"నీకు ఫోన్ వచ్చింది" అని, లైన్ లో అవతల ఉన్నదేవరో చెప్పింది సుదీర.
మట్లాడటం ఆపేసి, అపనమ్మకంగా చూశాడు ఆ డాక్టరు. తర్వాత సందేహంగా ఫోన్ దగ్గరికి నడిచాడు.
అవతల వ్యక్తీ గొంతు గుర్తు పట్టగానే అయన ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. అవతల వ్యక్తీ తన ఎదురుగానే వున్నట్లు గౌరవం ప్రకటిస్తూ కొంచెం ఒంగి, వినయంగా "ఎస్సర్ - ఎస్సర్.......అంటూ విన్నాడు ఒక నిమిషం సేపు.
ఫోన్ పెట్టేశాక - హెడ్మాస్టరు చేత చివాట్లు తిన్న స్టూడెంట్ లా చిన్న బుచ్చుకున్న మొహంతో తిరిగి వచ్చాడు.
"వెల్.......ఐయామ్ సారి!" అన్నాడు గత్యంతరం లేక రాజీకి వస్తున్నట్లు.
దర్పంగా తల పంకించింది సుదీర.
కానిస్టేబుల్ ఇది చూసి బాగా తగ్గిపోయాడు. అజ్ఞానంతో కూడిన అధికారం ముందు విజ్ఞానం , వివేకం వెన్నెముక జారిపోయినట్లు సాగిలపడిపోవడం అతను చాలా సార్లు చూసి ఉన్నాడు. అలాంటప్పుడు తను అనగా ఎంత! అందుకని క్షమార్పణ కోరుతూ , గల్తి అయిపొయింది అమ్మా! మాఫ్ చెయ్యుండ్రి! అని చెప్పబోయాడు.
అప్పటికే ఆలస్యం అయిపొయింది. వైర్ లెస్ మెసేజ్ అందుకొని , అటుపోతున్న పోలిస్ పాట్రోల్ వాన్ వచ్చేసింది. వాళ్ళు ఏం చెయ్యాలో అప్పుడే టాప్ రాంకింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేశాయి.
తనకు జరుగుతున్న దేమిటో గ్రహించేలోపలే ఆ కానిస్టేబుల్ ఊరవతల విసిరేసినట్లున్న పోలిస్ ఠాణాకి బదిలి చేయబడ్డాడు.
అవమానాన్ని దిగమింగుతూ, కారుని అక్కడే వదిలేసి టాక్సిలో వెళ్ళిపోయాడు డాక్టరు.
తేలిగ్గా నిట్టూర్చింది సుదీర. మళ్ళీ ఇందాకటి షాపుకే వెళ్ళి ఫోన్ ఎత్తి డయిల్ చేసింది. "సారదీ! మంచి రామచిలుక ఎక్కడ అమ్ముతారు?" అంది సారధి లైన్ లోకి రాగానే.
సుదీర కారు భరత్ ఇంటిముందు ఆగింది. దిగి వెనక సీట్లో ఉన్న పంజరం చేతిలోకి తీసుకుంది సుదీర. అందులో ఒక అరుదైన పంచవెన్నెల రామ చిలక ఉంది. దాన్ని నెలరోజుల క్రితమే తెప్పించి ఉంచాడు దుకాణం యజమాని ఖాన్ సాబ్. 'అంత ఖరీదు పెట్టి ఎవరూ కొనరేమో ఎందుకు దీన్ని నెత్తిన పెట్టుకున్నానురా' అని దిగులు పడుతున్న సమయంలో సుదీర వచ్చి ఎక్కువ బెరమాడకుండానే కొనేసింది.
పంజరంలో చిలక వైపు చూసింది సుదీర. చాలా అందంగా ఉంది. దాని మెడ చుట్టూ చిన్న నైలాన్ రిబ్బన్ కట్టాడు ఖాన్ సాబ్. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి గిప్టు పాకింగ్ చేసినట్లు ఉంది ఆ చిలక.
కొద్దిగా గర్వం అనిపించింది సుదీరకి. ఇది ఇస్తే మామూలు చిలక పోయి, మంచి చిలక వచ్చిందని సంతోషిస్తాడేమో ఆ భరత్.
విధి వాకిలి తెరిచే ఉంది కాని, లోపల ఎవరూ ఉన్న అలికిడి లేదు. నిశ్శబ్దంగా వుంది.
"స్వతంత్ర భారతి!" అని పిలిచింది సుదీర. అలా పిలుస్తున్నప్పుడు తనకు నవ్వొచ్చేస్తే ఆపుకోవడానికి కర్చీఫ్ నోటి దగ్గర పెట్టుకుంటూ.
