"అది కాదురా.....ఇలాంటి మంచి వాతావరణంలో అందమైన్ మనసుకు నచ్చిన అమ్మాయితో కబుర్లు చెబుతూ , నడుస్తూ వుంటే ఏంటో హాయిగా వుంటుందని నా ఉద్దేశం" అన్నాడు శ్రీచంద్ర.
"అదా సంగతి గురూ.....టైమెంతయింది?" అడిగాడు సత్తిపండు.
ఓసారి సీరియస్ గా చూసి ఆ దారిన వెళ్తున్నతన్ని "హలో మాస్టారు? టైమెంత" అని అడిగాడు శ్రీచంద్ర.
"ఆరు" చెప్పాడు అతను.
"విన్నావుగా. ఇంకోసారి టైమెంతయిందని అని అడిగితే పీక నొక్కుతా. నా చేతికి వాచీ లేదని తెలుసుగా" కయ్ మన్నాడు శ్రీచంద్ర.
"సారీ గురూ......అన్నట్టు ఇప్పుడు టైం ఆరు అయ్యిందంటే నీకేమైనా గుర్తుకోస్తుండా?"
"ఏం గుర్తుకొస్తుంది?" ఆలోచిస్తూ "ఆ.....ఈ టైంలో మా నాన్న....." ఇంకా అడ్డగాడిద రాలేదా?" అని అమ్మను అడుగుతాడు. అప్పుడేమో అమ్మ "అడ్డగాడిదల గురించి, నిలువు గాడిదల గురించి ఈ అడ గాడిదని అడిగితే ఏం తెలుస్తుంది. అయినా ఈ ఇంట్లో వున్న వన్ని గాడిదలా?" అంటుంది. ఆపుడేమో బామ్మా "అవునవును. నేను ముసలి గాడిదను' అంటూ మూతి విరుస్తుంది."
తన ఇంట్లో జరగబోయే సంఘటనలను ఉహించుకుని విజువలైజ్ చేసుకున్నాడు శ్రీచంద్ర.
"ఛా.....అదే కాదు గురూ.....పోనీ లుంబిని పార్కు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందంటావ్?"
సీరియస్ గా సత్తిపండు వైపు చూసి "ఇప్పుడే చెప్పాలా? ఎవరినైనా కనుక్కుని చెప్పేదా?" అని అడిగాడు.
"ఎందుకు గురూ అంత సిరియస్సయిపోతావు? జస్ట్ ఇన్ఫర్మేషన్ అవసరమై అడిగాను."
"బస్సులో నిక్కుకుంటూ , నీల్గుకుంటూ వెళ్తే అరగంట, ఆటోలో అయిన పావుగంట, ఇలా నడిస్తే ముప్పావుగంట.....ఇది చాలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా?" అన్నాడు సీరియస్ లుక్కు కంటిన్యూ చేస్తూ.....
"గురూ.....నీకు లుంబిని పార్కు పేరు చెప్పినా ఇన్ని గుర్తు చేసినా ఏమి గుర్తు రాలేదా?"
"అబ్బా.....విషయమేమిటో నాన్చకుండా చెప్పరా!"
"గురూ....మనకి గాళ్ ఫ్రెండ్ వుంది కదా" శ్రీచంద్ర కళ్ళల్లోకి ఆరాధన చూస్తూ అన్నాడు.
"చంపుతాన్రోయ్.....మనకి కాదు. నాకు, సమీర నీకు వదిన వుద్ది....." అన్నాడు అరిచినంత పన్జేసి.
"అదే గురూ.....ఆ వదిన నిన్ను అయిదున్నరకు ఎక్కడికయినా రామ్మందా?"
"ఎక్కడికి?" అంటూ వెంటనే గుర్తొచ్చి "ఆ......లుంబిని పార్క్ కు రమ్మంది రమ్మంది సమీర" ఆనందు కంగారుగా.
"మరి.....ఇంకా వెళ్లలేదేంటి గురూ. పోనీ నేను వెళ్లి కంపెని ఇచ్చేదా?"
"సత్తిపండు" గట్టిగా అరిచాడు శ్రీచంద్ర. ప్లయ్ ఓవర్ మీద నడిచే జనం వింతగా చూస్తున్నారు.
వెంటనే సిగ్గుపడిపోయాడు శ్రీచంద్ర.
"ఒరే.....ఈ విషయం నాకు అప్పుడే చెప్పొచ్చుగా!"
