాన్సు క్లాసుల కెళ్ళడం మొదలెట్టింది. త్యాగరాయ గానసభలో ప్రోగ్రాంలు ఉంటే తప్పనిసరిగా హాజరయ్యేది - డాన్సులో మెలుకువలు ఇట్టే పట్టేసేది.
డాన్సుకి , ఇంటి పనులకి మధ్య తన చదువు నలిగిపోయింది! ఎప్పుడూ పరిక్షలు వచ్చినా కూడా సరిగ్గా అప్పుడే అమ్మకి ఒంట్లో బాగా లేకపోవడం ఆనవాయితీ అయిపొయింది. అందుకే తను హైస్కులు చదువు పూర్తీ చేయలేకపోయింది.
దాదాపు ఆరేళ్ళ పాటు డాన్సు నేర్చుకున్న తర్వాత త్యాగరాయగానసభలో తన పోగ్రాం పెట్టించారు. ఆ ప్రోగ్రాంలో తను చేసిన డాన్సు చూసి, హోటల్లో ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చాడు మల్ హోత్రా. ఆ తర్వాత అక్కడ అనుకోని అవమానం ఎదురయింది తనకి.
"ఏమిటి ఆలోచనా?" అంది డాక్టర్ లత.
"మిమ్మల్ని గురించే!"
"తిట్టుకుంటున్నావా ఏం?" అంది లత.
"కాదు- మీరు బంగారు కొండ అనుకుంటున్నాను."
"పెద్ద నాపాసాని మాటలు మాట్లాడకు! కాఫీ కలిపి ఇస్తా! బుద్దిగా తాగి వెళ్ళు!" అంది డాక్టర్ లత.
"వెళ్ళక తప్పదు లెండి!" అంది మీనాక్షి.
"ఎక్కడికి?" అంది లత అనుమానంగా.
"తక్షణం ఇంకేక్కదన్నా ఉద్యోగం వేదుక్కోవడానికి! డాన్సు చెయ్యడం తప్ప ఇంకే క్వాలిఫీకేషను లేదు నాకు! ఎక్కడో ఒక చోట డాన్సర్ గా చేసి కాసిని డబ్బులు సంపాదించకపోతే అమ్మ సంగతి ఎలా? అంది మీనాక్షి.
సానుభూతిగా తల పంకించింది లత.
"డాక్టర్! ఈ సారి నేను డాన్సు చెయ్యడమే కాదు. నాతోబాటు ఈ లోకాన్ని కూడా నాట్యం చేయిస్తా చూస్తూ ఉండండి! ఒక్క రోజులో వందేళ్ళ అనుభవం వచ్చేసింది నాకు!" అంది. "ఆఠీన్ రాణీ" మీనాక్షి. ఆమె గొంతులో కటుత్వం ధ్వనిస్తోంది.
మీనాక్షి వైపు చిత్రంగా చూస్తూ ఉండిపోయింది డాక్టర్ లత.
* * *
విమానం ఎక్స్ ఫ్లోడ్ అయిన ఇంపాక్ట్ కి హోటల్ బిల్డింగ్ సగం డామేజి అయినా కూడా, మొత్తం మీద ఆరోజు గండం గడిచి బయట పడ్డాడు డైమండ్ రాజా.