కొద్ది క్షణాల తరువాత స్వతంత్ర భారతి వచ్చింది గుమ్మం దగ్గిరికి. చేతిలో టెక్ట్స్ బుక్ వుంది.
"మీరా.......రండి!"
"భరత్ లేరా?"
"పడుకుని ఉన్నాడు" అంది భారతి. ఆమె చూపులు సుదీర చేతిలోని పంజరం వైపు పోయాయి. మొహంలో కొంచెం ఆశ్చర్యం కనబడింది. "కూర్చోండి" అని చెప్పి లోపలికి వెళ్ళింది.
భరత్ వచ్చాడు. గడ్డం పెరిగి ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. పదిరోజులు ఉపవాసం చేసి, పదికిలోల బరువు గట్టిన వాడిలా ఉన్నాడతను.
"నమస్తే" అంటూ ఆమె చేతిలోని పంజరం వైపు చూశాడు.
"సారి మిస్టర్ భరత్! ఒక చిన్న పొరపాటు జరిగింది. లాస్ట్ టైము నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా సిల్వర్ మీ చిలకని చంపెసినట్లుంది. మీరూ చాలా అజాగ్రత్తగా ఉంటారనుకుంటాను. చిలకని పంజరంలో పెట్టకుండా బయటకు వదిలేస్తే బతుకుతుందా చెప్పండి?"
హతాశుడైనట్లు చూశాడు భరత్. తన చిలక తిరిగి వస్తుందేమో అని అప్పటిదాకా ఎ మూలో ఉన్న ఆశ అణగారిపోయింది. "సిల్వర్ అంటే" అన్నాడు బలహీనంగా.
"సిల్వర్ అంటే మా........" కుక్క అనడానికి ఆమెకి మనస్కరించలేదు. "సిల్వర్ అంటే మా డాల్మేషియన్" అంది దాని జాతి పేరు చెబుతూ.
కాసేపు మౌనంగా ఉండిపోయాడు భరత్. ఆ తరువాత మాటలు కూడదిసుకుంటూ అన్నాడు. "సుదీరగారూ! ఈ ఇల్లు ఒక ఋష్యశ్రమం లాంటిది. మా నాన్నగారు ఒక ఋషి లాంటి వారు. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉండే గండుపిల్లి కూడా మా చిలకని ఎప్పుడూ ఏమి చెయ్యలేదు. మీరూ నమ్మండి, నమ్మకపోండి! కానీ ఆశ్రమాలలో లేళ్ళు, పులులూ కలిసే ఉంటాయంటారే! అలాంటి పవిత్రమైన వాతావరణం ఉంటుంది ఈ ఆవరణలో! అది మా నాన్నగారి ప్రభావం. అందుకనే మేము చిలకని పంజరంలో బందీగా ఉంచలేదు. అంతేకాదు ఈ ఇంటికి కూడా పకడ్బందిగా తలుపులు బిగించి తాళాలు వెయ్యం. ఇవన్ని మనుషుల మధ్య అడ్డుగోడలని, మనిషి మీద నమ్మకం లేనప్పుడే అవన్నీ అవసరమని నాన్నగారు అంటూ వుంటారు."
"అసలు తలుపులు తెరిచే పెట్టినా మా ఇంట్లో పోయేవేమి లేవనుకోండి" అంది భారతి.
తన చెవులని తనే నమ్మలేనట్లు వింటూ ఉండిపోయింది సుదీర. "ఏమిటి ఈ మనుషుల మనస్తత్వం! వీళ్ళ ,మెదడు ఎ అయిదో క్లాసో చదువుతున్నప్పుడు పెరగడం ఆగిపోయిందా? ఇంతటి వెర్రి బాగుల వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు ఈ మహా నగరంలో?"
తేరుకున్న తరువాత చెప్పింది. "మీ చిలకని మా సిల్వర్ చంపేసింది. దానికి బదులుగా ఈ రెడ్ పారట్ ని తెచ్చాను. దిని ఖరిదేంతో ఉహించగలరా?"
"దాని ఖరీదు లక్ష రుపాయలయినా . నా సుదీరకి సమానం అవుతుందా? సుదీర అంటే పంచప్రాణాలు నాకు! పంచప్రాణాలు! దానికి బదులుగా పంచవన్నెల రామచిలుకలు పదివేలు ఇచ్చినా సమానం కాదు." అతని పెదవులు వణుకుతున్నాయి. "విన్నారా? నా సుదీరకి ఇంకేది సమానం కాదు."
అతను చటుక్కున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు.