"నాకు అయిదున్నరకే గుర్తొచ్చింది గురూ. నీకు చెబితే నాకేమైనా మతిమరుపా అని నువ్వు తిట్టిపోస్తానని చెప్పలేదు. ఆరయింది. అర్రే మరచిపోయావేమోనని అప్పుడు టైం అడిగి గుర్తు చేసా....."
పళ్ళు పటపటలాడుతూ ఆ దారిన వెళ్ళే మరో శాల్తిని టైం అడిగాడు.
"ఆరున్నర.....' చెప్పాడతను.
"ఒరే.....ఆరు గంటలకు అడిగి అరగంట నా బుర్ర తిని ఇప్పుడు చెబుతావా?' కోపంగా అని "పద....పద.....నీ సంగతి తర్వాత చెబుతా" అంటూ ఆటోని పిలిచి "లుంబిని పార్క్" అని చెప్పాడు.
అటో కదిలింది.
"అయిపోయావ్రా" అన్నాడు సత్తిపండుకు దగ్గరగా జరిగి శ్రీచంద్ర కొట్టడానికోస్తూ.
"ఏంటి గురూ......మీది మీది కొస్తున్నావు? రేప్ గానీ చేస్తావా?" అమాయకమైన ఎక్స్ప్రెషన్ తో అడిగాడు సత్తిపండు.
ఆటోడ్రైవర్ ఆ మాటలు విని సడెన్ గా ఆపి శ్రీచంద్ర వైపు చూసాడు అదోలా.
శ్రిచంద్రకు తల కొట్టేసినంత పనయింది.
"నువ్వు పోనీ" అన్నాడు విసుగ్గా డ్రైవర్ తో.
సత్తిపండు తల బయటకు పెట్టి ఓరకంటితో శ్రీచంద్రని గమనిస్తున్నాడు.
* * *
అటో లుంబిని పార్క్ ముందాగింది.
శ్రీచంద్ర, సత్తిపండు పరుగెడుతుంటే ఏదో క్యారీ బాగ్ తగిలి కిందపడిపోయాడు శ్రీచంద్ర.
"అదేంటి గురూ.....పిల్లిమొగ్గలాట ఆడుతున్నావా?" సబ్జెక్ట్ అర్ధం కాక అడిగాడు సత్తిపండు.
అసలే సమీర తన మీద పచ్చిమిరపకాయలు నురుతోందన్న టెన్షన్. దానికి తోడు తనకు క్యారీ బ్యాగ్ అడ్డం పడి కింద పడబోయానన్నా ఉక్రోషంతో వున్న శ్రీచంద్ర సత్తిపండును పీక పిసికేయాలన్నంత కోపంగా చూశాడు.
"సారీ గురూ! ఏదో నోటికి దురదనిపించి....." అంటూ నోరు మూసుకుని ఏదో అనుమానం వచ్చి శ్రీచంద్ర కాళ్ళకు అడ్డం పడ్డ క్యారిబ్యాగు వంక చూసి "గురూ" అంటూ ఒక్క అరుపు అరిచాడు.
"ఏంటా అరుపు....చుట్టుపక్కల పసిపిల్లలుంటే ఝడుసుకు చస్టారు" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.
"అదికాదు గురూ.....ఈ క్యారిబ్యాగు పుల్లుగా వుంది. ఇందులో ఏముందో?" అంటూ ఆసక్తిగా క్యారిబ్యాగు ముడి విప్పాడు.
శ్రీచంద్ర కూడా ఆసక్తిగా చూస్తున్నాడు. లోపల పచ్చగడ్డి వుంది.
"గురూ! పచ్చగడ్డి" అన్నాడు ఆశ్చర్యంగా.
"దూల తీరింది? పద....." అని ముందుకు కదలి మళ్ళీ కాలికి ఏదో తగలడంతో కిందకి వంగి చూశాడు.
అచ్చు ఇంతకు ముందు దొరికిన లాంటి క్యారిబ్యాగు.
"గురూ! మరో బ్యాగు. పోనీ ఇందులో ఏమైనా ఉందేమో చూద్దామా అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా దాని ముడి కూడా విప్పి.....'గురూ ఇందులో కూడా అదే" అన్నాడు అరిచినంత పన్జేస్తూ.....
ఈసారి డామ్ సీరియస్ గా చూసేడు. అలాంటి క్యారీబ్యాగులు ఓ అరడజను దాకా కనిపించాయి.
"గురూ! లాలూప్రసాద్ యాదవ్ గానీ, బీహార్ నుంచి సీక్రెట్ గా ఇక్కడికి తెచ్చి వేయలేడుగా......లోగొంతుకతో అడిగాడు.