Previous Page Next Page 
భామ కలాపం పేజి 8

 

    నవ్వులు- సంతోషం- అల్లరి.


    భారతి మనసు ఆర్ద్రంగా అయిపొయింది. నిజానికి తన బర్త్ డే రోజున తనే ఫ్రెండ్స్ అందరికి స్వీట్స్ ఇవ్వాలి. అంత డబ్బు తన దగ్గర ఉండదు కాబట్టి తను ఎవరికి ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అయినా, వీళ్ళు గుర్తుంచుకుని తమ పాకెట్ మని కలబోసుకుని తన కోసం........."


    "థాంక్స్ అని ఎన్ని వేలసార్లు చెబితే నా మనసులోని కృతజ్ఞత మీకు అర్ధమవుతుంది?" అంది మెల్లగా.


    అందరూ ఆమె వైపు అభిమానంగా చూశారు.


    "హలో! వచ్చారా? రండ్రండి! ఇంకా మీరు రాలేదే అని ఎదురు చూస్తున్నా!" అన్నాడు దయాకర్.

 

    అందరూ తలలు తిప్పి చూశారు.


    ఒక ఆవు మహా స్వతంత్రంగా లోపలికి వచ్చేసి ఒక టేబుల్ దగ్గర నిలబడి మెడలోని గంట గణగణ లాడిస్తోంది.


    కిచెన్ లోకి వెళ్ళి ఒక అల్యూమినియం బేసిన్ లో పది ఇడ్లీలు పెట్టుకుని వచ్చి ఆవు ముందు ఉంచాడు దయాకర్.


    ఆవు ఆవురావురుమంటూ ఇడ్లీలు భోజనం చేస్తుంటే, దాని గంగడోలు నిమురుతూ, "వేరే ఏం తీసుకుంటారు, మెడమ్? వేడిగా వడా, దోశా, పెసరట్టూ, ఉప్మా...." అని అడిగాడు.


    "ఇంకేమి వద్దు. ఒక్క బక్కెట్ తో కుడితి తెచ్చియ్." అంది ఆవు బొంగురు గొంతుతో.

 

    అందరూ ఉలిక్కిపడ్డారు.


    ఒక టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతున్న స్టూడెంట్ ఒకతను బల్ల మీద చరిచి నవ్వాడు. మిమిక్రి వెంత్రిలాక్విజం చెయ్యడం వచ్చు అతనికి. అమ్మాయిల ముందర తన ప్రతాపం చూపించే అవకాశం వచ్చినందుకు అతనికి ఆనందంగా వుంది.


    అందరికి నవ్వోచ్చేసింది.

 

    ఆవు ఇడ్లి తినడం ముగించి, దవడలు ఆడిస్తూ వెనక్కి తిరిగింది.


    "మేడం మేడం! బిల్లు చెల్లించడం మరచిపోయారు" అన్నాడు దయాకర్ తమాషాగా.


    "ఖాతాలో రాసుకో" అన్నాడు మిమిక్రి కుర్రాడు ఆవు గొంతులోనే.


    "వీరి మాటలు నాకేల" అన్నట్లు నిర్లక్ష్యంగా తోక విదిలించి వెళ్ళిపోయింది ఆవు.


    ఇది ఇలా జరుగుతుండగానే నిశ్శబ్దంగా వచ్చి మూలగా ఉన్న ఒక టేబుల్ దగ్గర ఒదిగి కూర్చున్నాడు ఒకతను. పెదగా, సాదాగా కనబడుతున్నాడు.

    అతని మీద తన దృష్టి పడగానే పలకరించాడు దయాకర్. "ఎప్పుడొచ్చావు రమణా! నేను చూడలేదే!" అని నొచ్చుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి ప్లేట్లో కొంచెం అన్నం, మామిడికాయల ముక్కల పచ్చడి ఒక చిన్న గిన్నెలో సాంబారు తెచ్చి అతని ముందు ఉంచాడు.


    రమణ స్నాలర్ షిప్పు మీద చదువుకునే బ్రిలియంట్ స్టూడెంట్. తిండికి కూడా గడవని పరిస్టితి అతనికి. భోజనం దొరకనప్పుడల్లా దయాకర్ దగ్గరికి వస్తుంటాడు అతను. తన కోసం వండుకున్న దానిలోనే ఒక ముద్ద పెడుతూ ఉంటాడు దయాకర్.

 

    బిక్కచచ్చిపోతూ తల వంచుకుని మొహమాటంగా అన్నం తింటున్నాడు రమణ.