తనకు ఉహించలేనంత అవమానం జరిగినట్లు అలాగే నిలబడిపోయింది సుదీర. భారతి నెమ్మదిగా దగ్గరికి వచ్చి కాఫీ గ్లాసు అందించింది. "సారి.......మీరేమి అనుకోకండి! అన్నయ్య చాలా అప్ సెట్ అయి ఉన్నాడు. ఆ చిలక కనపడకుండా పోయిన రోజు నుంచి భోజనం కూడా మానేశాడు. ఎంత చెప్పినా వినలేదు. చివరికి నిన్న నేనూ నాన్నగారూ కూడా ఉపవాసం చేసేసరికి మాట వరుసకి ఇప్పుడు రెండు మెతుకులు తింటున్నాడు. అంత సెన్సిటివ్ తను!"
ఇట్సాల్ రైట్" అంది సుదీర మెల్లిగా. కాఫీ కొద్దిగా సిప్ చేసి గ్లాసు పక్కన పెట్టేసింది.
"ఈ చిలకని ఇక్కడ ఉంచి వెళ్ళనా?" అంది సందేహంగా.
"వద్దొద్దు!" అని కంగారుగా తల ఉపింది భారతి. "అన్నయ్య తిడతాడు! తీసుకెళ్ళిపొండి! ప్లీజ్!"
"వస్తాను!" అని ముక్తసరిగా చెప్పి వెళ్ళి కారెక్కింది సుదీర.
"నిజం! ఇంత చిత్రమైన మనుషులను తానెప్పుడు చూడలేదు."
----------------
కాలేజి లంచ్ అవర్లో ఫ్రెండ్స్ తో కలిసి కాంటిన్ కి వచ్చింది స్వతంత్ర భారతి.
కాలేజికి ఎదురుగా రెండెకరాల ఖాళిస్థలం ఉంది. అది కూడా కాలేజి వాళ్ళదే. అందులో ఒక పక్కగా చిన్న కాంటిను పెట్టుకోవడానికి దయాకర్ కి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నాలుగు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. వాటికింద పది టేబుల్స్, చుట్టుతా వెదురుదడి మీద బటాని తీగె అల్లించి ఉంది. ఒక చెట్టు మొదలు దగ్గర ఆస్బేస్టాస్ రేకులతో చిన్న కిచెన్ లాంటిది వుంది.
ఆ కాంటిన్ ఓనరు , క్లినరూ, సర్వరూ సర్వమూ దయాకరే. ప్లమ్ కేకులాగా బొద్దుగా , గుండ్రంగా ఉంటాడు అతను.
ఎండలో నించి చెట్ల నీడలోకి రాగానే సేదదిరినట్లయింది భారతి ప్రాణం.
స్వతంత్ర భారతిని చూడగానే దయాకర్ మొహం వికసించింది.
ఫ్రెండ్సందరు ఒకే బల్ల చుట్టూ ఇరుకిరుగ్గా సర్దుకుని కూర్చున్నారు.
తన టిఫిన్ బాక్సు తెరిచింది భారతి. మజ్జిగన్నం ఆవకాయ ముక్కా ఉన్నాయి.
తను తప్ప మరెవ్వరూ టిఫిన్ బాక్సులు తెరవలేదు.
దయాకర్ వచ్చి ఒక కిలో కేకు వాళ్ళ ముందు ఉంచాడు. దాని మీద ఐసింగ్ తో "హాపీ బర్తడే టు భారతి!" అని రాసి ఉంది.
"ఇదేమిటి? ఎవరూ ఆర్డర్ చేశారు?" అంది భారతి తెల్లబోతూ.
అందరూ నవ్వు మొహంతో చూస్తున్నారు. మాళవిక అనే అమ్మాయి లేచి, "హాపి బర్త్ డే టూ యూ , హాపీ బర్త్ డే టూ భారతి! హాపి బర్త్ డే టూ యూ!" అని పాడింది. ఆడపిల్లందరూ చప్పట్లు చరుస్తూ పాటని రిపీట్ చేశారు.
మొహమాటంగా తల దించుకుంది భారతి.
"నువ్వు చెప్పకపోయినా మాకు గుర్తుందిలే. ఇవాళ నీ బర్త్ డే అని!" అంది మాళవిక.
"ఈ కేక్ నేనే స్వయంగా బెక్ చేశాను. అమ్మాయిగారు! చాకు తెస్తాను ఉండండి!" అని వెళ్ళబోయాడు దయాకర్.
"నువ్వే స్వయంగా చేశావా? అయితే, చాకూ బాకూ కదయ్యా! రంపం తీసుకురా!" అంది మాళవిక.