పెద్దగా నవ్వాడు శశికాంత్.
"పెద్ద మనుషులా? ఎవరు సౌమ్యా? ఎక్కడుంటారు వాళ్ళు? ఎలా వుంటారు? నేను పుట్టి బుద్దెరిగిన తరవాత పెద్ద మనిషి అనే వాడిని చూడలేదు. పెద్ద బిజినస్ మెన్ ఉంటారను. ఒప్పుకుంటాను. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లు వుంటారను. ఒకే. పెద్ద పెద్ద బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ వుంటారను. అగ్రీడ్! అంతేగాని సౌమ్యా, వ్యాపారంలోకి దిగాక పెద్దమనిషిగా ఉంది పెద్ద ఎత్తున బిజినెస్ చెయ్యటం, పెద్ద లాభాలు సంపాదించడం అసంభవం! ఏ రెండూ ఒక దానికి ఒకటి పొత్తుకుదరదని విషయాలు?"
హ్లాలోనే వున్న బార్ దగ్గరకు వెళ్ళి గ్లాసులోకి స్కాచ్ వంపుకున్నాడు శశికాంత్. విస్కీ కొద్దిగా చప్పరించి చెప్పడం మొదలెట్టాడు.
"ఇవాళ ఈ పార్టీకి వచ్చిన ప్రతివాడూ ఒక ఎస్. ఓ.బీ. అంటే తెలుసునా సౌమ్యా? సన్ ఆఫ్ ఎ బిచ్ అన్నమాట! బిచ్ అంటే అడక్కు. అంటే వాళ్ళందరూ కుక్కలే సౌమ్యా! కానీ ఇక్కడే ఉంది ఒక చిత్రం! ఏ కుక్కా మరో కుక్కని తినదు. కానీ ఈ కుక్కలు ఒకదాన్ని ఒకటి ఉప్పూ , కారం వేసుకుని నంజుకు తింటాయి. డాగ్ ఈట్స్ డాగ్ బిజినెస్ వరల్డ్ సౌమ్యా ఇది! ఇక్కడ నువ్వు రూపాయికి పదిపైసలు లాభం ఆశిస్తే- న్యాయంగా బతకొచ్చు. కానీ రూపాయికి రెండ్రుపాయలు లాభం కావాలనుకుంటే- న్యాయంగా పోయి లాభం లేదు. పక్కవాడిని తోక్కేయ్యక తప్పదు. అది వ్యాపార లక్షణం! ప్రకృతిలో ఎక్కడయినా అంతే సౌమ్యా! సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్! జంతువుల్లో కూడా అంతే! ఏ జంతువుకి ఎక్కువ శక్తి యుక్తులుంటాయో- ఏ జంతువు తక్కువ జంతువులని డామినేట్ చెయ్యగలదో- అదే బతకగలుగుతుంది.
"ఈ పార్టీకి వచ్చిన వందమందిలో ప్రతివాడూ ఒక పెద్ద బిజినెస్ మానే సౌమ్యా! ఎందుకంటె వీళ్ళలో ప్రతివాడూ ఒక వందమందిని ముంచినవాడే గనుక!" అందుకనే సౌమ్యా వీళ్ళందరిని కట్టగట్టి నేను ముంచేయ్యాలనుకున్నాను, వాళ్ళు నడిచిన దారిలో నేనూ నడుస్తాను ఇక!"
ఉపిరి పీల్చడం మరచిపోయినట్లు మెదలకుండా నిలబడి అతని మాటలు వింటోంది సౌమ్య.
మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు శశికాంత్.
"లేదు సౌమ్యా, నేను దివాలా తీయలేదు! నా ఆస్తులన్నీ భద్రంగానే వున్నాయి. వాటిని న ఫ్రెండ్స్ పేరుతొ బినామిగా ట్రాన్సఫర్ చేసేశాను. వాళ్ళు మళ్ళీ నన్నే మోసం చేయడానికి వీలు లేకుండా -- వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసరి నోట్లు ముందే రాయించుకుని నా దగ్గర ఉంచుకున్నాను. ఆ తరవాత ఐ.పీ. పెట్టను. దానితో పొలోమని మునిగిపోతారు వీళ్ళందరూ. వీళ్ళ డబ్బు దాదాపు ఒక యాభై లక్షలదాకా నా దగ్గర ఉంది. ఇక అదంతా మనకే! మనకే సౌమ్యా. నాకు నీకు అంతే!"