    ఆడపిల్లల గ్రూప్ కేక్ తిని టీ తాగారు.


    "దయాకర్! క్లాసుకి టైం అయిపోతోంది. బిల్లు తెచ్చేయ్. ఎంతయింది కేక్ కి?" అంది మాళవిక.


    "ఏమిటి బిల్లు తెమ్మని బల్లగుద్ది మరి చెబుతున్నారే. భలే వాళ్ళేనండి మీరూ! భారతిగారికి మీరూ పార్టి ఇస్తే దానికి బిల్లు వేస్తానా నేను? ఏం! నేను మీ పార్టీ వాణ్ణి కానేమిటి? నన్ను పరాయివాణ్ణి చేసేయ్యకండి" అన్నాడు కోప్పడుతూ.


    అతన్ని జాలిగా చూసింది మాళవిక.

    
    "దయాకర్, నువ్వు ఆవులకి, గేదేలకి ఇడ్లీలు మేపేసి, అందరికి ఉచితంగా భోజనాలు పెట్టి, పైగా ఇలా కేకులు కూడా పందారం చేసేస్తుంటే ఇంకా నీకు మిగిలేదేముంది?" అంది.


    ఈ మాటలు విని రమణ నొచ్చుకుంటాడెమో అని అతని వైపు ఒకసారి చూశాడు దయాకర్. అతను తల వంచుకునే అన్నం తింటున్నాడు.


    "ఏమిటా? రెండు పూటలా సాపాటు. అంతకంటే ఏం కావలి అమ్మాయిగారూ?" అన్నాడు దయాకర్.

 

    మెల్లిగా తలెత్తి అతని మొహంలోకి చూసింది భారతి.


    "ఇతని మాటలు అచ్చం నాన్నగారి మాటల్లా, అన్నయ్య మాటల్లా ఉన్నాయి."

 

    ఆడపిల్లలు చాలామందికి తమకి కాబోయే భర్త తమ తండ్రినో, అన్ననో గుర్తు తెస్తూ , తమకి  రక్షణ కల్పించేవాడుగా ఉండాలన్న కోరిక అంతర్గతంగా ఉంటుందంటారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు.


    అతను అన్న ఆ మాటలతో తనకు తెలియకుండానే అతని పట్ల అభిమానం అంకురించింది భారతి మనసులో.


    "మీరు భారతి గారి బర్త్ డే అని చెప్పారు. అంతే! రాత్రి అంతా మేలుకుని కేక్ బేక్ చేశాను. దానికి మీరూ బిల్లు గిల్లు ఇస్తానంటే తీసుకోవడానికి నేనేం కాబూలివాలానా........." అంటూ సగంలో ఆగిపోయి, తన మొహం మీద తడిగా పడిన పదార్ధాన్ని తుడుచుకుని అనుమానంగా తలెత్తి చూశాడు.


    చెట్టు కొమ్మమీద  తల వంకరగా పెట్టి కూర్చున్న కాకి అతని ప్రశ్నకి సమాధానంలా "కావు! కావు! " అని అరిచింది.

    భారతి పెదవులు చిరినవ్వుతో అరవిచ్చుకున్నాయి.

 

                                                                       -----------------

 

    పంచవన్నెల రామ చిలుక ఉన్న పంజరాన్ని తన రూమ్ లోనే తగిలించింది సుదీర.


    ఆమెకి చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలని పెంచుకోవడం చాలా ఇష్టం. తన దగ్గర ఏడు జాతుల కుక్కలు ఉన్నాయి. ఒక డాల్మేషియన్ , ఒక అల్సేషియన్, ఒక ఫాక్స్ టెర్రీయర్, ఒక బుల్ డాగ్, ఒక గ్రే హౌండ్ ఒక కూలి , ఒక రిట్రైనర్.


    కానీ, తను చిలకలని ఎప్పుడూ పెంచలేదు. ఆ చిలకని షాపు ఒనరుకే తిరిగి ఇచ్చేద్దామా అనిపించింది గానీ, ఏవో పనుల వల్ల నాలుగైదు రోజుల దాకా బిజీగా ఉండిపోయింది తను, ఆ తరువాత అంత లేటుగా రిటర్న్ చేస్తే అతను ఏమన్నా అనుకుంటాడెమో అని, ఆ ఆలోచన మానేసింది. అంత ఖరీదైన చిలకను చూస్తూ చూస్తూ నౌకర్లకి ఇచ్చేయ్యడానికి కూడా ఆమె మనసొప్పుకోలేదు.


     అందుకని ఇంకా రాజి పడిపోయి , చిలకల పెంపకం గురించి వివరాలు సేకరించడం మొదలెట్టింది. తను ఎ పని చేయ్యదలుచుకున్నా కూడా కూలంకషంగా దాన్ని గురించి తెలుసుకోకుండా మొదలెట్టదు.


    చిలకలలో దాదాపు మూడు వందల రకాలు ఉన్నాయి. ఇండియాలోనే ముప్పయి రకాల చిలకలు ఉన్నాయి. కొన్ని అపురూపమైన చిలకలకు యాభై వేల రూపాయల దాకా వెల పలుకుతుందని చెబుతారు. చిలకలు మంచి మిమిక్రి ఆర్టిస్టులు. ఒక పాట వింటే, దాన్ని ఆర్కెస్ట్రాతో ప్రేక్షకుల చప్పట్లతో కూడా ఇమిటేడ్ చేసి తిరిగి వినిపించగల చిలకలు ఉన్నాయి. వాటికీ ఎక్కువగా పళ్ళు, గింజలూ, బిస్కెట్లు, చిప్సూ అరటిపళ్ళు లాంటివి ఇష్టం.

 

    చిటికెన వెళ్ళు కూడా ఇష్టమే అని అది ఒకసారి తనని కొరికిన తరువాత అర్ధమయింది సుదీరకి. దాని ముక్కు తమ తోటమాలి దగ్గర ఉండే పెద్ద కత్తెర అంత పదునయింది.

 

    ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా తన ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసి, తనకి వచ్చిన ఉత్తరాలకి జవాబులు రాసి, కాసేపు ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లో వేసిన కంపెని షేర్ల ధరల హెచ్చు తగ్గులని నోట్ చేసుకుంటూ చదివింది. అలారం ముడున్నరకి పెట్టి మెత్తటి క్విల్టు కప్పుకుని నిద్రలోకి జారిపోయింది. తనకి మర్నాడు ఉపిరి తిరగనన్ని పనులు ఉన్నాయి. పైగా అమ్మ తెల్లవారు ఝామునే పూజ ఏదో చేయిస్తుందట.

 

    కళ్ళు మూతబడి అయిదు నిమిషాలు కూడా అయినట్లు లేదు. అప్పుడే కర్ణకఠోరంగా మోగింది అలారం.


    ఉలిక్కిపడి లేచి కూర్చుని, అలారం వైపు చూసింది సుదీర. పన్నెండుకి ఇంకా పది నిమిషాలు ఉంది. మరి......... అప్పుడే మోగిందెం ఇది?"


    గడియారం మీద ఆకుపచ్చగా మెరుస్తున్న నాబ్ నొక్కింది సుదీర.


    అలారం ఆగకుండా అలా మోగుతూనే ఉంది.


    అప్పుడు నవ్వు వినబడింది.


    ఎవరు?


    వెంటనే స్పీడుగా పోతున్న కారు శబ్దం!

 

    "సిల్వర్! సిల్వర్! కమ్ హియర్!" అని పెద్దగా కేక!


    జరుగుతున్నదేమిటో అర్ధం కావడానికి కొద్ది నిమిషాలు పట్టింది సుదీరకి.

 

    ఈ శబ్దాలన్నీ చేస్తున్నది చిలక! మాస్టర్ మిమిక్రి ఆర్టిస్టు!

 

    గాడంగా ఉపిరి తీసుకుని "షటప్! అంది చిలకని గదమయిస్తూ.


    "షటప్!" అంది చిలక మాటని అప్పగించేస్తూ. కోప్పడగానే తోక ముడిచేయ్యడానికి అది కుక్క సిల్వర్ కాదు.

 

    "ఎంత పొగరే నీకు! నీ పని పడతానుండు! నీ పేరేమిటి? అసలు నీకో పేరుందా?" అంది సుదీర.

 

    "భరత్! భరత్! భరత్! భరత్! అంది చిలక గబగబ. అది ఆ మాటని సుదీర నోట్లో నుంచి రాగానే పట్టేసుకుంది, భరత్ వాళ్ళ ఇంట్లో.

 

    "ఐ విల్ కిల్ యూ!" అంది సుదీర కోపంగా.

 

    "ఐ విల్ కిల్ యూ!" అంది చిలక చిలక పలుకులతో.

 Previous Page Next Page