అతను చెబుతున్న ఒక్కొక్క మాటా ఒక్కొక్క తుపాకీ తూటాలాగా గుచ్చుకుపోతోంది సౌమ్య హృదయంలోకి.
పుట్టి బుద్దెరిగిన తరువాత ఇంత అన్యాయాన్ని కళ్ళారా చూసి ఎరగదు తను!
ఔను, మోసాలు- కుట్రలు- జరుగుతాయని తనూ విన్నది. ఒకళ్ళని ఒకళ్ళు ముంచేయ్యాడాలు, నమ్మక ద్రోహాలు- ఇవన్ని తనూ చదివింది కధల్లో- నవలల్లో- పేపర్లలో కూడా.
కానీ అవన్ని చేసేవాళ్ళు పరమ కిరాతకంగా కనబడతారని ఉహించుకునేది తను! వాళ్ళు సినిమాలలో డెన్ లలో ఉండే విలన్ లలా లాంగ్ కోటు వేసుకుని- ప్లేల్టు హాట్ పెట్టుకుని - పైపు కాలుస్తూ వికటంగా నవ్వుతూ - విరనంగా మాట్లాడుతూ - వుంటారని భ్రమపడేది.
కానీ ఇదేమిటి?
వీళ్ళందరు పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు, ఒకళ్ళని మించి మరొకళ్ళు మర్యాదలు పాటిస్తూ - మహోన్నతమైన వ్యక్తిత్వం వున్నట్లు కనబడే వీళ్ళంతా మేకవన్నె పులులా?
అన్నిటికంటే భరించలేని విషయం.
సినిమా హీరోల కంటే అందంగా ఉండి, మగతనం, మంచితనం, మానవత్వం ఇవన్ని ముర్తిభావించినట్లు కనబడే ఈ శశికాంత్ వాళ్ళ లాగానే మాయగాడా?
భగవంతుడా!
అక్కడనుంచి తక్షణం బయటపడి పారిపోవాలనిపించింది సౌమ్యకి దూరంగా, ఈ శశికాంత్ చాలా దూరంగా.
మెదడు మొద్దుబారిపోతున్నట్లు అనిపిస్తోంది సౌమ్యకి.
తన మెడని ఎవరో రెండు చేతులతో పట్టుకొని నులిమేస్తున్నట్లు ఫీలింగ్ కలిగింది.
అప్రయత్నంగానే ఆమె చేతులు ఆమె మెడమీదికి పోయాయి. ఆమె కాళ్ళు గుమ్మం వైపు దారితీశాయి.
అప్పుడు తగిలింది ఆమె చేతికి, అతను కట్టిన తాళి!
ఆమె అడుగులు ఆగిపోయాయి.
తాళి! ఈ తాళి తన మెడలో కట్టేశాడు శశికాంత్!
ఇకనుంచి ఇతను తనకి భర్త! తను ఇతనికి భార్య.
నెగడులో జ్వలిస్తున్న అగ్ని సెగ ఆమెకు సోకింది.
తిరిగి చూసింది సౌమ్య.
అవును! తను ఇతనికి భార్య అయిపొయింది. ఈ అగ్నిసాక్షిగా!
ఆ మంట వైపే నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది సౌమ్య.
౩
అంతకు సరిగ్గా మూడు వారాల క్రితం.
సరికొత్త స్టాండర్డ్ 2009 మెడల్ కారులో తన ఆఫీసుకి వెళుతున్నాడు శశికాంత్.
అతని ఆఫీసుకి దగ్గర్లలోనే ఒక గుడి ఉంది. ఆ రోజు అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళలో చాలామంది పట్టుచిరెలు కట్టుకుని ఉన్నారు.